మన విద్యా విధానం ఎప్పుడూ కూడా పిల్లవాడు మార్కుల వెంబడి పరిగెత్తే విధంగా తయారుచేసింది. పిల్లవాడి జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో, పెద్దయ్యాక తనకు ఎదురయ్యే సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలో అనే కోణంలో విధానం లేదు. ఈశా హోం స్కూల్ దీనికి భిన్నంగా ఎలా పనిచేస్తుందో ఈ వ్యాసంలో తెలుసుకోండి..

ప్రశ్న: సద్గురూ.. మీరు ఒక స్కూల్ గురించి మాట్లాడారు. మీరు అంతర్జాతీయ విద్యా విధానాన్ని ఆధ్యాత్మిక విధానాలతో ఎలా జోడిస్తారు..?

సద్గురు: ఇందులో ఎటువంటి ఆధ్యాత్మికతా ఉండదు. మేము ఒక పిల్లవాడి జీవితంలోకి ఆధ్యాత్మికత తీసుకువద్దామని అనుకోవడం లేదు. మేము, వారికి శారీరిక, మానసిక ఆరోగ్యం కోసం కొద్దిగా యోగా నేర్పిస్తాం. ఆధ్యాత్మికత అనేది విద్యావిధానంలో ఒక భాగంగా చేసేది కాదు. ఒకవేళ, వారి చదువు పూర్తి అయిన తరువాత వాళ్ళు మూడు నెలలో, ఆరు నెలలో ఇక్కడ ఉండి,  ఆధ్యాత్మిక సాధన చెయ్యాలనుకుంటే చేసుకోవచ్చు.  అది వారు తీసుకునే నిర్ణయం.

అదే సమయంలో మేము ఒకరకమైన సుముఖత  వారిలో ఉండేలాగా పెంపొందించాలని చూస్తున్నాము. వారు దేనిపట్లా ఒక నిర్ధారణకి రారు.  ప్రతిదీ,  ఉన్నది ఉన్నట్లుగా చూడడానికి సిద్ధంగా, సుముఖంగా ఉంటారు. పిల్లలు ప్రతిదాన్నీ సుముఖతతో, ఎటువంటి మతపరమైన, సాంస్కృతిక పరమైన లేక మరో విధమైన పక్షపాతాలూ లేకుండా జీవితంలో అన్ని అంశాల పట్లా సంపూర్ణమైన సుముఖతతో చూసేలాగా చేస్తాం..!! ఇది వారిని ఎలా అయినా సరే  ఆధ్యాత్మికులుగా చేస్తుంది. ఆధ్యాత్మికత అనేది అతని జీవితంలో ఒక సహజమైన విధానం అయిపోతుంది. జీవితంలో ప్రతీ అంశంపట్లా ఒక విధమైన సుముఖతని ఏర్పరచుకున్నాడు కాబట్టి దీని గురించి ఇక ఆశ్రమానికి వెళ్లడమో మరొకటో చేయనక్ఖర్లేదు. విద్యావిధానం ద్వారా ప్రజలు వారి ఆలోచనల్ని, వారి పరిధుల్ని పెంపొందించుకోవాలి. కాని ఈనాడు అలా జరగటంలేదు.

కానీ మన ఆధునిక విద్యా విధానం వల్ల మనం మన తల్లి-తండ్రులతో కూడా జీవించలేని పరిస్థితి వచ్చేసింది.

ఒక 50 సంవత్సరాల క్రితం  భారతదేశంలో కూడా ప్రజలు పెద్ద కుటుంబాల్లో జీవిస్తుండేవారు. మూడు వందలు, నాలుగు వందల మంది కలిసి, ఒకటే కుటుంబంగా ఒకే ఇంట్లో జీవించేవారు. ఎటువంటి సమస్యలూ ఉండేవి కావు. వారికి, ఒకరితో ఒకరు ఎలా సర్దుకుపోవాలో తెలుసు. ఎందుకంటే నాలుగు వందలమంది ఒక చోట జీవించడం అన్నది ఒక పెద్ద సవాలే. ఆశ్రమం అంటే కూడా ఇదే..!! ఇప్పుడు, మనం ఆ పాత విషయాలను తిరిగి తెస్తున్నాం.  ఇది మరికొంచెం కష్టమైనదే.. మరిన్ని సవాళ్ళతో కూడుకున్నదే. ఎందుకంటే ఇక్కడ ప్రజలు వివిధ సాంప్రదాయాల నుంచీ, భాషల నుంచీ, నడవడుల నుంచీ, ఇష్టాయిష్టాల నుంచీ వచ్చినవారు. కానీ, ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ఎటువంటి ఘర్షణలూ లేకుండా ఎంతో పరిణతితో జీవితాన్ని ఎంతో విశాలంగా చూస్తున్నారు. లేకపోతే ఇది జరగడం కష్టం.

కానీ మన ఆధునిక విద్యా విధానం వల్ల మనం మన తల్లి తండ్రులతో కూడా జీవించలేని పరిస్థితి వచ్చేసింది. మనం కేవలం భార్యా, భర్తా, పిల్లలూ - ఇదే కుటుంబం అనుకున్నాం. కానీ  ఇంకో 15-20 సంవత్సరాల్లో అది కూడా రూపు మాసిపోతోంది. కుటుంబం అంటే.. కేవలం.. మీరే..! మీ భర్త మరో ఇంట్లో జీవించాలి. మీరు మరో ఇంట్లో. కలిసి మీరు పది రోజులు కూడా ఉండలేరు. పిల్లలు మరో చోట ఉండాలి. ఒక చోట ఇద్దరు-ముగ్గురు మనుషులు కూడా కలిసి జీవించలేకపోతున్నారు. మీ విద్య మీకు తెచ్చిపెట్టింది ఇదే..! ఇది  మీ పరిధుల్ని విశాలం చేయలేదు. ఇది మిమ్మల్ని కుచించుకుపోయేలా, మరింత వ్యక్తిగతంగా తయారు చేసింది.

మనం మన పిల్లలకి ఏ విధమైన విద్యని అందిస్తున్నామంటే అది వారిని ఎంతో వ్యక్తిగతంగా తయారుచేస్తోంది.

కలుపుగోలుతనం అన్నది పూర్తిగా పోయింది. అసలు, ఒక మనిషిని విద్యావంతుడిని చేయడం వెనకాల ఉన్న ఆలోచన - మీ జీవితంలో విశాలత్వం తీసుకురావడానికి. మీరతనికి విద్య నేర్పించి, ప్రపంచం గురించి తెలిపి జీవితం పట్ల అతనికి ఉన్న అవగాహనని పెంపొందించడానికి. మనం మన పిల్లలకి ఏ విధమైన విద్యని అందిస్తున్నామంటే అది వారిని ఎంతో వ్యక్తిగతంగా తయారుచేస్తోంది. ఎంతోమంది ప్రజలు ఇలాంటి పరిస్థితిలోకి వచ్చేశారు. వాళ్ళు, మరెవరితోనూ కలిసి జీవించలేరు. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. ఈ ప్రపంచంలోనే ఇది ఇలా తయారైపోయింది. ఇది ఒక్క తరంలోనే ఇలా తయారైపోయింది. ఎందుకంటే మన విద్యావిధానం ఈ విధంగానే ఉంది.

అందుకని మేము, ఎలాంటి విద్యని అందించాలనుకుంటున్నామంటే, అది అన్నిటినీ ఇముడ్చుకునేదిగా ఉండాలి. మీరు పెరుగుతున్నకొద్దీ ఈ ప్రపంచాన్నంతా మీలో ఒక్కటిగా కలుపుకుంటూ జీవించగలగాలి. ఇదే ఆధ్యాత్మికత కూడా..! అందుకని, ఆధ్యాత్మికత అనేది నేర్పించబడదు. విద్యావిధానమే ఆధ్యాత్మికత. ఎందుకంటే  విద్య అనేది మీ పరిధుల్ని పెంపొందించుకోవడానికే. అంతేగానీ, భగవంతుడి గురించో మరొకటో మాట్లాడడం గురించి కాదు. అందుకని మేము పిల్లలు ఎదుగుతున్నప్పుడు, వారి మేధస్సుని ఆ విధంగానే ఉంచాలని అనుకుంటున్నాం.  పిల్లవాడికి తృష్ణ లేకుండా బలవంతంగా నేర్పించడం ఇక్కడ జరగదు.

తెలుసుకోవాలి అన్న ఆకాంక్ష ఒక పిల్లవాడిలో పెంపొందించాలి. అంతేకానీ అతనికి ఎంతో ఎక్కువ శాతంలో విషయ సమాచారాన్ని అందించి అతను పాస్ అవ్వాలి.. పాస్ అవ్వాలి.. పాస్ అవ్వాలి అనుకోవడం కాదు. ఇక్కడ పద్ధతి మరో విధంగా ఉంటుంది. అదే సమయంలో వారికి 16-17 సంవత్సరాలు వచ్చేసరికే, వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్లడానికైనా సిద్ధంగా ఉండేలాగా తయారుచేస్తాం. వాళ్ళు ఎటువంటి యూనివర్సిటీకి వెళ్తారూ అన్నది వారి వ్యక్తిగతమైన సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ  దీన్ని ప్రక్కకు పెడితే, వారు ఎలా మెరుగ్గా జీవించగలరో నేర్చుకుంటారు.  వారు తమని తాము ఎంతో చక్కగా నిర్వహించుకోగలరు. వారు ఎంతో మెరుగ్గా జీవించగలరు. వారి అంతర్ముఖంలోనూ.. వారి చుట్టూతా ఉన్నవారితో కూడా. ఇది, ఎంతో ముఖ్యమైన విషయం.

డిగ్రీలు ఉండడం వల్ల  ప్రజలు వారి జీవితంలో సాఫల్యం పొందరు. వారికి యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఉండడంవల్ల వచ్చేది కాదు. వారికి సామర్థ్యం ఉండడంవల్ల జరిగేది. అందుకని ఈ స్కూలు వారి సామర్థ్యాన్ని పెంపొందించేదిగా ఉంటుంది.  అంతేకానీ అర్హతలను పెంపొందించేదిగా కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు