ప్రశ్న:  మీరు ఏ యోగ సాధనలు చేయడం వల్ల అటువంటి పారవశ్య అనుభూతులను పొందారు ?

సద్గురు:  నేను ఇంతకు ముందు చెప్పినట్లు, అవి ఎంతో సరళమైనవి. భౌతికమైనవి. వాటిలో ఏమీ ఆధ్యాత్మికత లేదు.  ప్రస్తుతం, మీరు “నేను” అనుకునేదంతా ఈ నాలుగు అంశాలే - మీ శరీరం, మీ మనస్సు, మీ భావాలూ, వీటికి మూలమైన మీ జీవశక్తి. ఈ నాలుగు అంశాలనీ మీరు “నేను”గా భావిస్తున్నారు. ఏదైనా ఒక పెద్ద విషయం జరగాలంటే ఈ నాలుగూ కూడా  సమన్వయంలో ఉండేలాగా మీరు చూడాలి. యోగా అన్నది ఈ నాలుగు కోణాలనీ సంపూర్ణమైన సమన్వయంలో ఉంచడానికి రూపొందించబడింది. ఈ నాలుగు అంశాలూ - మీ శరీరం, మీ మనస్సు, మీ భావాలూ, మీ శక్తి అంటే - మీ బుర్ర, మీ హృదయం, మీ చేతులు, మీ శక్తి.  ఇక్కడ ఎవరైనా కేవలం బుర్ర మాత్రమే ఉండి మనసు, చేతులు, శక్తి లేనివారు ఉన్నారా..?  మీరు ఈ నాలుగింటి సమ్మేళనం. కదూ..?? అందుకని, నాలుగు ప్రాధమికమైన యోగాలూ మీకు అవసరం.

నాలుగు యోగ మార్గాలు

అసలు ఉన్నది నాలుగు యోగాలే. అవి జ్ఞానయోగం, భక్తియోగం, కర్మయోగం, క్రియాయోగం. జ్ఞానం అంటే, మీరు ముక్తి పొందేందుకు మీ బుద్ధిని ఉపయోగించడం. దీనిని జ్ఞానయోగం అంటాం. మీరు మీ భావాలను మీ పరమోన్నత స్వభావాన్ని చేరుకోవడానికి వాడితే, దానిని భక్తియోగం అంటాం. మీరు మీ శరీరాన్ని ఉపయోగించి, మీ ముక్తిని లేదా పరమోన్నత స్వభావాన్ని చేరుకోవాలనుకుంటే దానిని కర్మయోగం అంటాం. మీ అంతఃశక్తులను పరిణామం చెందించుకోవడం ద్వారా మీరు పరమోన్నత స్థితిని చేరుకోవాలీ అనుకుంటే దానిని క్రియా యోగం అంటాం. ఈ నాలుగు విధానాలు మాత్రమే ఉన్నాయి. కానీ  “నేను ఏది తీసుకోవాలి?” అన్నది మీ ప్రశ్న. అలాంటి ఎంపిక ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఈ నాలుగింటి సమ్మేళనం. మీరు ఈ నాలుగింటినీ కూడా సరైన పాళ్ళల్లో వినియోగించుకోవాలి. ఒకరికి, వారి తర్కం ఎంతో ప్రగాఢంగా ఉండవచ్చు. కొంతమందికి, శరీరం అలా ఉండవచ్చు. అందుకని, ఒక సరియైన కలయిక అవసరం. లేదంటే, ఆధ్యాత్మిక ప్రక్రియ జరగదు.

జ్ఞానయోగి తన బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈయనకి, మిగతావారంటే చిన్న చూపు.

యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది. ఒక రోజున నలుగురు మనుషులు అడవిలో నడుస్తున్నారు.  వారిలో ఒకరు జ్ఞానయోగి, ఒకరు భక్తియోగి, ఒకరు క్రియాయోగి మరొకరు కర్మయోగి.  సాధారణంగా, ఈ నలుగురూ కలిసికట్టుగా ఎప్పుడూ ఉండలేరు. ఒకరంటే ఒకరికి పడదు. జ్ఞానయోగి తన బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈయనకి, మిగతావారంటే చిన్న చూపు. ప్రతీవారినీ కూడా ఒక మూర్ఖులుగా భావిస్తారు. ముఖ్యంగా ఈ భక్తి కలిగినవాళ్లైతే, "పైకి చూసి  రామ్..రామ్.. అంటూ ఉంటారు" అని పరిహసిస్తారు. వాళ్ళని వీళ్ళు భరించలేరు. అవునా.. కాదా..?? భక్తిలో ఉన్న ప్రజలకి అందరిపై సానుభూతి. భగవంతుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చెయ్యి పట్టుకుని నడవక, ఈ జుట్టు పీక్కోవడం అంతా ఎందుకూ..? ఈ యోగా ఏంటి, తలమీద నించోవడం, మీ శ్వాసను బిగబట్టడం, శరీరాన్ని వంచడం..ఇదంతా కూడా చెత్త. కేవలం భగవంతుడి నామం ఉచ్ఛరిస్తే  చాలు, జరగాల్సింది అంతా జరుగుతుంది అనుకుంటారు. "వీళ్ళందరూ బద్ధకస్తులు, ఆ బద్ధకాన్ని కప్పిపుచ్చుకోవడానికె ఇలాంటి పిచ్చి యోగాలన్నీ చెప్తున్నారని" అనుకుంటాడు కర్మయోగి. క్రియాయోగికి ఎవరూ పట్టరు.

ఎందుకంటే వీరికి  జీవితం అంతా కూడా శక్తే. వీరు శక్తిని కనుక పరిణామం చెందించుకోకపోతే అసలు మార్గమేదీ అనుకుంటారు. అందుకని ఈ నలుగురూ కూడా ఒకరితో ఒకరు మనలేరు. కానీ ఈ రోజున వాళ్ళందరూ కలిసి నడుస్తున్నారు. ఉన్నట్లుండి ఒక పెద్ద గాలి వాన వచ్చింది. వాళ్ళు ఎక్కడైనా తలదాచుకోవడానికి ఒక నీడ దొరుకుతుందేమో అని చూస్తూ పరిగెత్తడం మొదలు పెట్టారు. భక్తియోగికి ఎక్కడ దేవాలయాలు ఉంటాయో తెలుసు.  అందుకని ఆయన, అడవిలో ఇటుగా వెళితే అక్కడ ఒక పురాతనమైన దేవాలయం ఉంది. అక్కడకు వెళ్దాం, కొంత నీడ దొరుకుతుందని అన్నారు. వాళ్ళందరూ కూడా అటువైపు పరుగెత్తారు. అక్కడ, ఒక ఆలయం కనిపించింది. ఆ ఆలయం కూలిపోయే స్థితిలో ఉంది. కేవలం, కొద్దిగా పై కప్పు మాత్రం ఉంది. నాలుగు స్తంభాలున్నాయి. అక్కడ గోడలు ఏమీ లేవు. అవన్నీ ఎప్పుడో కూలిపోయాయి.

అన్నిటికంటే ఇదే పెద్ద సమస్య. ఈ నాలుగు కోణాలూ ఒక సరియైన అనుసంధానంలో లేవు.
తుఫాను మరింత ఉధృతం అవ్వడంతో, వాన అన్ని దిక్కుల నుంచి లోపలికి కొట్టసాగింది. వాళ్ళందరూ మరింత దగ్గరగా, మరింత దగ్గరగా రాసాగారు. ఆ గుడి మధ్యలో ఒక శివ లింగం ఉంది. అక్కడ, తలదాచుకునేందుకు మారేచోటూ లేదు. అందుకని వాళ్ళందరూ కూడా ఆ శివలింగాన్ని హత్తుకున్నారు. ఇది భగవంతుడి మీద ప్రేమతోనో, మరొకదానివల్లో కాదు. కేవలం ఆ తుఫాను నుంచి తప్పించుకోవడానికి. ఉన్నఫళంగా భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు. వాళ్ళ నలుగురి మనసులలోనూ ఒకటే ప్రశ్న. "ఇప్పుడేమిటీ..?" మేము ఇంత యోగా చేశాం, ఇంత సాధన చేశాం. అప్పుడంతా నువ్వు రాలేదు. ఇప్పుడు కేవలం వాన నుంచి తల దాచుకోవాలని చూస్తుంటే, నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎందుకూ..?? అన్నారు. దానికి భగవంతుడు, “ఆఖరికి మీ నలుగురు మూర్ఖులూ ఒక్కటిగా చేరారు. నేను ఈ క్షణం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను” అని అన్నాడు. అన్నిటికంటే ఇదే పెద్ద సమస్య.

ఈ నాలుగు కోణాలూ ఒక సరియైన అనుసంధానంలో లేవు. అలా లేకపోతే చెప్పుకోదగ్గ పెద్ద విషయం ఏదీ జరుగదు. మీరు ఒక కార్ నడిపించాలని చూస్తున్నారనుకోండి, ఒక చక్రం ఒకవైపు మరొక చక్రం మరొకవైపు వెళ్తుంటే అది ఎంత నరకంగా ఉంటుంది..?? ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న నరకం ఇలాంటిదే. వాళ్ళ మనస్సు ఒకవైపు, వాళ్ళ హృదయం ఒకవైపు, వాళ్ళ శరీరం మరొకవైపు, వాళ్ళ శక్తులు ఇంకెక్కడో ఉన్నాయి. ఇప్పుడు, ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు ఎక్కడికి వెళ్లాలనుకున్నా సరే తేలికగా ఎలా వెళ్లగలుగుతారు? యోగ, మనం ఇక్కడ "ఇన్నర్ ఇంజనీరింగ్" గా సూచిస్తున్నది ఏమిటంటే ఈ నాలుగు చక్రాలను మీరు సజావుగా ప్రయాణించే విధంగా చేయడమే. ప్రస్తుతం, మీరు నరకం దిశగా ప్రయాణిస్తున్నా పరవాలేదు. మీ కారు కనుక సరిగ్గా వెళుతున్నట్లయితే వెంటనే మీరు ఒక U- టర్న్ చేయవచ్చు,  కదు? కానీ నాలుగు చక్రాలు నాలుగు వేర్వేరు దిశల్లో  వెళ్లాలనుకునే ఒక వాహనం మీకు చిత్రహింసే..మీరు ఎటు వైపని వెళ్ళగలరు? మీరు ఎటూ వెళ్లలేరు. మీరు కేవలం పరిస్థితులను బట్టి అటో ఇటో నెట్టి వెయబడతారు. మీ దిశను మీరు నిర్ణయించలేరు. మీరు నివసిస్తున్న పరిస్థితులు మీ దిశను నిర్ణయిస్తాయి. అంటే అది బానిస జీవితం, అవునా?

ప్రేమాశీస్సులతో,
సద్గురు