ప్రశ్న: నా కలలను నెరవేర్చుకోవడానికి నాకు ఒక్కోసారి రూల్సు అతిక్రమించవలసి వస్తుంది. కాని మా తల్లి తండ్రులకు, నన్ను ప్రేమించేవారికి అగౌరవం, అమర్యాద తీసుకువచ్చేదేదీ నేను చేయదలచుకోవడం లేదు. మరి విధేయత ఉన్న కూతురుగానే ఉంటూ కూడా, తన సొంత నియమాలనే పాటిస్తూ, తనకు నచ్చిన విధంగా ఒక స్వంతంత్ర స్త్రీగా ఉండడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నాను.  

సద్గురు: మీరేమంటున్నారంటే నాకు కావలసింది నేను చేస్తాను, మరి దానికి అందరి అనుమతి కూడా కావాలి అంటున్నారు. జీవితం అలా నడువదు. మీకు నిజంగా కావలసింది ఏమైనా చేయాలనుకుంటే దానికో మూల్యం చెల్లించవలసి వస్తుంది. జీవిత స్వభావం అదే. మీరు చేసిన ప్రతిదానికీ సుంకమో, మూల్యమో, ఏదో ఒకటి చెల్లించవలససిందే. అది ఎంత, ఏ విధంగా అనేది ‘మీరనుకున్నది ఎంత విప్లవాత్మకమైనది’ అనేదాని బట్టి ఉంటుంది.

‘‘నేను ఏదో చేద్దామనుకుంటున్నాను కాని, మానాన్న, మా అమ్మ..... ’ అనుకోవడం చాలా అసంబద్దం. వారు మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చారు, అందుకు మీరు సంతోషించాలి. దానికి మించి మిగతావాటి గురించి వారిమీద మీరేమీ ఫిర్యాదులు చేయవద్దు. వారు చేయగలిగినంత చేస్తూనే ఉన్నారు. వారికన్నా మీకేదో ఎక్కువ తెలుసుననుకుంటే, ముందు మీరు చేయవలసింది వారికి నచ్చజెప్పగలగడం.

మీరు కావలసింది చేయాలి కాని దానికి మూల్యం చెల్లించకుండా ఉండగలగాలని మీరనుకుంటే, జీవితంలో అటువంటిది ఇక్కడా, అక్కడా, ఎక్కడా జరగదు.

కాని ఒక వేళ మీరు చెప్పేది వారు అర్థం చేసుకోలేకపోతే, వారు అంగీకరించరు. అప్పుడు మీరు చేయాలనుకున్నది, దానిని ఎంత ఖచ్చింతగా చేయాలనుకుంటున్నారన్నదాన్ని బట్టి ఉంటుంది. అది మీ తల్లిదండ్రులు గీసిన గీతను దాటవలసినంత ముఖ్యమా, కాదా? అని మీరే చూసుకోవాలి.  మీరు అలానే భావిస్తే, ఏది ఏమైనా మీరు చేయాలనుకుంటే, మీరు చేయండి, కాని మీరు ఖచ్చితంగా దానికో మూల్యం చెల్లించవలసి వస్తుంది. మీరు కావలసింది చేయాలి కాని దానికి మూల్యం చెల్లించకుండా ఉండగలగాలని అనుకుంటే మాత్రం, జీవితంలో అటువంటిది ఇక్కడా, అక్కడా, ఎక్కడా జరగదు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు