శబ్దం ఒక నిర్దిష్ట వాస్తవం. కాని పదాలు అసత్యం అని వివరిస్తున్నారు సద్గురు. నిశ్శబ్ద మౌనంలోకి కరిగిపోయే ప్రక్రియకు ఉదాహరణగా ఆయన మత్స్యేంద్రనాథ్, గోరఖ్‌నాథుల జీవితాల నుండి ఒక కథను వినిపిస్తున్నారు.

పంచేంద్రియాలతో చూసే, వినే, వాసన గుర్తించే, రుచి చూసే, స్పృశించే సృష్టి అంతా ప్రతిధ్వనులు సృష్టించేది, శభ్దం ఆడే నాటకం. మనిషి మనశ్శరీరాలు కూడా ప్రతిధ్వనులే. కాని మనశ్శరీరాలు వాటికవే అంతిమ లక్ష్యాలు కావు – అవి పై పై మెరుగులే. చాలామంది ఆ తోలు దాటిపోరు, వాళ్ల జీవితమంతా ద్వారం వెలుపలే కూర్చుని గడుపుతారు. కాని ద్వారం ప్రయోజనమేమిటి? లోపలికి ప్రవేశించడం. ఈ ద్వారానికి ఆవల ఉన్న దాన్ని అనుభూతి చెందడానికి మౌనం అవసరం.

సంస్కృతంలో మౌనం, నిశ్శబ్దం అన్నవి రెండు ముఖ్యమైన పదాలు. మౌనం అన్నది మాట్లాడకపోవడం; అది నిశ్శబ్దాన్ని సృష్టించే ఒక ప్రయత్నం. నిశ్శబ్దం అంటే శబ్ద రాహిత్యం లేదా శబ్దానికి అతీతమైనది. ఏదైతే శబ్దానికి అతీతమైనదో అది రూపానికీ, పంచభూతాల క్రీడకు అతీతమైనది. శబ్దానికి అతీతమై ఉన్నది ఈ సృష్టి మూలానికి చేరే చివరి తోవ. నిశ్శబ్దం, నిర్వాణం, నిర్వికల్పం – ఒక విధంగా చూస్తే వీటన్నిటికీ అర్థమొక్కటే. నిశ్శబ్దమంటే శబ్దరాహిత్యం. నిర్వాణం అంటే రూప రాహిత్యం. నిర్వికల్పం అంటే ‘కల్పం లేనిది’ అంటే సృష్టికి ఆవల అని అర్ధం - అది రూపం, శబ్దం రెండూ లేనిది.

నిర్వికల్పం అంటే ‘కల్పం లేనిది’ అంటే సృష్టికి ఆవల అని అర్ధం - అది రూపం, శబ్దం రెండూ లేనిది.

మత్స్యేంద్రనాథ్, గోరఖ్‌నాథుల కథ ఒకటి ఉంది. మహాయోగి అయిన మత్స్యేంద్రనాథుని అందరూ శివుడి అవతారంగా భావిస్తారు. అంటే శివుడు మళ్లీ జన్మించాడన్న భావన కాదు. ఆయన్ని మనం  అవతారం అని ఎందుకంటామంటే జ్ఞానంలోను, సామర్థ్యంలోను ఆయన శివుని కంటే భిన్నం కాదు అని. అయినా మనకు శివుడి మీద ఆసక్తి వ్యక్తిగా కాదు గదా, ఆయనకున్న లక్షణాల వల్ల. మత్స్యేంద్రనాథుడు లక్షణాలలో శివునికి చాలా దగ్గర. అందువల్ల ప్రజలు ఆయన్ను శివుడే అన్నారు. గోరఖ్‌నాథుడు ఆయనకు ప్రియశిష్యుడు, తరువాత తానే ఒక పురాణ పురుషుడయ్యాడు. దేశంలో అత్యంత ప్రసిద్ధుడైన యోగి అయ్యాడు. ఉపఖండంలో గోరఖ్‌నాథుడు అద్భుతమైన కృషి చేశాడు. భారతదేశంలో ఆయనను గురించి విననివారు ఉండరు.

మత్స్యేంద్రనాథుడు గోరఖ్‌నాథునితో కలిసి నడిచి వెళుతున్నాడు. వాళ్లు అప్పుడే చిన్నవాగు దాటారు. మత్స్యేంద్రనాథుడు ఒక చెట్టు కింద కూర్చుని, “కాసిని నీళ్లు తీసుకురా” అని చెప్పాడు. గోరఖ్‌నాథుడు నీళ్ల కోసం పరిగెత్తాడు. గోరఖ్‌నాథుడు గురువు నీళ్లడిగారంటే అది క్షణంలో చేసేయాలనుకుంటాడు; అందువల్ల అతను పరిగెత్తాడు. అప్పుడే కొన్ని బండ్లు ఆ వాగును దాటాయి. నీళ్లు మురికయ్యాయి. అప్పుడతను మళ్లీ గురువు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు, “అక్కడ నీళ్లు మురికిగా ఉన్నాయి, పది నిమిషాల దూరంలో నది ఉంది, నేనక్కడికి వెళ్లి నీళ్లు తెస్తాను” అన్నాడు. “వద్దు. అదే వాగులో అదే చోటినుండి తీసుకురా” అన్నాడు మత్స్యేంద్రనాథుడు. “కాని అవి మురిగ్గా ఉన్నాయి.” “నాకు దాహంగా ఉంది. అదే వాగులో అక్కడి నుండి నీళ్లు తీసుకురా” అన్నాడు మత్స్యేంద్రనాథుడు.

వాస్తవానికి శబ్దం మీ మనస్సులో ఉంది. ఏ శబ్దం అవుతున్నా మీరు నిద్రపోతూ ఉంటే, అది మిమ్మల్నేమీ చేయదు. 

గోరఖ్నాథుడు మళ్లీ వాగుకు పరుగెత్తాడు. ఇంకా నీళ్లు చాలా మురికిగానే ఉన్నాయి. ఏం చేయాలో అతనికి తెలియలేదు. మళ్లీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. మత్స్యేంద్రనాథుడు మళ్లీ చెప్పాడు, “నాకు ఆ వాగు నీళ్లే కావాలి.” ఏం చేయాలో తెలియక అతను మళ్లీ వెనక్కి పరిగెత్తాడు. అప్పుడు నీళ్లు కొంచెం తేరుకోవడం చూశాడు. కొంచెం సేపు ఎదురు చూశాడు. ఐదు, పది నిమిషాల్లో నీళ్లు పూర్తిగా తేరుకొని స్వచ్ఛంగా తయారయ్యాయి. మహాసంతోషంతో నీళ్లు తీసికొని ఎగురుకుంటూ వచ్చాడు. గురువుగారికిచ్చాడు. మత్స్యేంద్రనాథుడు నీళ్లు పక్కన పెట్టాడు, తాగలేదు. అతనికి దప్పిక లేదు. గోరఖ్‌నాథుడు ఎలాంటి వాడంటే ఒక మంత్రాన్ని పదిసార్లు జపించమంటే పదివేలసార్లు జపిస్తాడు. ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉంటాడు. అతనికి ఎం చెప్పినా ఎంతో ఉత్సాహంతో చేస్తాడు. ఎంతో చక్కగా చేస్తాడు. కాని ఇప్పుడతను మరో స్థాయికి వెళ్లవలసిన సమయం వచ్చింది. అందువల్ల మత్స్యేంద్రనాథుడొక సందేశం ఇచ్చాడు, “నువ్వు చాలా పరిగెత్తావు, తీవ్రంగా పనిచేశావు, ఇప్పుడు సమయం వచ్చింది. కేవలం ఎదురుచూడు. అది స్ఫటికంలా స్వచ్ఛమవుతుంది.”

వాస్తవానికి శబ్దం మీ మనస్సులో ఉంది. ఏ శబ్దం అవుతున్నా మీరు నిద్రపోతూ ఉంటే, అది మిమ్మల్నేమీ చేయదు. మీకేమైనా నిద్ర సమస్య ఉంటే తప్ప..! మీరు గాఢనిద్రలో ఉంటే శబ్దంతో ఎటువంటి సమస్యా ఉండదు. మీరు ఉత్పత్తి చేసే శబ్దాలే మీ కలుషిత బుద్ధికీ కారణం. ఈ శబ్దాలు పదాల రూపం తీసుకుంటాయి, ఆ అర్థంలేని మాటలకు మీరు అర్థం కల్పిస్తారు. కాని నేనేం చెప్తానంటే కేవలం ఎదురుచూడండి. అది మళ్లీ స్ఫటికంలా స్వచ్ఛమవుతుంది. అన్ని శబ్దాలు సన్నగిల్లిపోతే, మీరు పదాలకు అర్థాలు ఆపాదించడం మానివేస్తే, అన్నీ సమసిపోతాయి. అప్పుడంతా స్ఫటికంలా స్వచ్ఛమవుతుంది, నిశ్శబ్దమవుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు