ప్రశ్న: సూర్యునికి ప్రణమిల్లడంగా భావించే ఈ సూర్యనమస్కారాల ప్రాముఖ్యత ఏమిటి?

సద్గురు: ముందుగా అది ప్రణమిల్లడం ఎంతమాత్రం కాదు. దాని అర్థం మీలోని సూర్య శక్తుల్ని ఒక క్రమంలో పెట్టడం, భూమిమీద ఉన్న సమస్త జీవ పదార్థమూ సూర్యశక్తితోనే నడుస్తోంది. ఈ గోళం మీద ప్రాణానికి సూర్యుడే ఆధారం. మీరు తినే, తాగే, పీల్చే ప్రతి వస్తువులోనూ సూర్యుడి అంశ ఉంది. మీకు సూర్యుణ్ణి ఎలా "జీర్ణం" చేసుకోవాలో తెలుసుకోగలిగితే, సూర్యనమస్కారాన్ని మీ వ్యవస్థలో భాగం చేసుకోగలిగితే - మీకు ఈ ప్రక్రియవల్ల లాభం చేకూరుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సూర్యనమస్కారాలు చేసే వారికి వాళ్ళ అంతర్గత శక్తులు ఎక్కువకాలం కొనసాగుతున్న అనుభూతి కలుగుతుంది. వాళ్ళకు రీచార్జ్ కావలసిన ఆవశ్యకత కనిపించదు. అంతేకాకుండా, సూర్యనమస్కారాలు  అంతర్గత శక్తుల్ని – కుడి ఎడమ శక్తులు, లేదా సూర్య- చంద్ర ప్రమాణాలను ఒక క్రమంలో ఉంచడమేగాక వాటిని సమతుల్యంలో ఉంచుతాయి. ఇది శరీరంలో అంతర్గతంగా ఒక భౌతిక మానసిక సమతుల్యాన్ని  తీసుకువస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఇది చేసే లాభం చాలా ఉంది.

ఈ భౌతిక దేహం ఉన్నతమైన అవకాశాలు అందుకోవడానికి ఒక అద్భుతమైన సాధనం అయినప్పటికీ, చాలమందికి ఇది ఒక ఆడ్డంకిగా నిలుస్తోంది.

ఇంతకు ముందు చెప్పినట్టు, నా చిన్నతనంలో, నన్ను మా అమ్మగారు బలవంతంగా లేపవలసి వచ్చేది. నేను యోగ సాధన ప్రారంభించిన దగ్గర నుండి, నాకు ఏ ప్రయత్నమూ లేకుండానే రోజూ ఒకే సమయానికి మెలకువ వచ్చేది. నా జీవితం మరింత సరళంగా, శాంతంగా సాగడం ప్రారంభమయింది. ఈ సూర్యనమస్కారాల ఆంతర్యం, 12 సంవత్సరాల 3 నెలలకు ఒకసారి ఆవృత్తి పూర్తిచేసుకునే సూర్యుడి భ్రమణాలకి సరిగ్గా మీ శరీరంలోని ఆవృతులు అనుసంధానం అయ్యేలా మీలో ఒక అంతర్గత ప్రమాణాన్ని నిర్మించుకోవడం. అందుకనే అందులో కాకతాళీయంగా కాకుండా ఉద్దేశ్యపూర్వకంగానే 12 భంగిమలున్నాయి. మీ వ్యవస్థ ఒక స్థాయిలో ప్రతిస్పందించగల సంసిద్ధతతో, దేన్నైనా గ్రహించగల అవస్థలో ఉన్నప్పుడు, సహజంగానే, మీ ఆవృతులు సూర్యుడి ఆవృతులతో సమాన కాలనియమాన్ని పాటించగలుగుతాయి.

ఆడవారికి ఎంతో అనుకూలిస్తుంది

యువతులకు ఒక అనుకూలత ఉంది, వాళ్ళు చంద్రకళలతో సమాన ఆవృత్తిని పాటించగలరు. అయితే ఈ ఆధిక్యతని చాలమంది ఒక శాపంగా భావిస్తారు. వాళ్ళ శరీరం అటు సూర్యుడూ, ఇటు చంద్రుడూ ఇలా ఇద్దరితో సమాన కాలావృతి పాటించే అవకాశం ఉంది. ప్రకృతి ఈ అనుకూలతను స్త్రీలకు ఎందుకు ప్రసాదించిందంటే, మానవజాతిని కొనసాగించే బాధ్యత ఆమెకి అప్పగించింది గనుక. అందుకని ఆమెకు కొన్ని విశేష అధికారాలిచ్చింది. వాటిని దురదృష్టవశాత్తూ సామాజికంగా బలహీనతలుగా భావించబడుతున్నాయి. ఆ సమయంలో విడివడే అధిక శక్తిని ఎలా వినియోగించాలో తెలియక, దానిని ఒక శాపంగా పరిగణించడం జరుగుతోంది. దాన్నొక విధమైన పిచ్చిగా కూడా భావించడం జరుగుతోంది. ఈ భౌతిక దేహం ఉన్నతమైన అవకాశాలు అందుకోవడానికి ఒక అద్భుతమైన సాధనం అయినప్పటికీ, చాలమందికి ఇది ఒక ఆడ్డంకిగా నిలుస్తోంది. ఈ శారీరక బలహీనతలు వాళ్ళని ముందుకు పోనీయవు. సూర్యనమస్కారాలు అభ్యాసం చెయ్యడం శరీర సమతౌల్యతను నిలబెట్టడమేగాక, గ్రహణశక్తిని పెంపొందిస్తుంది, శరీరాన్ని దాని నియమిత శక్తుల హద్దులకు తీసికెళ్ళగలిగేలా సహకరిస్తుంది. అప్పుడు శరీరం ఎంతమాత్రం అవరోధంగా కనిపించదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు