ఈశా యోగా కేంద్రం వంటి శక్తిమంతమైన శక్తి స్థలాన్ని సృజించడంలోని లక్ష్యాన్ని సద్గురు వివరిస్తున్నారు. అటువంటి “శక్తిఛత్రం” సృజన వెనుక ఆలోచనను వివరిస్తున్నారు.

ఒక ఆశ్రమంలో జీవించడం ఎందుకు? దానిలో ఉన్న లక్ష్యమేమిటి? వివిధ రకాల ఆశ్రమాలున్నాయి. బాహ్య ప్రపంచంలో తమ అవసరాలు – తమ ఆహారం, గృహం, సంక్షేమం – తదితర అవసరాల విషయంలో తమ సంరక్షణ తాము చూసుకోలేని వాళ్లు కొన్ని రకాల ఆశ్రమాలలో చేరతారు. ఈశాయోగా కేంద్రం ఇటువంటి ఆశ్రమం కాదు. ఇది ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం ఏర్పరచినది. ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఏర్పరచిన ఆశ్రమంలో ప్రజలు ఎందుకు ఉంటారు? అటువంటి స్థలంలో ఉండే ప్రధాన అంశం ఏమిటి? ఆ స్థలం ప్రాముఖ్యత ఏమిటి? అటువంటి స్థలం ఎందుకు అవసరం?

ఇది ఆధ్యాత్మిక స్థలం. కావలసిన శక్తితో దాన్ని సృజించడం జరిగింది. వేల్లెంగిరి పర్వతాల్లో నివసించే ఇతర ప్రాణులు ఎంత శక్తిమంతమైనవో మనం కూడా అంత శక్తిమంతమైన వాళ్లమయితే ఈ ప్రదేశాన్ని ఈ భవనాలతో ఇంత అసహ్యంగా చేసేవాళ్లం కాదు – బయళ్లలోనే పడుకొనేవాళ్లం.

ఆశ్రమంలో ఉండడమంటే దాని శక్తి ఛత్రంలో ఉండడం.

ఆశ్రమంలో ఉండడమంటే దాని శక్తి ఛత్రంలో ఉండడం. చాలామందిని ఇది పూర్తిగా వెర్రివాళ్లుగా మారుస్తుంటే ఇటువంటి శక్తి స్థలానికి ప్రయోజనమేమిటి? మీరిక్కడ(ఆశ్రమంలో) ఉన్నప్పుడు, మీకు ఇక్కడ ఉండలేనట్టు అనిపిస్తుంది. మీరీ స్థలాన్ని వదిలిపెట్టి వెళితే,  మరేచోటా  ఉండలేనట్టు అనిపిస్తుంది. ఇలా ఎందుకుంటుంది? ఈ శక్తి లక్ష్యం మిమ్మల్ని స్థిరపడనీయక పోవడమే.

ఈ శక్తి ఛత్రాన్ని నిర్మించడంలో లక్ష్యం మీ జీవితం అతి వేగంగా ఫాస్ట్ ఫార్వర్డ్ లో లాగా నడిచేలా చేయడం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారి అసంతృప్తిని ఏదీ తీర్చలేదు. ఆధ్యాత్మికత అంటే సంతృప్తి అని ప్రచారం చేస్తుంటారు. సంతృప్తి అంటే మీరు మీకున్న దాంతో తృప్తి చెందడం. ఆధ్యాత్మిక వ్యక్తి అంటే పరమోన్నత లక్ష్యాన్ని చేరుకునే దాకా తృప్తి చెందని వ్యక్తి. అప్పటి వరకు అతనికి విశ్రాంతి ఉండదు. ఒక వ్యక్తి దుఃఖంతో అసంతృప్తిగా ఉంటే, అతను వికారంగా తయారవుతాడు. కానీ ఒక వ్యక్తి ఆనందంగా అసంతృప్తితో ఉంటే, అతను నిరంతరం పరిణామం చెందుతూనే ఉంటాడు. అతను నిరంతరం ఒక సంభావ్యంగా ఉంటాడు. అతనొక చోట స్థిరపడి పోడు. అది ఎంత సదుపాయంగా ఉన్నా సరే, అక్కడే నిలిచి పోడు. అది అతన్ని ఎదో సోకర్యంగా ఉన్న ఒక మూలన స్థిరపడిపోనీయదు. అతన్ని మరుగుతున్న ప్రవాహ స్రవంతిలోకి వెళ్లేందుకే ప్రేరేపిస్తుంది, అతను వెళ్లకతప్పదు.

