యోగా యొక్క 6 వ అంగాన్ని "ధ్యాన్" అనీ లేదా "ధ్యానం" అనీ పిలుస్తారు. అది మౌలికంగా మనిషి తనకున్న శారీరక, మానసిక వ్యవస్థల పరిమితులనూ, పరిధులనూ దాటే సాధన. బౌద్ధ బిక్షువుల ద్వారా చైనా నుండి భారతదేశానికి ఈ ధ్యానం వ్యాపించింది. చైనాలో దీనిని "చాన్"   అంటారు. ఆగ్నేయ ఆసియా దేశాలగుండా ప్రయాణించి ఈ ధ్యానం జపాను చేరుకుంది. అక్కడ అది "జెన్" గా రూపాంతరం చెందింది. ఈ జెన్ ఏ మతమూ, సిద్ధాంతమూ, ఉపదేశాల మీద ఆధారపడకుండా ప్రత్యక్షంగా అనుభూతి చెందగల అంతర్లోచనంగా రూపుదిద్దుకుంది.

జెన్ ఒక ఆధ్యాత్మిక మార్గం - దానికి ప్రామాణికమైన ఏ ధర్మ గ్రంధాలూ, పుస్తకాలూ, నియమ నిబంధనలూ, ఖచ్చితంగా పాటించవలసిన సాధనలూ విధులూ ఏవీ లేవు. అది అజ్ఞాత మార్గం. సుమారు 8 వేల సంవత్సరాల క్రిందట ఈ మార్గాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. అప్పటికి ఇంకా గౌతమ బుద్ధుడు అవతరించనే లేదు. తెలివైనవాడూ, మహా జ్ఞానీ అయిన జనక మహారాజు, జ్ఞానపిపాసతో తపించేవాడు. అతని రాజ్యంలోని ఆధ్యాత్మిక బోధకులు చెప్పినవన్నీ విన్నాడు. ఎవరూ అతనికి సహాయం చెయ్యలేకపోయారు. ఎందుకంటే ఈ బోధకుల పరిజ్ఞానం పుస్తకాలలోంచి వచ్చినది. అప్పటికి ఇంకా స్వానుభవం ద్వారా సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తిని అతను కలవలేదు.

అష్టావక్రుడు ఉపయోగించిన మార్గానికి సుమారుగా దగ్గరగా ఉన్నదే ఇప్పుడు జెన్ గా ప్రచారంలో ఉంది.

ఒకరోజు రాజుగారు వేటకి వెళ్ళారు. అడవిలోకి బాగా చొచ్చుకుపోయిన తర్వాత ఆయనకి ఒక యోగి కనిపించాడు. ఆయన ఆగాడు. ఒక చిన్న కుటీరం బయట అష్టావక్రుడనే యోగి కూర్చున్నాడు. అతను యోగుల్లో శ్రేష్ఠుడూ,అఖండ జ్ఞానసంపన్నుడూ అయినవాడు. జనకుడు అతనికి వందనం చెయ్యడానికి గుర్రాన్ని దిగబోయాడు. కాలు విదిలించి జీను మీంచి దిగబోయాడు. అప్పుడు అష్టావక్రుడి నోటనుండి "ఆగు!" అని వినిపించింది. అందుకని జనకుడు ఎలా ఉన్నవాడు అలాగే ఆగిపోయాడు. ఒక కాలు రికాబు మీదా రెండవ కాలు గాల్లో తేలుతూ. ఎవరికైనా సరే అది చాలా బాధాకరమైన భంగిమ. కానీ జనకుడు అష్టావక్రుని వంకే తన దృష్టి నిలుపుకుని బొమ్మలా అలానే ఉండిపోయాడు. గురువు శిష్యూణ్ణి ఎంత సేపు అలా ఉంచాడో మనకి తెలియదు కానీ అటువంటి అసౌకర్యమైన భంగిమలో ఉన్న జనకుడికి జ్ఞానోదయం అయింది. అష్టావక్రుడు ఉపయోగించిన మార్గానికి సుమారుగా దగ్గరగా ఉన్నదే ఇప్పుడు జెన్ గా ప్రచారంలో ఉంది.

ఒకప్పుడు అందరూ ఆరాదించే ఒక జెన్ గురువు ఉండేవాడు. అతనెవ్వరికీ ఏదీ బోధించేవాడు కాదు. అతనెప్పుడూ తన భుజం మీద ఒక పెద్ద బస్తా మోసుకుపోతుండేవాడు. అందులో చాలా వస్తువులు ఉండేవి, కొన్ని మిఠాయిలతో సహా. అతను తిరిగిన ప్రతీ పల్లె, పట్టణంలో పిల్లలు అతనిచుట్టూ చేరేవారు. పిల్లలకి మిఠాయిలు పంచిపెట్టి వెళిపోతుండే వాడు. ప్రజలందరూ ఏదైనా బోధించమని అడుగుతుండేవారు, కానీ అతను మాత్రం  నవ్వుకుంటూ తనమార్గాన తాను నడుచుకుంటూ పోతుండేవాడు.

యోగా లక్ష్యం ఏమిటి? ఇప్పుడు స్పృహతో ఆ బరువుని తలకెత్తుకొండి. మీకు అది అసలు బరువుగా అనిపించదు!

ఒకసారి జెన్ గురువుగా మంచి పేరు ప్రఖ్యాతులున్న మరొక వ్యక్తి  అతన్ని కలవడానికి వచ్చాడు. నిజానికి అతను ఈ సంచీ మోసుకుంటూ పోతున్న వ్యక్తి నిజంగా జెన్ అవునా కాదా అన్న సందేహం నివృత్తి చేసుకోవడానికి వెళ్ళాడు. అందుకని "జెన్ అంటే ఏమిటి?" అని అతన్ని అడిగాడు. వెంటనే ఆ వ్యక్తి బస్తాను పడేసి తీన్నగా నిటారుగా నిలబడ్డాడు. అపుడతను, "జెన్ లక్ష్యం ఏమిటి?" అని అడిగాడు. ఆ వ్యక్తి మళ్ళీ తన బస్తాని భుజానికి ఎత్తుకుని తన మార్గాన తాను పోయాడు.

యోగా కూడా సరిగ్గా ఇదే. ప్రతి ఆధ్యాత్మిక సాధన చెప్పేది కూడా ఇదే. మీరు యోగా స్థితిని గాని జెన్ గాని అందుకోవాలంటే, ప్రయాణంలో మీరు అన్ని త్యజించి, మీ బరువు వదిలించుకుని, స్వేఛ్ఛగా ఉండాలి, నిటారుగా నిలబడగలగాలి. అది చాలా ముఖ్యం. బరువుతో మీరు నిటారుగా నిలబడలేరు. యోగా లక్ష్యం ఏమిటి? ఇప్పుడు స్పృహతో ఆ బరువుని తలకెత్తుకొండి. మీకు అది అసలు బరువుగా అనిపించదు!

ప్రేమాశీస్సులతో,
సద్గురు

pixabay