భారతదేశంలో గంగా నదిని ఒక దేవతగా కొలుస్తారు, అతి పవిత్రమైన ఈ నది ఇప్పుడు అవిరైపోయే దశకు చేరుకుంది. గంగా నది మాత్రమే కాదు, దేశంలోని ఎన్నో నదులు ఇప్పటికే కనుమరుగైపోయాయి. వీటిని కాపాడుకోవలసిన అవసరం మనకు ఉంది.

భారతీయులకి గంగ కేవలం ఒక నది కాదు, అది చాలా విషయాల సమ్మేళనం. ఆ నదిని పవిత్రంగా భావించడానికి కారణం కొన్ని వేల సంవత్సరాలుగా అందులోని కొన్ని భాగాలని కొంతమంది మహానుభావులు పవిత్రం చేస్తూ రావడమే. మీరు దాన్ని అంగీకరించడానికి సుముఖులై ఉంటే, గంగ చాలా శక్తిమంతమైనది. నా ఆధ్యాత్మిక చింతన, అంతరాంతరాల అనుశీలన శాస్త్ర సమ్మతమైనవైనప్పటికీ, గంగా నది విషయంలో నేను తన్మయత్వంతో స్పందించకుండా ఉండలేను. దానికి కారణం గంగా నదికున్న సహజ లక్షణాలే. అది మాటల్లో చెప్పడానికి సాధ్యపడదు. అది గంగని ఒక జీవ చైతన్యశక్తిగా అనుభూతి చెంది తెలుసుకోవలసిందే. అంతే!

మన శరీరంలో 70 శాతానికి పైగా నీరే ఉంది. నీటి ప్రవాహాలను నిర్దిష్టమైన శక్తితో పెంపొందిస్తే, అవి ఉన్న ప్రదేశాలు మానవ చైతన్య స్పృహ మీద అమితమైన ప్రభావం కలిగి ఉంటాయి. అటువంటి ప్రభావం గంగానది ప్రవాహ ప్రారంభంలో ఖచితంగా ఉంది. కేవలం ఆ నదికీ దాని పరిసరాలకీ సమీపంలో ఉండడం వల్లే, ఏదో ఉన్నతమైన స్థితికి చేరుకున్న అనుభూతి కలగడంతో పాటు ఎంతో  శక్తిమంతంగా  అనిపిస్తుంది.

ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశం వచ్చినపుడు, వాళ్ళ ఓడలు తిరిగి వెనక్కి ఇంగ్లండు వెళ్ళేటపుడు వాళ్ళ నావికులు త్రాగడానికి గంగా జలాన్ని మాత్రమే పట్తుకుని వెళ్ళేవారట.

గంగా జలాలలకి రోగ నివారణ శక్తి ఉందని ప్రతీతి. ఆ విషయంలో చాలా అధ్యయనాలు కూడా జరిగాయి. ఈ విషయం మన ప్రాచీనులకి ఎప్పటి నుండో తెలుసు. ఉదాహరణకి, అక్బరు దేశంలో అనేక యుద్ధాలు చేస్తున్నపుడు, అతను త్రాగడానికి తనకోసం గంగా జలాన్ని మాత్రమే తీసుకుపోయేవాడట. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశం వచ్చినపుడు, వాళ్ళ ఓడలు తిరిగి వెనక్కి ఇంగ్లండు వెళ్ళేటపుడు వాళ్ళ నావికులు త్రాగడానికి గంగా జలాన్ని మాత్రమే పట్తుకుని వెళ్ళేవారట. ఎందుకంటే, ఈ నీరు రెండునెలల ప్రయాణంలో స్వచ్ఛంగా ఉండేది. ఆ స్వచ్ఛతకి కారణం ఆ నది నీటి అంతర్గత వ్యవస్థ, ఆ నీటిలో జీవించే కొన్ని జీవరాశులు, ఆ నీటిని ఎల్లవేళలా ఒక క్రమంలో శుద్ధిగా ఉంచడమే.

గత మూడు దశాబ్దాలుగా గంగ ఆవిర్భవించే గోముఖ తీర్థమూ, దాని దాటి తపోవనం, శివలింగ పర్వతం మొదలైనవి ఎన్నోసార్లు కాలినడకన ఎక్కాను. ఒకసారి మీరు ఆ ఉన్నతమైన పరిసరాలు చేరుకున్నాక, మీరు 3 రోజుల పాటు ఏ ఆహారం తీసుకోకపోయినా, ఆ నది నీరు మీరు త్రాగితే చాలు మీరు ఆ మహా పర్వతాలు ఎక్కడానికి తగిన శక్తి వస్తుంది. మీ శరీరం ఏమాత్రం నీరస పడకుండా మీరు ముందుకి నడవగలుగుతారు. ఇది నేను అనేక సార్లు అనుభూతి చెందాను. చాలామంది అటువంటి అనుభూతి చెందినట్టు చెప్పారు.

ఇప్పుడు చాలా మంది శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. కొందరు నీటికి జ్ఞాపకశక్తి ఉందని ప్రకటించారు. నీరు అది స్పృశించిన ప్రతి వస్తువునూ గుర్తు పెట్టుకోగలదట. మన భారతీయ సంస్కృతిలో ఈ నమ్మకం ఎప్పటి నుండో ఉంది. అందుకనే సంప్రదాయ కుటుంబాల్లో, రాగి పాత్ర ఉంచుకుంటారు, దానిని ప్రతి రోజూ శుభ్ర పరుస్తారు, దానికి పూజ చేస్తారు, ఆ తర్వాతే దానిలో తాగడానికి నీరు పట్టి ఉంచుతారు. దేవాలయాల్లో మీకు తీర్థం ఇస్తారు. దానికోసం కోట్లకు పడగెత్తిన వారు కూడా చెయ్యి చాచుతారు.  కారణం అటువంటి నీరు మీకు కొందామన్నా ఎక్కడా బయట దొరకదు.  ఆ నీటికి భగవంతుని గుర్తుంచుకోగల శక్తి ఉంది.

జీవనదులు అన్నీ కేవలం కొన్ని ఋతువులలో మాత్రమే ప్రవహించే నదులుగా మారిపోతున్నాయి.

మనుషులు గంగా జలాన్ని తమతో ఉంచుకోడంలో గల ఆంతర్యం ఇదే. గంగానది పవిత్రమైన నేల మీద ప్రవహిస్తుంది. అది పారినంతమేరా ఆ ప్రదేశాల్ని పవిత్రం చేస్తుంది. కనుకనే ఆ నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చనిపోతున్నప్పుడు, వాళ్ళు అంత గొప్ప ఆధ్యాత్మిక జీవనం గడిపి ఉండకపోయినా కానీ వాళ్ళ అవసాన కాలంలో ఇందులోంచి రెండు చుక్కలు వాళ్ళ గొంతులో పోస్తే, ఆ శరీరంలో ఒక్కసారిగా జ్ఞాపకశక్తి విస్ఫోటనం చెందుతుంది. ఒక వ్యక్తి చనిపోతున్నపుడు అతనికి ఈ శరీరంతో ఉన్న సంబంధం అంటీ ముట్టనట్టు ఉంటుంది. మీరు ఈ నీరు అతని నోట్లో పోస్తే, ఆ వ్యక్తికి తనేమిటో ఒక్కసారిగా అవగతమౌతుంది. లేకపోతే, అతను చనిపోతున్నపుడు కూడా, బ్రతికున్నపుడు ఏ వస్తువుల కోసం ప్రాకులాడేడో వాటికోసమే ఆ సమయంలొ ప్రాకులాడుతుంటాడు.

దురదృష్టవశాట్టూ ఈ భూమి మీద ప్రమాదంలో ఉన్న నదులలో గంగానది ఒకటిగా చేరిపోయింది. గత కొద్ది సంవత్సరాల్లో గంగానది బాగా కృశించిపోయింది. ఇది కేవలం గంగానదికే పరిమితం కాదు. దేశంలో అన్ని నదులదీ అదే పరిస్థితి. జీవనదులు అన్నీ కేవలం కొన్ని ఋతువులలో మాత్రమే ప్రవహించే నదులుగా మారిపోతున్నాయి. చిన్న చిన్న నదులూ, సెలయేళ్ళూ ఏనాడో అంతరించిపోయాయి. ఇప్పటి కావేరీ నది 50 ఏళ్ళ క్రిందటి కావేరీ నదిలో 40 శాతం ఉండవచ్చునేమో. కృష్ణానది సంవత్సరంలో కొన్ని నెలల పాటు సముద్రం దాకా ప్రవహించనే ప్రవహించదు.  క్రిందటి మాటు ఉజ్జయినిలో జరిగిన కుంభమేళాలో నర్మదా నది నుండి నీరు తోడి క్షిప్రా నదిలోకి పంపిణీ చెయ్యవలసి వచ్చింది. ఎందుకంటే క్షిప్రానది అంతగా ఎండిపోయింది.

ఈ నదులూ, ఈ నేలా మనల్ని ఎన్నో వేల సంవత్సరాలుగా పెంచిపోషించాయి. కానీ, కేవలం రెండు తరాల వ్యవధిలో  వాటిని మనం ఎడారులుగా మార్చేస్తున్నాం. కొన్ని దశాబ్దాల కాలంలోనే మన నదులు క్షీణదశకు చేరుకున్నాయి. మన జీవిత కాలంలో నదులు క్షీణించిపోతున్నా మనం పట్టనట్టు ఉన్నామంటే, మనం ఈ నేలమీద పుట్టబోయే భావితరాల భవిష్యత్తుపై ఏమాత్రం శ్రద్ధ లేనివారమని చెప్పకనే చెబుతున్నట్టు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు 

pixabay