సంసార బంధనాల్లో ఎందుకు చిక్కుకుపోతున్నాం? ఈ వ్యాసంలో సద్గురు చక్కటి ఉదాహరణ ద్వారా సమాధానాన్ని అందించారు.

ప్రశ్న: అసలు  మనం ఈ బంధనాల్లో ఎందుకు చిక్కుకుంటున్నాం?

సద్గురు: ఒకరోజు శంకరన్ పిళ్ళై అలా ఊరికే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఒక ఫెన్సింగ్ ఉన్న పుచ్చకాయల తోట ఒకటి కనపడింది. పుచ్చకాయల తోట చూడగానే అతని నోరు ఊరింది. అతను ఆ ఫెన్సింగ్ మీదకి ఎక్కి, ఒక సంచి తీసుకుని దాని నిండా పుచ్చకాయలు కోయడం మొదలుపెట్టాడు. పుచ్చకాయలన్నీ ఆ సంచిలో వేస్తున్నాడు. ఇక అతను ఆ సంచిని భుజాన తగిలించుకొని బయలుదేరబోయాడు. అప్పుడు ఆ తోట యజమాని, అక్కడకు వచ్చి నించొని, “నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో నేను తెలుసుకోవచ్చా?” అన్నాడు.

శంకరన్ పిళ్ళై దానికి, “నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఓ పెద్ద గాలి వీచింది, నేనొచ్చి ఈ తోటలో పడ్డాను. ” అన్నాడు. “ఓ! అంత పెద్ద గాలి నిన్ను ఈ తోటలోకి తీసుకొచ్చిందా? అయితే ఎవరు ఈ పుచ్చకాయలను కోసారు?” అన్నాడు యజమాని. “నే చెప్పాను కదా! అది కూడా గాలే” అన్నాడు. “ఓహో అయితే పుచ్చకాయలను కూడా గాలే కోసిందా? ఐతే వాటిని సంచీలో ఎవరు వేశారు?” అన్నాడు యజమాని. శంకరన్ పిళ్ళై అందుకు, “నేనూ అదే ఆశ్చర్యపోతున్నాను” అన్నాడు.

నేను పదే పదే చెప్తున్నట్లుగా మీ అనుభూతిలో ఏదైతే లేదో, దాని గురించి మనం మాట్లాడినప్పుడు మీకు రెండు ఎంపికలు ఉంటాయి. అయితే నమ్మాలి, లేదా నమ్మకుండా పోవాలి.

ఇప్పుడు మీరు కూడా అలానే ఆశ్చర్యపోతున్నారు. ఎవరు మిమ్మల్ని ఈ సంచీలో (శరీరం) పడేసారు అని? దీన్ని మనం మరికొంచెం లోతుగా చూద్దాం. నేను పదే పదే చెప్తున్నట్లుగా మీ అనుభూతిలో ఏదైతే లేదో, దాని గురించి మనం మాట్లాడినప్పుడు మీకు రెండు ఎంపికలు ఉంటాయి. అయితే నమ్మాలి, లేదా నమ్మకుండా పోవాలి. ఆ రెండు కూడా మీకు ముక్తిని కలిగించవు. మిమ్మల్ని ఈ సంచీలో ఎవరు పెట్టారు? అని తెలుసుకోవాలని అనుకుంటే, దీన్ని మీరు అనుభూతి పరంగా తెలుసుకోవాలి. ఙ్ఞాన పరంగా కాదు. అనుభూతి పరంగా మీకూ, ఈ సంచీకి ఉన్న సంబంధం ఏమిటన్నది తెలుసుకోవాలి. మిమ్మల్ని ఈ సంచీలో ఎలా పెట్టారు? ఎవరు మిమ్మల్ని ఈ సంచీలో పట్టి ఉంచారు? ఏది మిమ్మల్ని ఈ సంచీలో ఉండేలాగా చేస్తుంది? ఇవన్నీ మీరు అనుభూతి పరంగా అర్ధం చేసుకుంటే, మీరు ఇందులోకి ఎలావచ్చారో మీకే అర్ధం అయిపోతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు