ప్రశ్న: మన కెరీర్, మానవ సంబంధాలు లేదా కమ్యూనిటీ ప్రాజెక్టుకు సంబంధించినవి గానీ, మనం ఎలా ఉండాలనుకుంటామో, వాటిని అలానే భౌతికంగా వ్యక్తపరచుకోవడం ఎలా?

సద్గురు: మన మనస్సును మనకు కావాల్సిన వాటిపై కేంద్రీకరించడం ద్వారా జీవితంలో కొన్ని సాధించవచ్చు. అయితే, మనం దేన్ని సాధించడం అంటున్నామో దాని నిర్వచనం మార్చుకోవాలి. మీరు కోరుకున్నది మీకు దక్కడం అనేది మీరేదో సాధించినట్లు కాదు. మనిషి స్వభావాన్ని వ్యక్త పరచుకోవడానికి ఇదో చిన్న ప్రయత్నం. ముఖ్యంగా ఇది నాకు పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. ఈ వైఖరిని మార్చాలన్నది నా ఉద్దేశం.

వృత్తి, మానవ సంబంధాలు - మీరు చేర్చినట్లుగా - కమ్యూనిటీ ప్రాజెక్టులు, ఇవి కూడా ఒక రకంగా వృత్తిలాంటివే - మీరు కోరుకొనేవన్నీ భౌతికమైన విషయాలు. ఉదాహరణకు ఒక ఆటో రిక్షాను తీసుకోండి. ముగ్గుర్ని తీసికొని వెళ్లాల్సిన ఆటోలో పదిమందిని ఎక్కించుకొని తీసుకొని వెళతారు. డ్రైవర్ దాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఏదో లాగా కొండమీదికి తీసుకొని వెళ్లగలుగుతాడు; అతనిది ఒక విజయంగా భావిస్తాడు. ఆటో ఆపి చాయ్ తాగి విజయోత్సవం జరుపుకుంటాడు. వ్యక్తిగతంగా, ఆర్థిక లాభం దృష్ట్యా ఇది ఉపయోగకరమే కాని, అదొక విజయమో, ఒక దర్శనీయక విశేషమో కాదు. ఇదో చిన్న కోరిక, దీన్నిఅనేక విధాలుగా తీర్చుకోవచ్చు.

యోగాలో మేము ఏం చెప్తామంటే మీరు లక్ష్యం మీద ఒక కన్ను ఉంచితే, మీరు ఆ లక్ష్యం చేరుకోవడానికి దారి వెతుక్కోవడానికి ఒక కన్నే ఉంటుంది

ఇటువంటివి ప్రజలు మనస్సులో గొప్ప విషయాలుగా కనిపించడానికి కారణం, వారు తమ లక్ష్యాలను ఒక పద్ధతిలో ఏర్పరచుకోవడమే. ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం  ప్రారంభంలోనే మేమీ విషయాలు మాట్లాడతాము; యోగాలో మేము ఏం చెప్తామంటే మీరు లక్ష్యం మీద ఒక కన్ను ఉంచితే, మీరు ఆ లక్ష్యం చేరుకోవడానికి దారి వెతుక్కోవడానికి ఒక కన్నే ఉంటుంది. ఒంటి కంటితో ఉన్న ఓ మనిషి, తన ఇంటికి తోవ కనుక్కోవడమే ఓ గొప్పపని అనుకుంటాడు. అయితే రెండు కళ్లూ చక్కగా కనిపించే వ్యక్తికి ఇందులో గొప్ప తనమేమీ కనిపించదు. అతను తేలికగా తన ఇల్లు కనుక్కోగలడు.

మనిషి సామర్ధ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయకుండా, మనం చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకున్నాం. అప్పుడు, తక్కువ సామర్ధ్యం ఉన్న ఈ చిన్న యంత్రంతో, (కొండ ఎక్కగలిగినంత సామర్థ్యం లేని ఈ యంత్రం), ఈ చిన్న చిన్న లక్ష్యాలను సాధించడమే ఒక గొప్ప కార్యం సాధించినట్లుగా అనుకొంటూ ఉంటాం. కాని అదే తనను తాను మరింత శక్తిమంతమైన యంత్రంగా మార్చుకున్నట్లయితే, మీరు శ్రమ పడకుండానే అక్కడకు చేరగలరు. మనిషి తన దృష్టిని కేంద్రీకరించవలసిన విషయం ఇదే, అంతేకాని ‘‘నేను దేనిగా మారాలి?’’ లేదా “నా దగ్గర ఏమి ఉండాలి” అని కాదు. ‘‘ఈ జీవితాన్ని పెంపొందించటం ఎట్లా?’’ అన్నది  మీ లక్ష్యం కావాలి. నేను ‘‘జీవితం’’ అన్నప్పుడు నేను మీ కెరీర్ గురించి కాని, సంబంధాల గురించి కాని, మీ కమ్యూనిటీ ప్రాజెక్టుల గురించి కాని మాట్లాడడం లేదు. నేను ఈ జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఈ శరీరంలో ఉన్న జీవాన్ని గురించి మాట్లాడుతున్నాను. దీనిని అది ఇంతవరకు ఉన్న  స్థితి నుండి మరింత ఉన్నతస్థాయికి లేదా ఉన్నతమైన శక్తి కలిగిన జీవితానికి తీసికొని వెళ్లాలి. మీరు చేయవలసింది ముందు అదే. మీరు మీ దృష్టిని మీ జీవితాన్ని పెంపొందించటం మీద పెడితే అప్పుడు మీకు జరగవలసిందేదో అదే చేస్తుంది.

మీరు ఈ జీవాన్ని ఇప్పుడున్న దానికంటే శక్తిమంతమైన, సమర్థమైన స్థితికి తీసుకువెళ్ళండి; అప్పుడు మీరు ఊహించినదానికన్నా అధికమైన ప్రయోజనాలే పొందుతారు.

యోగ ఇందు గురించే. మీకు ఏమి ఉందో, మీరు ఏం చేయాలో అన్నదాని గురించి చింతించకండి; దీన్ని శక్తివంతమైన యంత్రంగా మలచుకోండి. అప్పుడు అదే ఏ కొండ పైకైనా ఎక్కుతుంది. మీ దృష్టి ఈ విధంగా ఉండాలి. అంతే కానీ ‘‘నాకు ఇటువంటి ఉద్యోగం కావాలి, నేను ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి, పొరుగున ఉన్న ఈ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి...’’ ఇటువంటివి కాదు. మీరు ఈ జీవాన్ని ఇప్పుడున్న దానికంటే శక్తిమంతమైన, సమర్థమైన స్థితికి తీసుకువెళ్ళండి; అప్పుడు మీరు ఊహించినదానికన్నా అధికమైన ప్రయోజనాలే పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవన ప్రమాణం మీరు జీవితంలో  సమకూర్చుకున్న  ఏర్పాట్లమీద ఆధారపడదు; మీ జీవన ప్రమాణాన్ని మీ అంతర్గత చోదక శక్తి నిర్ణయిస్తుంది. జీవితం అలానే ఉండాలి. జీవితం లోపలి నుండే కదా జరుగుతోంది. మీరు సమకూర్చుకున్న వస్తువులు, ఏర్పాట్లు  సామాజికంగా గొప్పవి కావచ్చు, కానీ జీవితానికి, అస్థిత్వానికి సంబంధించి విలువైనవి కాదు.

అందువల్ల చిల్లర కోరికలను భవిష్యత్ దృష్టి అనకండి: ‘‘నేనో కొత్త మోడల్ కారుకొనాలనుకున్నాను, కొనుక్కోగలిగాను!’’  అది మీరెలాగూ కొనుక్కోగలరు, ఎందుకంటే వాళ్లు వడ్డీలేని ఋణం ఇస్తున్నారు, ఎలాగు పదేళ్లలో మీ నుండి వసూలు చేసుకుంటారు. ఇది జరగడంలో విశేషమేమీలేదు. ఎవరైనా కారుకొనవచ్చు, విశేషమేమీ లేదు. ఆ మీరేం చేస్తారు? మీ పొరుగువాళ్లు మిమ్మల్ని కారులో చూసి అసూయపడితే మీకు ఆనందం. కాని వాళ్లందరికీ అంతకంటే పెద్దకార్లు ఉంటే మీకు మళ్లీ దిగులే..!. కాని మీరు మానవ చైతన్యాన్ని  పెంపొందించుకోగలిగితే మీరు నగరంలో ఉన్నా, కొండమీద ఉన్నా, ఒంటరిగా ఉన్నా ఎలా ఉన్న సరే - అది మీకు అద్భుతంగానే ఉంటుంది. మీరు కోరుకోవలసింది ఇదే.

ప్రేమాశిస్సులతో.
సద్గురు