ఒక చోట ముగ్గురు మనుషులు పని చేస్తున్నారు. ఒక రోజు ఆ దారిన వెళ్ళే ఒకతను ఆగి మొదటి వాడిని, ‘నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు?’ అని అడిగాడు. మొదటివాడు, ‘నువ్వు గుడ్డివాడివా? నీకు కనిపించట్లేదా?నేను రాళ్ళు పగలగొడుతున్నాను.’ అని అన్నాడు. అతను నిజంగానే రాళ్ళు పగలగొడుతున్నాడు. అతను రెండవవాడి దగ్గరకు వెళ్లి అడిగాడు, ‘నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు?’.

అతను అన్నాడు, ‘నేను నా పొట్ట నింపుకోవటం కోసం ఎదో చేస్తున్నాను.’ అతను మూడవవాడి దగ్గరకు వెళ్లి అడిగాడు, ‘నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు?’. అతను ఆనందంగా నుంచొని, 'నేను ఇక్కడ ఒక అద్భుతమైన గుడిని కడుతున్నాను’ అని అన్నాడు. ముగ్గురూ కూడా ఒకే పనిని చేస్తున్నారు. వారి వారి అనుభవాల్లో ఒకడు రాళ్ళు కొడుతున్నాడు, మరొకతను పొట్ట నింపుకుంటున్నాడు, మూడవ అతను ఒక అద్భుతమైన గుడిని కడుతున్నాడు.

మీ జీవన ప్రమాణాలు మీ జీవితంలోని విషయాలను మార్చడం ద్వారా మారవు, అవి కేవలం మీరు జీవించే తీరుని మారిస్తేనే మారుతాయి.

మీ జీవన ప్రమాణాలు మీ జీవితంలోని విషయాలను మార్చడం ద్వారా మారవు, అవి కేవలం మీరు జీవించే తీరుని మారిస్తేనే మారుతాయి. 'ఏ ఆపేక్ష లేకుండా లేదా ఎలాంటి లెక్కలు లేకుండా' అని మేము అన్నప్పుడు, మిమ్మల్ని రోడ్డు మీద బిచ్చగాళ్ళలా బతకమనడం లేదు. మేము మీరు అన్వయించుకునే తీరు గురించి మాట్లాడుతున్నాం. పరిస్థితిని మార్చడం గురించి మాట్లాడటం లేదు. పరిస్థితి మారిస్తే ఏమీ మారదు. మీరు వేసుకునే బట్టలని మారిస్తే, తినే తిండిని మారిస్తే, మీరు ఉండే చోటుని మారిస్తే, మీ జీవన ప్రమాణం మారదు, అవునా, కాదా?  మీరు ఇంటి నుండి ఆశ్రమానికి వస్తే, ఇక్కడ మీకు ఇంటి వద్ద కన్నా ఎక్కువ సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇంట్లో కేవలం నలుగురు మనుషులతో మీకు సమస్యలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు 1000 మంది ఉండే ఆశ్రమంలో ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?అవునా, కాదా? కాబట్టి మీరు మార్చవలసింది మీ జీవితంలోని పరిస్థితులను లేదా విషయాలను కాదు, మీరు వాటిని మీ జీవితంలో అన్వయించుకునే తీరుని.

మీరు మీ ఆఫీసుకి వెళ్ళండి.  మీరు అక్కడ జరిగేదాంట్లో మీ వంతు పాత్ర పోషించాలనుకుంటున్నారు కాబట్టి, వెళ్ళండి. మీరు అలా పని చేస్తే, మీకు నెల తరువాత జీతం ఇవ్వరా?వాళ్ళు జీతం ఇస్తారు, అవునా, కాదా? కానీ ౩౦ రోజులూ మీరు ‘జీతం, జీతం, జీతం’, అని జపం చేస్తే, మీరు ఆ ౩౦ రోజులూ, జీతం వచ్చే రోజుకోసం ఎదురు చూస్తూ బాధగా గడుపుతారు. ఆఖరికి జీతం వచ్చిన తరువాత ఇంకా బాధగా ఉంటారు. ఎందుకంటే మీకు ఎంత జీతం వచ్చినా అది సరిపోదు, అవునా, కాదా? ఈ భూమ్మీద ఎవరికైనా సరిపోయేంత జీతం వస్తుందా? ఎవరికీ సరిపోయేంత రాదు, అవునా, కాదా? సరిపోయేంత జీతం అంటూ ఏదీ ఉండదు – అది ఎప్పుడూ సరిపోదు. ఎందుకంటే మీ జీతం పెరిగితే, మీ జీవనశైలి దానికన్నా రెండడుగులు ముందే ఉంటుంది. కాబట్టి, మీరు ఏమి చేస్తున్నారు, ఏమి చెయ్యట్లేదు అన్నది కాదు ప్రశ్న - మీరు ఎలా చేస్తున్నారు అన్నదే ప్రశ్న. ఎందుకంటే అదే జీవితాన్ని మారుస్తుంది.

ఒక్కొక్కరికి ఆనందం ఒక్కో  విషయం వల్ల ఉద్దీపనం అవ్వచ్చు. ఒకరికి మంచి దుస్తులు వల్ల,  ఒకరికి మంచి సంబంధ బాంధవ్యాలు వల్ల సంతోషం కలగవచ్చు. ఒకరు మంచిగా ఆహారం తీసుకున్నారని ఆనందం చెందవచ్చు. ఇవి ఆనందంలోని రకాలు కాదు, ఆనందం అన్నది ఒక్కటే. ఇవి ఆనందాన్ని కలిగించే ఉద్దీపనాలు.  నేను మీకు బయట ఉద్దీపనం లేకుండానే మీరు ఇక్కడ కూర్చుంటే కేవలం మీ ఉనికి వల్లే సంతోషంగా ఉండే ప్రక్రియ ఏదైన నేను మీకు నేర్పిస్తానంటే, మీకు అది నేర్చుకోవాలని ఉంటుందా? దీని అర్ధం మీరు మీ జీవితాన్ని ఆస్వాదించరు అని కాదు, కాని మీ జీవితంలో మీరు ఏది ఆస్వాదించాలన్నా సరే మీరు ఎప్పుడు ఆస్వాదించ గలుగుతారు? మీరు ఆనందంగా ఉన్నప్పుడే...! దీని గురించే మనం చెబుతున్నాం. శ్రేయస్సు అంటే అది ఏదో ఒక పని చేయడం వల్ల మీకు కలిగే పర్యవసానం కాదు, ఇది మన ఉనికికి  మూలం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.