ప్రశ్న: సద్గురు! భక్తికీ, వ్యసనానికీ భేదమేమిటి? భక్తిలో కూడా వ్యక్తి తన భక్తికి కారణమైన వస్తువు లేకుండా జీవించలేని స్థితిలో ఉంటాడు కదా. అందువల్ల ఈ రెండిటికీ భేదమేమిటి?

సద్గురు: వ్యసనం అన్నది సాధారణంగా పదార్థాలకు. భక్తి అన్నది మీరు ఆశ్రయించేదానికి - మీకన్నా ఎంతో ఉన్నతమైన దానికే మీ భక్తి. భక్తి అన్నది ఆచరించదగింది కాదు. దాన్ని పెంపొందించలేం. ఏదైనా మిమ్మల్ని అతిశయంలో ముంచేసినప్పుడు సహజంగానే భక్తి కలుగుతుంది. మీకంటే అత్యంత ఉన్నత స్థితిలో ఉన్న దాన్ని  గుర్తించినప్పుడు మీలో భక్తి కలగడం సహజం. మీరు దేన్నో రుచిచూసినప్పుడు, ఆ అనుభవం మీకెంతో మధురమైనదిగా ఉంటే, మీరు దాన్ని కొంచెం, ఇంకొంచెం తీసుకుంటారు, అలా మీరు దాని అనుభవంలో చిక్కుకుపోతారు. అప్పుడది వ్యసనమవుతుంది. మనం ఈ భక్తిని, వ్యసనాన్ని ఎందుకు పోలుస్తామంటే ఆ రెండూ కూడా వ్యక్తిలో ఒక ఆనందకరమైన, పారవశ్య స్థితిని కలిగిస్తాయి. ప్రజలు పొగాకుకు, కాఫీకి, మద్యానికి, రకరకాల మత్తు పదార్థాలకు వశులైపోతున్నారు, ఎందుకంటే అవి వారిలో ఒక ఆనందానుభవాన్ని కలిగిస్తాయి. అదే అవి వారికి బాధను, దుఖాన్ని కలిగిస్తే వాళ్లు వాటికి వశులు కారు.

డ్రగ్స్ వల్ల, వ్యసనం వల్ల మీ శరీరమూ, బుద్ధీ కుంచించుకు పోతాయి, శిథిలమైపోతాయి.
భక్తి, వ్యసనం రెండిటికీ సంబంధం అనుభూతి స్థాయిలోనే తప్ప మరొకటి కాదు. మీరసలు ఆ రెండిటినీ పోల్చి చూడకోడదు. అనుభవం విషయంలోనే వాటికి పోలిక. రెండూ కూడా అత్యంత ఆనందకరమైన అనుభవాన్నిస్తాయి. భక్తి అంటే మీ భావాలు చాలా మధురం కావడం. మరొకరి దృష్టిలో భక్తుడు ఉన్మాదిలాగా కనిపించవచ్చు. బాగా తెలివిగల వారికి, భక్తుడు చేసే పనులు పరమ మూర్ఖంగా కనిపించవచ్చు. కాని మీరు చెప్పండి, మీరు 24 గంటలూ పరమ పారవశ్యంలో గడిపితే అది తెలివి అవుతుందా లేక వాస్తవానికి సంబంధం లేకుండా మనస్సులో రకరకాల సంక్షోభాలు మరుగుతూ ఉంటే అది తెలివి అవుతుందా? జీవితంలో ఈ ఎంపిక మీదే. భక్తుడు చాలా తెలివైనవాడు. అందులో జీవితానికి సంబంధించి ఒక లోతైన భావన ఉంది. జీవితానికి అత్యంత ముఖ్యమైన, పరమోద్దేశం అతనికి అర్థమయింది. జీవితానుభవాన్ని సంపూర్ణంగా ఆనందమయం చేసుకుంటే మరేదీ మనల్ని చిక్కుల్లో పడేయలేదు. అన్నిటినుండి విముక్తి పొందుతాము. తెలివిగల వారికి ఇదంతా తెలివితక్కువగా కనిపించవచ్చు, కాని అందులో ఒక లోతైన మేధస్సు ఉంది.

భక్తి వృద్ధికారకం, వ్యసనం వినాశకారకం

భక్తి కూడా పారవశ్యం కలిగిస్తుంది. ఇవ్వాళ టాబ్లెట్లకు కూడా ‘ఎక్ట్ససీ’ (పారవశ్యం) అని పేరు పెడుతున్నారు. మీరొక మందు పుచ్చుకొని  జీవితమంతా పారవశ్యంలో ఉండగలిగితే అంతకన్నా కావలసిందేమిటి? పుచ్చుకుందాం. కానీ సమస్య ఏమిటంటే దాని మత్తు కాసేపే వుంటుంది. మిమల్ని బాగా పైకి తీసుకొనిపోయి ఒక దెబ్బకి కింద పడవేస్తుంది. ఆ పడవేయడంలో మిమల్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. ఒకవేళ డ్రగ్స్ మీ మేధస్సును స్థిరంగా ఉంచి మీ జీవితాన్ని పెంపొందిచేవైతే ప్రతిరోజు అవి తీసుకోవచ్చు. కాని డ్రగ్స్ అలా చేయవు. డ్రగ్స్ వల్ల, వ్యసనం వల్ల మీ శరీరమూ, బుద్ధీ కుంచించుకు పోతాయి, శిథిలమైపోతాయి. మీ శారీరిక సామర్థ్యాలూ, మానసిక సామర్థ్యాలూ శిథిలమైపోతాయి. మనిషిగా మీరు మెరుగవలేరు, నాశనమైపోతారు. కాని, భక్తి మిమ్మల్ని ఉన్నతికి తీసికొని వెళుతుంది.

మీరు ఊహించలేని పనులు కూడా చేయగలుగుతారు, ఎందుకంటే మీకు పరిమితి ఉండదు. వ్యసనం మిమ్మల్ని కుంచింపజేస్తుంది, భక్తి ఉన్నతిని కలిగిస్తుంది. రెండూ కూడా ఆనందకారక అనుభవాలే. భక్తి మీకు నిరంతర ఆనంద భావనను కలిగిస్తుంది, కాని చాలా ముఖ్యమైన విషయం - అది మిమ్మల్ని వృద్ధి చేస్తుంది, విశాలం చేస్తుంది, సృష్టి సర్వస్వాన్నీ మీలో ఇముడ్చుకునేలా చేయగలుగుతుంది. వ్యసనం మిమ్మల్ని ఒక మూలకు తోస్తుంది, మిమ్మల్ని పూర్తిగా ఏకాకిని చేస్తుంది. మీరు మానసిక రుగ్మతలు, వైకల్యాలు, ఒత్తిడులకు లోనవుతారు. అందువల్ల ఒకటి మిమ్మల్ని వృద్ధికి తీసికొని వెళ్లేది, మరొకటి మిమ్మల్ని నాశనం చేసేది. ఇదే ఈ రెండిటికీ ఉన్న పెద్ద తేడా.

ప్రేమాశీస్సులతో,
సద్గురు