మీ జీవితాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినప్పుడు మీ అనుభవంలో ప్రతిదీ మీ ఆనందాలూ, దుఃఖాలూ అన్నీ విపరీతంగా ఉన్నటు కనిపిస్తాయి. మీ బాధ విపరీతంగా ఉనప్పుడు “ఈ ఆధ్యాత్మికత మనకెందుకు? నేను దీన్నెందుకు ఎంచుకున్నాను? ఇదేదో పరమానందం ఇస్తుందనుకున్నాను కదా...” అనుకుంటారు. మా ప్రకటనలో ఉన్నది  అదే మరి: “ఇన్నర్ ఇంజినీరింగ్ – పీక్ అఫ్ వెల్‌బీయింగ్”. అవును, అది నిజమే, కాని మీరు అర్థం చేసుకోవాలి, మీరు అత్యున్నత శిఖరాగ్రం మీద నిలుచున్నప్పుడు సంక్షేమం, భద్రత ఉంటేనే అక్కడ నిలబడగలగడం – గాలికి మీరు కొట్టుకొని పోకుండా....!

యోగ గాథల్లో ఒకమంచి కథ ఉంది. ఒక ఊళ్లో ఒక పేద కమ్మరి ఉండేవాడు. ప్రపంచంలో అన్ని సమస్యలూ అతన్నే చుట్టుకొన్నట్లు ఉండేది. కాని అతను మంచి భక్తుడు. ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు, అతనికిటువంటి వాటిపై నమ్మకం లేదు. ఆ స్నేహితుడు ఇలా అన్నాడు, “ఏమిటీ అర్థంలేని పిచ్చి, ఎప్పుడు దేవుడు, దేవుడని ప్రార్థనలు చేస్తూ ఉంటావు. నీ సంగతి చూస్తే, నీకు ఎప్పుడూ ఏవో సమస్యలు.”

ఒక ఉక్కుముక్కను ఒక వస్తువుగా మార్చాలంటే దానిని వేడిచేయడం, కొట్టడం, చల్లార్చడం తప్పదు.

అప్పుడు కమ్మరి అతనితో ఇలా అన్నాడు, “చూడు, నాకు తెలిసిన వృత్తి ఇదొక్కటే. నేను ఏమి నేర్చుకున్నా ఈ వృత్తి నుంచే నేర్చుకుంటాను. నేనొక ఇనుప ముక్కతో పనిముట్టు తయారుచేయాలంటే దాన్ని వేడిచేయాలి, సుత్తితో కొట్టాలి, చల్లబరచాలి, మళ్లీ వేడిచేయాలి, కొట్టాలి, మళ్లీ చల్లబరచాలి... ఒక ఉక్కు ముక్కను ఒక వస్తువుగా మార్చాలంటే దానిని వేడిచేయడం, కొట్టడం, చల్లార్చడం తప్పదు. ఈ ప్రక్రియకు పనికిరాని ఇనుపముక్కను చెత్తలో పారేస్తాం. పనికివస్తే ఉపయోగపడే వస్తువుగా మారుతుంది. అందువల్ల నా ప్రార్థన ఎప్పుడూ ఇలానే ఉంటుంది, “ప్రియమైన దేవుడా! నన్ను వేడిచేయి, కొట్టు, చల్లబరచు, ఏమైనా చేయి – కానీ నన్నెప్పుడూ చెత్తకుప్పలో పారవేయకు.”

చెత్తకుప్ప చాలా సౌకర్యవంతమైన చోటు. ఎవరూ మిమ్మల్ని కొట్టరు, ఎవరూ వేడిచేయరు, మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయరు, కాని చెత్తకుప్పలో ఉంటారు అంతే. మీరు బాధలకు భయపడవద్దు, కష్టాలకు భయపడవద్దు, చావుకు భయపడవద్దు. “నన్ను చెత్తకుప్ప మీద పడవేయకండి...” ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారెవరైనా భయపడవలసింది దీనికొక్కదానికే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు