విజయదశమి ప్రాముఖ్యత ఏమిటి?

 

తొమ్మిది రోజుల నవరాత్రుల తరువాత వచ్చేది రోజు విజయదశమి. ఈ నవరాత్రులు, వాటి ఆఖరున వచ్చే విజయదశమికి మన సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యత గురించి యోగి, మర్మజ్ఞులైన సద్గురు ఈ వ్యాసంలొ వివరిస్తారు.


దసరాతో ముగిసే ఈ నవ రాత్రి పండుగ అందరూ జరుపుకునే ఎంతో ప్రాముఖ్యమున్న సాంప్రదాయ పండుగ. ఇది అంతా కూడా అమ్మవారికి సంబంధించిన పండుగ. ఆంధ్రలో కనకదుర్గ అని, కర్ణాటకలో చాముండీ దేవి అని, బెంగాల్లో దుర్గ అని ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ దేవతల గురించి దసరా పండుగ జరుపుతారు, కానీ ఇది ముఖ్యంగా దేవి లేదా ఆదిశక్తికి సంబంధించినది.

దసరా - ఉత్సవాలలో పదవ రోజు
నవరాత్రి చెడును, విశృంఖలత్వాన్ని నిర్మూలించడానికి, అలాగే జీవితంలో అన్ని అంశాల పట్ల, అంటే మన శ్రేయస్సుకి దోహదపడే వస్తువులు, విషయాల పట్ల కూడా కృతజ్ఞతా భావంతో ఉండటానికి సంబంధించినది. నవ రాత్రుల తొమ్మిది రోజులు మూడు ప్రాధమిక లక్షణాలైన తామస, రజస, సత్వ గుణాలకు అనుగుణంగా వర్గీకరించ బడ్డాయి. మొదటి మూడు రోజులు తామసికమైనవి, వాటికి ప్రతీకలు తీవ్రమైన దుర్గ, కాళి దేవతలు. తరువాతి మూడు రోజులు లక్ష్మికి సంబంధించినవి - కోమలమైనదే కానీ ధన, వస్తు, కనక, వాహనాలకు ఆధారమైన దేవి. ఆఖరి మూడు రోజులు సరస్వతి కోసం ఉద్దేశించబడినవి. అదే సత్వ గుణం. అది జ్ఞానం, జ్ఞానోదయానికి సంబంధించినది.

నవ రాత్రుల తరువాత పదవది, అంటే ఆఖరుది విజయదశమి- అంటే మీరు ఈ మూడు గుణాలను జయించారని అర్ధం.

విజయదశమి- విజయం పొందిన రోజు
ఈ తామస, రజస, సత్వ గుణాలలో వేటిని ఎంత వృద్ధి చేసుకుంటున్నారనే దానిని బట్టి మీ జీవితం ఒక నిర్దేశిత మార్గంలో వెళుతుంది. మీరు తామసంగా వ్యవహరిస్తే, మీరు ఒక విధంగా శక్తివంతంగా ఉంటారు. మీరు రజసంతో వ్యవహరిస్తే మరొక విధంగా ఉంటారు. మీరు సత్వగుణంతో వ్యవహరిస్తే, మీరు పూర్తిగా వేరే తరహాలో శక్తివంతులౌతారు. మీరు వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళితే, అది ఇక శక్తికి సంబంధించినది కాదు, అది ముక్తికి సంబంధించినది. నవ రాత్రుల తరువాత పదవది, అంటే ఆఖరుది విజయదశమి- అంటే మీరు ఈ మూడు గుణాలను జయించారని అర్ధం. మీరు వాటిలో దేనికీ లొంగి పోకుండా, వాటిని దాటి వెళ్ళారు. మీరు వాటి అన్నిటిలోనూ పాల్గొన్నారు కానీ మీరు ఆ గుణాలను మీవిగా చేసుకోలేదు. మీరు వాటిని జయించారు. అదే విజయదశమి, జయం పొందిన రోజు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1