నేను పుట్టిన ప్రదేశానికి ఎంతో దగ్గరలో నివసించిన ఒక యోగి గురించి మీకు చెబుతాను. ఈయన గురించి, అక్కడ జరిగిన  దాని గురించీ నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు విన్నాను.  కానీ  అప్పుడు దానిమీద అంత దృష్టి పెట్టలేదు. అది నాకు కొంత ఉత్సాహాన్ని కలిగించింది, కానీ అప్పట్లో అది నాకంతగా ప్రాధాన్యమైన విషయంగా అనిపించలేదు. మైసూరుకి పదహారు కిలోమీటర్ల దూరంలో ఒక భక్తుడు ఉండేవాడు. ఇప్పుడు నంజనగూడుగా ప్రఖ్యాతి చెందిన ప్రదేశానికి ఇది పొలిమేరలో ఉంది. అతని పేరు మల్ల. మల్ల ఏ సంప్రదాయానికీ చెందినవాడు కాదు. అతనికి ఎటువంటి ఆరాధనగానీ, ధ్యానంగానీ తెలియదు. కానీ  బాల్యం నుండీ కూడా, తను కళ్ళు మూసుకుంటే చాలు తనకి శివుడు మాత్రమే కనిపించేవాడు. ఇతనిని కేవలం ఓ భక్తుడు అనటం సరి కాదేమో..! ఇటువంటివారు, కొన్ని లక్షలమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా శివుడికి ఆధీనమైపోయారు. వారికి, ఇక వేరే ఎంపిక లేదు. నేను కూడా, ఈయన వలలో అలాగే చిక్కుకున్నాను. నేను, శివుడు కావాలని కోరుకోలేదు. కానీ, ఆయన వలలో చిక్కుకున్నాను. శివుడు ఒక వేటగాడు కూడా. ఈయన కేవలం జంతువులనేకాదు, మానవులను కూడా వలవేసి పడతాడు. ఇది అలాంటి మరో విషయం.

అతను ఇలా దోచుకోవడం మానేసి, ఒకటిన్నర సంవత్సరంలోనే ఈ యోగులతో కూర్చుని మహాసమాధిని పొందాడు.
శివుడు తప్ప మరేమీ తెలియదు మల్లకి. అతను ఎంతో మొరటుగా పెరిగాడు. ఏ పనీ-పాటా నేర్చుకోలేదు. అతనికి కావలసినది ఎవరో ఒకరిని ఆపి, వారిదగ్గరనుంచి తీసుకోవడం అన్న విషయం తప్పు అని కూడా అతనికి అనిపించలేదు. అందుకని అతను అలానే చేస్తూ ఉండేవాడు. ప్రజలు అతనిని దుండగుడు అన్నారు. ప్రజలు ఎప్పుడూ వెళ్ళే ఒక అడవి మార్గం దగ్గర ఇతను దుండగుడిగా ఉండడం మొదలు పెట్టాడు. అక్కడ ఇతను ఉన్న ప్రదేశం - ఎక్కడైతే ఇతను శిస్తును వసూలు చేస్తూ ఉండేవాడో, దానిని ప్రజలు ‘కల్లనమూలై’ అని పిలవడం మొదలు పెట్టారు. అంటే, ఇది దొంగ ఉండే ఒక మూల అని అర్థం. మొట్టమొదట్లో, ప్రజలు ఇతనిని శపించేవారు. కానీ, సంవత్సరం చివరిలో ఇతను వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన ప్రతీ పైసా కూడా ఎంతో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాన్ని జరిపించడానికి ఉపయోగించేవాడు. ఒక పెద్ద వేడుక చేసేవాడు.

కొన్ని సంవత్సరాల తరువాత, ప్రజలు ఇతను ఒక గొప్ప భక్తుడని అర్థం చేసుకుని, వారే ఇష్టపూర్వకంగా ఇతనికి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఎవరైతే ఇవ్వలేదో వారి దగ్గర వసూలు చేసేవాడు. అన్నదమ్ములైన ఇద్దరు యోగులు ఒకసారి అటుగా రావడం జరిగింది. వారు ఈ వ్యక్తిని ఒక దుండగుడుగా ఇంకా ఒక భక్తుడిగా కూడా చూశారు. వారు “నీ భక్తి అమోఘమైనది.  కానీ, నువ్వు ఎంచుకున్న మార్గం ప్రజలని బాధపెడుతోంది” -  అని చెప్పారు. దానికి అతడు - “నేను ఇది శివుడిగురించి చేస్తున్నాను. ఇందులో సమస్య ఏముంది..?”  అన్నాడు. వారతనిని ఒప్పించి ప్రక్కకి తీసుకుని వెళ్ళి, ఎన్నో విషయాలు బోధించి, అతనిని మరో మార్గంలో పెట్టారు. ఆ తరువాత నుంచీ, ఆ ప్రదేశాన్ని కల్లనమూలై నుంచి మల్లనమూలై అనడం మొదలు పెట్టారు. ఈ రోజుకీ దానిని మల్లనమూలై అనే పిలుస్తారు. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవం ఎంతో గొప్ప వేడుకగా చేసే ఒక కేంద్రం ఏర్పాటయ్యింది. అతను ఇలా దోచుకోవడం మానేసి, ఒకటిన్నర సంవత్సరంలోనే ఈ యోగులతో కూర్చుని మహాసమాధిని పొందాడు. ఈ యోగులు ఇతనికి మహాసమాధి స్థితిని తీసుకువచ్చిన తరువాత, వారిద్దరూ కూడా కూర్చుని వారి దేహాలను త్యజించారు. ఈ రోజున అక్కడ ఒక అందమైన గుడి ఉంది. కానీ, ప్రజలు ఇంకా దీనిని మల్లనమూలై అనే పిలుస్తారు. ఇది కాబిని నది ఒడ్డున ఉంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు