ప్రశ్న: ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో తరచుగా కలహాలు ఎందుకు కలుగుతున్నాయి?

సద్గురు: స్త్రీ ఇంకా పురుషుడు భౌతికంగా చూస్తే భిన్నమైన వారు. ప్రకృతి మనల్ని ఈ విధంగా సృష్టించడానికి కారణం పునరుత్పత్తి జరిగి, తరువాతి తరం సాధ్యం కావడం కోసమే. ఒకవేళ ఇది అవసరం లేకపోతే - కొంగలు పసి పిల్లల్ని ఆకాశం నుంచి కిందకి పడేసేటట్లు అయితే - రాబోయే తరాల కోసం స్త్రీ పురుషులు పని చేయాల్సిన అవసరం లేదు.

పునరుత్పత్తి కార్యం కోసం, ఇంకా జాతులు కొనసాగి, వృద్ధి చెందేందుకు ప్రకృతి మిమ్మల్ని ఈ మత్తులో ఈ రసాయన చర్యలో పడేసింది.

పునరుత్పత్తి ప్రక్రియ అనేది ఒక నిర్బంధంగా ప్రజలు భావించకపోతే, ప్రజలు ఆ జోలికే వెళ్లరు. మీలో ప్రతి కణాన్ని, ఆఖరికి మీ మెదడులో కణాలతో సహా - మీ హార్మోన్లు వశం చేసుకుని, మిమ్మల్ని ఆ దిశగా ప్రేరేపిస్తున్నాయి. ఈ ప్రేరేపణకు అతీతంగా ప్రవర్తించడానికి ఒక మనిషికి అసాధారణమైన మేధస్సు అవసరం. అది లేనప్పుడు ఇదే జీవితంగా కనిపిస్తుంది. అది మీరు అలా అనుభూతి చెందేలా చేస్తుంది.

మీకు 10, 11 సంవత్సరాలు నిండే వరకు అసలు మీరు ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించను కూడా లేదు. మిగతా వారందరూ చేస్తున్న పనులు చూస్తే, మీకు నవ్వులాటగా ఉండేవి. కానీ ఒకసారి ఈ రసాయనిక చర్య మీ దేహంలో మొదలైన తరువాత ఇక అదే అంతిమ సత్యం అనుకుంటున్నారు.

Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

పునరుత్పత్తి కార్యం కోసం, ఇంకా జాతులు కొనసాగి, వృద్ధి చెందేందుకు ప్రకృతి మిమ్మల్ని ఈ మత్తులో ఈ రసాయన చర్యలో పడేసింది. ఒకసారి ఇది జరిగిన తర్వాత, ఇక స్త్రీ పురుషులలో దగ్గరవ్వాలన్న నిర్బంధం మొదలౌతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇలాంటి నిర్బంధం మొదలైన తర్వాత ఇక మనస్సు అదే దిశగా పని చేసి దాన్ని ఎలా బాగా చేయాలో ఆలోచిస్తుంది.

ఇచ్చిపుచ్చుకోవడం

ప్రాథమికంగా ఒక సంబంధం అనేది, దురదృష్టవశాత్తు, ఒకరినొకరు ఎలా ఉపయోగించుకోవాలో అన్న భావన తోనే మొదలవుతుంది. ఇది ఒక లావాదేవి సంబంధం. మీరు ఇలా ఇచ్చిపుచ్చుకునే సంబంధంలో నిత్యం ఉన్నప్పుడు, అందులో ఒకరికి ఎల్లప్పుడూ, “నేను అవతలి వారి కంటే ఎక్కువ ఇచ్చి వారి దగ్గర తక్కువ పుచ్చుకుంటున్నానేమో” అన్న భావన కలుగుతుంది.

ముఖ్యంగా, ఇది శరీరాలకు సంబంధించిన విషయం కాబట్టి, మిమ్మల్ని మరొకరు ఉపయోగించుకుంటున్నారన్న భావన ఎంతో తేలికగా వస్తుంది. సమాజాలు మీకెప్పుడు తక్కువ ఇచ్చి ఎక్కువ పుచ్చుకోవడం తెలివిగలతనమని నేర్పించాయి. అది వివాహమైనా సరే వ్యవహారమైనా సరే ఇదే లెక్క. అందుకే ప్రేమ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడటం జరుగుతోంది. మీరు ఈ లెక్కని దాటి వెళ్లాలన్న భావావేశం మీకు ఎవరి పట్ల అయినా కలిగినప్పుడు, మీరు ఈ లెక్కని అధిగమిస్తారు. అప్పుడు మీరు ఏం పుచ్చుకుంటున్నారనేది మీకు ముఖ్యం కాదు, మీరు ఏమిస్తున్నారన్నదే ముఖ్యం అవుతుంది.

భావపరమైన తీక్షణత ఉన్నప్పుడు ఒక అనుబంధం ఎంతో అందంగా ఉంటుంది. ఒకసారి అందులో ఉన్న భావావేశం తొలగిపోతే ఇక అది కేవలం ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది. మీరు మీ వ్యాపారాల్లో, మీ ఇరుగుపొరుగు వారితో, ఇంకా ఎంతో మంది ప్రజలతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు నడిపించగలరు. కానీ ఇవన్నీ మితంగానే ఉంటాయి. కానీ వివాహంలో ఇచ్చి పుచ్చుకోవడం అన్నది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అందుకని మీరు ఈ ప్రత్యేకమైన వ్యక్తికి బంధీ అయిపోయిన భావన కలుగుతుంది.

అప్పుడు సహజంగానే మీలో, ఎదుటివారు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్న భావన మీకు కలుగుతుంది. ఒకసారి ఈ భావన కలిగిన తర్వాత ఇక మిగిలేది కలహాలే, కలహాలే, కలహాలే. ప్రేమ ఉన్న క్షణాల్లో మాత్రమే స్త్రీ పురుషులు నిజంగా ఒక్కటిగా ఉండగలరు. ఒకసారి అది లేక పోయిన తర్వాత ఇంక ఇది ఎంతో కష్టమైపోతుంది. భౌతికంగా భావపరంగా ఇంకా ఎన్నో అంశాల్లో పంచుకోవడం ఒకటిగా జీవించడం అన్నది కష్టంగా అనిపిస్తుంది.

ముఖ్యంగా, ఇది శరీరాలకు సంబంధించిన విషయం కాబట్టి, మిమ్మల్ని మరొకరు ఉపయోగించుకుంటున్నారన్న భావన ఎంతో తేలికగా వస్తుంది.

అది కేవలం డబ్బు లేదా కేవలం మీ ఇల్లు లేదా మరో సెటిల్మెంట్ అయితే, “సరే, నువ్వు ఇంట్లో ఈ భాగాన్ని వాడుకో, నేను ఆ భాగాన్ని వాడుకుంటాను” అనుకుంటారు. “నేను సంపాదిస్తాను, నువ్వు వంటచేయ్యి” అంటారు. కానీ శరీరాలుకు సంబంధించింది కాబట్టి ఒకరిని మరొకరు వాడుకుంటున్నారన్న భావన కలగడం వల్ల కలహాలకు కారణమవుతుంది.

మరి దీనికి పరిష్కారం ఏది?

మీరు పొద్దస్తమానూ ఒక స్త్రీగానో లేదా పురుషుడుగానో ఉండడం మానేయాలి, మీరు మీ స్త్రీత్వాన్ని పురుషత్వాన్ని రోజులో 24 గంటలూ మోయడం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో, మీ జీవితంలో కొన్ని పరిస్థితుల్లో, మీరు ఒక స్త్రీ గానో లేదా ఒక పురుషుడుగానో వ్యవహరించాల్సి ఉంటుంది. మిగతా సమయాల్లో మీరు అలా ఉండనవసరం లేదు.

కానీ సమాజాలు మీకు ఈ విధమైన శిక్షణనిచ్చాయి - ఎల్లప్పుడు ఇలా ఉండేలాగా. మీరు ఎటువంటి దుస్తులు ధరిస్తారు, మీరు ఏ పని చేస్తారు, ఇవన్నీ కూడా మీకు శిక్షణ ఇవ్వబడ్డాయి. మీరు ఇలా 24 గంటలూ ఒక పురుషుడిగా లేదా 24 గంటలూ ఒక స్త్రీ గా ఉన్నారంటే, మీకు సమస్యే.

కానీ మీకు ఇక్కడ కేవలం ఒక జీవిగా ఉండడం తెలిస్తే, మీరు హాయిగా ఉంటారు. మీరు ఒక స్త్రీలా గానీ పురుషుడులా గానీ ప్రవర్తించ వలసివచ్చినప్పుడు మీరు మీ పాత్రను ఎంతో బాగా పోషిస్తారు. దీనిని మీరు అలా ఉంచుకోవాలి. ఒక జీవంగా ఇక్కడ ఉండి ఈ భూమ్మీద నడవగలగాలి. మీరు అలా ఉంటే ఇక ఎటువంటి కలహాలు ఉండవు. ఇద్దరు మానవులు ఎంతో బాగా, ఒక్కటిగా జీవించగలుగుతారు.

నిర్బంధాలకు అతీతంగా

స్త్రీ పురుషులు అనేవి రెండు నిర్బంధాలు. రెండు నిర్బంధాలు ఎప్పటికీ ఒక్కటిగా జీవించలేవు. మీరు ఎంతగా మీ లైంగికతతో గుర్తింపు ఏర్పరచుకుంటే మీ నిర్బంధం అంత ఎక్కువగా ఉంటుంది. మీలో నిర్బంధ స్థితి ఉంటే సహజంగానే మీరు పక్క వారికి ఇబ్బంది కల్పిస్తారు. ఇలా ఒకరికొకరు ఇబ్బందులు కలిగించుకుంటే, ఇక సమస్యే.

మీరు స్త్రీత్వంతో గానీ పురుషత్వంతో గానీ మరీ ఎక్కువగా గుర్తింపు ఏర్పరుచుకోకుండా కేవలం ఒక జీవంగా ఇక్కడ నడవగలిగితే, “మీరు స్త్రీ నా, పురుషుడా..?” అన్నది మీ జీవితంలో ఎంతో చిన్న భాగమని మీరు తెలుసుకుంటారు. మీ జీవితాన్ని మీరు ఒక స్త్రీనా, పురుషుడా అన్నదాన్ని బట్టి రూపొందించుకోనవసరం లేదు.

మీ లైంగికతతో మీరు గుర్తింపు ఏర్పరుచుకోకపోతే, మీలో ఉన్న సామర్థ్యం ఎంతగానో వెలికివస్తుంది. ప్రజలు మరింత కళాత్మకంగా, ఎన్నో పనులు చేయగలిగే సామర్థ్యం కలిగి, ఊహకు కూడా అందని విధంగా జీవించగలరు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు