ప్రశ్న: సద్గురూ! నమస్తే. సద్గురూ, విశ్వ సంకల్పం అంటే ఏమిటి, అలాగే స్వేచ్ఛా సంకల్పం అంటే ఏమిటి? స్వేచ్ఛా సంకల్పం, విశ్వ సంకల్పం ఒకటేనా, లేదా ముందే నిర్ణయించిన విధి ప్రకారం నడిచే విశ్వ సంకల్పం అనేది ఏదైనా ఉందా?


ద్గురు: మీరు విశ్వ సంకల్పం అని అనేది -  మీకు తెలిసిన సంకల్పం, అంటే మానవ సంకల్పం , లేదా మీ మానసిక సంకల్పం కాదు. దాని కొక నిర్దిష్ట సరళి, నిర్దిష్ట గుణం ఉన్నాయి. విశ్వాన్ని పాలించే దానికి ఓ నిర్దిష్ట చైతన్యం, తనదైన ఓ విధానం ఉంటాయి. అదెప్పుడూ ఉంటుంది, మీరు, నేను, ఈ క్షణం ఉండటం అనేది విశ్వ సంకల్పమే, కానీ ప్రస్తుతం మీరీ సత్సంగానికి రావడం అన్నది మీ సంకల్పం, కాదా? కాదంటారా? కాబట్టి, విశ్వ సంకల్పం అన్నది ఓ నిర్ణయం లాంటిది కాదు. అది ఊరికే అలా అక్కడుంది. విశ్వ సంకల్పం వల్లే మనమీ రూపాన్ని దాల్చాం.

విశ్వ సంకల్పం వల్లే ఈ గ్రహం సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఇవి మానవ ఆలోచనల్లాంటివి కావు; ఇది కేవలం ప్రకృతి విధానం. ప్రస్తుతం, నీరు ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తుంది. దాన్ని ఏ రకంగా అయినా సరే, ఆపడానికి ప్రయత్నించండి. దానికంటూ ఓ సంకల్పం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ అది సంకల్పం కాదు; అది గురుత్వాకర్షణ నియమాల ప్రకారం ప్రవహిస్తోంది.

విశ్వ సంకల్పం ఎప్పుడూ సజీవంగా ఉంటుంది, మనం జీవితంలో ప్రతీక్షణం దాన్ని ఆనందిస్తున్నాం లేదా దానివల్ల మనం కొన్నిసార్లు బాధపడతాం. 

కాబట్టి, విశ్వ సంకల్పం అనేది గురుత్వాకర్షణ శక్తిలాంటిది, అలాంటి అనేక విషయాల లాంటిది. అదెప్పుడూ ఉంటుంది. అది ఆ రకంగానే ప్రవర్తిస్తుంది ఎందుకంటే, జీవిత విధానమే విశ్వ సంకల్పంపై ఆధారపడి ఉంది. కానీ మీరు ఈ రోజు ఇదో, అదో చేయాలని నిర్ణయిస్తే, అది ఖచ్చితంగా మీ సంకల్పమే. విశ్వ సంకల్పానికి దీనిలో ఎలాంటి పాత్రా లేదు, కానీ మీరు అది నెరవేర్చడానికి విశ్వశక్తిని వాడుకోవచ్చు...మీ సంకల్పాన్ని నెరవేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తోంది, దాన్ని ఉపయోగించుకొనే నేనిక్కడ కూర్చోగలుగుతున్నాను, లేదంటే నేనిక్కడంతా తేలుతూ ఉంటాను. అవునా? నేనిక్కడ ఉండటానికి నాకొక లంగరు కావాల్సి వస్తుంది. ఎందుకంటే, గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తోంది కాబట్టి నేనిక్కడ కూర్చోవడం వీలౌతోంది, అలాగే ఆ శక్తిని ఉపయోగించుకొని నేను నాట్యం కూడా చేయచ్చు. అది నా సంకల్పం. కూర్చోవడం నా సంకల్పం, నాట్యం చేయడం నా సంకల్పం. కావాలంటే, నేను కిందికి దూకచ్చు, అది కూడా నా సంకల్పమే, కానీ ఈ విషయాలేవీ గురుత్వాకర్షణ లేకుండా జరగవు. బహుశా మనకు దొరికే అతి దగ్గరి ఉదాహరణ అదే.
కాబట్టి, విశ్వ సంకల్పం ఎప్పుడూ సజీవంగా ఉంటుంది, మనం జీవితంలో ప్రతీక్షణం దాన్ని ఆనందిస్తున్నాం లేదా దానివల్ల మనం కొన్నిసార్లు బాధపడతాం. ఈ గురుత్వాకర్షణ శక్తి మీతో నాట్యాన్ని చేయిస్తుంది, లేదా దానితో మీరు అనుసంధానమై లేకపోతే, మీరు కిందపడచ్చు. కాబట్టి, అక్కడే మీ సంకల్పం పనిచేస్తుంది. అలా మీ సంకల్పం ఏమి జరగాలో నిర్ణయించి,  విశ్వ సంకల్పాన్ని ఉపయోగించుకోగలగుతుంది. అదే లేకుంటే, మీ సంకల్పానికి అసలు ఉనికే ఉండేది కాదు. మీకు సంకల్పం ఉండాలనేది విశ్వ సంకల్పం, కానీ మీ జీవితాన్ని మీ సంకల్పం ద్వారా పరిపూర్ణం చేయాలని ప్రయత్నించకండి, ఎందుకంటే మీ సంకల్పాన్ని సాధారణంగా ఆలోచనే నడిపిస్తుంది, మీ ఆలోచన మీరు సేకరించి పెట్టుకున్నదే.  మీ చుట్టూ ఉన్న సమాజం నుండి మీరు సేకరించిన విషయాలే మీ ఆలోచనలు.

