ప్రశ్న: నిత్యం శాంభవీ అభ్యాసం ద్వారా, దాదాపు రోజూ ఈశా క్రియ అభ్యాసం ద్వారా నా శరీరంకాని, నా మనస్సు కాని నేను కాదన్న అనుభూతి పొందడం ప్రారంభించాను. నేను ఎల్లవేళలా నా శరీరం నుండి, మనస్సు నుండి ఈ దూరం అనుభూతి చెందడం ఎట్లా?

సద్గురు: ఈశా క్రియ సమయంలో మీరు “నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు” అన్నప్పుడు అది ఒక తత్త్వం కాని సిద్ధాంతం కాని కాదు. మీరు లోపల్లోపల మళ్లీ మళ్లీ చేసే నినాదం కాదు, ఒకరోజు అది వాస్తవంగా మారేది కాదు. ఇది మీరు మీ శ్వాసకు చేర్చే జ్ఞాపిక. “నేను శరీరం కాదు; నేను మనస్సు కాదు” అన్నదాన్ని మిమ్మల్ని మానసికంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నంగా ఉపయోగించకండి. మీరు మీ శ్వాసకొక అంశాన్ని చేరుస్తున్నారు. లేకపోతే మీరు మీ శ్వాసను గమనించలేరు. ఇప్పుడు మీరు కేవలం గాలి కదలక వల్ల కలిగిన ప్రకంపనలను చూడగలుగుతున్నారేకాని శ్వాసను కాదు.

మీరు గాలిని లోపలికి పీలుస్తున్నప్పుడు కేవలం ఉచ్ఛ్వాస మాత్రమే జరగడం లేదు – పాక్షికంగా గాలి విడవడం, నిశ్వాస కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాగే నిశ్వాసలో కూడా అదొక్కటే జరుగుతూ ఉండదు – ఉచ్ఛ్వాస కూడా పాక్షికంగా జరుగుతూనే ఉంటుంది. మీరు శ్వాస జరుగుతున్న పద్ధతిని జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఈ విషయాన్ని తెలుసుకోలేరు. అనేక విధాలుగా శారీరకంగా శ్వాసయే మీ ప్రాణాధారం. చాలామంది నిజంగా తమ శ్వాసను అనుభూతి చెందరు. వాయుమార్గపు కదలికల అనుభూతిని ఇచ్ఛాపూర్వకంగా పొందే వ్యక్తి అన్ని రకాల పరివర్తనలూ పొందుతానంటాడు, అది నిజమే. మీరేమిటి అన్నదానికి అన్నిటికంటే పై పొరే మీ అనుభూతులు. ఆ అనుభూతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు కూర్చున్నా, నిలుచున్నా మీరు దేన్ని తాకినప్పటికీ దాని స్పర్శ జ్ఞానం మీకుంటుంది. కాని మీ అనుభవంలోకి తేలికగా రాని చాలా ముఖ్యమైన, ఉదాత్తమైన అంశం శ్వాస.

శ్వాసను తీసివేసుకోవడం

శ్వాసను కూర్మనాడి అన్న అర్థంలో మనం వాడినప్పుడు అది కేవలం ఆక్సిజన్ తీసికొని కార్బన్‌డైఆక్సైడ్ వదలడం కాదు. మన శ్వాస అనే దాని ఫలితంగా అది జరుగుతుంది. గాలి లోపలికి రావడం, బయటికి వెళ్లడంతోపాటు శారీరక ప్రక్రియ జరగడానికి మరో స్థాయిలో వ్యవహారం జరగాలి. వైద్యశాస్త్రపరంగా మనిషి మరణించిన తర్వాతకూడా – గాలి కదలిక, గుండె కొట్టుకోవడం, మెదడు పనిచేయడం ఆగిపోయిన తర్వాత కూడా – కూర్మనాడి ఇంకా ఉందనే అర్థంలో అతను మరికొంతసేపు శ్వాసిస్తూ ఉంటాడు. ఆ ప్రక్రియ సాగుతూనే ఉంటుంది కాని గాలిని లోపలికి పీల్చుకోవడం, కార్బన్‌ డై ఆక్సైడ్‌ను బయటికి వదలడం మాత్రం అది చేయలేదు. ఇదెలా ఉంటుందంటే ఒక పాత సైఫన్ పనిచేస్తూనే ఉంటుంది, కాని ఎక్కడో ఒకచోట లీకేజీ ఉన్నందు వల్ల నీరు మాత్రం బయటికి రాదు. అదే విధంగా కూర్మనాడి పనిచేస్తూనే ఉంటుంది. కాని ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ మార్పిడి మాత్రం ఆగిపోతుంది.

ఉదాహరణకు స్టాక్ ఎక్స్చైంజ్  మూత బడిందనుకోండి – చాలామంది మొత్తం ఆర్థిక వ్యవస్థ పని అయిపోయిందనుకుంటారు, కాని మీ ఇంటి పక్క దుకాణంలో బ్రెడ్ మాత్రం దొరుకుతూనే ఉంటుంది. మీరు నగదు రూపంలో చెల్లించకపోవచ్చు, వస్తు మార్పిడి పద్ధతిలో చెల్లించవచ్చు, ఆర్థిక వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది, కాకపోతే దాని స్థాయిని కొలవడం సాధ్యం కాకపోవచ్చు. అదేవిధంగా మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయినప్పటికీ కూర్మనాడి ఇంకా పనిచేస్తూనే ఉండవచ్చు.

మీరు మీ శ్వాసకొక అంశాన్ని చేరుస్తున్నారు. లేకపోతే మీరు మీ శ్వాసను గమనించలేరు.

మనం శ్వాస స్పృహ గురించి మాట్లాడుతున్నాము - అంటే మీకూ మీ శరీరానికీ నడుమ ఉన్న సంబంధాన్ని గురించిన జ్ఞానం. మీ శ్వాసను తొలగిస్తే మీరు, మీ శరీరమూ విడిపోతారు. మీ శ్వాసతో పాటు ప్రయాణించడం మీకు ఈ కోణాన్ని అందిస్తుంది. మీరు మీ శరీరాన్ని మీ నుండి కొంచెం దూరంగా ఉంచితే మీరు మీ శరీరం కాదని మీరు అర్థం చేసుకుంటారు. మీరు వదులుగా ఉండే బట్టలు వేసుకున్నప్పుడు ఆ బట్టలు మీరు కాదని తెలుసుకుంటారు. కాని మీరు బిగుతుగా ఉండే బట్టలు వేసుకున్నప్పుడు కొంత సమయం తర్వాత అవి మీరో కాదో తెలుసుకోలేరు. మీరు చర్మాన్ని ‘మీరు’గా అనుభూతి చెందుతారు. మీ శరీరం మీద కొంత చర్మం మాయమైపోవచ్చు అయినా మీరు ‘మీరు’ గానే ఉంటారు. మీరింకా మీ శరీరపు లోపలి పొరల్లోకి వెళ్లి చూచినప్పటికీ మీరు ‘మీరు’ గానే ఉంటారు.

మీ శ్వాసకొక పరిమళం జోడించడం

‘నేను శరీరం కాదు – నేను మనస్సు కాదు’ అన్నదాన్ని ఒక నినాదంగా ఉపయోగించవద్దు – అది అలా పనిచేయదు. ఇది మీకు చెప్పడం ఎందుకంటే మీకు కూర్మనాడి లేదా శ్వాసను గురించిన స్పృహ కలిగించడానికి. నినాదాలు చేయడం వీథిలోని గుంపులతో వ్యవహరించే పద్ధతి. దానితో మీలోపల మీరేమీ చేయలేరు. నేను ఉత్తర భారతంలో కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు “సద్గురు మహారాజ్ కీ జై” అని నినాదం చేయాలని ప్రజలు అనుకోవడం సాధారణం. నేను వెంటనే వాళ్లను ఆపుతాను. “ముందు ఒక నినాదం వస్తుంది, తర్వాత ఒక జెండా, తర్వాత ఒక చిహ్నం, ఆ తర్వాత మీకు మీరే ఒక దేశం అవుతారు. ఆ తర్వాత మీకొక జాతీయ పక్షి వస్తుంది.” అని చెప్తాను.

‘నేను శరీరం కాదు – నేను మనస్సు కాదు’ అన్నది చాలా సూక్ష్మ రీతిలో జరగాలి. అప్పుడే శ్వాస మీ స్పృహలోకి వస్తుంది. ఈ ఆలోచనతో మీరు మీ శ్వాసకు ఒక పరిమళం జోడించగలుగుతారు. ఆ పరిమళం మీరు మీ శ్వాసను గమనించడంలో తోడ్పడుతుంది. గాలి ఎటు కదులుతూ ఉందో చూడడానికి సాంబ్రాణీ కడ్డీ వెలిగించినట్లు ఇది ఉపయోగపడుతుంది. గాలి చాలా మెల్లగా కదులుతున్నట్లయితే మీరు దాన్ని తెలుసుకోగలరు. ఇదీ అంతే.

ఈశా క్రియా ధ్యానం:

ప్రేమాశీసులతో,
సద్గురు