ఊరికే ఆసక్తి పెంచుకోవడం మంచిది కాదని, అలా అభిరుచుల్ని, ఆశలని పెంచుకుంటూ పొతే ఎదో ఒకనాడు అది మిమ్మల్నే దహించివేస్తుంది అని, అభిరుచుల్ని పెంచుకోవడం కన్నా కూడా ప్రతిభని పెంచుకుంటే అది మీరు అనుకోని చోట్లకు తీసుకువెళ్తుంది అని సద్గురు చెబుతున్నారు.

ప్రశ్న: నమస్కారం సద్గురూ! నాలాంటివాడు చేయవలసిన పని చదువులో నిమగ్నం కావడం. కాని నాకు చదువు మీద ఎటువంటి ఆసక్తి లేదు. నేనేం చేయాలి?

సద్గురు: ప్రతి మనిషికీ ఏదో ఒకదానిలో నైపుణ్యం, ప్రతిభ, తగినంత అభిరుచి ఉండాలి. మీకు ఆసక్తి ఎంతో ఎక్కువగా ఉండి తగినంత నైపుణ్యం, ప్రతిభ లేనట్లయితే ఆ అభిరుచి మిమ్మల్ని దహించివేస్తుంది. మీ నైపుణ్యం, ప్రతిభలను మీరు పెంపొందించుకోవాలి; అభిరుచిని, ఆసక్తిని కాదు. మీకు సంగీతం మీద ఆసక్తి ఉంటే, ఉదాహరణకు మీరు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా కూర్చుని, విని పరమానందం పొందేటట్లుగా పాడగలిగినా, ఒక వాద్యాన్ని వాయించ గలిగినా, మీ ఉపాధ్యాయులు మీకు మరో విషయం బోధించే ప్రయత్నం చేయకుండా రోజూ మీ సంగీత కచేరీ వినడానికే వస్తారు. అందువల్ల మీరు ఆసక్తితో రగిలిపోతూ ఉంటే మీ నైపుణ్యం, ప్రతిభను పెంపొందించుకోవడానికి కృషి చేయండి. “వాళ్లు నాకు సమయమివ్వడం లేదు, భౌతికశాస్త్రం నేర్చుకో, రసాయనశాస్త్రం నేర్చుకో అంటున్నారు” అనుకోవద్దు.

మీరో సంగీత విద్వాంసుడు కావడానికి అద్భుతమైన గొంతో, మరొకటో అవసరం లేదు. మీకు మంచి వినికిడి శక్తి కావాలి.

సంగీతం మీరు పాడడం వల్లో, ఏదన్నా వాయిద్యం వాయించడం వల్లో రాదు. అది మీ వినికిడి శక్తి వల్ల వస్తుంది. మీ చెవులు ఎంత సూక్ష్మంగా గ్రహించగలిగితే మీకు అంత మంచి సంగీతం వస్తుంది. మీరో సంగీత విద్వాంసుడు కావడానికి అద్భుతమైన గొంతో, మరొకటో అవసరం లేదు. మీకు మంచి వినికిడి శక్తి కావాలి. మీరొకదాన్ని విన్నప్పుడు అనేక ధ్వనుల పొరల మధ్య ఏం జరుగుతూ ఉందో తెలుసుకోగలగాలి. కా,కా (కాకి అరుపులు) ధ్వనులు విని ఏ ఉపాధ్యాయుడూ సంగీతాన్ని కూర్చలేడు. స, రి, గ, మ కాదు కా, కా, కా, కా అనేటువంటి సంగీతాన్ని.

ఎందుకంటే కాకి ఎల్లవేళలా ఈ కా, కా ధ్వనులను ఒకే రీతిగా చేయదు. దాన్ని వివిధ స్థాయిల్లో చేస్తుంది. ఎన్నో శ్రుతుల్లో చేస్తుంది. మీరు శ్రద్ధగా విన్నట్లయితే ప్రతి దానికీ ఒక ప్రత్యేక జ్యామితి ఉంటుంది. అన్ని ధ్వనులకూ నిర్దష్ట జ్యామితి ఉంటుంది. మీరు జాగ్రత్తగా వింటే అందులో సంగీతం ఉంటుంది. ఆ విధంగా మీరు సామర్ధ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఎవరూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేయలేని స్థితికి మీ సామర్ధ్యాన్ని తీసికొని వెళితే ఇక మీ అభిరుచి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలే మిమ్మల్ని పైకే తీసికొని వెళతారు. మీరు అభిరుచిని చూపాల్సిన అవసరం లేదు,  సామర్ధ్యాన్ని చూపిస్తే చాలు.

 ప్రతిభను పెంచుకొనే ప్రయత్నం చేయండి. ఆసక్తిని నిద్రపోనివ్వండి.

అందువల్ల ఆసక్తి పెంచుకొనే ప్రయత్నం చేయవద్దు. ప్రతిభను పెంచుకొనే ప్రయత్నం చేయండి. ఆసక్తిని నిద్రపోనివ్వండి. ప్రతిభను రగలనివ్వండి. అభిరుచి ప్రజ్వలిస్తే, అది మిమ్మల్ని కాల్చివేస్తుంది. ఇక్కడ ఈ పాఠశాలలో మీకొక చోటుంది. అక్కడ ఎన్నో ధ్వనులున్నాయి. వాటినుండి మీరు సంగీతం కూర్చవచ్చు. ఒక యంత్రం గర్జిస్తే దానినుండి సంగీతం సృష్టించలేరా? ప్రతిదానికీ ఒక శ్రుతి ఉంటుంది. ప్రతి దానికీ ఒక లయ ఉంటుంది. అదక్కడే ఉంది, మీరు పట్టుకోవాలంతే. నిరంతర అన్వయమే దాన్ని సంభావ్యం చేస్తుంది. “ఓహ్. నేనొక సంగీత పాఠశాలలో ఉండవలసింది, ఇప్పుడు నేను రసాయనశాస్త్ర తరగతిలో ఉన్నాను. ప్చ్” అనుకోకూడదు. దానివల్ల మీకేమీ లాభం ఉండదు. మీకు అదీ రాదు, ఇదీ రాదు. మీ ఆసక్తి పెంచుకోవడంపై కాలం వృథా చేయకండి. “నాకు సంగీతంపై ఆసక్తి ఉంది, కాని నాకు ప్రతిభ లేదు.” అంటే ఉపయోగమేంటి... మీ సంగీతం వినడానికి ఇతరులు ఆసక్తి చూపించాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు