సాధారణంగా మనమందరం ఆనందాన్ని ఒక భావోద్వేగం అనుకుంటాం. కాని సద్గురు ఆనందం ఒక భావోద్వేగం కాదని అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.


ఆనందం ఒక భావోద్వేగం కాదు, అది మీ జీవితంలోని అన్ని అంశాలలోకి చొచ్చుకువచ్చే ఒక నిర్దిష్టమైన జీవన విధానం, ఒక నిర్దిష్టమైన ఆహ్లాదం. దానివల్లే మీరు ఆనందంగా ఉంటారు.

ఆనందం ఒక భావోద్వేగం కాదు, అది మీ జీవితంలోని అన్ని అంశాలలోకి చొచ్చుకువచ్చే ఒక నిర్దిష్ట జీవన విధానం, ఒక నిర్దిష్టమైన ఆహ్లాదం, దానివల్లే మీరు ఆనందంగా ఉంటారు. ఇది ఎవరో మీకు జోక్ చెప్పినందువలన మీరు నవ్వడం కాదు. అది ఒక క్షణికానందం, అది చిరకాలం ఉండదు. మీరు ఎల్లప్పుడూ జోకులకి నవ్వుతూ ఉండలేరు.

మీకు తెలుసా, మీ జీవితంలోని ప్రతిక్షణంలో ఎవరైనా మీకు జోక్ చెపుతూ ఉంటే, కొంతకాలానికి జోక్స్ అంటే మీకు పూర్తిగా వెగటు పుడుతుంది. అన్నిటితోనూ ఇలాగే ఉంటుంది. అది సంగీతం, డాన్స్, ప్రేమ, సంబంధాలు, ఇలా వేటినైనా మీరు అతిగా చేస్తే వెగటుపుడుతుంది. కానీ, మీలోని జీవానికి ఎప్పటికీ వెగటు కలగదు. ఎందుకంటే అదే మీ ఉనికికి ఆధారం.

కాబట్టి మీరు మీలోకి ఈ ఆహ్లాదాన్ని తెచ్చుకుంటే, మీరు ఉండే విధానమే ఆనందభరితమవుతుంది. మీరు ఇలా ఉన్నప్పుడు, మీరు ఒక సంబంధం ఏర్పరుచుకోవాలని అనుకుంటే, తద్వారా మీరు మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారే కానీ, వారి నుండి ఆనందాన్ని పిండుకోవాలనుకోరు. మీరు ప్రపంచంలో ఏ పని చేస్తున్నా, ఎవరితో ఎలాంటి సంబంధంలో ఉన్నా, మీరు మీ ఆనందాన్ని పంచుకుంటే, మీ జీవన ప్రమాణం చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఇక ఎంత మాత్రమూ ఆనందాన్ని వెతుక్కోరు. ఆనందాన్ని వెతకటం నుండి ఆనందాన్ని పంచుకోవడానికి మారడంలో ఒక గొప్ప మార్పు సంభవిస్తుంది. అసలు మానవుల జీవిత ఆధారమే ఆనందం. ఒకసారి మీరు ఇలా అయితే, అంటే మీకై మీరు స్వతహాగానే ఆనందంగా ఉంటే, ఇక మీకంటూ స్వార్ధ ప్రయోజనాలేమి ఉండవు. మీరిక నిర్బంధ చర్యలేమి చేయరు. మీరు ఏ పరిస్థితులలోనైనా ఏది అవసరమో అదే చేస్తారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.