ప్రశ్న:  సద్గురూ, మా కోసం మీరు ప్రేమను నిర్వచిస్తారా?

సద్గురు:  ప్రేమ ఎన్నో రూపాల్లో అభివ్యక్తం అవుతుంది. చాలామందికి, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ లాంటిది. ఆవునా..? ప్రజలకి, ఎన్నో రకాల అవసరాలుంటాయి. శారీరికం, మానసికం, భావపరమైనవి, సామాజికం, ఆర్ధికపరమైనవి ఇలా ఎన్నో రకాల అవసరాలు. ఈ అవసరాలన్నీ నెరవేర్చుకోవడానికి “నిన్ను ప్రేమిస్తున్నాను” - అనేది ఒక మంచి మంత్రం. ఈ మంత్రం లేకపోతే, మీకు తలుపులు తెరుచుకోవు. సరే, ఇది ఒక స్థాయిలోని విషయం. కానీ, మౌలికంగా, మనం ప్రేమ అని దేనిని పిలుస్తున్నాము? మనిషి తన జీవితంలో ఏ మెట్టులో ఉన్నా సరే, అతను ఏమైనా సరే, అతను ఏమి సాధించినా సరే, ఎక్కడో ఏదో ఒక లేమి అన్నది ఉంది. అతను ఏ విధంగా ఉన్నా సరే, అది అతనికి సరిపోదు. ప్రస్తుతం ఉన్నదానికంటే మరొకదానిని, అతనిలో భాగంగా చేర్చుకుందామనుకుంటాడు. ఇది అతనిలో మరింత సంపూర్ణ అనుభవం కలగడం కోసం చేయాలనుకుంటాడు.

మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే పెద్ద ఆకాంక్షే ప్రేమ. మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే ఆకాంక్ష భావపరంగా వ్యక్తమైనప్పుడు, మనం దానినే ప్రేమ అని పిలుస్తున్నాం. ఒకవేళ మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే ఆకాంక్ష శారీరికంగా వ్యక్తమైతే, దానిని మనం లైంగికత అంటున్నాం. ఇది మానసికంగా వ్యక్తమైతే, దానిని మనం ఆశయం అనో, దురాశ అనో లేదా మరేదైనా అంటాం. ఈ కృషి అంతా కూడా, మరొకదానిని మీలో భాగంగా చేర్చుకోవడానికే. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే కాదో, అది కూడా మీరు అవ్వాలని మీ కోరిక. ఇటువంటి ఆకాంక్షే - ప్రేమ.

ఇప్పుడున్న జీవితం మీకు నిండుగా అనిపించడం లేదు. ఇప్పుడు ఉన్న దానికంటే మీరు జీవితాన్ని మరికొంచెం అనుభూతి చెందాలనుకుంటున్నారు.  మరొకరిని మీలో భాగం చేసుకోవాలన్న ఈ ఆకాంక్షే ప్రేమ.

ఇది అదే ఆకాంక్షకు, భావపరమైన అభివ్యక్తి. మానవుడు ఎల్లప్పుడూ దేనినో, తనలో భాగంగా ఇముడ్చుకోవాలని ఆకాంక్షిస్తూనే ఉన్నాడు. ఇది మీ చుట్టూరా ఉన్న చిన్న- చిన్న విషయాలను పొగుజేసుకోవడం దగ్గర నుంచి ఆధ్యాత్మికత వరకూ వర్తిస్తుంది. ఆకాంక్ష అదే, మరొక దానిని మీలో భాగంగా చేసుకోవాలని. ఈ ప్రాధమికమైన ఆకాంక్ష, ప్రస్తుతం మీరు అనుభూతి చెందుతున్న దానికంటే జీవితానుభూతిని మరింత పెంపొందించుకోవడానికి. ఇదే, మీ ఆకాంక్ష..కదూ..?? ఇప్పుడున్న జీవితం మీకు నిండుగా అనిపించడం లేదు. ఇప్పుడు ఉన్న దానికంటే మీరు జీవితాన్ని మరికొంచెం అనుభూతి చెందాలనుకుంటున్నారు. మరొకరిని మీలో భాగం చేసుకోవాలన్న ఈ ఆకాంక్షే ప్రేమ. భావపరంగా మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే, (ఏకత్వానికి) మీరు చివరిదాకా వెళ్ళినట్లే అనిపిస్తుంది. అటువంటి క్షణాలు ఎన్నో ఉంటాయి.

కానీ ఆ మరుక్షణమే మీరు అక్కడి నుంచి జారిపోతారు. మీరు దానిపట్ల ఎంత తీవ్రతతో ఉన్నా సరే, అది నిలవలేదు. మీరు దాని దగ్గర దాకా వెళ్తారు. కానీ, అది జారిపోతుంది. ఇది మీకు అన్నిటితో ఏకం అయిన అనుభూతి కలిగిస్తుంది. కానీ, మిమ్మల్ని అక్కడ స్థిరంగా ఉండనివ్వదు. ప్రేమ అనేది, అన్నింటితో ఏకత్వం పొందడానికి ఒక వాహనం లాంటిది. మీరు దేనికోసం అయితే కాంక్షిస్తున్నారో, అది ఏకత్వం. అక్కడికి చేరుకోవడానికి భావాలూ లేదా ప్రేమ అన్నది కేవలం ఒక రకమైన వాహనం. ఈ వాహనం మిమ్మల్ని ఒడ్డుదాకా తీసుకువెళ్తుంది కానీ అక్కడి నుంచి వెనుతిరిగి పోతుంది. ఇది మిమ్మల్ని ఆవలి ఒడ్డుకి చేర్చదు. ఎప్పటికీ చేర్చదు. అందుకని, ఈ ప్రక్రియలో మీరు చాలాసార్లు దెబ్బ తిన్న తరువాత, అప్పుడు మీరు అనుగ్రహానికి సంసిద్ధమవుతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay