ప్రశ్న :  ఆధ్యాత్మికతపై పట్టు సాధించాలి అంటే, బ్రహ్మచర్యం పాటించడం ఒక్కటే మార్గమా లేక మామూలు సంసార జీవితం గడిపే వాళ్లకు కూడా ఆ అవకాశం ఉంటుందా ?

సద్గురు : ఆధ్యాత్మికత యొక్క ప్రధాన ఉద్దేశం భౌతికవిషయాలకు అతీతంగా ఎదగడం, భౌతికాతీతమైనదేదో గ్రహించడం. భౌతిక విషయాలలో మీరు చాలా గాఢంగా నిమగ్నులై  ఉంటే, అప్పుడు సహజంగానే శరీరంతో మీ అనుబంధం చాలా దృఢంగా ఉంటుంది. శృంగారం తనంతట తానుగా మనిషి ఎదుగుదలకు అవరోధం కాదు. కాని ఒకరికి వారి శరీరంతో ఉండే అనుబంధం ఖచ్చితంగా అడ్డంకి అవుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సహజంగా శృంగారం శారీరక అనుబంధాన్ని పెంచుతుంది. ఆ ఉద్దేశంతోనే బ్రహ్మచర్యం పాటించమన్నారు. కాని, శృంగారంలో పాల్గొనడమే ఆధ్యాత్మికతకు అడ్డుపడుతుందా? కానే కాదు. కాని, ఆధ్యాత్మిక మార్గంలో ఏమి చెపుతారంటే, మీరు ఒకే దిశలో తదేకంగా దృష్టిని కేంద్రీకరిస్తే తప్ప,  సహజంగానే ఎదుగుదలకు అవకాశం ఉండదు లేదా ఎదుగుదల వున్నా చాలా నిదానంగా ఉంటుంది. ఇలా ఎందుకంటే, మన మనస్సు ఒక దాని మీద కేంద్రీకృతమై లేనప్పుడు, మనం ఒకేసారి అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము.

ఒక వ్యక్తి  తన శాయాశక్తుల ప్రయత్నించి, అతి తక్కువ సమయంలో తను అనుకొన్న వాటిని సాధించేసేయాలి అనుకున్నప్పుడు, శారీరక విషయాల్లో చిక్కుకుంటే  ఇంకా అనేక విషయాల్లో కూడ చిక్కుకుంటాడు కనుక, వాటిలో చిక్కుకోవద్దని తప్పకుండా  చెబుతాము. చాలా మందికి, వారు దేంట్లోనైనా శారీరకంగా ఏ రకంగానైనా పాలుపంచుకుంటే, దాని వెనుకే వారి భావోద్వేగాలు, ఆలోచనలు, మొదలయినవి అన్నీ అనుసరించి వస్తాయి. వారి జీవతమంతా కేవలం అదే విషయంతో నిండిపోతుంది.  ఇక ఏ ఇతర విషయాలపై దృష్టిని కేంద్రీకరించలేరు. ఒకవేళ ఒక వ్యక్తి ఒక పనిని పూర్తిచేసి, వేరే పనులను చేస్తున్నప్పుడు మునుపటి వాటిని గురించి అసలు ఏమి ఆలోచించకుండా ఉండగలిగితే, అప్పుడు అది ఆధ్యాత్మిక పధంలో అంత అవరోధమేమి కాదు. కాని  చాలా మంది, తమ జీవితంలో అలా వ్యవహరించలేరు. జీవితం అన్ని స్థాయిలలో వారిని చిక్కుల్లో పడేస్తుంది. అందుకే, బ్రహ్మచర్యం ఆధ్యాత్మిక  పురోగతికి సహకరిస్తుందని చెప్పారు.

మీరు నిజ జీవితంలో ఏ పని చేస్తున్నా, దానికి ఆధ్యాత్మిక ప్రక్రియతో ఏ సంబంధం లేదు. ఎందుకంటే, ఆధ్యాత్మిక ప్రక్రియ అంతర్గతమయినది. చేసే పనులు బాహ్యానికి సంబంధించినవి. పని అనేది దేహం, మనస్సు, శక్తి లేదా ఉద్వేగాలకు సంబంధించినది. ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రక్రియకు  సోపానాలు కాగలవు, కాని  ఇవన్నీ భౌతికమైనవి కనుక, ఏ విధంగా కూడా అధ్యాత్మికతలో భాగం  కాలేవు. ఆధ్యాత్మికతకు, చేసే పనికి మధ్య మీరు స్పృష్టమైన అంతరాన్ని పాటించగలిగితే, నిజానికి వాటికి ఒక దానితో ఒక దానికి సంబంధమే లేదు. కాని, అలా చాలా మందిలో రెంటికీ మధ్య అంతరం లేదు కనుక మేము, 'దీంట్లో  చిక్కుకోవద్దు, దాంట్లో చిక్కుకోవద్దు' అని చెప్తూ ఉంటాము. మీ జీవితంలోని ప్రతి అంకంలో మీరు పూర్తిగా జాగృత స్థితిలో ఉండగలిగితే, మీరు మీ జీవితంలొ చేసేదేది  అవరోధం కాదు. అది చాలా మందికి ప్రస్తుతం అసాధ్యం కనుక సాధారణంగా అలా చెప్పబడింది.

ప్రజలు వారి లైంగికతను (శృంగారాన్ని) చాలా స్పృహ(ఎరుక)తో చేసే ప్రక్రియగా చూపించుకోవాలి అని కోరుకుంటున్నప్పటికి,  అది నిజం కాదు. అదొక తప్పనిసరి ప్రకియ. మిగతా వారందరూ స్పృహ (ఎరుక) ఏమి లేకుండా శృంగారంలో  పాల్గొన్నప్పటికి, కొంత మంది కొంత స్పృహ (ఎరుక)తో పాల్గొంటుండవచ్చు. కాని, అసలు శృంగారం యొక్క మూలబీజం లేదా కారకమే ఒక  “తప్పనిసరి” ప్రక్రియ. అది ఒక శరీరధర్మ, రసాయనిక ప్రక్రియ. ఆ దిశగా మిమ్మల్నితరుమేది వివిధ హార్మోనుల రసాయనిక చర్యలే.

మీలోని అన్ని “తప్పనిసరి చర్య”లకు అతీతంగామీరు వెళ్ళే దాకా, ఖచ్చితంగా శారీరక పరమైనవన్నీ మీకు అవరోధాలే. ఏ రకమైన చర్యైనా, అది తినటం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, శృంగారం కావచ్చు, మరేదైనా కావచ్చు, మీలో అది ఒక తప్పని సరి ప్రక్రియ ఐనట్లయితే, దానికి మీరు బానిసలు ఐనట్లయితే  అది అవరోధమే. మీలో ఈ తప్పని సరైన చర్యలను ఏదైతే కలిగిస్తుందో దానిని గమనించి, అవగాహన చేసుకొని, పరిష్కరిస్తే, అప్పుడు ఆ చర్యలు చేయాల్సిన అవసరం మీకు లేకుండా పోతుంది. అది ఖచ్చితంగా స్వేచ్చ వైపు పయనమే. ఒకరు ఆధ్యాత్మిక పధంలో నడవగలిగితే, వారు ఇప్పుడు ఏ స్థాయిలోఉన్నా, క్రమంగా తనలోని ఎన్నో బలహీనతల నుండి బయటపడుతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు