Sadhguruఈ గ్రహం యొక్క జీవితకాలంలో అంటే మనం ఉన్న ఈ గ్రహ జీవన పరిమాణంలోనూ ఇంకా దానిమీద ఉన్నటువంటి సమస్త జీవకోటి జీవన పరిమాణంలోనూ, సంవత్సరంలో మనకి డిసెంబర్ నెలలో వచ్చే ఆయనాంతం మొదలుకొని రెండవ అమావాస్య వరకు లేదా మరో పదిహేను రోజులు కలుపుకుని మళ్ళీ  వచ్చే పౌర్ణమి వరకు ఉన్న ఈ కాలం ఎంతో ఫలవంతమైనది. ఎవరైతే ప్రయత్నపూర్వకంగా వారి పరిమితులను అధిగమించాలి అని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అది ఫలించడం ఎంతో తేలిక. ఈ సమయాన్ని సద్వినియోగించుకోవడానికి ఎన్నో పనులు చేసేవారు. చెట్లు, మొక్కలు ఈ సమయంలో ఫలిస్తాయి, పుష్పిస్తాయి. ఇది  కేవలం వాతావరణం సహకరించడం వల్ల మాత్రమే కాదు, ఇది పంచభూతాలలో ఉన్న మార్పు వల్ల కూడాను. ఇవి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ ఐదు పంచభూతాలల్లో ఒకటైనది, మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది, మనం ఎవరు అన్న దాన్ని నిర్ణయించేది ‘నీరు’. ఈ సమయంలో నీరు అత్యధికంగా ఈ భూమండలం మీద ఉంటుంది. ఇలా సమయం గడుస్తున్న కొద్దీ చాలా నీరు ఆవిరైపోయి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మీరు చూసినట్లైయితే ఇప్పుడు ఆకాశంలో ఒక్క మేఘం కూడా కనబడటం లేదు. కాని ఎండాకాలం వస్తున్నకొద్దీ చాలా నీరు ఇంకిపోయి పైకి మేఘాల రూపంలో వెళ్ళిపోతుంది. చాలావరకు నీరు  ఈ గ్రహాన్ని వదిలేసి మరోచోట దాని  స్థానం తీసుకుంటుంది. అందుకే ఈ సమయంలో ఎక్కడ చూసినా సరే, ముఖ్యంగా ఈ ఉత్తరాది దిశలో శీతాకాలం అయిపోగానే ఈ మండలం  మీద నీరు పుష్కలంగా ఉన్నప్పుడు, ఈ సమయంలో మనం, మన మానవ శరీరంలో ఏదయినా మౌళికంగా మార్చుకోవాలి  అనుకుంటే ఇది ఎంతో  ముఖ్యమైన సమయం.

యోగ సాంప్రదాయంలో మన ధోరణి మార్చడం గురించో లేదా ఆలోచనా విధానం మార్చడం గురించి ఎప్పుడూ చెప్పలేదు.

మనం ఒక విషయం అర్ధంచేసుకోవాల్సింది ఏంటంటే, యోగ సాంప్రదాయంలో మన ధోరణి మార్చడం గురించో లేదా ఆలోచనా విధానం మార్చడం గురించి ఎప్పుడూ చెప్పలేదు. అందుకే  చూడండి యోగులకు అంత గొప్ప ధోరణి ఏమి ఉండదు. ఒకరి ఆలోచనా సరళిలో మార్పు తీసుకురావడం అన్నది ఈ రోజులలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ మీలో మౌళికమైన మార్పు, పరివర్తన అన్నది లేకుండా, మీలో ఎలాంటి అనుభూతి లేకుండా కేవలం మీ ధోరణి మార్చుకుంటే అది మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని మోసపుచ్చుకోవడం మాత్రమే అవుతుంది. ఏదో ఒకరోజున, మీలో మౌళికంగా ఏమి మారలేదు అన్న  విషయం మీకు తెలుస్తుంది. మీలో అలా ప్రయత్నం చేసేవారికి జీవితం మిమ్మల్ని  మళ్ళీ బాధపెట్టడం మొదలు పెడుతుంది. మీరు  మంచితనానికి, శ్రేయస్సుకి మారుపేరుగా కనబడుతూ ఉండి ఉండచ్చు. కానీ ఎదో ఒకరోజున మీలో మీరు ఎంత ఘర్షణలో ఉన్నారోనన్న విషయం మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ధోరణి మార్చడం అంటే మీరు ఒకరకంగా నాటకం ఆడుతున్నారు అని అర్ధం.

బయటకు  ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా, కనిపించే అద్భుతమైన మనుషులు ఉన్నా వారిలోవారు ఘోరంగా ఉంటారు.

మీరు ఈ నాటకాన్ని ప్రపంచం ముందర ఆడవచ్చు. కానీ ఎప్పటికీ అలానే ఉండిపోలేరు. మీరు ఈ నాటకాన్ని మిగతా ప్రపంచమంతటి ముందర సాగించగలుగుతున్నా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీకు ఇది తెలిసిపోతుంది కదా. బయటకు  ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా, కనిపించే అద్భుతమైన మనుషులు ఉన్నా వారిలోవారు ఘోరంగా ఉంటారు. పైగా ఇటువంటి వాళ్లకి వచ్చే ప్రశ్న ఏంటంటే “ఎందుకు ఈ చెడ్డవారందరూ ఇంత హాయిగా ఉంటున్నారు? వీరందరికి ఇంత హాయిగా ఎలా ఉంది” అని. ఇది ఎందుకని అంటే మీరు కేవలం మీ ధోరణిలో మాత్రమే బాగా ఉంటే సరిపోదు. మీరు ఈ సృష్టితో అనుసంధానమై ఉండాలి. ఈ సృష్టి  మూలంతో అనుసంధానమై ఉండాలి. అంతే. ఎంతో అద్భుతమైన ఈ బ్రహ్మండంతో కూడా అనుసంధానమై ఉండాలి. కానీ ఈ మంచితనంలో మీరు మంచివారు అనుకుంటూ మీ చుట్టూ ఓ గోడ కట్టేసుకుని అందులో మీరు మరో ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరైతే ఇలా సృష్టిలో ఓ భాగంగా కాకుండా ఉన్నారో, వారు బాధకి గురి అవ్వాల్సిందే, బాధ పడవలసిందే. ఎందుకంటే ఇలాంటి వారు కనుక బాధపడలేదు అనుకోండి వీరింకా వాళ్ళు సృష్టించుకున్న ప్రపంచంలోనే బ్రతుకుతున్నట్టు. అందుకని ప్రకృతికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అది ఇటువంటి వారిని కిందకు తీసుకువస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మిమల్ని కిందకు దింపుతుంది. ఎందుకంటే వీళ్ళ కాళ్ళు  ఈ భూమి మీద ఆనట్లేదు కదా. ఇది ఎలాంటిదంటే, మీరు ఓ విమానంలో ఎగిరి పైకి వెళిపోయిన తరువాత మళ్ళీ కిందకు ల్యాండ్ అవలేకపోతే మీరు భయపడతారా లేదా?

వ్యవస్థను హాయిగా ఉంచడం ముఖ్యం

ఈ సమయంలో అత్యాధికంగా నీరు ఈ భూమండలం మీద కిందకు దిగి వచ్చి ఉన్న సమయం. మీలో ఉన్నది 70శాతం నీరే. మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఇది మీ శరీరానికి తెలుసు. ఇప్పుడు మీ శరీరానికి ఈ విషయం తెలుసు. ఈ సమయంలో  భూమండలం మీద అధికంగా నీరు ఉంది అన్న విషయం మీ శరీరానికి తెలుసు. ఇలా ఎండాకాలపు వేడి మొదలై అది ఎక్కువైన కొద్దీ, ఈ నీరు ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు చూడండి శారీరకంగా అంత హాయిగా ఉండదు. అదే వసంతంలో మీ శరీరంలో ఎలా ఉంటుంది..? హాయిగా ఉంటుంది. మీ శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. హాయిగా ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో చాలా మంది మానవాళి ఇది ఏమిటి అన్న అనుభూతి కూడా చెందడంలేదు. హాయిగా ఉండడం అంటే ఏమిటి అన్న అనుభూతి కూడా చెందడం లేదు. ఓ చిన్న పురుగయినా సరే మిమల్ని, మీ ప్రశాంతతని భంగం చేసేయగలదు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఓ ఎండుటాకు మీ మీద పడిందనుకోండి హమ్మో అంటారు. అది మీ ప్రశాంతతని కోల్పోయేలా చేయగలదు. ఎందుకంటే మీలో ఒక రకమైన హాయి లేదు. అలా హాయిగా ఉండడం అన్నది తేలికయినా విషయం కాదు.  అలా హాయిగా ఉండడం అంటే మీరు ఈ సృష్టితో పూర్తిగా అనుసంధానమై ఉన్నట్టు లెక్క.

మీరు ఒక విషయం తెలుసుకోవాలి -  ఏదైతే ఒక స్థాయి హాయికి చేరుకోలేదో అది మిమ్మల్ని వదిలి పెట్టడానికి సిద్ధంగా ఉండదు.

అందుకని మీ వ్యవస్థలో ఇలా ఒకరకమైన హాయిని తీసుకురావడానికి, మీ శరీరం అది ఈ భూమండలంలో ఒక భాగమే అని అర్ధం చేసుకుంటుంది. ఒకసారి మీ శరీరం కనుక ఈ గ్రహంలో భాగమే అన్న విషయం  అర్ధం చేసుకున్న తరువాత మీరు అలా భూమ్మీద కూర్చున్నారనుకోండి, మీ శరీరానికి అది ఈ గ్రహం, ఈ భూమిలో భాగమే అని అర్ధమవుతుంది. కానీ మీరు మీ గురించి మరేదో అనుకుంటుంటారు...అదే సమస్య. కానీ  శరీరానికి అది ఈ భూమిలో ఒక భాగమే అని తెలుస్తుంది. ఇది తెలుసుకున్నప్పుడు మీ ఆధ్యాత్మిక ప్రక్రియ ఎంతో తేలికైపోతుంది. మీకు నేను ఇదే అన్న విషయం అర్ధంకాకపోయినా సరే మీ శరీరరానికి అర్ధమవుతుంది. అప్పుడు మీ వ్యవస్థలో ఒకరకమైన హాయి వస్తుంది. మీ భౌతిక శరీరంలో ఈ ప్రశాంతత, మీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే, మీ చుట్టూవున్న వాటితోటి వచ్చే ఈ మౌలిక ప్రశాంతత ఎంతో ముఖ్యం. ఏది ఏమి జరుగుతున్నా, అప్పుడు ఒకరకమైన నిశ్చలత్వం వస్తుంది. అదే ఎంతో ముఖ్యమైనది.

మీరు ఒక విషయం తెలుసుకోవాలి -  ఏదైతే ఒక స్థాయి హాయికి చేరుకోలేదో అది మిమ్మల్ని వదిలి పెట్టడానికి సిద్ధంగా ఉండదు. ఏదయితే హాయిగా లేదో అది ఎప్పుడు మిమ్మల్ని  పట్టుకుని  ఉంచుకుంటుంది. మీరు ఇక్కడ కూర్చుని ‘నేను శరీరాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు’ అన్నా సరే, మీ శరీరం అది  వినదు. అది మిమల్ని భౌతికత దాటి పోనివ్వదు. మీ శరీరం, మీ దేహం ఒక రకమైన హాయిగా ఉన్న స్థితికి చేరుకోవాలి. అప్పుడు మీ శరీరం మీరు ఆవలకి చేరుకోవడానికి సరే అంటుంది. అది సరే అనకపోతే మీకు మరో మార్గం లేదు.

మీరు వక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు నేను ఓ భిన్నమైన ప్రాణినా లేదంటే ఈ సృష్టిలో ఓ భాగాన్నా అని ఆలోచించాలి.

అందుకని ఈ దేహాన్ని ఒక హాయిలో ఉంచడం అన్నది ఎంతో అవసరం. ఈ సమయానికి, అంటే మహాశివరాత్రి వచ్చేవరకు దీనికి ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఇది ఈ పంచభూతాలు ఎలా ప్రవర్తిస్తాయి అన్నదాన్ని బట్టి ఈ భూమండలం ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి మీరు కనుక మీ సాధన సరైన క్రమంలో చేసినట్లైతే అవి ఎంతో ఫలవంతంగా ఉంటాయి. సాధనా సమయం అంటే మీరు నమ్రతతో ఉండాల్సిన సమయం. మీరు ఈ భూమండం  మీద  మరొక ప్రాణి అంతే. మీరు మీ గురించి ఏదో ఆలోచించుకుంటూ ఉండి ఉండచ్చు. కానీ నిజం ఏవిటంటే మీరు ఈ భూమండలం మీద మరో ప్రాణి మాత్రమే. మీరు కేవలం ఇలా మరో ప్రాణిగా ఉండగలిగితే, ఇది ఎంతో గొప్ప విషయం. ఇది ఎంతో అద్భుతమైన వరం. మీరు ఈ భూమండలం మీద మరో ప్రాణి అంటే ఈ సృష్టి కర్త చేయి మిమల్ని తగిలిందని అర్ధం. మీరు ఓ చీమైనా, ఓ పురుగయినా, ఓ  బొద్దింకయినా సరే, లేదా ఓ మనిషి ఐనా సరే మీరు ఈ భూమండలం మీద ఓ ప్రాణి అంటేనే ఈ సృష్టికర్త  స్పర్శ మీకు తగిలిందని అర్ధం. మీకు మీరు ఓ భిన్నమైన వ్యక్తి అని మీరు ఆలోచించుకుంటూ ఉండి ఉండచ్చు. మీరు వక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు నేను ఓ భిన్నమైన ప్రాణినా లేదంటే ఈ సృష్టిలో ఓ భాగాన్నా అని ఆలోచించాలి. మీరు ఒక్కసారి ఇది ప్రయత్నించి చూడండి - మీరు నోరు మూసేసుకొని, మీ ముక్కు మూసి ప్రయత్నించి చూడండి. కొన్ని క్షణాల్లోనే, మీరు మీ అంత మీరు ఇక్కడ జీవించడం లేదు అని మీకు  తెలుస్తుంది. ఈ సృష్టి అన్నది ఎప్పుడూ మీకు ఊతాన్ని ఇస్తూ ఉంటేనే మీరు ఇక్కడ ఉండగలరు. లేదంటే, మీరు ఇక్కడ ఉండలేరు. ఒకసారి మీకు ఈ విషయం అర్ధమైదనుకోండి అప్పుడు ఈ వ్యవస్థంతా  కూడా ఒక రకమైన హాయిగా ఉండే స్థితికి చేరుకుంటుంది. మీరు ఈ ఉనికిలో అలా హాయిగా ఎప్పుడు ఉండగలుగుతారు..? మీరు ఈ ఉనికిలో ఒక భాగమైనప్పుడు మాత్రమే...!

ప్రేమాశిస్సులతో,
సద్గురు