నదులను పూజించే సుదీర్ఘ సంప్రదాయం భారతదేశానికి ఉన్నప్పటికీ, ఈ నదుల అస్తిత్వం ఇప్పుడు ప్రమాదంలో పడింది. మనం తక్షణమే చర్యలు చేపట్టనట్లయితే మనం మన అమూల్యమైన జలసపందను కోల్పోయి మన దేశానికి కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతామని సద్గురు వివరిస్తున్నారు. ఈ ‘సప్తనదుల భూమి’ని మనం ఎడారిగా మార్చితే గొప్ప ముప్పు ఏర్పడుతుంది. సప్తనదులు: గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి.

ప్రాచీన భారతదేశాన్ని ఎప్పుడూ ‘సప్తసింధు’ దేశంగా వర్ణించేవారు. మనకు ఈ నదులు ఎంత ముఖ్యమైనవంటే ప్రజలు వాటిని ఆరాధించేవారు. మనం ఈ నదులను పూజిస్తున్నాం కాని, వీటి విషయంలో జాగ్రత్త తీసుకోలేదు. ఈ భూమి మీద లక్షలాది సంవత్సరాల నుండి నదులు ప్రవహిస్తూనే ఉన్నాయి. కాని ఆ నదులు తీవ్ర ప్రమాద స్థితిలో ఉన్నాయి. నదిని ఎట్లా ఉపయోగించుకోవాలి, దానికి ఆనకట్టలెలా కట్టాలి, కాలువలెలా తవ్వాలి, ఈ నదుల నుండి ఎక్కువ ఆహారాన్నెలా ఉత్పత్తి చేయాలి అన్న విషయాలమీద ఎక్కువ ఊనిక పెట్టాం - ఇదంతా చేశాం. వంద కోట్లకు పైగా జనాభాకు ఆహారాన్నందించే అద్భుత కార్యం సాధించాం. ఇదేమీ సాధారణ విషయం కాదు, మహా విజయం. కాని ఈ ప్రక్రియలో భవిష్యత్తరాలకు తినడానికీ, తాగడానికీ ఏమీ లభించని పరిస్థితిని సృష్టిస్తున్నాం.

ఇవ్వాళ మన నదీ ప్రవాహాలు ఎంత వేగంగా తరిగిపోతున్నాయంటే రాబోయే 20 ఏళ్లలో అవి పరిమిత కాలంలోనే ప్రవహించే నదులుగా మారబోతున్నాయి. లక్షలాది సంవత్సరాలుగా నిరంతర ప్రవాహాలుగా ఉన్న నదులు మరో రెండు తరాల కల్లా పరిమిత కాలిక ప్రవాహాలుగా మారబోతున్నాయి. ఇప్పటికే కావేరిలోని నీరు, ఏడాదిలో మూడు నెలలపాటు సముద్రాన్ని చేరుకోవడం లేదు. తగ్గిపోయిన నీటికోసం రెండు రాష్ట్రాలు పోట్లాడుకుంటున్నాయి. కృష్ణానది నీరు దాదాపు ఏడాదిలో 4,5 నెలలు సముద్రాన్ని చేరడం లేదు. అన్నిచోట్లా ఇలాగే జరుగుతూ ఉంది. ఎటువంటి అనిశ్చిత పరిస్థితులనైనా మనం ఎదుర్కోగలం కానీ, నీరులేక, మన జనాభాకు కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేయలేని పరిస్థితి వచ్చిందంటే మహా ప్రమాదం ముంచుకొచ్చినట్లే.

మనం ఏడాదికి సుమారు 5.3 బిలియన్ టన్నుల భూ-ఉపరితల మృత్తికను(Top Soil) కోల్పోతున్నాం. అంటే భూమి ఉపరితల మట్టి పొరలో ఏడాదికి సుమారు ఒక మిల్లీ మీటరు కోల్పోతున్నాం. మనం దీన్నిని భూమిలో మళ్లీ చేర్చకుండా ఈ విధంగానే ఇంత వేగంతో కోల్పోయేటట్లయితే మరో 35, 40 సంవత్సరాల్లో పంటలు పండే భూ-ఉపరితల మృత్తిక మొత్తం పోగొట్టుకుంటాం. అందువల్ల మన ఆహారోత్పత్తి సామర్థ్యం వేగంగా తగ్గిపోతూ ఉంది. గత 30, 35 ఏళ్లలో మనం ఇప్పటికే దాదాపు 25% ఉపరితల మృత్తికను కోల్పోయాం. ఇది కొనసాగితే ఈ నేలను మనం ఎడారిగా మార్చివేస్తాం.

మనం ఈ భూమిని ఎడారిగా మారుస్తున్నాం కాబట్టి ఆహారం పండించే సామర్థ్యాన్ని కూడా మనం త్వరలోనే కోల్పోతాం.

ప్రాచీన కాలం నుండీ మనం పంటలు పండించినపుడు పంట మాత్రమే తీసికొని తక్కిన మొక్క భాగాన్ని, పశువుల పేడ వగైరాలను మట్టిలో కలిసిపోనివ్వడమే ఎప్పుడూ చేసేవాళ్లం. కాని ఇప్పుడు మనం సర్వం తీసేసుకుంటున్నాం, ఏమీ తిరిగి ఇవ్వడం లేదు. ఎరువులు వేస్తే అంతా సరయిపోతుందనుకుంటున్నాం. అదలా పనిచేయదు. మన ఆహారపు ప్రమాణం, పౌష్టికత వేగంగా తగ్గిపోతూ ఉన్నాయి. మనం ఈ భూమిని ఎడారిగా మారుస్తున్నాం కాబట్టి ఆహారం పండించే సామర్థ్యాన్ని కూడా మనం త్వరలోనే కోల్పోతాం.

ఇంత పచ్చని నేల ఎలా ఎడారి అవుతుందని మీరనుకోవచ్చు, అది మీ ఊహకు అందకపోవచ్చు. ఆఫ్రికాలో అతి కఠినమైన ఎడారుల్లో ఒకటైన కలహారి ఎడారి ఒకప్పుడు నదులు ప్రవహిస్తూ పచ్చగా కళకళలాడుతూ ఉండేది. ఈనాడది అతికఠినమైన ఎడారి. ఇది జరగవచ్చు. వివిధ కారణాల వల్ల గతంలో ఇలా సంభవించింది కూడా. అయితే అది సహజంగా జరిగింది కానీ ఇప్పుడు దీనికి మనమే కారణమవుతున్నాం.

వ్యక్తిగత ఉత్సాహం వల్ల ఈ సమస్య తీరదు. మనలో కొంతమంది నదీ తీరాలకు వెళ్లి అక్కడ కొన్ని చెట్లు నాటి మనమేదో చేసేశాం అనుకున్నందువల్ల ప్రయోజనం లేదు. అది కేవలం వ్యక్తిగత సంతృప్తే తప్ప కార్యం నెరవేరదు. కావలసింది అమలు జరపగలిగిన ప్రభుత్వ విధానం. నదులలోకి నీళ్లు రావాలంటే పరిసర భూమి తడిగా, తేమగా ఉండాలి. మన నదుల్లో అధిక భాగం అడవుల నుండి నీటిని పొందుతున్నాయి. భూమి వర్షాటవులతో నిండి ఉన్నప్పుడు నేలలో బిందురూపంగా పోగయిన నీరు వాగు వంకలు, నదులు నిండుగా ప్రవహించేటట్లు చేస్తుంది. ప్రజలు నీళ్లున్నాయి గనక చెట్లు ఉన్నాయి అని అనుకుంటారు, నిజానికి చెట్లున్నాయి కాబట్టే నిళ్ళున్నాయి. అడవులే లేకపోతే కొంత కాలం తర్వాత నదులుండవు. కాని మన దేశంలో అధిక భూభాగం ఇప్పుడు వ్యవసాయ భూమి. దీన్ని అడవిగా మార్చలేం. పరిష్కారం ఏమిటి? నది పొడుగునా రెండు వైపులా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఉందో అక్కడ కి.మీ. వెడల్పున అడవి చెట్లు పెంచాలి. అదే ఉప నదులైతే అరకిలో మీటరు. ప్రైవేటు భూమి అయితే మృత్తికా నష్టం జరిగే పంటలకు బదులు చెట్ల మీద ఆధారపడిన ఉద్యాన వనాల పెంపకం చేపట్టాలి.

రైతు తన ఉదర పోషణ కోసం పనిచేస్తున్నాడు. జరగబోతున్న పర్యావరణ విధ్వంసం గురించి అతనికి తెలియదు. అయితే మనం అతనికి పొలందున్ని వరి వంటి పంటలు పండించటం కంటే పండ్ల తోటల వల్ల ఎక్కువ ఆదాయం లభిస్తుందని చూపించగలిగితే అతను పంట మార్చుకుంటాడు. కాని అతని పండ్లతోటలు ఫలసాయం ఇవ్వడం ప్రారంభించేంత వరకు కొన్నేళ్లు మనం అతనికి సాయం చేయాలి. ఉద్యాన వన పంటలు ప్రారంభం కాగానే వాటి వినియోగానికి అవసరమైన పరిశ్రమలను స్థాపించడానికి  ప్రైవేటు రంగానికి ప్రోత్సహం అందించాలి. అనేక వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో జరిగే ఉద్యానవన సాగు ఉత్పత్తి చేసే పంటలను వినియోగించుకోవడానికి కావలసిన మౌలిక వసతులు సృష్టించుకోవాలి కదా. మనం ఈ కనీస వృక్షావరణను నిశ్చితం చేస్తే పదిహేనేళ్లలో మన నదుల్లో కనీసం 20% ఎక్కువ నీరు ప్రవహిస్తుంది.

ప్రభుత్వ విధానం ద్వారానే ఈ పరిష్కారం సాధ్యం. గణనీయమైన మార్పు కావాలంటే దేశ వ్యాప్తంగా అమలు పరిచే విధానం కావాలి. మన నదులను ఎలా ఉపయోగించుకోవాలన్న నిరంతర ఆలోచన నుండి మనం వాటిని ఎలా పునరుజ్జీవింపజేయాలనే ఆలోచనకు మారాలి. మన నదులను పరిరక్షించుకోవడానికి దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ విషయంపట్ల అవగాహన కల్పించడం మన తక్షణ కర్తవ్యం.

ఈ కార్యక్రమంలో ఒక మెట్టుగా సెప్టెంబరు, 3 నుండి అక్టోబరు, 2 వరకు 30 రోజులు నదుల రక్షణ (ర్యాలీ ఫర్ రివర్స్) ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాను. నేను పదహారు రాష్ట్రాల గుండా 7000 కి.మీ. ప్రయాణిస్తాను. 23 పెద్ద నగరాలలో నదీ పరిరక్షణ గురించిన సమావేశాలు నిర్వహిస్తాను. చివరికి ఢిల్లీలో ప్రభుత్వానికి నదీ పునరుజ్జీవన విధాన  సిఫారసును అందించడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పటివరకు దేశంలోని ప్రతిరాష్ట్రమూ దానికదే ఒక ప్రత్యేక రాజ్యం లాగా ప్రవర్తిస్తూ ఉంది. అన్ని రాష్ట్రాలూ కలిసి ఒక ఉమ్మడి విధానాన్ని నిర్మించుకొని అవలంబించవలసి ఉంది.

విషయం చాలా సాధారణం. నదుల పక్కన చెట్లుండాలి. మనమలా వృక్షావరణ కల్పిస్తే అది నీటిని ఆపి నదులకు జల సమృద్ధి కల్పిస్తుంది. దేశంలో అందరికీ మనం ఈ అవగాహనను అందిస్తే, ఒక ఉమ్మడి విధానాన్ని రూపొందిస్తే, దాన్ని ఆచరణలో పెట్టడం ప్రారంభిస్తే మన దేశ భవిష్యత్తుకూ, భావితరాల సంక్షేమానికీ అది ఒక మహత్తరమైన, సార్థకమైన ముందడుగు అవుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు 

సంపాదకుని సూచన: సద్గురు ఏ ఏ నగరాలలో ఎప్పుడు ఆగుతారో ఆ కార్యక్రమాన్ని తెలుసుకొనేందుకు, పాల్గొనేందుకు, దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు www.RallyforRivers.org చూడండి.