మీరు చెయ్యవలసిన విధానంలో పనులు చేస్తే ఎటువంటి వారికైనా ఈ సృష్టిలోని ప్రతీ అణువు అనుకూలంగా మారుతుందని, మీరు కేవలం ఒక ఆలోచనల మూటగా కాక, అస్తిత్వమున్న జీవిగా, ఒక ప్రాణిగా, మిమ్మల్ని మీరు మేల్కొన్నప్పుడే మీ భవిష్యత్తు వందశాతం మీదవుతుందని సద్గురు వివరిస్తున్నారు.

సద్గురు: ఆధ్యాత్మిక ప్రక్రియంటే అస్థిత్వం మీద మీ అభిప్రాయాలను రుద్దడం కాదు; మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలంటే, ఈ సృష్టీ ఈ సృష్టికర్తా, ఈ సృష్టిలోని ప్రతి అణువూ మీకు అనుకూలంగా మారవలసిందే. ఈ విశాలమైన విశ్వంలో, మీరు మీ ఇష్టాయిష్టాల వెంట పరుగెత్తుతున్నప్పుడు, ఒంటరితనాన్ని అనుభవిస్తారు. నిత్యం ఏదో అభద్రతా భావంతోనూ, అస్థిరతతోనూ, మానసికమైన సవాళ్ళతోనూ బాధపడతారు. ఒకసారి ఆ సృష్టే మీకనుకూలంగా మారిన తర్వాత, అది మిమ్మల్ని అనుగ్రహంతో నిండిన మరో లోకంలోకి తీసుకుపోతుంది. అక్కడ, ప్రతి గులకరాయీ, ప్రతి రాయీ, ప్రతి చెట్టూ, ప్రతి అణువూ, మీకు అర్థమయ్యే భాషలోనే మీతో సంభాషిస్తాయి. ప్రతి క్షణం మీ చుట్టూ కొన్ని లక్షల అద్భుతాలు జరుగుతున్నాయి. ఒక పువ్వు వికసించడం, ఓ పక్షి కూయడం, తుమ్మెద ఝంకారం, వాన చినుకు సవ్వడి, సాయం సంధ్య వేళలో ఒక మంచు తునక అలా గాలిలో తేలిపోవడం. ఇలా ఎటు చూసినా అద్భుతమే. ఎలా జీవించాలనేది మీకవగతమైతే, జీవితంలో ప్రతిరోజూ ఇలాంటి అద్భుతాలకి కొదవే ఉండదు.

మీరెంతటి వారైనా సరే, చేయవలసిన విధానంలో పనులు చెయ్యకపోతే, జీవితం మీకు కావలసినట్టు పని చెయ్యదు. ‘నేను చాలా మంచివాణ్ని’ అని మీరనుకోవచ్చు. అయినా రోజూ నీళ్ళు పోయకపోతే మీ తోటలో మొక్కలకి పువ్వులు పూస్తాయా? సరైన ఫలితాలు కావాలనుకున్నప్పుడు వాటికవసరమైన పనులు చెయ్యవలసిందే. మంచీ, చెడూ అనేవి ప్రాథమికంగా మనుషులు ఏర్పరుచుకునే అభిప్రాయాలు, వాటి మీద సమాజం ప్రభావం ఉంటుంది. కాబట్టి సామాజిక ప్రమాణాలుగా అవి మంచివే కావచ్చు. కానీ, అస్తిత్వానికి మాత్రం ఈ నిర్ణయాలతో సంబంధం లేదు. అస్తిత్వం దేని మీదా అభిప్రాయాలను ఏర్పరచుకోదు. అది మనందరినీ సమానదృష్టితో చూస్తుంది.

మిషిగన్లో ఓ చలి కాలం ఉదయాన్నే ఓ ముసలాయన గడ్డకట్టుకుపోయిన కొలనులో చేపలవేట (Ice-Fishing) కి బయలుదేరాడు. ఉదయం 10 గంటలయింది.  మంచులో చిన్న కన్నం తవ్వి, తన పక్కన ఒక తట్టెడు బీరు సీసాలు పెట్టుకుని చేపలు పట్టడానికి కూర్చున్నాడు. చేపల వేట అనేది ఎన్ని చేపలు పట్టేమో ఆ సంఖ్యకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. అది మన సహనాన్ని పరీక్షించే ఆట. ఆ విషయమతనికి తెలుసు. అందుకే గేలం నీటిలో వేసి, బీరు సీసాలు ఒక్కొక్కటే ఖాళీ చేస్తున్నాడు. అలాగే, చేపలు పట్టే బుట్ట కూడా ఖాళీగానే ఉంది.

పొద్దు పోతోంది. నాలుగ్గంటలయింది. ఇటు చేపల బుట్ట ఖాళీ గానే ఉంది, అటు బీరు బుట్ట కూడా ఖాళీ అయింది.

ఇంతలో ఓ యువకుడు అటుగా వచ్చాడు. అతను చేత పట్టుకుని తెచ్చిన మ్యూజిక్ సిస్టం నుంచీ చెవులు చిల్లులు పడే రాక్ పాటలు. అతను దగ్గరలోనే మంచులో చిన్న కన్నం చేసి, సంగీతం ఇంకా హోరెత్తిస్తునే ఉండగా చేపల వేటకి కూచున్నాడు.

ముసలాయన ఆ కుర్రాడి వంక అసహ్యంతో ఒక చూపు చూసి, "పొద్దుటి నుంచి చప్పుడు చెయ్యకుండా కూచున్నాను. నాకిప్పటి దాకా ఒక చేప కూడ దొరకలేదు. ఈ మూర్ఖుడు అంత చెవులు హోరెత్తించే చప్పుడు చేసుకుంటూ మధ్యాహ్నం నాలుగు గంటలకి వచ్చి చేపలు పట్టాలనుకుంటున్నాడు. వీణ్ణి మించిన తెలివి తక్కువ దద్దమ్మ ఇంకెక్కడా ఉండడు!" అని తిట్టుకున్నాడు.

ఆశ్చర్యమేమిటంటే, పది నిమిషాల్లో ఆ కుర్రాడు ఒక పెద్ద చేపని పట్టాడు. అదృష్టం కలిసొచ్చిందిలే అనుకుని, ముసలాయన తన పనిలో తాను మునిగిపోయాడు. మరో పది నిమిషాలు గడవకుండా మరో పెద్ద చేపని పట్టాడు.

ముసలతను ఆ కుర్రాడిని పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. గుడ్లప్పగించి నోట మాట రాక ఆ కుర్రాడి వంక చూస్తూ ఉండి పోయాడు.  సరిగ్గా అదే సమయంలో, అతను నమ్మలేని విధంగా, ఆ కుర్రాడు మూడో సారి ఇంకో పెద్ద చేపని పట్టాడు.

ఇక ఉండబట్టలేక తన అహంకారాన్ని పక్కనబెట్టి ఆ ముసలివాడు కుర్రాడి దగ్గరకొచ్చాడు. "ఏమిటి రహస్యం?" అని అడిగాడు. "నేను పొద్దుటి నుండి ఇక్కడ కూర్చున్నాను. అయినా నా బుట్ట ఖాళీగా ఉంది. నువ్వు కొద్ది సేపట్లోనే మూడు పెద్ద చేపలు పట్టావు. అసలిదెలా సాధ్యం, ఏమిటి సంగతి?" అని అడిగాడు.

దానికా కుర్రాడు, "రూ రా రూ రా రూం" అని సమాధానం చెప్పేడు.

ముసలివాడు తన చేతిని చెవికానించుకుని, “ఏమిటీ?” అనడిగాడు.

కుర్రాడు స్టీరియో శబ్దాన్ని తగ్గించి, “రూ రా రా రా రూ రా రం” అన్నాడు.

ఇకా ముసలాయన పూర్తిగా గందరగోళంలో పడి. "నువ్వు చెప్పేదొక్క ముక్క కూడా అర్థం కాలేదు" అన్నాడు.

ఆ కుర్రాడు తన నోట్లో పెట్టుకున్న ముద్దని అరచేతిలోకి ఉమ్మి (చేపలకు వేసే ఎర) "మీరు వేసిన ఎరలు వెచ్చగా ఉంచాలి" అన్నాడు.

చేయవలసిన విధానంలో పనులు చెయ్యకపోతే, మీకు సరియైన ఫలితాలు రావు. సూత్రాలకీ సిద్ధాంతాలకీ విలువ ఉన్నది సామాజిక పరిధిలోనే. మీరు కేవలం ఒక ఆలోచనల మూటగా కాక, అస్తిత్వమున్న జీవిగా, ఒక ప్రాణిగా, మిమ్మల్ని మీరు మేల్కొలుపుకోవలసిన తరుణం ఇది. అప్పుడే మీ భవిష్యత్తు మీదవుతుంది. నూటికి నూరు శాతం మీదవుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు