ఓజస్సు అంటే ఏంటి? దానివల్ల కలిగే ఉపయోగాలెటువంటివి..

మీ భౌతిక దేహం నడవాలంటే మూడు ప్రక్రియలు జరుగుతూ ఉండాలి. ఒకటి ఉచ్ఛ్వాస-నిశ్వాసలు, రెండోది ఆహారాన్ని తీసుకోవడం, మూడవది విసర్జించడం. ఈ మూడు ప్రక్రియలూ జరుగుతున్నంత కాలం మీ మనుగడ కొనసాగుతుంది. ఇవి మీ భౌతిక దేహాన్ని నడిపించడానికి ఎంతో ముఖ్యమైనవి. ఈ మూడు విషయాలూ కూడా ఒక రకమైన భౌతిక పదార్థాన్ని మరొక దానిగా మారుస్తూ ఉంటాయి. ఉదాహరణకు వ్యవసాయం అంటే మట్టిని ఆహారంగా మార్చడం..! జీర్ణప్రక్రియ అంటే  ఆహారాన్ని రక్త-మాంసాలుగా మార్చడం. ఇవన్నీ కూడా, వివిధ ప్రక్రియలు. వీటి ద్వారా,  మీరు ఒకరకమైన భౌతిక పదార్థాన్ని మరొక దానిగా మారుస్తున్నారు.

ఒక రూపంలో ఉంటూనే పరాన్ని రుచిచూడాలని మీ కోరిక. దానివైపుగా వెళ్ళడం కోసం మీకు సరైన వాహనం లేదు.

మీరిప్పుడు ఒక కేరెట్ తిన్నారనుకోండి, అది సాయంత్రానికి ఒక మనిషిలా మారిపోతోంది. ఇదే మీరు పరిణామక్రమం ప్రకారం వెళ్లాలి అంటే  దానికి ఒక కోటి సంవత్సరాలు పడుతుంది. కానీ, ఒకరోజులో మీరు దీనిని చేస్తున్నారు. అదేమీ చిన్న విషయం కాదు కదా..? దీని ప్రాముఖ్యత అర్థం చేసుకోకుండా, దీని ఇంద్రజాలం తెలుసుకోకుండా.. మీరు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. శ్వాస తీసుకోవడం, ఆహారాన్ని తీసుకోవడం, మల-మూత్ర విసర్జన అనేవన్నీ కూడా, మీ స్వీయ సంరక్షణకి సంబంధించినవి. స్వీయ సంరక్షణ మెరుగ్గా జరిగితే, అప్పుడు ఆ తరువాతది -  పునరుత్పత్తి..! పునరుత్పత్తి కూడా ఒక విధంగా చూస్తే ఆత్మ సంరక్షణ వంటిదే..! ఎందుకంటే  ఇది కేవలం, తన జాతిని సంరక్షించుకోవడం వంటిది. అందుకని మనం దీన్ని కూడా ఆత్మసంరక్షణ క్రిందే చెప్పవచ్చు.

మీ స్వభావంలో మరో అంశం ఒకటుంది. ఇది భౌతికతకు సంబంధించినది కాదు. మీలోని ఈ స్వభావం ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉండాలి అని కాంక్షిస్తుంది. మరేదో అవ్వాలి అని. ఇది, అనంతమైపోవాలి అని అనుకుంటుంది. భౌతికత అన్నది రెండు సరిహద్దుల మధ్య ఉండవలసినదే..అవి చిన్నవైనా, పెద్దవైనా. అభౌతికమైనదానికి పరిమితులూ, సరిహద్దులూ ఉండవు. అందుకని మీరు భౌతికమైనదాని(ఇహం) నుంచి అభౌతికమైనదానికి(పరానికి) వెళ్ళడం అంటే  పరిమితమైనదాని నుంచి అనంతమైన దానివైపుగా నడవడమే. ఒక రూపంలో ఉంటూనే పరాన్ని రుచిచూడాలని మీ కోరిక. దానివైపుగా వెళ్ళడం కోసం మీకు సరైన వాహనం లేదు.

running-in-a-circleఓజస్ అనేది మరొక కోణం. దీని ద్వారా మీరు అభౌతికమైన శక్తిని సృజించుకోవచ్చు. కానీ దానికి దాని వ్యక్తిగతమైన ఒక రూపం ఉంటుంది. దీనిని మీరొక వాహనంలాగా వాడవచ్చు. మీరు మీ చుట్టూరా తగినంత ఓజస్సును గనక సృష్టించుకో గలిగితే ఈ సృష్టిలోని మీ మనుగడ ఎంతో సజావుగా సాగిపోతుంది. మీ జీవితం  అసలు శ్రమ లేకుండా గడచి పోతుంది. మీ చుట్టూరా ఎంత గందరగోళం జరుగుతున్నా సరే,, మీకు మీ మార్గం ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. మీ చుట్టూరా ఉన్నవారు.. మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు.. అని అనుకోవచ్చు. కానీ, మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ ఎటువంటి ఇబ్బందీ లేదు.. అన్న విషయం తెలుస్తూనే ఉంటుంది.

మీ చుటూరా ఉన్నవారందరూ మిమ్మల్ని మానవాతీతం అనుకొనే విధంగా మీరు జీవించవచ్చు. ఎందుకంటే మీ చుట్టూరా ఎంతో వృత్తాకారమైన ఓజస్ ని మీరు కలిగి ఉన్నారు కాబట్టి..! తూర్పు దేశాల్లో జ్ఞానోదయం పొందిన వారిని ఎంచి అని అంటారు. ఎంచి అంటే ఒక వృత్తం. ఎంచి అని ఎందుకు అంటున్నారూ అంటే.. ఈ రకమైన రూపానికి అసలు ఎటువంటి ఘర్షణ ఉండదు. మీ కార్ చక్రాలూ లేదా మీ మోటార్ సైకిలు చక్రాలూ వృత్తాలుగా ఉంటాయి. అంతేగానీ.. త్రికోణాకారంగానూ.. చతురస్రాలుగానూ ఉండవు. ఒకవేళ మీ కార్ చక్రాలు గనుక చతురస్రాలుగా ఉంటే,, మీకు నడపడం ఎంత కష్టమై ఉండేది..! అందుకే అవి వృత్తాకారంగా ఉంటాయి. దీనిలో; ఎటువంటి  ఘర్షణ  ఉండదు. ఏదైతే, అలా ముందుకి సాగిపోగలదో, అది వృత్తాకారంగా ఉంటుంది. మీ చుట్టూరా మీరు గనుక తగినంత ఓజస్ ను సృష్టించుకోగలిగితే, మీరు కూడా అలా వృత్తంలా మారిపోతారు. శరీర ఆకారంలో వృత్తం కాదు.. మీ ఉనికిలో మీరు వృత్తంగా మారిపోతారు. అప్పుడు; మీ మార్గంలో ఎటువంటి ఘర్షణలూ ఉండవు. ఓజస్ మీకు ఇటువంటి ఆవశ్యకతను కలిగిస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు