ధర్మం - అధర్మం

సద్గురు:

మహాభారతం మొత్తం ధర్మం, అధర్మం అనే ఈ రెండు ప్రాధమిక అంశాల చుట్టూ జరుగుతుంది. మనం ధర్మం లేక అధర్మం అన్నప్పుడు చాలామంది సామాన్యంగా ‘తప్పు-ఒప్పు’, ‘మంచి - చెడు’ అనే భావనతో ఆలోచిస్తారు. ధర్మాన్ని, అధర్మాన్ని పరిశీలించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

ఒక క్షత్రియ వీరునకు తనదైన ధర్మం ఉంటుంది, ఒక బ్రాహ్మణునకు అంటే ఒక గురువుకు తన ధర్మం ఉంటుంది. అలాగే వైశ్యులకు, శూద్రులకు ఉంటాయి. ఇది జీవితాన్ని ఉన్నత కోణంలో చూసే విధానం.సమాజంలో వివిధ వర్గాలకు తమ ధర్మం ఉండటమే కాదు, ప్రతి వ్యక్తికీ కూడా తనదైన ధర్మం అంటూ ఒకటి ఉంటుంది. భీష్ముడు, మరి కొందరు, మళ్లీ మళ్లీ ‘ఇది నా ధర్మం’ అంటూ ఉండటం మీరు వినే ఉంటారు. మరి ప్రతి ఒక్కరికి తమదైన ధర్మం ఉంటే, అటువంటప్పుడు అసలు ధర్మం ఏమిటి? అని మీరు అడగవచ్చు. అందరికీ తమదైన ధర్మం ఉండటం వల్లనో, ఒకరి ధర్మం మరొకరి ధర్మానికి వ్యతిరేకంగా ఉండటం వల్లనో, కురుక్షేత్ర యుద్ధం జరగలేదు. కొంతమంది తమ ధర్మాన్ని అతిక్రమించడం వల్ల ఆ యుద్ధం జరిగింది. ఇది జీవితాన్ని ఒకవిధంగా చూసే పద్ధతి. అందులో ప్రతి ఒక్కరూ తమదైన ధర్మంతో నడుచుకోవచ్చు, అయినా అందరికీ వర్తించే మరొక సాధారణ ధర్మం ఉన్నది, దానిని ఎవరూ వ్యతిరేకించలేరు. ఈ విధంగా ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ జీవితాలను నిర్వహించుకోవచ్చు, అది మరొకరి ధర్మాలను అతిక్రమించదు. ఇలాంటి ప్రాథమిక ధర్మం వల్ల ఒక నాగరిక సమాజానికి అవకాశం వచ్చింది.

మత్స్య న్యాయం

ధర్మం ఏర్పడే ముందు, అక్కడ మత్స్య న్యాయం అని ఒకటి ఉండేది, దానికి ఒక కథ ఉన్నది. ఒకరోజు ఒక చిన్న చేప గంగలో హాయిగా తిరుగుతున్నది. అప్పుడు దానికన్నా కొంచెం పెద్ద చేప ఎక్కడి నుంచో వచ్చింది. ఆ చిన్న చేపను మింగి వేసింది. చిన్న చేప, పెద్ద చేపలో భాగం అయిపోయింది. దీనితో ఆ పెద్ద చేప సంతోషంగా ఉంది. మరో రోజు అంతకన్నా పెద్ద చేప వచ్చి దీనిని మింగి వేసింది. ఈ విధంగా పెద్ద చేపలు రావడం, చిన్న చేపలను మింగివేయడం జరిగింది. ఆ అతిపెద్ద చేప అప్పుడు సముద్రం లోకి వెళ్ళింది. అది చిన్న చేపలను మింగి వేయడం మొదలు పెట్టింది. అది చివరకు ఎంత పెద్ద చేప అయ్యిందంటే అది కేవలం తన తోకని కదిలిస్తే, సముద్ర కెరటం హిమాలయాలను తాకుతోంది. దానివల్ల ప్రపంచానికి పెద్ద ఆపద వచ్చింది. ఈ కథను మీరు సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో కూడా ఇది నిజమే. ప్రతి చేపా అది ఉన్నదాని కన్నా పెద్దగా కావాలనే చూస్తోంది. అన్ని చేపలూ ఒకే విధంగా పెరుగుతూ పోతే నాగరిక సంఘం ఉంటుంది. కానీ ఒక చేపే, మరీ పెద్దదయితే నాగరిక సంఘంలోని మూల న్యాయ సూత్రాలు చెదిరిపోతాయి. పెద్ద చేప ఇష్టాయిష్టాలే న్యాయ సూత్రాలు అయిపోతాయి. ఈ మత్స్య న్యాయం నుంచి బయట పడడానికి, ఆ తరువాత అందరూ తమ ధర్మాన్ని పాటిస్తూ సమాజ ధర్మాన్ని మీరకుండా స్వేచ్ఛగా జీవించే ఒక సంఘాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించారు.

మహాభారతంలోని ధర్మం

మహాభారతంలో కూడా కొన్ని చేపలు(కొంత మంది) మరీ పెద్దవి అయిపోయి, ప్రతి వ్యక్తీ స్వేచ్ఛగా జీవించగల న్యాయా సూత్రాలను వారు గౌరవించలేదు. మహాభారతంలో వారు ధర్మం, న్యాయం, అన్నప్పుడు వారు పౌర స్మృతి (civil code) గురించి మాట్లాడలేదు, వారు సమాజంలో శాంతి గురించి కూడా మాట్లాడలేదు, అలాగే ప్రతి వ్యక్తీ స్వేచ్ఛగా జీవించడం గురించి కూడా మాట్లాడలేదు. ధర్మం అంటే ప్రతి వ్యక్తీ తమ సర్వోత్తమ ఉన్నతస్థితికి చేరే విధంగా జీవితాన్ని క్రమబద్ధం చేయడం గురించి మాట్లాడారు. ధర్మం అంటే, మీరు మీ పరమోన్నత స్థితికి చేరడానికి వీలుగా జీవితాన్ని క్రమబద్దీకరించడం. మీరు మీ సహజ పరమ స్థితికి చేరే కృషి చేస్తున్నట్లయితే, మీరు ధర్మంలో ఉన్నట్లు. అలా మీరు ముందుకు వెళ్లకపోతే, మీరు మరొకరికి ఏ హాని చేయకపోయినా సరే, మీరు ధర్మాన్ని పాటించినట్లే. మహాభారతంలో ‘ఇది నాధర్మం’ అంటే, ఎవరైనా ‘ఇది నా ధర్మం’ అంటే, తమ ధర్మం వారికి ఇష్టం కాకపోవచ్చు, అది వారికి సౌఖ్యంగా లేకపోవచ్చు, కానీ వారు తమ సర్వోత్తమ స్థితికి చేరడానికి ఇదే వారికి మార్గం. భీష్ముడు ‘తన ధర్మం’ అన్నప్పుడు, ‘కురువంశానికి ఏమి జరిగినా, రాజ్యం సంక్షోభంలో పడినా, నేను ఈ రాజ్యానికి నా జీవితాన్ని ఇస్తాను, కానీ నా ప్రతిన వీడను’ అంటే అర్థం ఏమిటంటే. నేను నా పరమోన్నత స్థితికి చేరడానికి ఎంచుకున్న మార్గం ఇదే, దానిని తాను విడనాడడని అర్ధం. విదురుడు ఏమన్నాడో మీకు తెలుసు కదా. “కుటుంబం కోసం ఒక వ్యక్తిని త్యజించ వచ్చు, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని త్యజించ వచ్చు, ఒక దేశం కోసం ఒక గ్రామాన్ని త్యజించ వచ్చు, ప్రపంచం కోసం ఒక దేశాన్ని త్యజించ వచ్చు, కానీ పరమోన్నత స్థితి చేరడం కోసం మీరు ప్రపంచాన్ని కూడా త్యజించ వచ్చు” అన్నాడు. ధర్మాన్ని ఈ విధంగా చూడడం జరిగింది. పరమోన్నత స్థితిని చేరడమే ఉన్నత లక్ష్యం అని వారు అన్నారు.

భీష్ముని శక్తి

దీని ఆధారంగానే వారు ధర్మసూత్రాలను క్రోడీకరించారు. వారు రోజువారీ ధర్మాలను కూడా తమ పరమోన్నత స్థితికి చేరటానికి మెట్లుగానే భావించారు. భీష్ముడు ఘోరమైన శపధం చేశాడు. మనం దానిని ఘోరమైంది అనడానికి కారణం, ఆయన బ్రహ్మచర్యం తీసుకున్నాడని కాదు, లేక తనను తాను నిర్వీర్యం చూసుకున్నాడని కాదు, అతని వ్యక్తిగత నష్టానికి కాదు, కానీ ఆయన తన దేశాన్ని, ఎంతో ప్రేమించిన కురువంశాన్ని, పణంగా పెట్టారు కాబట్టి.

తనకు అతి ముఖ్యమైన దాన్ని ఆయన పణంగా పెట్టాడు, తన పరమోన్నత స్థితికి చేరడానికి, అదే ధర్మం అన్నాడు. అలా చూస్తే భీష్ముడు పరమ పురుషుడు లాగా అనేక సందర్భాల్లో మనకు అనిపిస్తాడు. ఒక వ్యక్తి తన శరీరంలోని ఒక్క కణాన్ని (మరో మానవుడిని సృష్టింప చేయగల కణాన్ని), జీవకణాన్ని, జీవశక్తిగా మార్చటానికి సిద్ధమైతే, అది ఒక అణుశక్తి లాగా తయారవుతుంది. ఒక్క కణం, ఎంతో శక్తిని సృష్టించగలదు. అనేకసార్లు, అనేక మంది వ్యక్తులు, తాము భీష్ముని ఓడించలేము అన్నారు. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కాబట్టి అని. ఎందుకంటే ఆయన తన శరీరంలోని ప్రతికణాన్ని, ప్రాణ శక్తిగా మార్చేశాడు. దానితో ఆయన మరణాన్ని తానే నిర్ణయించే వాడిగా మారిపోయాడు. ఈ సందర్భంలోనే మనకు భీష్ముడి మరణం ఆయన చేతిలోనే ఉంది అని చెప్పడం జరిగింది. ఆయన మరణం లేని వాడు కాదు కానీ, ఆయన తన మరణ సమయాన్ని, స్థలాన్ని నిర్ణయించుకునే స్థితికి చేరాడు. అది దాదాపు అమరుడితో సమానం. అమరుడిగా మారేది ఎవరో శాపం ఇస్తేనే. మీరు మరణం లేకుండా ఎప్పటికీ బతికి అంటే, అది ఎంత భయంకరమో ఆలోచించారా? అమరత్వం ఒక శాపం. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మరణం అంటే, అది ఒక వరం.

మహాభారతం – అప్పటి కాల స్థితిని దాటింది

ఇది తమ శక్తులను, ప్రకృతి శక్తులను, ఉద్దీపనం చేసే ప్రక్రియ. మహాభారతంలో మరొక ఉదాహరణ అస్త్రాలు, అంటే శక్తిమంతమైన ఆయుధాలు. సృష్టిలోని అతి చిన్న అణువును కూడా, అతి శక్తివంతమైన అస్త్రంగా యుద్ధరంగంలో ప్రయోగించవచ్చు అన్నారు. నిజానికి అలానే అనిపిస్తుంది. వారు ఇంకా బాణాలు, విల్లంబులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ అస్త్రాలు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయలేకపోయినా కాని ఇవి తల్లి గర్భంలో శిశువులను కూడా సంహరించగలవు అన్నారు. వారికి నమ్మశక్యం గానంత ఊహ ఉన్నదో లేక వారికి నిజంగా ఆ శక్తి ఉన్నదో తెలియదు. వారికి ఇటువంటి ఆయుధాలు ఉన్నాయా? ఇటువంటిదే వారు ఎక్కడైనా చూసారా? ఎవరో ఎక్కడనుంచో వచ్చి, ఈ విషయాలు వారికి తెలియజేశారా? మనకు తెలియదు. కానీ మనం ఈ కథను కొంత శ్రద్ధతో చూడాలి, ఇది కేవలం కొందరు ఒక రాజ్యం కోసమో, ఒక స్త్రీ కోసమే, ఒక పిల్లవాని కోసం చేయడం కాదు, దానిలో అనేక కోణాలు ఉన్నాయి.