భరించలేని ఆకలి దారిద్య్రంతో బాధపడుతున్న ఒక వ్యక్తి చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో సార్లు జైలుకు వెళ్లి తప్పించుకోవడానికి ప్రయత్నించి దొరికి పోయేవాడు. ప్రతొక్కసారి అతని జైలు శిక్ష ఇంకాస్త పెరుగుతూ ఉండేది. చివరికి, ఎన్నో సంవత్సరాల తరువాత అతను తిరిగి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.

ఆకలి ఇంకా చలి అతడిని వేధించసాగాయి. అతని దగ్గర డబ్బు లేదు, ఒక్క పూటకు తినడానికి కూడా సంపాదించుకోవడానికి దారి లేదు. ఖైదీగా ఉన్నతనని నమ్మి ఎవరూ పని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎన్నో ప్రదేశాలు తిరిగాడు, ఎక్కడికి వెళ్లినా అతనిని తరిమి కొట్టేవారు. ఒక పల్లెటూరులోని వారు తరిమి కొట్టగా, అతడు ఆ ఊరి మతాచార్యుడి ఇంట్లో ఆశ్రయం తీసుకున్నాడు.

ఆ మతాచార్యుడు తనను అంత దయతో ఆహ్వానిస్తాడు అని ఊహించలేదు. " ఇది దేవుని నివాసం, దొంగైనా, పాపి అయినా, ఎవరైనా ఇక్కడ ఆశ్రయం కోరుకున్నవారు దేవుని బిడ్డలు" అలా ఆ మతాచార్యుడు అతనిని ఓదార్చి, అతనికి భోజనం పెట్టి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, ఉండడానికి స్థలం ఏర్పాటు చేసాడు.

కడుపునిండా తిని అతను నిద్రపోయాడు. మధ్య రాత్రి మెలకువ వచ్చి అత్యుత్సాహంతో చుట్టూ పరిశీలించాడు. అతని కళ్ళు ఆ గదిలో ఉన్న వెండి వస్తువులపై పడింది. అలవాటైన దొంగ వాటం ఆపుకోలేక అవి తీసుకుని పరిగెత్తాడు, ఆశ్రయం ఇచ్చిన వారిని మోసం చేస్తున్నానన్న ఒక్క ఆలోచన కూడా అతనికి రాలేదు.

వెండి వస్తువులు పట్టుకుని ఊరిలో తిరుగుతున్నవ్యక్తిని చూసి ఆ ఊరివారికి అనుమానం వచ్చింది. పోలీసులు అతనిని పట్టుకుని ప్రశ్నించారు. అతనినుండి సరైన సమాధానం దొరకక, అతన్ని మతాచార్యుడి ఇంటికి తీసుకువెళ్ళారు. " మీ వెండి వస్తువులు ఇతడు దొంగిలించాడని మాకు అనుమానము.ఈ వస్తువులు చూసి ఇవి మీవేమో చెప్పగలరా?" అని పోలీసులు అడిగారు.

ఆ వ్యక్తి వణికి పోతున్నాడు, దొంగతనం పట్టుబడితే ఇంకెన్నో సంవత్సరాలు కారాగారానికి తిరిగి వెళ్ళాలన్న భయం పట్టుకుంది. మతాచార్యుడు ఎంతో దయతో "ఈ వెండి వస్తువులతో నీకు వెండి కాండిలు స్టిక్స్ కూడా ఇచ్చాను కదా వాటిని వదిలి వెళ్లిపోయావేమిటి" అని అన్నాడు. ఆ కాండిలు స్టిక్స్ ను కూడా అతనికి అందించాడు. పోలీసులు వెంటనే "మమ్మల్ని క్షమించండి, ఇతను దొంగతనం చేస్తున్నాడు అని తప్పుగా అనుకున్నాము" అని ఆ వ్యక్తిని విడుదల చేశారు. అతను ఆ మతాచార్యుడి కరుణలో మునిగి ఉబ్బి తబ్బిబ్బయ్యి తన దారిలో వెళ్ళిపోయాడు. ఈ పైన వృత్తాంతం "లెస్ మిసెర్బిల్స్" లోనిది.

జెన్ సంప్రదాయంలో ఇటువంటిదే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది, ఇది పాశ్చాత్య కథాకారుల నుండి స్ఫూర్తి పొంది ఉండవచ్చు. ఇదే సందేశం అందజేస్తుంది:

ఒక జెన్ గురువు తన శిష్యులలో కొంత హడావిడి గమనించి వారిని విషయమేమిటని ప్రశ్నించాడు.

" అతను తిరిగి దొంగతనం చేసాడు" అని ఒక శిష్యుడిని గురువుగారి ముందుకి తోశారు. గురువుగారు "అతడిని క్షమించండి" అన్నారు.

"ముమ్మాటికీ కుదరదు, మీరు చెప్పగా ఇతడిని ఎన్నో మార్లు క్షమించాము, ఇప్పుడు మీరితడిని బయటకు పంపివేయకపోతే, మేమందరము వెళ్ళిపోతాము" అని శిష్యులందరు బెదిరించారు.

"మీరందరు వదిలి వెళ్ళిపోయినా, నాకు అతడిని పంపే ఉద్దేశం లేదు" అని సమాధానం ఇచ్చారు గురువు. దొంగతనం చేసిన శిష్యుడు గురువుగారి పాదాల మీద పడి ఏడ్చేశాడు.

సద్గురు వివరణ

సద్గురు: మానవుడికి ఎటువంటి శిక్షను విధించినా దానిని ఎదురుకోవడానికి తగిన శక్తిని కూడగట్టుకోగలడు, కానీ అమితమైన కరుణ అతడిని పూర్తిగా ఓడిస్తుంది. శిక్ష వ్యక్తిని రాతి బండ లాగా మార్చగలదు కానీ మితిమీరిన కరుణ అతడిని చిన్నాభిన్నం చేస్తుంది.

ఒక వ్యక్తి యందు మీరు కఠినంగా మెలగడానికి ప్రయత్నిస్తూ పొతే అతను మీరు విధించే శిక్షను ఎదురుకోవడానికి తనకున్న సామర్ధ్యాన్ని కూడా ఎక్కువ చేసుకుంటూ వెళ్తాడు. కరుణ ఒక్కటే అతడిని కరిగించగలిగేది. ఒక ఆధ్యాత్మిక గురువు వ్యక్తులపై వారు ఇప్పుడు ఎలా ఉన్నారు అన్న విషయంపై నిర్ణయం తీసుకోరు. ఎవరైనా కొబ్బరి చెట్టు నాటినప్పుడు ఒక నాలుగు వారాల తరువాత అది కాయలు కాయలేదని దానిని నరికివేయరు. అలాగే, గురువు ప్రతి శిష్యుడి ఆంతర్యంలోని సంభావ్యతను కనుగొని దానిని వెలుపలికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తాడు. ఈ రోజున అతనికి అవసరమైన సామర్ధ్యత లేదని ఎవరినీ గురువు నిర్లక్ష్యం చేయడు.

తమని తాము శిష్యులమని అనుకున్న వారందరు తమ వృద్ధికి, పరివర్తనకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వారికి సరిపడని పరిస్థితి ఎదురయినప్పుడు ప్రత్యేకంగా, అది తమ పరివర్తనకు కారణం కాగలదని గుర్తించాలి. అలా కాక వారు గురువుకి ఆంక్ష్యలు విధించి, ఎదో ఒకటి కావాలని ఆశిస్తే, వారు తమ గొప్పతనం చూపించుకోవడానికే తప్ప, పరివర్తన యందు ఏ మాత్రము ఆసక్తి కలిగిన వారు కాదని అర్థం. ఇటువంటివారు శిష్యులమని చెప్పుకోవడానికి అనర్హులు. ఇటువంటివారిపై సమయం వ్యర్థం చేసుకోవడంకన్నా వారిని వెళ్ళి పోనివ్వడమే మంచిది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు