ప్రశ్న: నమస్కారం సద్గురూ, నేను సైన్స్ విద్య అభ్యసిస్తున్నాను. నేను కాలేజీలో యోగా గురించి, శాంభవి గురించి మాట్లాడితే, అందరూ నన్ను హేళనగా చూస్తున్నారు, నువ్వు సైన్సు చదువు కుంటున్నావు, వీటి గురించి  ఎందుకు మాట్లాడుతున్నావు?’, అని అడుగుతున్నారు. నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు దీని గురించి చాలా బాధ పడేవాడ్ని, తరువాత దాన్ని పట్టించుకోలేదు. నేటి యువతకు మన శాస్త్రాలపైనే  ఎందుకు ఇంత ఏవగింపు అని నా ప్రశ్న. నా ఉద్దేశంలో భారతీయ యోగ శాస్త్రాలు ఎంతో లోతైన అవగాహనతో రూపొందించబడ్డాయి, మరి ఎందుకీ నిరాదరణ? మరి ఈ నిరాదరణను ఆదరణ లోకి మార్చుట మన పని కాదా? కనీసం అదేమిటో తెలుసుకోకుండా నిరాదరణను చూపవద్దని చెప్పలేమా? ప్రస్తుతం ఉన్నవిద్యా విధానంలోకి ఈ శాస్త్రాన్ని ఎలా చేర్చాలి?

సద్గురు: దురదృష్టవశాత్తు  ఈనాడు సైన్స్ అంటే మనకు  సరైన  అవగాహన లేదు. సైన్స్ అని దేనిని అంటామంటే ఏది  ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందో , దేనిని పునరావృతం చెయ్యగలమో దానిని సైన్సు అంటాము. సైన్సు ముఖ్యంగా భౌతిక శాస్త్రం, అలాగే మరికొన్ని శాస్త్రాలు కూడా అందులోనుంచి పుట్టాయి.  జీవ శాస్త్రం, మానసిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం అలాంటివే. అంటే ఏది పద్ధతి ప్రకారం జరుగుతుందో, అది ఏ ఒక్కరికో కాక అందరికీ వర్తింపబడుతుందో దానిని సైన్స్ అంటారు.

ఆ విధంగా చూస్తే అందరికీ వర్తించదగ్గ  యోగ శాస్త్రం లాంటిది మరొకటి లేదు. కాబోతే ఇప్పుడు మీరందరూ వింటున్న యోగ శాస్త్రం అమెరికా నుంచి మళ్లీ మనకు వచ్చింది. ఏదో ఒక రకమైన బట్టలు వేసుకుని తిరగడమే యోగ శాస్త్రం అనుకుంటున్నారు. అదో రకమైన ఫ్యాషను. యోగా అంటే ఐక్యత. మరి ఐక్యత అంటే ఏమిటి? ఏదో ఒక రోజు మీ శరీరాన్ని ఎవరో ఒకరు  పూడ్చి పెట్టడమో, తగల బెట్టడమో చేస్తారు. ఏం చేసినా మీరు మట్టిలో కలిసిపోతారు. అవునా?

వీక్షకులు: అవును.

సద్గురు: మీరు కూడా గుట్టలా భూమి లోంచి పైకి వచ్చిన వారే, మీరు అటూ ఇటూ తిరగ గలుగుతున్నారు కాబట్టి మీకు ఆ అవగాహన  లేదు. మీదే ఒక ప్రపంచం అయిపోయింది. మీరు కూడా ఒక చెట్టులా ఒకే చోట ఉండిపోతే  మీకు అర్ధమయ్యేది. కేవలం మీరు తిరగ గలుగు తున్నారు కాబట్టి, మీరింత మూర్ఖత్వం లో ఉన్నారు. ఇది కేవలం మీ శరీరానికే కాదు, మొత్తం విశ్వానికి, మీకు తెలిసిన అన్నింటికీ ఇది  యదార్థమే.

అందరికీ వర్తించదగ్గ యోగ శాస్త్రం లాంటిది మరొకటి లేదు.

 

యోగ అర్థం ఐక్యం అవ్వడం, అంటే మీ వ్యక్తిత్వం అనే మీ హద్దులను చెరిపేసి, ఇప్పుడు మీరున్న దాని కన్నా ఎంతో పెద్ద జీవం కావడం. మీరిక్కడ ఒక అరకొర జీవిగా ఉండవచ్చు లేక సమర్థవంతంగా ఉండవచ్చు. అరకొర అంటే ఎదుగూ బొదుగూ లేని అని అర్థం.ప్రస్తుతం చాలామందికి జీవితం అరకొరగానే ఉంది. మీ జీవితంలో గొప్ప సంఘటనలు ఏమిటి అంటే చాలామంది, నా పరీక్షలు పాస్ అయినప్పుడు, గొప్పగా అనిపించింది అంటారు, తరువాత మళ్ళీ మామూలే, ఉద్యోగం దొరికినప్పుడు బాగుంది తరువాత మళ్ళీ మామూలే, పెళ్ళైతే బాగుంది తరువాత అత్తగారు రాగానే, ష్... మళ్ళీ మామూలే, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇలా ఎవరైనా తమ జీవితంలో ఐదో, ఆరో గొప్ప సంఘటనలు చెబుతారు. జీవితంలో ప్రతిక్షణం అద్భుతంగా లేకపోతే మీ జీవితం అరకొరగానే ఉన్నట్టే.

ఈ జీవితం అద్భుతంగా ఉండాలంటే మీ వ్యక్తిత్వం అనే హద్దులు  చెరిగిపోవాలి, అప్పుడే  మీరు మామూలుగా జరిగే జీవితం కన్నా పెద్దది చూడగలుగుతారు. మీ చిన్నప్పుడు సబ్బు బుడగలు ఊదారా? 

వీక్షకులు: ఇప్పుడు కూడా మేము చిన్న వాళ్ళమే
సద్గురు: ఓ, చిన్నప్పుడు సబ్బు బుడగలు ఊదారా?
వీక్షకులు: ఊదాం.

సద్గురు: ఉదాహరణకు  మీ బుడగలు చిన్నవిగా ఉన్నాయి అనుకుందాం. ఇతరులవి  పెద్దగా ఉన్నాయి, ఎందుకని? మీ ఊపిరితిత్తుల్లో కూడా నిండా గాలి ఉంది. మీ దగ్గరా సోపు ఉంది. కానీ అతనికి పెద్ద బుడగ వచ్చింది. మీ హద్దులను పెంచుకుందామంటే మీకు కావలసింది కోరిక కాదు, మీరింత సమయంలో అంత గాలిని పట్టుకోవాలి, అప్పుడే అది పెద్దదవుతుంది.

మీరు ఎంత జీవితాన్ని ఆస్వాదిస్తే,  జీవితం అంత పెద్దది అవుతుంది, మీరెంత సమాచారం కూడబెట్టారు అన్నది కాదు. మీకలా జరగాలంటే మీ వ్యక్తిత్వ గోడలను పగులగొట్టాలి. ఆ గోడలు కరిగితేనే మీరు యోగాలో ఉన్నట్టు. వ్యక్తి ఈ కరిగిపోవడాన్ని అనుభూతి చెందితే, అతన్ని యోగి అంటాము. ఒకరు ఎంత ముందుకు వెళతారు అన్నది, అనేక వాస్తవాలకు లోబడి ఉంటుంది. కాని మనవరకు మనం శాస్త్రీయంగా, ఏకాగ్రతతో మనమే వేసుకున్న హద్దులను చెరిపి వేయడానికి మన ప్రయత్నం చేయాలి. 

నా జీవితమే యోగా, నిరంతరం నేను నా జీవితంలో హద్దులన్నీ చెరిపేస్తూనే ఉంటాను. నా అంతరంగంలో, బయటా కూడా.

హద్దులన్నీ మనం ఏర్పరచుకున్నవే, అవునా? హద్దులు మీరు పెట్టుకున్నవే, మళ్లీ బాధ పడేదీ మీరే, అదేమి జీవితం?  ప్రకృతే హద్దులు ఏర్పాటు చేసినప్పుడు మనం బాధ పడుతున్నామంటే అర్థం ఉంది. స్వీయ రక్షణ కోసం మీరే హద్దులు ఏర్పరచుకున్నారు.  స్వీయ రక్షణ కోసం ఏర్పరచుకున్న హద్దులే కారాగార హద్దులైనాయి. మీకవి వద్దనుకుంటే మీకు యోగా కావాలి. మరి నేను శరీరాన్ని వంచాలా? తిప్పాలా? తల క్రిందపెట్టి నుంచోవాలా? అంటే, అక్కరలేదు. యోగా అంటే తిప్పడమో, తిరగడమో కాదు. మీరు కావలసిన విధంగా యోగా చేయవచ్చు, శ్వాసతో, నడకతో, చదువుతో దేనితోనైనా యోగా చేయవచ్చు. ఖచ్చితమైన తీరు అంటూ ఏమీ లేదు. అదొక విధానం అంతే. 

కొందరు నన్ను అడుగుతుంటారు సద్గురూ మీరెన్ని గంటలు యోగాసనాలు వేస్తారని. నేను ఇరవై సెకన్లు అంటాను. అదే వాస్తవం. నేను ఇరవై సెకన్ల సాధనే చేస్తాను.  నేను ఉదయం లేచాక ఇరవై సెకన్లలో నా యోగా అయిపోతుంది. మరి ఇక రోజంతా యోగా చేయనా? అదేంకాదు, నా జీవితమే యోగా, నిరంతరం నేను నా జీవితంలో హద్దులన్నీ చెరిపేస్తూనే ఉంటాను. నా అంతరంగంలో, బయటా కూడా, ఇదే యోగా, మనమిప్పుడు చేస్తున్నది యోగానే.

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image