మీరు మీ వ్యవస్థ నుండి మానసిక వ్యాకులతను ఎలా తరిమికొట్టవచ్చో మిమ్మల్ని మీరు ఎలా సంబాళించుకోవచ్చో సద్గురు వివరిస్తున్నారు.

Sadhguruమనోవ్యాకులత అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. కుంగిపోవడం అంటే ఏమిటి? మీ లోపల ఏం జరుగుతుంది? ప్రాథమికంగా మీరేదో జరగాలని కోరుకున్నారు, అది జరగలేదు. మీరు, ఎవర్నో, దేన్నో మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారు, మీ భవిష్యత్తు, ప్రపంచం మీరు కోరుకున్నట్లు ఉండాలనుకుంటారు, అది జరగదు. మరో విధంగా చెప్పాలంటే మీరు ఏం జరుగుతున్నదో దానికి వ్యతిరేకంగా ఉన్నారన్నమాట; అంతే. బహుశా మీరొక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండవచ్చు, లేదా ఒక పరిస్థితికి వ్యతిరేకంగా ఉండవచ్చు, లేదా జీవితానికే వ్యతిరేకంగా ఉండవచ్చు. మీరు దేని పట్ల వ్యతిరేకంగా ఉన్నారన్నదాన్ని  బట్టి ఈ వ్యాకులత మరీ మరీ లోతుగా మారుతుంది.

మీరొక దానికి ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు? ఎందుకంటే విషయాలు మీకనుకూలంగా ఉండనందువల్ల, అంతే కదా? దయచేసి ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ప్రపంచం మీ మూర్ఖపద్ధతిలో నడవదు. అంటే మీకు సృష్టికర్త మీద నమ్మకం లేదు. సృష్టిని మీరు అంగీకరించడం లేదు. మీకు అతిసున్నితమైన అహం ఉంది. అందుకే మీలో వ్యాకులత.

మనోవ్యాకులత ఉన్నవాళ్లు తమకు తామే నష్టం కలిగించుకుంటారు.   మనోవ్యాకులత చెందిన వ్యక్తి ఎల్లప్పుడూ తనకు తాను హాని చేసుకునే ప్రయత్నం చేస్తాడు.

వ్యాకులత మిమ్మల్ని నిరాశాపూరితుల్ని చేస్తుంది, మీకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. మనోవ్యాకులత ఉన్నవాళ్లు తమకు తామే నష్టం కలిగించుకుంటారు.   మనోవ్యాకులత చెందిన వ్యక్తి ఎల్లప్పుడూ తనకు తాను హాని చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎవరైనా కత్తి తీసికొని వెళ్లి ఎవరినైనా పొడిచి చంపితే అతని అహం అంత సున్నితం కాదని అర్ధం. వ్యాకులత చెందిన వ్యక్తి మనస్సుకు స్వస్థత కలిగించడానికి ఈ వ్యక్తి కంటే ఎక్కువ ప్రయత్నం అవసరమవుతుంది.  హింసాత్మక ధోరణి ఉన్నవ్యక్తిని తేలికగా మెత్తబరచవచ్చు. మీరు వీథుల్లో చూసి ఉంటారు. ఇద్దరు వ్యక్తులు తగాదా పడతారు, ఒకరినొకరు చంపుకోబోతారు, కాని ఎవరైనా కాస్త తెలివిగలవారు వాళ్లను ఆపి నచ్చచెప్తే తగాదా మరచిపోయి స్నేహితులై నవ్వుకుంటూ వెళ్లిపోతారు. కిందటి క్షణానికీ, ఈ క్షణానికీ అంత మార్పు ఉంటుంది. కాని మానసిక వ్యాకులత ఉన్నవ్యక్తి విషయంలో ఇలా జరగదు. ఇది జీవితాంతం కొనసాగుతుంది. ఉద్దేశపూర్వకంగా చేసినా, అనుద్దేశపూర్వకంగా చేసినా వీళ్లు జీవితాంతం తమ కత్తికి పదును పెట్టుకుంటూనే ఉంటారు, దానితో తమ గుండె కోసుకుంటూనే ఉంటారు. ఒక వ్యక్తి తనను తాను ఎందుకు గాయపరచుకుంటాడు? సాధారణంగా అది సానుభూతి పొందడం కోసం. బాగా వ్యాకులత చెందిన వ్యక్తికి సాధారణ సానుభూతి చాలదు; వాళ్లతోపాటు ఎవరో ఒకరు భోరుమని ఏడవాలి.

మీలో గాయపరచుకోవడానికి ఏముంది? నేను కర్ర తీసికొని మిమ్మల్ని కొడితే మీ శరీరం గాయపడుతుంది; అది సరే. మరోవిధంగా మీ లోపల ఎలా గాయపడుతుంది? ఆ గాయపడేది మీ అహం, అవునా? బుద్ధి, అంతర్గత స్వభావం గాయపడలేవు. గాయపడేది మీ అహం మాత్రమే. అందువల్ల ‘నేను ఎదగదలచుకున్నాను’ అని మీరంటే మీరు దీన్ని అధిగమించి, మీ అహాన్ని తొక్కివేసి ముందుకు వెళ్లడమన్నమాట.

మీకు విచారం కలిగినప్పుడు మీకు చిరాకు, కోపం కలిగితే, మీకు  ఈ ప్రపంచమంతా తప్పుగా కనిపిస్తే, మీరు మూర్ఖులన్నమాట.

ఒక వ్యక్తి తనలోని ఏ భావోద్వేగాన్నయినా తన జీవితంలో ఒక సృజనాత్మకశక్తిగా మార్చుకోగలడు. మీ దుఃఖం మీరు అసంపూర్ణులని మీకు గుర్తుచేస్తే, అది మంచిదే; మీ దుఃఖాన్ని పెరగనివ్వండి. మీకు విచారం కలిగినప్పుడు మీకు చిరాకు, కోపం కలిగితే, మీకు  ఈ ప్రపంచమంతా తప్పుగా కనిపిస్తే, మీరు మూర్ఖులన్నమాట. మీరు మీ ఈ విచారాన్ని కోపంలోకి మార్చుకోవాలనుకుంటారా? ప్రేమానురాగాలలోకి మార్చుకోవాలనుకుంటారా? మీరు విచారంలో ఉన్నప్పుడు మీరు కరుణామయునిగా మారాలని అనుకుంటే మీ పని చాలా తేలిక అవుతుంది. అది మిమల్ని లయం చేయగల శక్తి; దీన్ని మరింత కరగడానికీ, తద్వారా మీ పరమోన్నత శ్రేయస్సు  పొందడానికీ ఉపయోగించవచ్చు. ప్రస్తుతం మనుషుల విషయంలో దురదృష్టకరమైన వాస్తవం ఏమిటంటే వారి మానవత్వం పనిచేసేది జీవితం వారిని నలిపివేసినప్పుడే. చాలామంది విషయంలో దుఃఖం, బాధ కలగకుండా పరిపక్వత కలగదు. మరోవిధంగా తమ విషయంలోకాని, తమ చుట్టూ ఉన్నవారి విషయంలో కాని ఏమి జరుగుతున్నదో వారికి అర్థం కాదు.

యోగాలో మనోవ్యాకులతను - శరీరం, మనస్సు, శక్తి, ఈ  మూడు స్థాయుల్లోనూ వ్యవహరించడం జరుగుతుంది. శారీరక, మానసిక, శక్తి శరీరాలకు ఆవశ్యకమైన సమతుల్యతను, ఉత్సాహాన్నీ అందిస్తే పరమానందం పొందడం చాలా సహజం. పారవశ్యంలో ఉన్న వ్యక్తిలో వ్యాకులత ఎప్పుడూ ఉండదు కదా.

ప్రేమాశిస్సులతో,
సద్గురు