Sadhguruఆధ్యాత్మిక ప్రక్రియ పరిహాసానికి గురి అవడానికి ఓ కారణమేమిటంటే, ఆధ్యాత్మికత అంటే  - ఉత్సాహముతో జీవం ఉట్టి పడుతున్నట్టు ఉన్నవారి కోసం ఇది కాదు, అన్న అభిప్రాయం ఏర్పడడం వల్లే. ఎందుకంటే సహజంగా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి అంటే ఆయన ఓ గొఱ్ఱెలా ఉండాలి. ఆయన ఓ గొర్రెలా తినాలి. మీరు ఏమాత్రం జీవం చూపించినా కానీ ఇది ఆధ్యాత్మికత                       కాదు, అన్న భావన.

కానీ జీవితానుభవం మీలో లోతుగా ఉందనుకోండి, అప్పుడు మీరు వేరే అందరికంటే కూడా ఎంతో జీవం ఉట్టిపడుతూ ఉండాలి కదా? కానీ చాలా కాలంగా దీనికి భిన్నంగా ప్రచారం జరుగుతోంది. దీనివల్ల మన సంఘములో చాలా మంది ఈ ఆధ్యాత్మిక ప్రక్రియను, ఆధ్యాత్మికత్వంలో ఉందాం అన్న ఆలోచనను  వదిలేసుకున్నారు. ఎందుకంటే మీరు ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే సరిగ్గా తినకూడదు, సరిగ్గా అలంకరించుకోకూడదు, సరిగ్గా జీవించకూడదు అన్న భావన..అవునా కాదా? ఆధ్యాత్మికత అనేది మీరు ఎవరినుంచో నేర్చుకునే విషయం కాదు. అది మీరు సహజంగా ఎలా జీవిస్తున్నారు అన్నదానిగురించి.

నేను ఇక్కడ  మీకో కథ చెప్పొచ్చా ? మీకు కథ చెబితే పర్వాలేదా? ఒకసారి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఓ తండ్రి,  ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ కొడుకులు పెరిగి పెద్ద అవుతున్నారు. ఆ తండ్రికి వయసు మీద పడుతోంది, ఒకరోజున అయన వారిని పిలిచి, తన ఆస్తిని రెండు భాగాలుగా విభజించాలనుకుంటున్నానని తెలిపారు. ఆస్తిని వారిద్దరూ సరి సమానంగా  పంచుకోవాలని చెప్పారు. ఆయనకి ఎన్నో ఎకరాల మంచి మాగాణి భూమి ఉంది. ఆ రోజులలో భూమిని ఎప్పుడూ   పంచుకునే వారు కాదు. అప్పట్లో, కేవలం పంటను మాత్రమే పంచుకునే వారు. ఎప్పుడు భూమిని పంచుకునే వారు కాదు. ఎందుకంటే ఇది అంత తెలివైన ఆలోచన కాదు కాబట్టి. ఈరోజుల్లో మాత్రం ఎదురు డబ్బులు పెట్టి ఐయినా సరే ...అర ఏకరమైనా  సరే  ఎవరిది  వాళ్ళు తీసుకుంటున్నారు..అందుకే ఏదీ సారవంతంగా పని చెయ్యడం లేదు. ఎందుకంటే, మనం భూమిని పంచుకుంటున్నాము కాబట్టి.. సరే, అందుకని ఆ తండ్రి ఈ భూమి మీద వచ్చే పంటని ఈ ఇద్దరి కొడుకులకి సరి సమానంగా పంచి ఇచ్చారు.

ఆధ్యాత్మికత అనేది మీరు ఎవరినుంచో నేర్చుకునే విషయం కాదు. అది మీరు సహజంగా ఎలా జీవిస్తున్నారు అన్నదానిగురించి.

వారిలో ఒకరికి వివాహం అయ్యింది. అయనకి అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఇంకొకరికి అసలు వివాహము కాలేదు. కానీ ఇద్దరికి పంట మాత్రం సరి సమానంగా వచ్చేది. ఈ వివాహము అయ్యి పిల్లలు కలిగి ఉన్న ఆయనకి పెద్ద కుటుంబం ఉండేది కదా. ఒక రోజు ఆయనకి మనసులో ఒక పురుగు తొలవటము మొదలెట్టింది. మీ మనస్సు లోనూ పురుగులు తొలుస్తూ ఉంటాయి కదూ? ఒక్కో సారి...అవునా?  ఆయన మనస్సు లోకి ఓ పురుగు చేరి ఆయనని తొలవడము మొదలు పెట్టింది. " నాకు పెద్ద కుటుంబం ఉంది ....నాకు ఈ ధాన్యంలో సగ భాగం వస్తోంది ....నా తమ్ముడికి కూడా...కానీ అతను ఒంటరిగా ఉంటున్నాడు. అతనికి కూడా సగభాగమే వస్తోంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలలో నా పిల్లలు పెద్ద వాళ్ళు అవుతారు. వాళ్ళు నన్ను చూసుకుంటూ ఉంటారు. కానీ నా తమ్ముడికి ఎవరూ లేరు. అతనేం చేస్తాడు? అందుకని అతనికి నా కంటే ఎక్కువ ధాన్యం కావాలి" అని ఆలోచించాడు. అందుకని రాత్రి పూట ఏం చేసాడు అంటే ఆయన ఓ గోనెసంచి నిండా ధాన్యం నింపుకొని అది తీసుకెళ్లి ఆ తమ్ముడి ధాన్యం ఎక్కడ ఉందో  తీసుకువెళ్లి  అక్కడ వేసి వస్తూ ఉండేవాడు. ఇలానే ఎవరికి తెలీకుండా రహస్యంగా ఇలా ఈయన ధాన్యం తీసుకువెళ్లి ఆయన తమ్ముడి  ధాన్యంతో కలిపివస్తూ ఉండేవాడు.

కొంత కాలం తరువాత అయన తమ్ముడికి కూడా ఇలాంటి పురుగే తొలవడం  మొదలు పెట్టింది. అతను, " నా అన్నగారికి అయిదుగురు పిల్లలు, భార్య ఉన్నారు. వారందరికీ కూడా ధాన్యం కావాలి. నేను ఒక్కడినే, నేను ఇంత ధాన్యం ఏం చేసుకుంటాను? కానీ నేను ఇస్తే మా అన్న తీసుకోడు" అని ఆయన కూడా ఇదే పని చెయ్యసాగాడు. అయన ధాన్యంలోంచి తీసుకువెళ్లి అన్నగారి  ధాన్యంలో కలిపాడు. వూరికే అక్కరలేని చాకిరీ ఇద్దరూ చెయ్యడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచింది. వీరు కూడా పెద్ద వారు అవుతున్నారు. ఒక రోజు ఈ అన్నదమ్ములు ఇద్దరు  ఇలా ధాన్యాన్ని తీసుకువెళుతూ ఒక చోట ఇద్దరు కలుసుకున్నారు . వాళ్ళు ఒకరినొకరు కలుసుకుని ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. వారికి అది ఎంతో మొహమాటంగా, సిగ్గుగా అనిపించింది.. ఎంతో సిగ్గుగా అనిపించింది. వాళ్ళు మరో వైపు చూస్తూ వారు ఏం చెయ్యాలనుకున్నారో అది చేశారు. వీళ్ళు ఏ ప్రదేశంలో అయితే కలుసుకున్నారో ....కలుసుకుని ఇలా మొహమాటంగా, సిగ్గుగా అనుభూతి చెందారో వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్లే వాళ్ళు కాదు. ఎందుకంటే ఇది వారి రహస్య  ఔదార్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఉండేది. ఇది వాళ్ళకి కొంచెం  ఇబ్బంది కరంగా ఉండేది.  కొన్ని సంవత్సరాలు తరువాత వారిద్దరూ  చనిపోయారు.

దైవత్వం ఈ ప్రపంచంలో  ఓ అనాథగా ఉంది. ఇలాంటి ప్రదేశం కోసం అది వెతుకుతూ ఉంది

ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఓ ఆలయం కట్టాలనుకున్నారు.. వాళ్ళందరూ సరైన  ప్రదేశం కోసం వెదక సాగారు. కొంత వెతికిన తరువాత వాళ్ళు ఇలా అనుకున్నారు, " ఏ  ప్రదేశంలో అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు కలుసుకొని, ఒకర్నొకరు చూసి అలా మొహమాటంతో కూడిన సిగ్గు పడ్డారో ...ఆ ప్రదేశంలోనే ఈ ఆలయం కట్టాలి" అని. మీలో మీరు ఇలాంటి ప్రదేశాన్ని ఏర్పరుచుకోలేదనుకోండి మీరు ఒక ఆలయంలో జీవించాలని అనుకున్నారనుకోండి, మీలో ఇలాంటి ప్రదేశాన్ని మీరు ఏర్పరుచుకోవడం ఎంతో ముఖ్యము.. ఎక్కడో మీరు కేవలం మీ మనుగడ గురించి మాత్రమే ఆలోచించకుండా మీరు ఇంక మరేదో చెయ్యడం మొదలుపెడతారు. అప్పుడు మీ జీవితం కేవలం మనుగడకు మాత్రమే పరిమితమవ్వకుండా ఉంటుంది. ఈమాత్రం మీ జీవితంలో జరగలేదనుకోండి మీలో మీరు ఓ ఆలయాన్ని నిర్మించుకోలేరు. ఆలయమూ లేదు, దివ్యత్వము లేదు. మీకు ఎలా జీవించాలి, ఎలా తినాలి అన్నది మాత్రమే తెలుస్తుంది. మీరు బాగా తింటారు. కానీ మీరు బాగా జీవించలేరు. మీకు అన్నీ ఉంటాయి కానీ మీలో మీకు ఈ ఆలయం  ఉండదు. అంటే, మీకు ఏమి లేన్నట్టే. మీకు ఈ ఆధ్యాత్మిక ప్రక్రియన్నది మీ జీవితంలో ఒక భాగంగా మారిపోవాలనుకోండి, అది మీరు ఓ ప్రోగ్రాంకి వెళ్లడంవల్లో, మీరు ఎక్కడికో వెళ్లడం వల్లో, ఎవరో ఏదో చెప్పింది వినడం వల్లో ఈ ఆధ్యాత్మికత రాదు. మీలో మీరు ఈ స్థానాన్ని ఏర్పరుచుకున్నారనుకోండి అది కలుగుతుంది. దైవత్వం ఈ ప్రపంచంలో  ఓ అనాథగా ఉంది. ఇలాంటి ప్రదేశం కోసం అది వెతుకుతూ ఉంది..మీరు కనక ఇలాంటి స్థానాన్ని, ప్రదేశాన్ని మీలో మీరు కల్పించుకున్నారనుకోండి మీరు ఓ విగ్రహాన్ని పెట్టనవసరం లేదు మీరు కేవలం ఇలాంటి స్థానాన్ని మీలో మీరు  ఏర్పరుచుకోగలిగితే చాలు. దివ్యత్వం తానంతట తనే మీలో వచ్చి కోలువౌతుంది. మీరు ఓ విగ్రహం కోసం ఎక్కడికి వెతుక్కుంటూ వెళ్లనవసరం లేదు. అది మీలో జరుగుతుంది అంతే.

అందుకని ఈ మనుగడ కోసం మాత్రమే పాటుపడ్డం అన్నది ఉన్నంత సేపు మీ చుట్టూరా మీరు గోడలు కడుతూనే ఉంటారు. ఇది చాలా సహజం. కానీ మీలో మరో కోణం కూడా ఉంది.

అందరూ వారి మనుగడకి మాత్రమే అంకితం అయిపోయున్నారు కాబట్టే వారు ఎక్కడికి వెళ్లినా సరే ఇదే జరుగుతుంది. మీలో రెండు రకాల శక్తులు ఉన్నాయి...మీలో ఒక కోణం మనుగడ వైపు చూస్తూ ఉంటుంది. మీరిది గమనించి చూడండి. మీరు ఏం చేశారు, ఎందుకు చేశారు - అవన్నీ మీ మనుగడ కోసమే. ఈ మనుగడ అనేది ఎన్నో స్థాయిల్లో ఉంటుంది.. భౌతికమైన స్థాయి, మానసికమైన  స్థాయి, భావావేశాలు,మీ ఆర్ధిక స్థాయిలో, సామాజిక స్థాయిలో ఎన్నో భిన్నమైన స్థాయిల్లో ఉంటుంది. కానీ మీరు చేసేవన్నీ కూడా ఏదో ఒక విధమైన  మనుగడ కోసమే. అధాత్మికత కూడా ఒక రకమైన స్వర్గం కోసం చేస్తున్నపని  అయియుండుండచ్చు. లేకపోతే మీరు అక్కడికి వెళ్లి బాగా జీవించడం కోసం.

అందుకని ఈ మనుగడ కోసం మాత్రమే పాటుపడ్డం అన్నది ఉన్నంత సేపు మీ చుట్టూరా మీరు గోడలు కడుతూనే ఉంటారు. ఇది చాలా సహజం. కానీ మీలో మరో కోణం కూడా ఉంది. అది ఇప్పుడు మీరు ఏది అన్నదానికంటే ఇంకా ఎంతో వ్యాపించాలి, ఇంకా ఎంతో విస్తరించాలి అనుకుంటూ ఉంటుంది. దాన్ని కనక మీరు బాగా పరిశీలించినట్లయితే అది అనంతంగా ఎదగాలనుకుంటుంది. ఆధ్యాత్మికంగా మారడం అంటే ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్లిపోవడం అని కాదు. ఎందుకంటే  మీరు ప్రపంచం అనుకునేది మీ మనస్సులో మీరు ఏమి ఆలోచించుంకుంటున్నారో అన్నదాన్నిబట్టి ఉంటుంది. కానీ మీరు ఆధ్యాత్మికంగా మారడం అంటే మీలో మీరు ఈ జీవిత ప్రక్రియని ఎంత బలపరుచుకున్నారంటే అది కేవలం జ్ఞాపక శక్తికి, మనసుకి, ఆలోచనకి మాత్రమే సంబంధించింది కాదు. ఇంతకు మించింది ఏదో మీలో జరగడం మొదలుపెట్టింది.ఇది కేవలం మనసుకి,శరీరానికి సంబంధించింది  కాదు. మీకు ఒకసారి కనుక మీ మనసుకి, మీ శరీరానికి మించిన ప్రక్రియ ఏదో మీలో జరగడం మొదలుపెట్టినప్పుడు అదే ఆధ్యాత్మికత. ఎందుకంటే మీరు ఇది నమ్ముతున్నారు, అది నమ్ముతున్నారు అన్నదాని వల్ల మీరు ఆధ్యాత్మికులు అవ్వరు. ఈ భౌతికమైనదానికి మించినది ఏదో మీ అనుభూతిలోకి వచ్చినప్పుడే అది ఆధ్యాత్మికత అవుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు