ఈ వ్యాసంలో కర్మ, భౌతిక, ఇంకా శక్తి శరీరాల గురించి సద్గురు వివరిస్తున్నారు. శక్తి శరీరం వ్యాప్తి చెందినప్పటికీ దానిని తట్టుకొనే రీతిలో కర్మ ఇంకా భౌతిక శరీరాలు సిద్ధంగా ఉండాలని లేదంటే వాటికి కొంత నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.

ప్రశ్న: సద్గురు, మీరు మానవ వ్యవస్థలోని వివిధ పొరల మధ్య ఏర్పడే సంఘర్షణ లేదా ఘర్షణ గురించి మాట్లాడారు. కొందరు వ్యక్తులలో, కర్మ శరీరం లేదా శక్తి శరీరం వారి శారీరక శరీరంతో ఘర్షణలో ఉండవచ్చునని చెప్పారు. ఇది ఎందుకు జరుగుతుంది? మేము దీనిని ఎలా అధిగమించగలము?

సద్గురు: ఉదాహరణకి ఒక ఆటోమొబైల్ తీసుకుందాం. మీరు ఒక చిన్న కారు తీసుకొని దానిలో చాలా శక్తివంతమైన ఇంజిను ఉంచాలనుకుంటే, మీరు మొత్తం కారునే మెరుగుపరచాల్సి వస్తుంది. ఇలా చేయక పోతే, కారు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది – దీని అర్ధం ఇంజిన్ చెడ్డది అని కాదు. ఇంజన్ చాలా అధునాతనమైనది కాబట్టే దానిని తట్టుకునే కారు అవసరం. అదేవిధంగా, మీ శక్తి శరీరం బాగా మెరుగుపడినప్పుడు, మీ భౌతిక శరీరాన్ని మెరుగుపరుచుకోకుండా, మీ కర్మ శరీరాన్ని సంసిద్ధం చేసుకోకపోతే , ఏదో ఒకటి విరిగిపోవచ్చు.

అందుకే ఇరవై ఒక్క నిమిషాల శాంభవి మహాముద్రను నేర్పించటానికి చాలా రోజుల పాటు క్లాసులు నిర్వహిస్తున్నాం - తద్వారా మీరు మీ భౌతికతను ఇంకా అన్నింటికంటే ముఖ్యమైన మీ కర్మ స్వభావాన్ని నిర్వహించడం నేర్చుకుంటారు.  మీ("మీరు"గా అనుకునే) గుర్తింపును విస్తరింపజేస్తే, ముఖ్యంగా మీ భావోద్వేగ పరంగా ఉండే గుర్తింపును అపరిమితంగా విస్తరింప చేస్తే - కర్మ శరీరం ప్రభావం మీపై బలంగా ఉండదు. ఇప్పుడు మీ శక్తి శరీరం విస్తరణ ఎంతగానైనా చేసుకోవచ్చు. అందుకే మీ భావోద్వేగ గుర్తింపు విస్తరణ జరగాలి. అలా లేకపోయినట్లయితే, మీ కర్మ మిమల్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది.

ఒక నిర్దిష్టమైన రీతిలో ఇంకా తీవ్రతతో క్రియా యోగ స్వభావాన్ని అన్వేషించ దలచుకునే ముందు, భౌతిక శరీరం స్థిరంగా, ఇంకా సామర్థ్యంతో ఉండడం చాలా ముఖ్యం.

మీ కర్మ ప్రభావం మీపై చాలా గట్టిగా ఉన్నప్పుడు, మీ శక్తులు విస్తరించినట్లయితే, మిమ్మల్ని ఎదో లోపలి నుండి చీల్చేస్తున్నట్టు మీరు భావిస్తారు. మీరు విచ్ఛిన్నం అయినట్లయితే అది మంచిదే, కానీ మీరు దానిని తట్టుకోగలగాలి. మీరు దానిని తట్టుకోకపోతే, మీకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది. కాబట్టి, ఉత్తమమైనది ఏమిటంటే, మీ శక్తికి ఏ స్థాయిలో విస్తరణ జరిగినా, కర్మ శరీరం దానిని తట్టుకోగలిగేలగా మీ కర్మ శరీరాన్ని విస్తరింపచేయడం.

భౌతిక శరీరానికి సంబంధించి, ఒకరి భౌతిక శరీరం దీనిని(శక్తి విస్తరణని) తీసుకోలేని స్థితిలో ఉండడమనేది చాలా అరుదు. ఇది ఎంతో శక్తివంతమైన క్రియా యోగా ప్రక్రియలను చేస్తున్నప్పుడు మాత్రమే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక నిర్దిష్టమైన రీతిలో ఇంకా తీవ్రతతో క్రియా యోగ స్వభావాన్ని అన్వేషించ దలచుకునే ముందు, భౌతిక శరీరం స్థిరంగా, ఇంకా సామర్థ్యంతో ఉండడం చాలా ముఖ్యం. ఇందుకు అవసరమైన అవగాహన లేక పోయినట్లయితే, వారు తమ శరీరానికి అపారమైన నష్టాన్ని కలిగించుకుంటారు. సాధారణంగా కుండలిని యోగ అని పిలవబడే సాధనల వల్ల, వారి భౌతిక శరీరానికి అపారమైన నష్టాన్ని కలిగించు కున్న వ్యక్తులను నేను చూశాను. కానీ ఎక్కువ మంది ప్రజలు యోగా గురించి మాట్లాడే వారే. యోగాను తీవ్రతతో సాధన చేసేవారు అరుదు. ప్రత్యేకించి అమెరికాలో - వారు నెలకు ఒకసారి కలిసినప్పుడు మాత్రమే యోగ సాధన చేస్తారు. ఇది యోగా క్లబ్. మీరు కేవలం "వినోదం కోసమే యోగి" అయితే, మీలో జరిగే వ్యత్యాసాన్ని అనుభూతి చెందకపోవచ్చు. కానీ మీరు తీవ్రంగా అభ్యాసం చేస్తే, మీ శక్తి నిజంగా విస్తరించినట్లయితే, అందుకు మీ భౌతిక శరీరం ఇంకా కర్మ శరీరం తప్పక సిద్ధంగా ఉండాలి. లేకపోతే దీనిని మీరు తట్టుకోలేరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay