మీలోని స్వర్గ నరకాల్ని మీరు ధ్వంసం చేస్తే తప్ప సత్యం వైపు ప్రయాణించలేరని సద్గురు అంటున్నారు. దీన్ని కొడిగుడ్డు పగలడంతో ఆయన పోలుస్తారు – అది పగిలినప్పుడు మీరు లోపలికి వెళ్లరు, కాని పూర్తిగా కొత్తదొకటి బయటికి వస్తుంది.

Sadhguruమానవ సమాజాలపై నియంత్రణ సంపాదించడానికి ప్రపంచ వ్యాప్తంగా స్వర్గనరకాల వ్యాపారం జరుగుతూ ఉంది. ఒక వ్యక్తిని కాని, సమూహాన్ని కాని ఎలా నియంత్రించాలో తెలియనప్పుడు “నేను మిమ్మల్నిక్కడ శిక్షించలేకపోతే, అక్కడ పట్టుకుంటాం. మీరిక్కడ చూపించే మంచితనానికి ఇక్కడ బహుమానం ఇవ్వలేకపోతే అక్కడ ఇస్తాం” వంటి ఉపాయాలతో వస్తారు.

మనం ‘అసతోమా సద్గమయ’ అన్నప్పుడు అసత్యం నుండి సత్యానికి ప్రయాణమని అర్థం. ఇది నిజంగా ప్రయాణం కాదు. ‘ప్రయాణం’ అంటే మనం నడవవలసిన దూరం ఉందని అర్థం. ఇక్కడ అటువంటి దూరమేమీ లేదు. తెలుసుకోవడం అనేది దూరంగా ఎక్కడో లేదు, ఎందుకంటే మీరు తెలుసుకోవలసింది ఎక్కడో కొండమీద లేదు. అది మీలోనే ఉంది.

స్వర్గనరకాలు మీలోనే ఉన్నాయి

యోగా ముందు దాడిచేసేది స్వర్గ నరకాల మీదే. మనిషి మెదడులో స్వర్గ నరకాలున్నంత కాలమూ అంతరంగానికి సంబంధించిన సాంకేతికత, వ్యక్తి విముక్తి దిశగా నడిచే ప్రక్రియలు అర్థరహితమవుతాయి, ఎందుకంటే మిగిలేది మనం వెళ్లడానికి రెండు స్థలాలే – అయితే చెడ్డ స్థలమో, కాకపోతే మంచి స్థలమో. మీరు మంచి చోటుకు టికెట్టు కొనుక్కుంటే మీరెలా జీవిస్తున్నారన్న విషయం గురించి మీరు పట్టించుకోనవసరం లేదు. మానవులు ఎంత ఘోరంగా జీవించాలో అంత ఘోరంగానూ జీవించారు, ముఖ్యంగా ఇది మతం తోడ్పాటుతో. అసలు మీరేం చేస్తే ఏమిటి, మీరిది నమ్మండి చాలు, ఇది, ఇది, ఇది. స్వర్గానికి మీ టికెట్టు ఇదిగో అని మతం చెప్పడం వల్లే.

ప్రస్తుతం మీలో పనిచేస్తున్న ఈ స్వర్గ నరకాలను మీరు ధ్వంసం చేయకపోతే నిజంగా సత్యం వైపు ఎటువంటి ప్రయాణమూ ఉండదు. మీ మన:శ్శరీరాలు మీలోనే స్వర్గాన్నో, నరకాన్నో సృష్టిస్తూ ఉంటాయి, అవి రెండింటినీ సృష్టించగలవు. మీరెక్కడన్నా ఉండండి, అవి మాత్రం స్వర్గాన్నో, నరకాన్నో సృష్టిస్తూనే ఉంటాయి.

మీ మనస్సు విచక్షణా జ్ఞానం ఎంతో గొప్పది. మీరు నరకాన్ని సృష్టించినప్పుడు, అదీ మరీ బాధాకరమైనప్పుడు, మీరు దాన్ని కొంచెం వెనక్కు తిప్పుతారు. అట్లాగే అది స్వర్గాన్ని సృష్టించినప్పుడు అది మరీ సుఖదాయకమై మీరు వాస్తవంతో సంబంధాన్ని కోల్పోయినప్పుడు ఆ వాస్తవం మిమ్మల్ని పడగొడితే అప్పుడు కూడా మీరు దాన్ని కాస్త వెనక్కు తిప్పుతారు. కాని మీరు శరీరాన్ని కోల్పోయినప్పుడు మీరు విచక్షణా సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు. అప్పుడు స్వర్గాన్ని సృష్టించే ప్రక్రియలో ఉన్న మనస్సు దాన్ని సృష్టిస్తూ పోతుంది, కొన్ని లక్షల రెట్ల ఆనందాన్ని సృష్టిస్తుంది. అట్లాగే నరకాన్ని సృష్టిస్తున్న మనస్సు నరకాన్నే సృష్టిస్తూ వెళ్లి లక్షల రెట్ల దుఃఖాన్ని సృష్టిస్తుంది, ఎందుకంటే మీ విచక్షణ, - అధికమైందనుకున్నప్పుడు వెనక్కు తిప్పే సామర్థ్యం ఇక అక్కడ ఉండదు కాబట్టి.

ఒక సంపూర్ణ స్థాయి స్వర్గాన్నో, నరకాన్నో నిర్మించగలిగిన సామగ్రి ఎప్పుడూ మీ చుట్టూ వేలాడుతూనే ఉంటుంది. మీ శక్తులు పనిచేసే తీరులోనే అది ఉంటుంది. మీ విచక్షణ ప్రకారం మీరు నడచుకున్నట్లయితే మీ తీర్పు ఇలా ఉంటుంది, “నరకాన్ని నాశనం చేస్తాను, స్వర్గాన్ని ఉంచుకుంటాను.” కాని అలా ఎన్నటికీ జరగదు, ఎందుకంటే వాటి నిర్మాణ సామగ్రి ఒక్కటే: అవే గదులు. కొందరికవి ఆనందపు గదులు, మరికొందరికి చిత్రహింసాశాలలు. అవి ఏ క్షణంలోనైనా ఇటుదటు, అటుదిటు కావచ్చు. అదొక విద్యుద్దీపపు మీట వంటిది. మీకు రెండు రంగుల దీపాలు ఒకటి తెలుపు, మరొకటి నీలం ఉన్నట్లయితే మీరు నీలపు రంగు దీపాలు వెలిగిస్తే ఒకరకమైన అనుభూతి కలుగుతుంది. తర్వాత మీరు తెల్లరంగు దీపాలు వెలిగిస్తే వేరే చోట ఉన్న అనుభూతి కలుగుతుంది. కాని చీకట్లో మీరు దీపపు మీట వేయడానికి తడుముకుంటూ వెళితే తెల్ల దీపం బదులు నీలపు దీపమూ, నీలపు దీపం బదులు తెల్లదీపమూ వెలిగించవచ్చు.

దీపాలు ఆర్పండి

ఎవరూ నరకాన్ని నాశనం చేసి స్వర్గాన్ని మాత్రమే ఉంచుకోలేరు. కాని మీరెల్లప్పుడూ ఆనందంగా ఉండవచ్చు, ఇది నరకం సంభవిస్తుందన్న భయం మీ మనస్సులో ఉండడం వల్ల కాదు, మీ విచక్షణ ప్రక్రియను శక్తిమంతం చేసుకోవడం ద్వారా, నరకం తన ద్వారాలు ఎప్పటికీ తెరవకుండా మీరు చూసుకోవచ్చు ఎందుకంటే మీరు దానిపట్ల ఎరుకతో ఉంటారు కనుక. జాగరూకత ఉండే ఈ సామర్థ్యం ఒక స్థాయివరకే. కాని మీరు స్వర్గాన్ని కాని, నరకాన్ని కాని నిర్మించే సామగ్రినంతటినీ తీసివేశారనుకోండి, అప్పుడు మీరు చీకట్లో ఉంటారు. తెల్ల దీపంకాని, నీలపు దీపంకాని ఉండే అవకాశం ఉండదు. కాంతి ఉన్నా లేకపోయినా తేడా లేని దిశకు మీరు తిరుగుతారు. కళ్లు తెరచి ఎక్కడికైనా వెళ్లాలనుకొనేవారికి వెలుగు అవసరం. కళ్లు మూసుకొని ఎక్కడో ఉండేవారికి వెలుగుతో ఏం పని? అతనికి వెలుగు ఇబ్బందికరం.

పెంకు పగలగొట్టడం

అందువల్ల అసత్యం నుండి సత్యానికి ప్రయాణించడం అంటే భౌగోళికమైన దూరాన్ని దాటడం కాదు. ఇదొక కోడిగుడ్డు పై పెంకు లాంటిది – ఇప్పుడు మీరు పెంకుకు వెలుపల ఉన్నారు. కాని మీరు లోపలికి పోవాలనుకుంటే గుడ్డుపై టక్, టక్, టక్ కొడతారు. గుడ్డు పగిలినప్పుడు లోపలికి వెళ్లవచ్చు ననుకుంటారు, కాని, కోడిప్లిలలు బయటికి వస్తాయి – అదీ జరిగేది. లోపలికి వెళ్లాలనుకొని మీరిక్కడ కూర్చున్నారు. మీరు దాన్ని పగలగొట్టినప్పుడు ఎవ్వరూ లోపలికి వెళ్లరు. కాని పూర్తిగా కొత్త సంభావ్యత బయటికి వస్తుంది. అందుకే యోగాలో సహస్రార చక్రం ప్రతీకను వాడతారు. వేయి రేకుల పుష్పం బయటికి వస్తుంది. మీరు పెంకును పగలగొట్టినప్పుడు మీరెన్నడూ సంభావ్యమని ఊహించనిదేదో బయటికి వస్తుంది.

మీరీ పెంకును పగలగొట్టదలచుకుంటే మీ అంతట మీరా పని చేయలేరు, ఎందుకంటే ఆ పెంకు మీరే. మిమ్మల్ని మీరెలా పగలగొట్టుకుంటారు? మీకింకా అటువంటి ధైర్యం లేదు. మీ మనస్సు చెప్పవచ్చు, “ఔను, పగలగొడదాం, ఒక కోడిపిల్ల బయటికి వస్తుంది.” లేదు. మిమ్మల్ని మీరు పగలగొట్టుకొనే ధైర్యమెప్పటికీ మీకుండదు.

అందుకే వెలుపలినుండి మీకొక సుత్తి కావాలి. దీన్నే సాధారణంగా కృప అంటారు. అది మీ వైపు లాగబడేటట్లు మీరు మిమ్మల్ని తయారుచేసుకోవాలి. పిల్లవాడికి పన్ను ఊడేటప్పటి స్థితిలా ఉంటుందిది. వాడంటాడు, “దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని ముట్టుకోవద్దు.” తండ్రి అంటాడు, “నన్ను చూడనీ, నన్ను చూడనీ.” టక్కున పన్ను ఊడి నీ చేతిలోకి వస్తుంది. పన్ను ఊడి వచ్చేసినందుకు పిల్లవాడు మహా సంతోషపడిపోతాడు. అప్పుడే పన్ను ఊడినప్పటి బాల్య స్మృతి మీకింకా ఉందా? నొప్పి పోతుంది, ఖాళీ జాగా ఏర్పడిన అనుభూతి. మీరు దాంతో ఎన్నో రోజులు ఆడుకుని ఉంటారు. కాని దాన్ని మీ అంతట మీరు పీకే సాహసం చెయ్యరు. అందువల్ల మనం కేవలం ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాం. సాధన చేసేది కేవలం దాని గురించే – మీ నోరు తెరవడానికి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు