సాధకుడు: సద్గురూ.. ఒకవేళ ఈ హాల్లో కూర్చున్నవారందరూ జ్ఞానోదయం పొందితే, అప్పుడు భారతదేశం ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడడానికి ఎంత సమయం పడుతుంది..?

సద్గురు: అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తిని ఎన్నుకోవచ్చా..? అని మీరు అడుగుతున్నారు. అది ఎంతో పెద్ద ప్రశ్న.  ఇక్కడున్నవారందరూ జ్ఞానోదయాన్ని పొందడానికి ఉన్న సంభావ్యత ఎంతో అరుదైనది. అలా జరగడానికి అసలు ఆస్కారం లేదని నేను చెప్పడం లేదు. కానీ, అలా జరగడం అనేది ఎంతో అరుదైన విషయం. ఎందుకంటే, ప్రస్తుతం ఇక్కడున్న వాళ్ళు “ భోజనానికి సమయం అయిపోయింది, సద్గురు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, ఏం చెయ్యాలీ,  ఏం చెయ్యాలీ “ అని ఆలోచిస్తున్నారూ. వారికి జీవితంలో ఎన్నో విషయాల పట్ల ఆసక్తి ఉంది. జీవితంలో మీ దృష్టి అంతా కూడా జ్ఞానోదయం మీదనే ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానోదయం కలగడం అన్నది సాధ్యం అవుతుంది.

అలాంటి స్థితిలో మీరు ఉంటేనే, ఈ హాలు వదిలి వెళ్ళే లోపే ఆత్మసాక్షాత్కారం పొందే అవకాశం ఉంది. కానీ, అలాంటి విషయం ఇక్కడ జరుగడం లేదు. మీకు, దీనికంటే ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి. మీరు ఐదు దిశలుగా ఒకేసారి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఐదు ప్రక్కలకి ఒకేసారి వెళ్ళలేరు కాబట్టి, ఉన్నచోటే ఉండిపోతారు.  జరుగుతున్నదంతా ఇదే.  పరిణామం చెందడం అన్నది అసలు లేనేలేదు.

దానికి కొద్దిగా ఇంగిత జ్ఞానం, అందరిపట్ల కొద్దిపాటి ప్రేమ ఉంటే సరిపోతుంది.
ఇక్కడున్న ప్రజలకి ఒకవేళ ఆత్మసాక్షాత్కారం కలిగినప్పటికీ, వారు దానిని తట్టుకుని నిలబడలేరు. మీరు ఇప్పుడు జ్ఞానోదయం పొందవచ్చు. కానీ ఏ క్షణాన్నైతే మీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందో, మీరు మీ శరీరాన్ని వదిలేసే క్షణం కూడా అదే అవుతుంది. ఎందుకంటే మీరు మీ శరీరాన్ని పట్టి ఉంచలేరు. మీరు మీ శరీరాన్ని అలా నిలబెట్టుకోగాలగాలంటే, మీకు శరీరం గురించిన ఎన్నో అంశాలు తెలిసి ఉండాలి. లేదంటే మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన క్షణమే, మీరు ఈ దేహాన్ని విడిచి పెట్టేస్తారు. మీకు ఈ దేహం కనుక నిలిచి ఉండాలంటే, మీరు దానికై ఎంతో సర్కస్ చెయ్యవలసి ఉంటుంది. ఈ సర్కస్ నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. జ్ఞానోదయం అన్నది ఈ క్షణంలో కావాలంటే, అలా ఒక్క క్షణంలో జరిగే పనే. కానీ మనస్సు, దేహం గురించిన సర్కస్ అన్నది పూర్తిగా వేరే విషయం. మీరు దానిని అధ్యయనం చెయ్యవలసిందే..!

ఇది ఒక సైకిల్ నడపడం లాంటిదే. నేను జ్ఞానోదయం పొందిన వ్యక్తి నని, నాకు సైకిల్ నడపడం దానంతట అదే వచ్చేయ్యదు కదా..? నేను దానిని ఎలా నడపాలో నేర్చుకోవాలి. ఈ దేశం పరిస్థితిలో మనం పరివర్తన తీసుకురావాలంటే, దానికి ఇంత అద్భుతమైన పరిస్థితి - అంటే ఒక వెయ్యి మంది ఒక్కసారిగా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి అద్భుతమైన పరిస్థితి అవసరం లేదు. దానికి కొద్దిగా ఇంగిత జ్ఞానం, అందరిపట్ల కొద్దిపాటి ప్రేమ ఉంటే సరిపోతుంది. ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం, మనందరం ఇప్పుడు ఒక దేశ ప్రజలుగా ఒక గుర్తింపుని ఏర్పరచుకున్నాం.  మనందరం కూడా ఒక దిశగా నడవటం నేర్చుకోవాలి. మనకి ఒక గట్టి నేతృత్వం ఉండాలి. అందుకు దేశం పట్ల ఎంతో దీక్షా, నిమగ్నతా భావం కలిగిఉండాలి. అలా కనుక జరిగితే, దేశం పురోగమిస్తుంది.

భారతదేశం ఎంతో విశాలమైన దేశం. ఇంత వైశాల్యం కలిగిన దేశం ఒక్క రాత్రిలో పరిణామం చెందదు. దానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ అది ఒక పరిష్కార దిశగా నడవడం మొదలు పెడితే అది ఎంతో మేలైన విషయమే..! అది ఒక సరైన దిశలో నడుస్తూ ఉంటే, మనందరమూ కూడా దానిని మరింత వేగంగా ముందుకి నడిచేలాగా తొయ్యవచ్చు. కానీ; అది ఒకవేళ తప్పు దిశగా నడుస్తూ ఉన్నట్లయితే, మనం దానిని మరింత వేగంగా ముందుకి తోసినట్లితే అప్పుడు అది పూర్తిగా తప్పు దిశగా వెళ్లి, తప్పు దశకు చేరుకుంటుంది.  అందుకని, మనం జ్ఞానోదయానికీ ఒక ప్రభుత్వ పాలనకూ సంబంధాన్ని వెతకవలసిన పనిలేదు. కానీ, ఒక వ్యక్తిగా మీరు మీ ఆత్మసాక్షాత్కారం వైపుగా నడవాలి. అదీ మీ శ్రేయస్సు కోసం. మానవాళి శ్రేయస్సు కోసం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు