సాధకుడు: నాలోని ప్రతి అణువు నన్ను ఆశ్రమంలో ఉండమని చెప్తోంది, కాని...

సద్గురు:  ఈ ‘కాని’ అనే పదం, లక్షలాది సంవత్సరాల నుంచి భూమి మీద ప్రతిధ్వనిస్తూనే ఉంది. కొందరు దానిని సమర్ధవంతంగా పరిష్కరించుకున్నారు. కాని చాలామంది ఈ పాడు ‘కాని’ ని అధిగమించలేక పోయారు.

సాధకుడు: మా తల్లిదండ్రులు అనేక విధాలుగా నా మీద ఆధారపడి ఉన్నారు, వారిని చూసుకోవడం నా ధర్మం అనుకుంటాను. అదే సమయంలో దానికోసం(ఆధ్యాత్మికం) జీవిత కాలం వేచిచూడ దలచుకోవడం లేదు, అలా నిరీక్షించడం కూడా నేరం అనిపిస్తుంది. అందువల్ల నేను ఇప్పుడు నలిగిపోతున్నాను. నేనిప్పుడు దీనిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ముందుకు అడుగు వేయాలి?

సద్గురు: కాని గత ఐదేళ్ళనుంచీ మీరు అదే చెబుతున్నారు.

సాధకుడు: అవును!

సద్గురు:  ఐదేళ్ళల్లో, మీరు దాని మీదే దృష్టి పెట్టి ఉంటే, ఈ పాటికి ఆర్ధిక భద్రత కల్పించుకుని  మీరు ఏ భయమూ లేకుండా ఉండగలిగేవారు. అంతే కాకుండా, మీ తల్లిదండ్రులు ఉండడానికి ఆధ్యాత్మిక వాతావరణమే ఉత్తమంగా ఉండేది. తింటానికీ, ఉంటానికీ ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమే - అది చేయకూడదని నేను చెప్పడం లేదు, వారికి వృద్ధాప్యం వచ్చే కొద్దీ, వారు కూడా ఆంతరింగిక శ్రేయస్సు మీద దృష్టి పెట్టడం అవసరం. ఇళ్ళు కట్టుకోవడానికీ, బాంకు బాలెన్సులు పెంచుకోవడానికీ ఇది సమయం కాదు. వారి భౌతికావసరాలు తీర్చవద్దని నేను చెప్పడం లేదు, అది కావలసినంతవరకూ చేసుకోవాలి, కాని అది ఏదో గొప్ప జీవన శైలికోసం ఆలోచించవలసిన సమయం కాదు.

మీకు 65, 70 ఏళ్ళ వయసు దాటినప్పుడు, మీకు సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పే విషయం కాదు. కాని మీకు 60 వచ్చినప్పుడు, మీరు 18 ఏళ్ళ వయస్కునిలాగా జీవితం గురించి ప్లాన్ వేసుకోవడం తగదు. అది తెలివి తక్కువతనం అవుతుంది.

పెద్దల పట్ల బాధ్యత పిల్లలిదే

వారి వారి పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, సామర్ధ్యాన్ని బట్టి, ఇంకా అనేక విషయాలను బట్టి ఒక్కొక్కరూ తమ జీవిత విధానాలను ఏర్పరచుకుంటారు. కాని అవన్నీ జీవితంలోని ఒక నిర్దిష్ట సమయంలోనే అవసరం. ఆ తరువాత అంతర్గిక శ్రేయస్సు ముఖ్యం. మీ తల్లిదండ్రులు తమంత తాముగా ఆ విషయాన్ని ఇంకా అర్థం చేసుకోకపోతే, వారికి ఆ విషయం తెలియజెప్పడం పిల్లల్లుగా మీ బాధ్యతే. మీకు ఆ రకమైన బాధ్యత ఉందంటారా? వాస్తవానికి భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు ముక్తి చేకూర్చడం పిల్లల బాధ్యత. సాంస్కృతిక పరంగా చాలా చోట్ల, ఇప్పుడు  అది ఇంక సజీవంగా లేదేమో, కాని అది ముఖ్యమైన విషయం.

అది ‘‘ మీ జీవితానికి మరో కోణం ఉంది, దానికై  మీరు ప్రయత్నించాల’’ ని తల్లిదండ్రులకు గుర్తు చేయడం మీ బాధ్యతే కదా? వారు సరిగ్గా తినకూడదనో, మిగతావి చేయకూడదనో అని నేను అనడం లేదు, కాని వారికి ఈ విషయం గుర్తు చేయడం మన పనే కదా? అది చాలా ముఖ్యం లేకపోతే వారి సంతానంగా మీరు తప్పు చేస్తున్నారు.

బ్యాంకులు టైమ్ లిమిట్ పెట్టినట్టు, ఒక లిమిట్ పెట్టుకోండి ‘‘ వచ్చే ఆర్నెలల్లోనో, సంవత్సరంలోనో ఈ సమస్య పరిష్కరిస్తాను’’ అని..అంతే. లేకపోతే ఎవ్వరూ ఎప్పటికీ తమ ఆర్ధిక సమస్యలను పరిష్కరించుకోరు, అది ఎప్పుడూ ఆకలితో ఉన్న కడుపు లాగా ఏమివేసినా అదృశ్యమైపోతూ ఉంటుంది. ఎక్కువ ధనం వస్తే మీ జీవన శైలి పెరుగుతుంది. అందుకే మన సామర్థ్యం, అవసరం, ఔచిత్యాన్ని బట్టి మనం దానికో పరిమితి పెట్టుకోవాలి. అది మీరే నిర్ణయించుకోవాలి, అది నిర్ణయించవలసింది నేను కాదు.

కాని ఆ ‘కాని’ అనే పదం చాలా విషయాలను ఎప్పటికీ పక్కన బెట్టేలా చేస్తుంది.

‘కాని’ ని ఓ తన్ను తన్నండి

ఈ ప్రపంచంలో ఎంతో గొప్పవ్యక్తులచే ప్రారంభింపబడిన ఎన్నో ఆధ్యాత్మిక ఉద్యమాల గురించి  మీరు వినను కూడా లేదు. ఎందుకంటే ఇవి అంతరించి పోయాయి కాబట్టి . అవి ఏవో పెద్ద కారణాలవల్ల అంతరించిపోలేదు. అవి చాలా చిన్న చిన్న కారణాలవల్ల అంతరించి పోయాయి. ఇద్దరు మనుషులు ఒక సంస్థగా పనిచేయలేక అన్నింటినీ భగ్నం చేస్తారు. ఈ భూమి మీద ఇదో పెద్ద  విషాదం. ఎవరి పార్టీ వారు పెట్టాలనుకుంటారు, దానితో అన్నిటినీ మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. ఇలా ఆ ఆధ్యాత్మిక ఉద్యమాలు అంతరించి పోతాయి. ఇది ఎంత విషాదకరం. ఏవో దుష్ట శక్తులు వాటిని నాశనం చేయడం లేదు. వారు చెప్పేది ఎలా ఉంటుందంటే ‘మేము చేద్దామనే అనుకున్నాం, కాని....’ ఈ కాని, కాని, కాని అనే పదాన్ని ఎప్పుడూ అంటూ ఉండకండి.

మీరు ఏమి చేయకూడదో నేను చెప్పడం లేదు. నేను చెప్పేదేమిటంటే, భౌతికంగా, అంతర్గతంగా కూడా మీకు ముఖ్యమైనది, మీకు అది చేయాలని ఉంటే, ఈరోజే చేయండి, రేపు కాదు, ఎందుకంటే రేపు ఎప్పటికీ రాదు. మీకు విలువైనది అనిపించినదేదైనా, ఈరోజే చేయండి, రేపు కాదు.