'మదర్స్ డే' సందర్భంగా సద్గురు సందేశం అందించారు. మాతృత్వంలో ఉన్న సౌందర్యం పునరుత్పత్తి వల్ల వచ్చింది కాదని, మరొకరిని తనలో అంతర్భాగంగా ఇముడ్చు కోవడం వల్ల వచ్చిందని చెబుతున్నారు.

మీ పిల్లలు మీ నుండి ఒక కణం మాత్రమే తీసుకొని ఉండవచ్చు. కానీ ఈ గ్రహం నుండి మీరు ఎంత తీసుకున్నారు? ఎన్ని కణాలు? అందులోని సర్వస్వం తీసుకున్నారు, మీరు శరీరానికి మించి ఆలోచించలేక పోయినా కూడా, ఇది నిజమే! మీ నుండి కేవలం ఒక కణం తీసుకున్నవారు మీ కుటుంబం అయినప్పుడు, ఈ గ్రహం ఇంకా దాని నుండి వచ్చినవన్నీ కూడా మీకు కుటుంబమే. ముఖ్యంగా మదర్స్ డే తరువాత, మీకు ఇలా చెప్తే నచ్చకపోవచ్చు, కానీ మాతృత్వంలో ఉన్న సౌందర్యం పునరుత్పత్తి వల్ల వచ్చింది కాదు, అది తనలో అంతర్భాగంగా ఇముడ్చుకోవడం వల్ల వచ్చిన అందం.

మిమ్మల్ని పునరుత్పత్తి చేసి, మోసి, కనడం వల్ల, తల్లి అమూల్యమైనది కాదు. ఆమె మనకు ఎందుకు అమూల్యమైనదంటే, ఎన్నో విధాలుగా ఆమె మిమ్మల్ని తనలో ఒక భాగంగా చూసింది. ఇది భౌతిక సంబంధం వల్ల వచ్చింది కాదు, ఇది అంతర్భాగం చేసుకోవడం వల్ల వచ్చింది. మీ తల్లి మిమ్మల్ని కని, ఆ తరవాత మీ గురించి ఎన్నడూ పట్టించుకోక పోతే, ఆమె మీకు ప్రధాన శత్రువు అవుతుంది. ఇక్కడ ముఖ్యమైనది భౌతిక సంబంధం కాదు, మీ జీవితంలో మరొక జీవితాన్ని అంతర్భాగం చేసుకోవడానికి సుముఖంగా ఉండడం. అటువంటి సౌందర్యాన్నే మనం 'మదర్స్ డే' గా జరుపుకోవాలనుకుంటున్నాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు