Sadhguruపునరుత్పత్తి అన్నది, కేవలం మీకు, మీతో సహచర్యం చేస్తున్న వారికి మాత్రమే సంబంధించినది కాదు. మనం భావి తరాలని సృజిస్తున్నాం. అది అఖండమైన బాధ్యత. ఈరోజు మనం ఎటువంటి పిల్లల్ని తయారు చేస్తున్నాం అన్నదాన్ని బట్టి ఈ ప్రపంచంలో రాబోయే 25 సంవత్సరాలు ఉంటాయి. ఇది కాకతాళీయంగా కాదు, ఎంతో ఎరుకతో జరగాలి, ఇది ప్రేమ లేకుండా జరుగకూడదు, వారు ఎంతో ఆహ్లాదమైన వాతావరణంలో కలగాలి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు పిల్లలు కలగాలా వద్దా అన్న ఎంపిక మీకు లేదు. కానీ ఈ రోజున ఇది అలా కాదు.  ఇప్పుడు పూర్వంలాగా కాదు. పూర్వం పిల్లలు పుట్టేవాళ్ళు. అందులో ఎటువంటి ఎంపికా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు మనకు ఒక ఎంపిక ఉంది. అందుకని, ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే తల్లిదండ్రులకు ఎటువంటి ఆకాంక్షలు ఉన్నప్పటికీ, వారికి ఎటువంటి గమ్యాలు చేరుకోవాలని ఉన్నప్పటికీ, పిల్లలు కావాలనుకుంటే మీరు ఇది ఒక 20 సంవత్సరాల ప్రాజెక్ట్ అని అర్ధం చేసుకోవాలి. అదీ, ఒకవేళ, మీ పిల్లలు ఎంతో చక్కగా పెరిగితే, అది 20 సంవత్సరాల ప్రాజెక్ట్. ఒకవేళ అలా కాకపొతే, అది జీవితాంతం కొనసాగే ప్రాజెక్టే..! మీరు 20 ఏళ్ల ప్రాజెక్ట్ ని ఎంచుకోవాలనుకుంటే, కనీసం మీకు 20 ఏళ్లపాటూ నిబద్ధత ఉండాలి.

పిల్లల్ని కనకూడదని ఎంపిక చేసుకోవడం వల్ల, మీరు ప్రపంచానికి గొప్ప సేవ చేస్తున్నట్లు.
జీవితం సాగుతున్నకొద్దీ మన భావాలూ, మన ఆలోచనలూ మారిపోతూ ఉండవచ్చు. ఎన్నో కష్ట-నష్టాలూ, ఎన్నో ఒడిదుడుకులూ రావచ్చు. ఇద్దరు మనుషులు ఎంతో సాన్నిహిత్యంలో ఉంటూ అన్నింటినీ పంచుకుంటున్నప్పుడు, ఎన్నో విషయాలు జరగవచ్చు. కానీ మనం ఒక 20 సంవత్సరాల ప్రాజెక్ట్ ని చేపట్టాం కాబట్టి, కనీసం 20 సంవత్సరాల పాటు ఆ నిబద్ధతతో ఉండాలి. ఇది పరిణితి చెందడం. పిల్లలని కనాలని నిర్ణయించుకునే ముందర, ఈ పరిణితి, నిబద్ధత ఉండాలి. అవి మీకు లేకపోతే మీకు పిల్లలు అవసరం లేనట్లే. మీరే ఇంకా ఒక పిల్లవాడిగా ఉన్నట్లు అర్ధం. మీరు ఈరోజున పోట్లాడుకుని వెళ్లిపోవచ్చు. మీరు ఎవరితోనో లేదా దేనికో అంగీకరించక పోవడంతో ఇల్లు వదలి వెళ్లిపోవచ్చు. మీరు ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు,  మీరు ఇంకా పిల్లవాడిగా ఉన్నట్లే..! మీకు మరో పిల్లవాడు అవసరం లేదు. ఒక పిల్లవాడు, పిల్లల్ని కనాలనుకోవడం తగిన పని కాదు కదా..?!! అందుకని మీకు అది తగదు. పిల్లల్ని కనకూడదని ఎంపిక చేసుకోవడం వల్ల, మీరు ప్రపంచానికి గొప్ప సేవ చేస్తున్నట్లు. ఎందుకంటే, ఇప్పుడు, మనకున్న ఒకే ఒక సమస్య, అధిక జనాభా కలిగి ఉండడమే..!!

ప్రేమాశీస్సులతో,
సద్గురు