ప్రశ్న: సద్గురూ, ఒక ప్రక్క రోదసిలో ఎక్కడెక్కడో గ్రహాలపై జీవకోటి ఆనవాళ్లు కనిపెట్టడానికి వేల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తూ, రెండవ ప్రక్క భూమి మీద ఉన్న జీవ కోటిని నాశనం చెయ్యడానికి ఎందుకు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు? మనలో లోపం ఎక్కడ ఉంది?

సద్గురు: మనలో లోపం ఎక్కడుందంటే, మనం భౌతిక సాధనాలా ద్వారా అంతులేని విశ్వంలోకి చొచ్చుకుపోడానికి ప్రయత్నిస్తున్నాము. మనకి చంద్రుడి మీదకి వెళ్ళాలని ఉంది కానీ మనం ఎడ్లబండి ఆ ఎడ్లని బాదుతున్నాం. ఇలా చేస్తే మనం ఎద్దుల్ని చంపేస్తామే గాని అక్కడికి చేరలేం.  అసలైన లోపం ఇక్కడ ఉంది.

మనిషి ఎప్పుడూ ప్రస్తుతం తను ఉన్న స్థితికంటే మరింత కావాలని కోరుకుంటూనే ఉంటాడు. అతనికి డబ్బు ఒక్క విషయం గురించే అవగాహన ఉంటే, అతను కొంచెం మరింత డబ్బు కోరుకుంటాడు; అతనికి అధికారం గురించి తెలిస్తే, మరికొంచెం అధికారం కోసం ప్రాకులాడతాడు; అతనికి ప్రేమ గురించి తెలిస్తే, మరికొంచెం ప్రేమ కోసం ఆరాటపడతాడు. ఉన్న వస్తువులతో సంతృప్తిపడలేనితనం ఏదో మనిషిలో ఉంది. మీకు తెలిసిన ఏదో ఓ మార్గంలో, మీరిప్పుడున్న స్థితి కంటే మెరుగైన స్థితికి చేరుకోవాలని తహతహలాడుతూనే ఉంటారు. కానీ మీరు మీ స్పృహని ఒకసారి ఉపయోగించి ఆలోచిస్తే, మీరు ప్రయత్నిస్తున్నది డబ్బు గురించో, ఆస్థి గురించో, ప్రేమ గురించో, సౌఖ్యం గురించో కాదు అన్నది స్పష్టంగా మీకు అర్థం అవుతుంది: నిజానికి మీరు కోరుకుంటున్నది విశ్వవ్యాప్తమవడం.. మీరు ఎంతగా వ్యాప్తిచెందితే మీకు సంతృప్తి కలుగుతుంది? ఈ కోణంలో ఆలోచిస్తే, మీరు అనంతంగా వ్యాపించడాన్ని కోరుకుంటున్నారన్నది అవగాహన అవుతుంది. ప్రతి మనిషీ అవధులులేని మేరకి వ్యాప్తి చెందాలనే కోరుకుంటాడు. కానీ ఈ క్షణంలో మాత్రం, మనం అంచెలంచెలుగా గెలవడం, ఆక్రమించడం, కొనుగోలు చెయ్యడం, వంటి మార్గాలని అనుసరిస్తున్నాము. ఈ వ్యాప్తి చెందాలన్న కోరిక బహు ముఖాలుగా ప్రకటితం అవుతున్నప్పటికీ, అవన్నీ భౌతికమైనవి.

ఈ భౌతిక విశ్వం ఎంత అనంతంగా కనిపిస్తున్నప్పటికీ, దానికి పరిమితులున్నాయి. ఈ క్షణంలొ, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అలాగే సృష్టించబడ్డాయి. అవి ప్రతి సంవత్సరమూ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ప్రగతి సాధించాలనే ప్రయత్నిస్తాయి. ప్రతి దేశం ప్రగతిని వేగంగా సాధించడం గురించే మాటాడుతుంది. దానర్థం ప్రతి వ్యక్తీ ఎక్కువ కొనాలి; ఎక్కువ వినియోగించాలి. కానీ ఎంత కాలం..? ఎక్కడ నుండి ఈ "ఎక్కువ", వస్తుంది?  అందుకనే, మనిషి ఇతర గ్రహాల్ని తన ప్రయోజనానికి వాడుకోడానికి ఆసక్తి పడుతున్నాడు. కానీ ఆ గ్రహాన్ని కూడా నాశనం చెయ్యడానికి  ఎక్కువ కాలం పట్టదు.

అద్భుతమైన మన భూగోళం

భూమి ఒక అద్భుతమైన గ్రహం. ఇక్కడ ఒకటో రెండో జీవరాశులు ప్రాణం పోసుకోలేదు; కొన్ని కోట్ల జీవరాశులు అవతరించాయి. ఇక్కడ ఉన్న వైవిధ్యభరితమైన జీవ సంపద - జంతువులు, పక్షులు, చెట్టూ-చేమా, కీటకాలు, క్రిములు, కంటికి కనిపించని సూక్ష్మ జీవులు - వీటన్నిటినీ చూస్తే మనకు మతిపోతుంది. మనం ఇప్పటికి కొన్ని లక్షల జీవరాశుల్ని గుర్తించినప్పటికీ, ఈ రోజుకీ, ప్రతి ఏడూ 10 వేల రకాల కొత్త జీవరాశులు ఉద్భవిస్తూనే ఉంటాయి. అయినా, మనం ఇక్కడికంటె మరెక్కడో ఇంతకన్నా మెరుగైనది దొరుకుతుందన్న ఆశతో ఉంటాము.

