మీ పరిమితులు ఏమిటో తెలుసుకోవటానికి కుటుంబం అనేది ఒక మంచి శిక్షణా స్థలం. కొంత మందితో కలిసి మీరు ఒకే గూడులో ఉంటారు – అంటే ప్రతీ రోజు మీరు ఏమి చేసినా, మీరు ఒకరి కాళ్ళు ఒకరు తొక్కాల్సిందే. మీకు అసలు నచ్చని పనులేవో వారు చేస్తారు, అయినా కూడా మీరు వారితోనే ఉండాలి. అది ఫేస్బుక్ లాగా ఒక 10,000 మంది ఉండే కుటుంబం లాంటిది కాదు – మీకు ఎవరైనా నచ్చకపోతే మీరు ఒక క్లిక్ చేసి వారిని తీసేయవచ్చు.
మీ ఇష్టాయిష్టాలను దాటి ఎదగటానికి కుటుంబం ఒక అందమైన ప్రదేశం. మీ ఇష్టాయిష్టాలే మీ నిర్భంధతలకు మూల కారణం. మీరు మీ ఇష్టాయిష్టాలతో అతుక్కుపోయి ఉంటే, ఇక అవగాహన అనే ప్రశ్నే లేదు. మీకు ఏదైనా ఇష్టం అవ్వటం కానీ, ఇష్టం కాకపోవటం కానీ జరిగిన క్షణాన, మీరు సహజంగానే నిర్భంధ ప్రవర్తనతో ఉంటారు. మీకు ఎలా ఇష్టమో అలానే నిర్భంధంగా, అంటే మీకు నచ్చనివాటికి ఒక ప్రతి క్రియగా మీరు ఉంటారు.

అవగాహన అలవరచుకోవటం

కుటుంబం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి ఉండే గూడు లాంటిది, మీరు వాళ్లతో కచ్చితంగా కొంత నిర్దిష్ట కాలం ఉండాల్సిందే. దీనిని మీరు ఒక చెడు అనుభవంగా చేసుకోవచ్చు లేదా దీని ద్వారా మీ ఇష్టాయిష్టాలను అధిగమించవచ్చు. మీ భర్తలో కొన్ని అంశాలు మీకు నచ్చలేదని అనుకుందాము. కొద్ది సమయం తరువాత మీరు “ఆయన అంతే – అయినా పర్వాలేదు” అని మీరు అనుకుంటే అది వాళ్ళు మారటం గురించి కాదు, ఆ నిర్దిష్ట ప్రవర్తనపై మీ అయిష్టాన్ని లేక వారి గురించి మీకు ఏది నచ్చలేదని అనుకున్నారో దాన్ని మీరు అధిగమించినట్లు.
మీరు మీ ఇష్టాయిష్టాలను అధిగమించినప్పుడు మీకు తెలియకుండానే, మీరు చేతనంగా మారతారు. మీకు తెలియకుండానే మీరు ఆధ్యాత్మికంగా తయారవుతారు, ఇది ఆధ్యాత్మికంగా మారటానికి ఉత్తమమైన విధానం కూడా. “నేను ఆధ్యాత్మిక మార్గాన్ని తీసుకున్నాను” అని అనటం కంటే ఒక ప్రాణిగా మీరు మీ పరిమితులను, ఇష్టాయిష్టాలను అధిగమించేంత చేతనంగా ఉంటే మీరు “ఆధ్యాత్మికత” అనే పదాన్ని జతకలుపుకోకుండానే మీరు ఆధ్యాత్మికులు అయినట్లు. ఆధ్యాత్మికులు అవ్వటానికి ఉత్తమమైన విధానం ఏమిటంటే మీరు నిర్భంధతత్వంతో ప్రతిక్రియ చేయకుండా ఉండే స్థాయికి చేతనంగా ఎదగటమే. ఇలా మీరు అవ్వటానికి కుటుంబం అనేది ఒక మంచి శిక్షణా స్థలం. మీరు ఎలాంటి కుటుంబంలో ఉన్నా అది కొంత కాలం వరకే. ఈ కాలాన్ని మీరు మీ ఇష్టాయిష్టాలను అధిగమించటానికి ఉపయోగించుకోవాలి.
మీ చుట్టూ ఉన్నవారు మీతో ఏకీభవించకపోతే, మీరు మంచి ప్రదేశంలో ఉన్నట్లే. నేను ఆశ్రమంలో ఉన్నవారికి ఎప్పుడూ, “మీరు అసలు తాళలేని వ్యక్తిని ఎంచుకొని వారితో ఆనందంగా పని చేయటం నేర్చుకోండి. అది మీకు ఎన్నో అద్భుతాలను చేస్తుంది” అని చెప్తూ ఉంటాను. మీకు నచ్చిన వారితో మీరు ఉండాలని ఎంపిక చేసుకుంటే మీరు అలాంటి వారితోనే ఉండే నిర్భంధ స్థితికి చేరుకుంటారు. ఇక్కడ సమస్య కుటుంబం కాదు. మీకు నచ్చిన దానితోనే మీరు ఉండాలని అనుకోవటం అసలు సమస్య. మీకు ఇష్టమైనదాన్ని ఎంచుకోకండి. ఇప్పుడు ఉన్న దాన్ని అద్భుతంగా ఎలా మలచుకోవాలో చూడండి. మీ దగ్గరికి ఏది వస్తుంది అనేది మీ పని కాదు. మీరు దానితో ఏమి చేస్తారనేదే మీ పని.
జనాలు ఇలా అంటుంటారు, “ఓహ్! ఇవాళ రోజు ఎంత అద్భుతంగా ఉంది” లేదా “ఈ రోజు బాలేదు”. ఇది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం మబ్బుపట్టి ఉంటే, అది చెడ్డ రోజు కాదు; ఒక రోజు వర్షం పడితే మరొక రోజు మంచు కురుస్తుంది – పర్వాలేదు. ఎండగా ఉంటే షర్ట్ వేసుకోకుండా వెళ్ళండి; వర్షం పడితే రెయిన్ కోట్ తీసుకువెళ్ళండి; మంచు కురుస్తుంటే ఒక స్నో బోర్డుతో వెళ్ళండి. ఏది జరిగినా దానితో మనం ఏమి చేస్తున్నాము అనేదే దాన్ని ఒక మంచి రోజు, లేదా చెడ్డ రోజుగా మారుస్తుంది.

ఫలితాలను బేరీజు వేయటం

అసలు ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రక్రియ పని చేస్తుందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఫలితాల వల్లనే కదా.అదే మనుషులతో మీరు ఇంకొంచం ఆనందంగా నిద్రలేవగలిగితే, మీరు ఇంకొంచం సుఖంగా ఉండగలిగితే, వాళ్ళు మిమల్ని ఇంతకు ముందులాగా ఇక ఏ మాత్రం విసిగించకపోతే – మీరు ఎదుగుతున్నారని అర్ధం. అన్నీ చోట్లా పురోగమనాన్నిఫలితాలతోనే కొలుస్తారు – ఇక్కడ కూడా అంతే.
మనము ఎక్కడ ఉంటాము అనేదానిలో ఎప్పుడూ పూర్తిగా మన ఇష్టమే ఉండదు. కాని దానితో మనం ఏమి చేస్తామనేది పూర్తిగా మన ఇష్టమే. దాన్ని ఉపయోగించుకోండి. దాన్ని ఉపయోగించుకుంటే మీ బయట పరిస్థితి కూడా మెల్లిగా మీ ఎంపికకు అనుగుణంగా మారుతుంది. కొంత సమయం గడిచేటప్పటికి సహజంగానే మీ చుట్టూ ఉండే పరిస్థితులు ఎంతో అందంగా మారతాయి.
ఈ ప్రపంచంతో నా అనుభవం ఎంతో అద్భుతమైనది. నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు ఆనందాశ్రువులు కురిపిస్తున్నారు. నాకు ఇంతకంటే ఇంకేమి కావలి? ఈ ప్రపంచం మొత్తానికి అది వాస్తవం కాదని నాకు తెలుసు కాని ఈ ప్రపంచం నా చుట్టూ అలానే అమరుతుంది. నేను ఎక్కడ ఉన్నా ఇలానే ఉండేటట్లు జరిగింది నన్ను నేను సరిచేసుకోవటానికి సమయం గడిపినందువల్లనే. మెల్లిగా నేనేమిటో ఈ ప్రపంచం కూడా అదే చేస్తుంది.మీరు కూడా ఇలానే చేయండి. ఈ ప్రపంచం దాన్ని అది మలచుకుంటుందా లేదా అనే దాని గురించి మీరు దిగులుపడకండి – అది కొంత కాలంలో జరుగుతుంది. మొదటి విషయం ఏమిటంటే మీరు ఒక అందమైన మనిషిగా మిమల్ని మీరు మలుచుకోవటం. అవతలి వారు దాన్ని ఎలా చూస్తారు అనేది మన పని కాదు.
ఇప్పుడు వాళ్ళు బురదలో నడవాలని అనుకుంటున్నారు – కొద్ది సమయం వాళ్ళను అందులో నడవనివ్వండి, వాళ్ళు అలిసిపోయేంత వరకూ నడుస్తారు. మీరు ఎలా జీవించాలంటే మిమల్ని వాళ్ళు చూసినప్పుడు ఆ బురదలో ఉన్న వాళ్ళు కూడా మీలా ఉంటే మంచిదని తెలుసుకోవాలి. అది వారికి అర్ధం కాకుండా ఉండదు. వాళ్ళు అలా చేదుగా మారటానికి కారణం వాళ్ళ జీవితానుభావం చేదుగా, అసంతృప్తిగా ఉండటం వల్లనే. ఇప్పుడు ఈ చేదుదనం ఒక సంఘర్షణగా బయటపడుతుంది. వేరే విధంగా కూడా జీవించవచ్చని మీరు ఉదాహరణ చూపించండి. యోగాలో ఎప్పడూ వాడుతూ ఉండే చిహ్నాలలో తామరపువ్వు ఒకటి ఎందుకంటే తామరపువ్వు ఎక్కడైతే బురద ఎక్కువగా ఉంటుందో, అక్కడ బాగా పెరుగుతుంది. ఎంత ఎక్కువ మురికిగా ఉంటే, అంత బాగా పెరుగుతుంది. అలాంటి మురికే దాన్ని అంత దివ్యమైన అందంతో, సువాసనతో నింపుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. బురద అంటే ప్రతికూల భావన కలిగి ఉండటం ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు. ఆ బురదనే సువాసనగా మార్చుకోవటం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ.

ప్రేమాశిస్సులతో,
సద్గురు