సంకల్పబలంతో చేయడం కంటే, మీరు భక్తితో చేయండి, మీరు ప్రేమతో చేయండి.

మీరు సేకరించిన సమాచారాన్నే వివిధ మార్గాలలో మీరు తిరిగి వాడుకుంటున్నారు. చిన్న చిన్న పనులను పూర్తిచేయడానికి, మీరు సంకల్పబలంతో పనిచేయడం పర్వాలేదు. ఉదయం మీరు 5 గంటలకి లేవాలనుకుంటే, మీరు దాన్ని సంకల్పబలంతో చేస్తారా లేదా అలారంతోనా? ఒకవేళ మీ అలారం మోగినప్పటికీ, మీ పక్కమీద నుంచి బయటపడటానికి సంకల్పబలం కావాలి. ఇలా చేస్తే మీరు ఎన్నో పనులు చేయవచ్చు, కానీ రోజు చివరన మీ మొహం వేలాడుతుంది. సంకల్పబలంతో చేయడం కంటే, మీరు భక్తితో చేయండి, మీరు ప్రేమతో చేయండి. నేను 5 గంటలకు లేవాలనుకుంటాను ఎందుకంటే నేను నిజంగా  చేయాలనుకున్న పని ఒకటుంది. నేన్నది ఖచ్చితంగా చేయాలని కాదు, నేను ఖచ్చితంగా చేయాల్సినది నా జీవితంలో ఏదీ లేదు. నా జీవితంలో ప్రతీదీ నేను చేయాలని అనుకుంటున్నవే. కాబట్టి అలారం 5 గంటలకి అయితే, నేను 4.30కే లేస్తాను, ఎందుకంటే నేనది చేయాలనుకుంటున్నాను. మీరు మీ జీవితాన్ని నేనిది ఖచ్చితంగా చేయాలి అని జీవిస్తే, దానికి కారణం మీ సంకల్పబలం. “ఓహ్, ఏది ఏమైనా నేను చేసి తీరాలి, నేను చేసి తీరాలి, నేను చేసి తీరాలి!’ మీరు దాన్ని చేయగలగ వచ్చు , కానీ మీ మొహం వేలాడిపోయి, దుఃఖమయమవుతుంది. ప్రతిదీ జరిగుతుంది, కానీ చివరకు, మీ మొహం వేలాడి పోతుంది; అసలు ప్రయోజనమే లేకుండా పోతుంది, అవునా, కాదా? ఇవన్నీ చేయడంలోని అసలు ఉద్దేశాన్ని అప్పటికే కోల్పోతాము. కాదంటారా? మీరు దాన్ని ఆస్వాదించలేదు, అది మీకు సంతృప్తిని ఇవ్వలేదు, ఇక అదంతా చేయడం ఎందుకు? వ్యర్ధమేకదా!
కాబట్టి, మీ జీవిత విషయాలను సంకల్పబలంతో చేయాల్సిన పనిలేదు. అడపాదడపా చిన్న పనులు, కొన్నిసార్లు మీ శరీరం ఇబ్బంది పడుతున్నప్పుడు, మిమ్మల్ని మీరు కొంత నెట్టుకురావలసి వస్తుంది, కానీ మీ జీవిత ప్రక్రియను సంకల్పబలంతో నిర్వహించాలని చూడకండి. ఎందుకంటే మీది విజయవంతమైనా, ఏడుపు  మొహం అవుతుంది. మీ పొట్టలో అల్సర్, మీ బ్యాగులో విజయం, ఇక మీ మొహం ఎంత పొడుగ్గా వేలాడిపోతుందంటే దాన్ని ఎవరూ చూడాలని కూడా అనుకోరు లేదా మీ గడ్డం మీ ఊరు (హైదరాబాద్) రోడ్లను తాకుతూ ఉంటుంది. మంచిది కాదు, ఎందుకంటే నా కైతే కాస్త మెత్తగా(గడ్డం) ఉంది; మరి మీకు?

ప్రేమాశీస్సులతో,
సద్గురు