మనకి జీవం అంటే, దాన్ని మన స్వార్థ ప్రయోజనానికి వాడుకునే ఒక అంశం / వస్తువు అయిపోయింది

వ్యాప్తి చెందాలన్న కోరిక అణచుకోలేనిది. మనకి వ్యాప్తి చెందడానికి వేరే మార్గం ఏదీ కనిపించడం లేదు గనుక,  మనకి భౌతిక వనరుల్ని కొల్లగొట్టడం ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది. దురదృష్టవశాత్తూ శాస్త్ర విజ్ఞానాన్ని మనం అవగాహన చేసుకున్నది అంతవరకే. ఏ క్షేత్రంలో నైనా శాస్త్ర పరిశోధన జరుగుతోందంటే, ఆ పరిశోధనలలో కొత్తగా ఏది ఆవిష్కరించబడినా, దానిని ఆర్థికంగా వినియోగించగల అవకాశాలే ప్రాముఖ్యత సంతరించుకుంటాయని మీరు నమ్మొచ్చు. మనం ఇప్పటికే నేలనీ, సముద్రాలనీ మనకి అనుగుణంగా వాడుకుంటున్నాం. ఇప్పుడు మనం వాటిని దాటి ఆలోచిస్తున్నాం. మనకి జీవం అంటే, దాన్ని మన స్వార్థ ప్రయోజనానికి వాడుకునే ఒక అంశం / వస్తువు అయిపోయింది. ఇప్పుడు సూక్ష్మ జీవుల నుండి మాంస కృత్తుల్ని తయారుచేస్తున్నారు. కనీసం సూక్ష్మ జీవుల్నికూడా మనిషి విడిచిపెట్టడం లేదు. ఎంత దౌర్భాగ్యం!

ఇప్పుడు పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందంటే, ప్రతి జీవికీ ఇప్పుడు రక్షణ ఆవశ్యకం అయిపోయింది. అతి భయంకరమైన పులి లాంటి జంతువుకి కూడా రక్షణ అవసరం అయింది. "పులి" అంటే చాలు మనిషికి గుండె దడ పట్టుకోవాలి. పాపం! అటువంటి జంతువుకి కూడా ఇప్పుడు రక్షణ కల్పించవలసిన పరిస్థితి ఎదురయింది.

మనం ఇప్పటికే, భూమి మీద లభించే వనరుల్లో అధిక భాగం కొల్లగొట్టేశాము గనుక, మనకి ఈ వనరులు ఎక్కువ కాలం సరిపోవన్న విషయం నిశ్చయం అయిపోవడంతో, మనిషి వేరే ప్రదేశాల/ వనరుల అన్వేషణలో ఉన్నాడు. ఒకసారి అటువంటి గోళంగాని లభిస్తే, అలా లభించకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను... ఆ క్షణం దేశాలు ఆ వనరుని స్వంతం చెసుకోవడానికి యుద్ధానికి దిగుతాయి.  మనం సినిమా తీసినా, చివరకి , దానికి "స్టార్ వార్" అనే పేరుపెడుతున్నాం.

పర్యావరణ "చీకటి యుగం"

స్వప్రయోజనానికి అన్నిటినీ వాడుకునే ఈ విధమైన మానసిక స్థితి, మనకి అవసరం వల్ల కాదు, అణచుకోలేని బలహీనత వల్ల. దీనికి విరుగుడు కేవలం స్పృహతో ప్రవర్తించడం.  మానవాళి ఎప్పుడైతే స్పృహతో ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుందో, అప్పుడు ఈ బలహీనత మనల్ని నియంత్రించదు. అప్పుడు మనకి ఏది కావాలో, ఎంతమేరకు కావాలో దాన్నే ఆచరిస్తాం. అంతకంటే ఎక్కువా లేదు; తక్కువా లేదు. ఇదిగాని జరగకపోతే, అతి త్వరలో మనపై విరుచుకుపడటానికి రూపుదిద్దుకుంటున్న పర్యావరణ ఉత్పాతానికి బలి అయ్యే మొట్టమొదటి దేశాల్లో మనదేశం ఉంటుంది. ఇప్పటికే, ఈ దేశంలో నదులు ప్రమాదకర స్థాయిలో క్షీణించిపోయాయి. అవి తరుగుతున్న వేగం ఇలాగే కొనసాగితే, రాబోయే 20 సంవత్సరాల్లో, కేవలం కొన్ని ఋతువుల్లో మాత్రమే ప్రవహించే నదులుగా మారిపోవడం తథ్యం. చాలా నదులు ఇప్పటికే, సంవత్సరంలో చాలా నెలల పాటు సముద్రంలో కలవడం లేదు. దారిలోనే ఎండిపోతున్నాయి. ఈ క్షీణత దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఒక్కలాగే ఉంది.

ఇప్పుడు మనిషికి లభించే త్రాగు నీటిని పరిగణనలోకి తీసుకుంటే, 1947 లో లభ్యమైన నీటితో పోలిస్తే, మనకి 25% అంటే, నాలుగవ వంతు మాత్రమే లభిస్తోంది.  కొన్ని అంచనాల ప్రకారం 2050 సంవత్సరం వచ్చెసరికి అది 18 శాతానికి పడిపోతుంది.  ఇక అప్పుడు  ఇంక ఒక సీసా నీటితోనే స్నానం చెయ్యవలసిన పరిస్థితి ఎదురౌతుంది. దానికి సన్నద్ధం అవ్వాలి.  ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. రోడ్డు మీద నడిచే ప్రజలకి తాగడానికి నీళ్ళు దొరకకపోతే, మన జీవితాలు హాయిగా, సుఖంగా ఉన్నాయన్న భ్రమతో మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు.

నదుల గురించిన అవగాహనని పెంపొందించడం

ఇప్పుడు మనం ముఖ్యంగా చేపట్టవలసింది, నదులలొకి నీరు పారడానికి అనువుగా నదీ పరీవాహక ప్రాంతానికి రెండు వైపులా ఒక కిలోమీటరు దూరం వరకూ చెట్లు నాటాలి. అక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అందులో అడవి చెట్లూ, అక్కడ వ్యక్తుల స్వంత భూమి ఉంటే, అందులో రైతులు వ్యవసాయపంటలకి బదులుగా ఫలాలనిచ్చే వృక్షాధార పంటలూ వెయ్యాలి. చెట్లు కాపుకి వచ్చేదాకా, ప్రభుత్వం రైతులకి ఉచితంగా మొక్కల్ని పంపిణీ చెయ్యాలి. ప్రభుత్వం అప్పటి దాకా రైతులకి ఆర్థిక సహకారం అందించాలి. దానివల్ల రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మనం చెట్లు పెరగడానికి వీలైన అన్ని పద్ధతులూ అనుసరించాలి. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి: మనిషి నీరుంది కాబట్టి చెట్లున్నాయి అనుకుంటున్నాడు; కాదు, చెట్లున్నాయి కాబట్టి మనకి నీరు లభిస్తోంది. నేను ఈ విషయాన్ని గత 10 సంవత్సరాలుగా చెబుతూ వస్తున్నాను. మధ్యప్రదేశ్, మహరాష్ట్రలోని ప్రభుత్వాలు ఇప్పుడు దీన్ని చాలా  గంభీరమైన విషయంగా స్వీకరించి అమలు చేస్తున్నాయి.

నేను స్వయంగా కన్యాకుమారి నుండి  హిమాలయాల వరకు 16 రాష్ట్రాల గుండా, 7 వేల కిలోమీటర్ల కార్ డ్రైవ్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటున్నాను.

రైతు కేవలం తన భుక్తి కోసం పాటుపడుతున్నాడు. అతనికి ఎదురవబోతున్న పర్యావరణ ప్రమాదం గురించి అవగాహన లేదు. అందువల్ల మనం ఈ విషయం మీద దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టి, దాని అవసరాన్ని ప్రజలకి అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంగా, మేము “నదుల రక్షణ”  అన్న ఉద్యమం చేపట్టడం జరిగింది. నేను స్వయంగా కన్యాకుమారి నుండి  హిమాలయాల వరకు 16 రాష్ట్రాల గుండా, 7 వేల కిలోమీటర్ల కార్ డ్రైవ్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటున్నాను. ప్రజల్లో చైతన్యాన్ని కలింగిచడానికి మార్గ మధ్యంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడాకి తమ సుముఖతను ఇప్పటికే చాలామంది ముఖ్యమంత్రులు ఖరారు చేశారు. ఈ చైతన్య యాత్రకి ముగింపుగా, కేంద్ర ప్రభుత్వానికి, మన నదులని పునరుజ్జివింపజేయడానికి అనువైన "నదీ సంరక్షణ యోజన"ని సమర్పించడం జరుగుతుంది.

మన జీవిత కాలంలోనే మన నదులు అంతరించిపోతుంటే మనం స్పష్టంగా మన భావితరాల మీద మనకు ఏ మాత్రం శ్రధ్ధ లేదని చెప్పకనే చెబుతున్నాం. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ నదులు మనల్ని అక్కున చేర్చుకున్నాయి, మనల్ని పోషించాయి. ఇప్పుడు ఆ నదుల్ని అక్కున చేర్చుకుని వాటిని పోషించవలసిన సమయం ఆసన్నమయింది. ఎందుకంటే, ఈ దేశ గొప్పదనం ఈ దేశంలోని నదుల మీదే ఆధారపడి ఉంది. మనందరం కలిసికట్టుగా దాన్ని సాకారాం చేద్దాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు