అసాధారణమైన పోటీతత్వం కలిగిన సద్గురు,  చాలా ఆటలలో కృషిచెయ్యడమే గాక, కొన్నిటిలో చాలా ఎక్కువ ప్రావీణ్యం సంపాదించారు. సమయం దొరికినప్పుడల్లా,  ఆయన వాలీ బాల్, బిల్లియర్డ్స్, క్రికెట్, ఫ్రిస్బీ, లేదా డాడ్జ్ బాల్, ఏ ఆట అయినా ఆడడానికి సిద్ధమే. కొద్దికాలం క్రితమే, సద్గురు  అమెరికాలో మొట్టమొదటిసారిగా  గోల్ఫ్ ఆటకూడా ఆడారు. అప్పటినుండి, ప్రపంచంలో ఆయన హాజరయే సమావేశాలూ, సదస్సులూ మధ్యలో ఎప్పుడు తీరిక చిక్కినా గోల్ఫ్ఆడడం తప్పనిసరి. ఆయన అనుభవంలోంచి ఆ ఆటగురించీ, ఆ ఆటలోని నైపుణ్యం దేనికి ఉపకరిస్తుందో ఆయన మాటల్లో చదువుదాం.

నాకు నిజంగా ఉత్సాహాన్నిచ్చే విషయం గోల్ఫ్ఆటలో ఉపయోగించే బంతీ, అది చెయ్యగల విన్యాసాలు. ఒక క్రికెట్ బంతికి గాని, ఒక హాకీ బంతికి గాని దీనికున్న ఎగిరిపాటు లేదు.  నేను మొదటిసారి నేర్చుకుంటున్నప్పుడు కొందరు గోల్ఫ్ఆటగాళ్లని అడిగాను, "పెద్ద పెద్ద పోటీల్లో బంతిని కొట్టినపుడు ఒక సారి ఎంత ఎక్కువ దూరం కొట్టగలరు?" అని. వాళ్ళు, "నిజంగా గొప్పగా కోడితే ఎక్కువలో ఎక్కువ 300 గజాలు వెళుతుంది. అంతే!  కొన్ని అప్పుడప్పుడు 300 గజాలు దాటొచ్చును గాని, 300 గజాలు కొడితే గొప్ప కిందే లెక్క. 200 గజాలు దాటిన ఏ ప్రహారం అయినా చాలా మంచి ప్రహారం క్రింద పరిగణించవచ్చు," అన్నారు.  నేను ప్రయత్నిస్తానని తీసుకుని కొట్టాను. అది 325 గజాలు వెళ్ళింది. వాళ్ళు, "సద్గురూ! ఇది అసంభవం. మీకు ఇంతకుముందు గోల్ఫ్ఆడిన అనుభవం ఉంది," అన్నారు. నేనన్నాను, "ఇప్పటికీ నాకు దాని గురించి ఓనమాలు తెలీవు. మీరు అక్కడిదాకా కొట్టాలన్నారు. నాకు అంతదూరం ఎలా కొట్టాలో తెలుసు అంతే," అన్నాను. నాకు జీవితం గురించి కూడా అంతే తెలుసు. అది అక్కడికి వెళ్ళాలనుకున్నాను. నాకు దాన్ని అక్కడికి ఎలా పంపాలో తెలుసు.  అంతకుమించి నాకు ఏమీ తెలీదు.  అంతకు మించి ఎవరికీ ఏమీ తెలియవలసిన అవసరంకూడా లేదు. లేకపోతే మీకు అన్నీ తెలుస్తాయి గాని, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు.

ఈ వ్యక్తులు  గోల్ఫ్ మూడేళ్ల పాటు ఆడారు.  వాళ్ళకి గోల్ఫ్ఆటగురించి తెలియవలసినదంతా తెలుసు.  వాళ్లు ఆ ఆట మీద రాసిన పుస్తకాలు చదివారు,  గోల్ఫ్ మైదానానికి వెళ్ళారు,   గోల్ఫ్ కర్ర దేనితో తయారవుతుందో తెలుసు... సాంకేతిక విషయాలు అపరిమితంగా తెలుసు గానీ, వాళ్ళకి బంతిని ఎలా కొట్టాలో తెలీదు.

మనుషులు జీవితంలో ప్రతి చిన్న విషయాన్నీ ఎందుకు గందరగోళం చేస్తారంటే, వాళ్ళకి మనసు నిలకడ లేదు. మీకు ఒక చెంచా గాని, ఫోర్క్ గాని నోట్లోకి సరిగ్గా పెట్టుకో గలిగిన నియంత్రణ ఉంటే, ఒక గోల్ఫ్ బంతిని కన్నంలోకి సరిగా కొట్టగలరు. అంతకంటే విశేషం ఏమీ లేదు. మీకు కొంత శిక్షణ అవసరమేమో గాని, గోల్ఫ్ బంతిని కొట్టడానికి అంత అట్టహాసం చెయ్యనక్కరలేదు.  మీకు ఎవ్వరూ ఎలా నిలబడాలో, గోల్ఫ్ కర్రని ఎలా పట్టుకోవాలో చెప్పనక్కరలేదు. ఆ పరిజ్ఞానం అంతా మీ శరీరంలో అంతర్గతంగా నిర్మితమై ఉంది. మీకు నోట్లోకి ఆహారాన్ని పెట్టుకోగల సమర్థతా, తెలివితేటలూ ఉంటే, మీకు గోల్ఫ్ఆడడానికి కావలసిన తెలివీ సమర్థతా ఉన్నట్టే.

జీవితం ఏ ప్రయాస లేకుండా సాగిపోగలదు. కానీ ప్రతీదీ ఎందుకు సమస్యగా పరిణమిస్తుందంటే, మనసు నిలకడగా ఉండక పోవడం వల్లే.

చాలా నేర్పైన ఆట

గోల్ఫ్ చాలా నైపుణ్యంగల ఆట. దాని సరళత అందరూ అది ఆడడానికి ప్రయత్నించేలా ప్రేరేపిస్తుంది, కానీ దానికి కావలసిన చతురత అందరినీ నిరాశకి గురిచేస్తుంది. ఇందులో ఒక ముఖ్యమైన విషయం మీరు ఎవ్వరితోనో కలిసి ఆడటం లేదు. ఈ ఆట ముఖ్యంగా మీ మీదా, ఆడే మైదానం మీదా, సందర్భం మీదా  ఆధారపడి ఉంటుంది. పోటీలుంటాయి గానీ, ఆట ఆడేదంతా మీరే. మీరు క్రికెట్ ఆడుతున్నారంటే,  ఎవరో  బంతి విసురుతారు, మీరు దాన్ని కొట్టాలి. గోల్ఫ్ లో అలా కాదు. బంతి అక్కడే స్థిరంగా కూచుంటుంది. అది ఎంతో సులువైన ఆటలాగా, అంత సులువైనది మరోటి లేనట్టూ కనిపిస్తుంది, కానీ, ఒకసారి ఆడడం ప్రారంభిస్తే అదెంత కష్టమో, ఎంత నైపుణ్యం కావాలో తెలుస్తుంది. మీకు ఎవరినుండీ పోటీ అక్కరలేదు. మీ మనసూ, మీ శరీరమూ మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తాయి. ఆ రెండింటి మీద నియంత్రణ సాధించడానికి చాలా సాధన కావాలి. ఈ ఆట ఎంత సులభంగా కనిపిస్తుందంటే, మీరు అది సరిగ్గా చెయ్యలేకపొతే, మీకు అది చాతకానితనంగా అనిపిస్తుంది. మిగతా ఆటల పోటీల్లా, దీనికి శరీర దారుఢ్యం, చురుకుగా పరిగెత్తడం వంటివి అవసరం లేదు.  కానీ, అది చాలా సున్నితంగా మీకు అన్నిరకాలైన సవాళ్ళనూ మీ ఎదురుగా నిలబెడుతుంది.

ఈ ఆట ముఖ్యంగా మీ మీదా, ఆడే మైదానం మీదా, సందర్భం మీదా  ఆధారపడి ఉంటుంది.

చాలా రకాలుగా, గోల్ఫ్ చాలా మంచి భవిష్యత్తు ఉన్న ఆట. ఈ ఆట ఆడడానికి ఏమి కావాలో తెలుసుకున్న తర్వాత, ఎక్కువమంది ఈ ఆటను ఆడడానికి ప్రయత్నిస్తారని నేను భావిస్తున్నాను. శరీర దారుఢ్యత కంటే మానసిక దారుఢ్యత ఈ ఆటలో మిమ్మల్ని నిపుణులుగా చేస్తుంది.

నా కిదంతా ఎందుకు చాలా బాగా తెలుసునంటే, ఈ మనసు- శరీరం సంబంధించిన విషయంలో నేను చాలా కాలంగా పరిశ్రమ చేస్తున్నాను. చాలా సందర్భాలలో, మీరు అనుకుంటున్నట్టుగా శరీరం పనిచెయ్యదు. గోల్ఫ్ఆటలో ఇది మరీ స్పష్టంగా ఎందుకు కనిపిస్తుందంటే బంతి వెంటనే ఎటో పోతుంది కాబట్టి. మిగతా ఆటలలో ఇది అంత విశదంగా తెలియదు అంటే అది ఆ ఆటల్లో లేదని కాదు, కానీ అక్కడ ఆట చాలా జోరుగా సాగుతుంటుంది. మీరు సాకర్ ఆడుతుంటే, మిమ్మల్ని పదిమంది మనుషులు ఎన్నిరకాలుగా వీలయితే అన్ని రకాలుగా ఆపడానికి ప్రయత్నిస్తారు.  అది సామాన్యమైన విషయం కాదు. కానీ ఇక్కడ అంతా మరీ నింపాదిగా జరుగుతుంటుంది. అందుకని మీరు దాన్ని వెంటనే పోల్చుకోగలరు.

గోల్ఫ్ వృద్ధులకి చాలా ప్రయోజనకారి కానీ, యువకులు ఎక్కువగా దీన్ని ఆడతున్నారు.  ఇప్పుడు అది అందరికీ మంచి ఆటగా మారింది. దీనికి కారణం ఇదివరకు లా యువకులకి శరీర దారుఢ్యం లేదు. అందుకని వాళ్ళు గోల్ఫ్ యవ్వనంలో ఉండగానే ఆడుతున్నారు. ఎవరు వాళ్ళనుగురించి వాళ్ళు అతిగా అంచనాలు వేసుకుంటారో, ఈ ఆట వాళ్ళని కొంచెం నేలమీద నిలబెడుతుంది. అది వాళ్ళకి మంచే చేస్తుంది.

ఎవరికైనా వాళ్ళ మానసిక శారీరక స్థితి అంచనా వేసుకునేంత స్పృహ వాళ్ళకిలేనట్లయితే, ఈ రోజు వాళ్ళు ఏ స్థితి లో ఉన్నారో  అంచనా వేసుకుంనేందుకు గోల్ఫ  ఉపకరిస్తుంది.

గోల్ఫ్ విషయంలో, "తక్కువే ఎక్కువ" --- స్కోరు లోనే కాదు, మీరు చేసే ప్రతి దానిలోనూ. మీరు ఎక్కువ చెయ్యడానికి ఏదో  ఒక రోజు, నేను ఇవాళ ఈ కర్రే ఉపయోగిస్తాను, ఈ రకంగానే కొడతాను అని మీరు నిర్ణయం తిసుకుంటే, ఆ రోజు చేసేది ఏ ఒక్కటీ సవ్యంగా జరగదు.  నక్షత్రాలు అనుకూలంగా లేకపోవడం వల్ల కాదు, ఈ పద్ధతే అంత. నేను చేసే ప్రతి పనిలోనూ ఈ విషయంలో నేను ఎప్పుడూ స్పృహతో ఉంటాను. కొన్ని రోజులు కొన్ని విషయాలు తలకెత్తుకోను.  ఆ రోజు అవి సవ్యంగా జరగవని నాకు తెలుసు. గోల్ఫ్ఆట ఈ విషయం స్పష్టం చేస్తుంది. ఇది తెలుసుకోలేని వాళ్ళు ఆ రోజు వాళ్ళకి అనుకున్నదంతా అనుకున్నట్టు జరిగింది అనుకుంటారు. దానికి కారణం అదృష్టం కాదు, ఆ రోజు మీ మనసూ శరీరమూ ఆ రకంగా పనిచేశాయి. ఎవరికైనా వాళ్ళ మానసిక శారీరక స్థితి అంచనా వేసుకునేంత స్పృహ వాళ్ళకిలేనట్లయితే, ఈ రోజు వాళ్ళు ఏ స్థితి లో ఉన్నారో  అంచనా వేసుకుంనేందుకు గోల్ఫ  ఉపకరిస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు