నేను దీని గురించి ఏమి చెప్పినా, అపార్థమే చేసుకుంటారు. ఎందుకంటే తార్కిక, భౌతిక పరిమితుల్లో లేని దానిని  మాటల్లో చెప్పలేం. మీలో ప్రధానంగా రెండు రకాల ఆకాంక్షలు ఉన్నాయి. అవి ఒకటి ఆత్మ సంరక్షణ, మరొకటి వ్యాప్తి చెందడం. మీలోని ఆత్మ సంరక్షణ స్వభావం, మీ చుట్టూరా గోడలు కట్టుకుని మిమ్మల్ని రక్షించుకోమని చెబుతూ ఉంటుంది. మీలోని మరో భాగమైన వ్యాప్తి చెందడం అనేది - ఎల్లప్పుడూ వ్యాప్తి చెందాలని ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఈ రెండూ కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకమైన శక్తులు కావు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే వీటిని - గురుత్వాకర్షణ, అనుగ్రహం - తో పోల్చి చెప్పవచ్చు. ఇది కేవలం ఒక ఉపమానం మాత్రమే..! ఈ రెండూ మీ జీవితంలోని రెండు అంశాలకు చెందినవి.

మీరు ఈ అస్థిత్వం యొక్క భౌతిక శక్తుల నుంచి విముక్తులైతే, అప్పుడు మీ జీవితంలో అనుగ్రహం వెల్లివిరుస్తుంది.
ఆత్మ సంరక్షణ అన్నది కేవలం శరీరానికి పరిమితమై ఉండాలి. మీ శరీరానికి మాత్రమే సంరక్షణ అవసరం. మిగతావన్నీ కూడా మనం ఎలా మార్చేసినా, ఎలా కూలదోసినా, మరుసటి రోజూ వాటిని పునఃనిర్మించుకోవచ్చు. మీరు కావాలనుకుంటే మీరు లేచిన తరవాత ప్రతిరోజూ ఉదయాన్నే మీరొక కొత్త వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవచ్చు. ఆత్మ సంరక్షణ (గురుత్వాకర్షణ) అంటే మిమ్మల్ని క్రిందకి లాగుతోంది. అనుగ్రహం అన్నది మిమ్మల్ని పైకి లేవనెత్తాలని చూస్తోంది. ఎందుకంటే, అనుగ్రహం అన్నదానిని మనం వివరించలేము. మీరు ఈ అస్థిత్వం యొక్క భౌతిక శక్తుల నుంచి విముక్తులైతే, అప్పుడు మీ జీవితంలో అనుగ్రహం వెల్లివిరుస్తుంది. అనుగ్రహం అన్నది ఎక్కడి నుంచో వచ్చేది కాదు.

మీరు మీ క్యాలెండరులో చూసినట్లు, అందులో ఫొటోల్లో ఉన్నట్లు - అనుగ్రహం ఇలా ఒక కాంతి పుంజంలో కిరణాల్లాగా ఒక మనిషి వైపు రావడం, జాలువారడం చూస్తారు. కానీ, ఇది అలాంటిది కాదు. గురుత్వాకర్షణ ఎప్పుడూ ఎలా పని చేస్తూనే ఉంటుందో అనుగ్రహం కూడా ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మీరు, అందుకు పాత్రులుగా చేసుకోవాలి. గురుత్వాకర్షణతో మీకు ఇష్టాయిష్టాలు లేవు. ఎలా అయినా సరే, మీరు దానికి పాత్రులే..! కానీ అనుగ్రహంతో అలా కాదు. మిమ్మల్ని మీరు అందుకు సుముఖులుగా, అది గ్రహించేందుకు అనువుగా అట్టి పెట్టుకోవాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు