Sadhguru‘’దైవాన్వేషణ చేయాలంటే ప్రాపంచిక వ్యవహారాలు మానేయాలా?’’ అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. చూడండి! అసలు ప్రాపంచిక వ్యవహారాల నుంచి మీరు ఎలా తప్పుకోగలరు? అసలు ప్రాపంచిక వ్యవహారాలు అని మీరు వేటిని అంటారు? ఉదాహరణకు నేను ఒక కొబ్బరి చెట్టును పెంచుతున్నాను అనుకోండి, అది ప్రాపంచిక వ్యవహారమే కదా? నా భోజనం నేను వండుకుంటున్నాను. మరి ఇది కూడా ప్రాపంచిక వ్యవహారమే కదా! అంటే ప్రాపంచిక వ్యవహారాలన్నవి తప్పవు, అవి లేకుండా మీరు ఎలా బ్రతకగలరు?

బయటి ప్రపంచంతో ఎలాంటి వ్యవహారాలు నిర్వహిస్తారనేది మీ వ్యక్తిగత విషయం. ఉదాహరణకు, అందరూ రాజకీయాలలో చేరనవసరం లేదు. సంఘంలో ఒకరు రాజకీయాల్లోకి వెళితే ఇంకొకరు ఆఫీసులో పని చేస్తుంటారు. ఒకరు మొత్తం పరిశ్రమనే నడుపుతుంటే, మరొకరు రోడ్లు ఊడుస్తుంటారు. అందరూ ప్రాపంచిక వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. అంటే మనం ప్రాపంచిక వ్యవహారాల నుంచి పూర్తిగా వైదొలగలేము.

ఈ వ్యవహారాల్లో వేటిని ఎంచుకోవాలి, ఎంత మేరకు వాటిని నిర్వహించాలి అనేవి మాత్రమే మనం నిర్ణయించుకోగలం. అందరికీ ఆ అవకాశం ఎందుకు ఉండదు? అందరికీ ఆ అవకాశం ఉంది కూడా. తమకు తాము ఏమి చేసుకుంటున్నారో తెలియనివారే మిగతావాళ్ళు చేసేది అనుకరిస్తూ, ఇలా ఫిర్యాదులు చేస్తుంటారు. స్వతహాగా తమను తాము ఏమి చేసుకుంటున్నారో వారికి తెలియదు. తమకేమి కావాలో, ఏవి అఖ్కరలేదో తెలుసుకునే తెలివితేటలు, ఎఱుక వారికి లేవు.

నిజానికి ఆఫీసుల్లో పనిచేసే వారూ, ఇళ్లలో ఉండేవారూ కూడా తమ సొంత పనులే చేసుకుంటున్నారు కదా; వారికి ప్రపంచసౌభాగ్యం గురించి అంత ఆసక్తి లేదు.

అలాంటి వారే ‘’వీరికి అసలు బాధ్యత తెలియదు, ప్రపంచానికి కావలసింది కాకుండా వారికి కావలసినదేదో చేసుకుని పోతుంటారు’’ అని ఆధ్యాత్మికమార్గంలో ఉన్నవారిపై ఫిర్యాదులు చేస్తుంటారు. నిజానికి ఆఫీసుల్లో పనిచేసే వారూ, ఇళ్లలో ఉండేవారూ కూడా తమ సొంత పనులే చేసుకుంటున్నారు కదా; వారికి ప్రపంచసౌభాగ్యం గురించి అంత ఆసక్తి లేదు. ఇలా అనేవారికి అసలు తమ పనేమిటో కూడా వారికి తెలియదు, తాము కూరుకుపోయిన ఊబిలో నుంచి ఎలా బయటపడాలో కూడా వారికి తెలియదు. అందులోనుంచి బయటపడటం వారికి చేతకాకపోగా, తమ వ్యవహారాలను కావలసిన రీతిలో బాగా చక్కదిద్దుకుంటున్న ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారే తప్పుడు మార్గంలో ఉన్నారు అని అంటున్నారు.

ఒక రోజు ఒక తాగుబోతు ఎలాగో బస్సెక్కాడు, అందరినీ తోసుకుంటూ సామానులన్నీ కింద పడవేసుకుంటూ ముందుకు పోయి, హాయిగా కూర్చున్న ఓ ముసలావిడ పక్క సీట్లో కూర్చోబోతూ తూలి, ఆమె మీద పడ్డాడు. ఆమె వాడిని తోసేస్తూ ‘నిన్ను తిట్టాలన్న  ఉద్దేశం నాకు లేదు. కాని నువ్వు సరాసరి నరకానికి పోతావు!’ అని తిట్టింది. ఆ తాగుబోతు ఒక్కసారిగా లేచి ‘అవునా, అయితే నేను పొరబాటున ఈ బస్సెక్కాను’ అంటూ బస్సులోంచి దూకేసాడు.

అదృష్టవశాత్తూ ప్రపంచంలో ఉన్నవారిలో సగంమంది బద్ధకస్థులే. మిగిలిన శ్రమించే సగం మందే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు.

తాగుబోతులకు తప్పుడు బస్సు ఎవరు ఎక్కారో తెలియదు. తాము కూరుకుపోయిన స్థితి నుంచి బయటకు రావడం చేతకాని వారికి, తమకు కావలసిన రీతిలో జీవితాన్ని చక్కదిద్దుకునే వారంటే అసూయ, వారెప్పుడూ ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక సాధకులను ప్రపంచం నుంచి తప్పించుకుంటున్నారని అంటూనే ఉంటారు. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఇంతమంది ఇలా శ్రమిస్తుంటే, ఈ భూగోళం  పదేళ్ళు కూడా మనలేదు. అదృష్టవశాత్తూ ప్రపంచంలో ఉన్నవారిలో సగంమంది బద్ధకస్థులే. మిగిలిన శ్రమించే సగం మందే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. నిజంగా ఆధ్యాత్మికతతో ఉన్నవారు బహుశా ఒక శాతం మంది కూడా లేరేమో. ఈ ప్రపంచాన్ని సరిచేయాలంటే సగం మందినైనా ఈ ఆధ్యాత్మికమార్గంలో నడిపించాలని అనుకుంటున్నాము.

అనవసరంగా శ్రమించకండి

అనవసర ప్రాపంచిక వ్యవహారాల నుంచి తప్పుకున్నవారు తమకు గానీ, ప్రపంచానికి గానీ, వాతావరణానికి గానీ, ఈ భూగోళానికి గానీ ఎలాంటి హానీ కలిగించటం లేదు. అనవసరంగా శ్రమించేవారే నిజంగా ప్రపంచానికి హాని చేస్తున్నారు. అవునా? మూఢంగా, తాము ఏమి చేస్తున్నారో గమనించకుండా ఏదో చేసుకుపోతున్నవారే, ప్రపంచానికి అందరికన్నా ఎక్కువ హాని కలిగిస్తున్నారు. ప్రపంచ మనుగడకు వారే ఎంతో హాని కలిగిస్తున్నారు. ఎవరినో అనుకరిస్తూ ఉన్న వారే,  అందరికన్నా ఎక్కువగా  ప్రపంచ మనుగడను, దానిపై నివసించే వారికీ, ఎంతో హాని కలిగిస్తున్నారు. అటువంటి వారే ఈ ప్రపంచ మానవాళినంతా పతన దిశగా తీసుకు వెళుతున్నారు. ప్రస్తుతం మీరు చేయగలిగిన బాధ్యతాయుతమైన పని ఏమిటంటే  ఈ అనవసరపు, అర్థం లేని పనుల నుంచి తప్పుకోవడమే. కాని అలా పనుల నుంచి తప్పుకోవడం అంత సులభం కాదు. అవసరమైన మేరకే ప్రాపంచికపు పనులు చేస్తూ, ఊరికే ఉండగలగడానికి ఎంతో పరిణతి అవసరం. బద్ధకంతో కాని, బాధ్యతారాహిత్యంతో కాని ఉన్నవారు, ఈ విధంగా ఉండలేరు. కేవలం ఎంతో ఎరుకతోనూ, వివేకంతోనూ ఉన్న వారు మాత్రమే ఇలా జీవించగలరు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు