సంజయ్ రాయ్: మీరు రచించిన పుస్తకం ఇన్నర్ ఇంజనీరింగ్: యోగం ఆనంద మార్గం, లో మీరు నిద్ర పోవడం పట్ల మనకున్న వ్యామోహం, ఇంకా మనకుండే అనేక ఇతర వ్యామోహాల గురించి వివరించారు.

సద్గురు: శరీరానికి నిద్ర అవసరం లేదు – దానికి అవసరమైనది విశ్రాంతి. చాలా మందికి వారి అనుభవంలో, నిద్ర అనేది వారికి తెలిసిన విశ్రాంతి పద్ధతులలో అత్యంత ప్రగాఢమైనది కాబట్టి వాళ్ళు దాని గురించే మాట్లాడుతారు. కానీ ప్రాధమికంగా, శరీరం నిద్రను కోరుకోవడం లేదు, అది విశ్రాంతి కోసం చూస్తోంది. మీరు చాలా ఎక్కువ పనిని చేసినప్పుడు, ఆ పని తాలూకు బడలిక శరీరంలో పెరుగుతూ పోతుంది. కాబట్టి ఒక స్థితికి చేరుకున్నాక, ఇక శరీరం నిద్రలోకి జారుకోవాలని కోరుకుంటుంది.

కొంతమంది నిపుణులుగా చెప్పబడేవారు, నిద్ర పోవడాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. నిద్రను ప్రోత్సహించే అవసరం ఏమీ లేదు – ప్రజలు అలసిపోయినప్పుడు వారే నిద్రపోతారు. కానీ ఎనిమిది నుండి పది గంటల పాటు అందరూ నిద్రపోవాలని ప్రజలు మాట్లాడుతున్నారు. బహుశా, మీరు ఒక వంద సంవత్సరాల పాటు జీవించారనుకుంటే – మీరు సూచించిన ప్రకారం రోజుకు ఎనిమిది గంటల చొప్పున నిద్రకు కేటాయిస్తే, మొత్తంగా మీరు ముప్పై మూడు సంవత్సరాలు నిద్రలోనే గడిపినట్టు.

విశ్రాంతస్థితి అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోలేదు. ఈరోజు ఈ సులభమైన విషయాన్ని ప్రయత్నించి చూడండి - భోజనానికి ముందు, భోజనానికి తరువాత మీ నాడి(పల్స్)ని పరిశీలించండి. ఇప్పుడు మీరు ఈశా క్రియ అనే సులభమైన సాధనా ప్రక్రియను నేర్చుకుని, రోజుకు పన్నెండు నిమిషాల చొప్పున ఆరు వారాల పాటు చేసిన తరువాత, మళ్ళీ భోజనానికి ముందు, భోజనానికి తరువాత మీ నాడి ని పరిశీలించండి. దానిలో తగ్గుదలను మీరు గ్రహిస్తారు. దీనర్ధం మీరు తక్కువ RPM లో కదులుతున్నారు. మీరు మీ కారును 5000 RPM లో నడుపుతూ ఉంటే, అది మీరు 2000 RPM(నిమిషానికి చేసే భ్రమణాల సంఖ్య) తో నడిపేటప్పుడు కన్నా తొందరగా పాడైపోతుంది. అదేవిధంగా, మీరు నిరంతరం ఎక్కువ నాడీ వేగంతో, అలసిపోయేటంత పనిచేసినప్పుడు, మీరు దానిని ఎక్కువ సేపు నిద్రపోవడం ద్వారా భర్తీ చేయాలని ప్రయత్నిస్తారు.

మీరు గనుక విశ్రాంత స్థితికి చేరుకుంటే, మీరు మీ వ్యవస్థను అనాయాస స్థితికి తీసుకురాగలరు. ఒక్కసారి మీరు పూర్తి అనాయాస స్థితిలో ఇక్కడ కూర్చుంటే, మీ శరీరంలో ఉత్పన్నమయ్యే బడలిక చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా, నేను సగటున రెండున్నర నుండి మూడు గంటల నిద్రతో సరిపెట్టాను. ఈ మధ్య నేను కొంచెం బద్ధకంగా అవ్వడం వల్ల నాలుగు నుండి నాలుగున్నర గంటలు నిద్రిస్తున్నాను!

ఖచ్చితంగా ఇన్ని గంటలు నిద్రపోవాలి అని నిర్దేశించవలసిన అవసరం లేదు. మీకు సరిపడా విశ్రాంతి కలిగింది అనుకున్నప్పుడు, మీరు నిద్ర నుండి మేల్కోవాలి. శరీరం మరియు మనసు ఒక నిర్దిష్ట స్థాయి చురుకుదనం ఇంకా అవగాహనతో ఉన్నప్పుడు, దానికి మంచి విశ్రాంతి దొరికినప్పుడు, అది జీవించడం కోసం ఉవ్విళ్ళూరడాన్ని మీరు గ్రహిస్తారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు