ఈ ఆర్టికల్ లో, సద్గురు మన జీవితాల్లో, మన కుటుంబ సంబంధాల్లో, మొత్తం సమాజంలో -  విధేయత, ఆనందం అనేవి ఏ విధంగా పనిచేస్తాయో మనతో పంచుకుంటున్నారు. సద్గురు ఏమంటున్నారంటే, “మన జీవితాల్లో మనం గతంలో పాటించిన నియమాలను వదిలేయాలి అన్న నిర్బంధమూ ఉండకూడదు. అలా అని ఖచ్చితంగా మనం గతంలో ఎలా అయితే చేశామో, అదే విధంగా చేయాలి - అన్న నిర్బంధము కూడా ఉండకూడదు” అని చెప్తున్నారు.

పెద్దల పట్ల విధేయత అన్నది సాంప్రదాయపరంగా ఒక గొప్ప విలువగా మనకు చెప్పబడింది. నేనేమంటానంటే, మనం ప్రశ్నించకుండా విధేయతతో ఉండడం అన్నది - ఒక సమాజానికి గానీ, ఒక సంస్కృతికి గానీ ఎటువంటి తోడ్పాటునీ అందించదు.  విధేయత ఉందంటే, అక్కడ ఒక అధికారం ఉందని అర్థం. అది తల్లిదండ్రులు అవ్వచ్చు, ఒక మత పెద్ద అవ్వచ్చు, భగవంతుడు అవ్వచ్చు లేదా ఇతిహాసాలూ,  పురాణాలూ అవ్వచ్చు - ఈ అధికారం ఎదైతే చెపుతోందో, అది సరైనదన్న ఊహ మీద మీ విధేయత ఆధారపడి ఉన్నది. మీరు కనక అధికారాన్ని సత్యంగా మారిస్తే, అది మానవ మేధస్సుని వినాశనం చేస్తుంది.  సత్యమే ఎప్పుడూ అధికారమై ఉండాలి.

ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లల నుంచి ప్రేమాభిమానాలని చూరగొనలేకపోతున్నారో, వారు విధేయత కావాలి - అని అడుగుతారు.

మన తరువాతి తరం వారు మనం ఊహించలేని విధంగా ఏదో చేయగలిగి ఉండాలి. మనం మన తరువాతి తరాన్ని ఎందుకు సృజిస్తున్నాం అంటే, అది ఒక నూతన ఆవశ్యకత కాబట్టి. అది ఒక నూతన అవకాశంలాగా కాకుండా, కేవలం మీ నుంచి సూచనలను మాత్రమే తీసుకునేటట్లైతే, అన్ని స్థాయిల్లోనూ మీకు కావలసినది మాత్రమే చేస్తున్నట్లైతే, అప్పుడు అసలు అది ఒక కొత్త తరమే కాదు కదా..! అందులో కొత్తదనానికి చొటేది..? అది కేవలం గతమే మళ్ళీ వర్తమానంగా పునరావృతమవ్వడం. ఇలా అధికారం చూపించే ప్రవృత్తి, స్వభావం ఉండడం అనేది జీవితం వృధా అయిపోవడమే..!!

ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లల నుంచి ప్రేమాభిమానాలని చూరగొనలేకపోతున్నారో, వారు విధేయత కావాలి - అని అడుగుతారు. ప్రేమ, అభిమానం, గౌరవం అన్నవి మనకి మనం సంపాదించుకోవలసినవి. తల్లిదండ్రుల స్థానంలో ఉన్నప్పుడు, ఇది ఎంతో ముఖ్యమైన విషయం. మీరు ఏ క్షణంలో అయితే, విధేయతను చూపించాలి అని అడుగుతున్నారో, అప్పుడు మీరు అధికారాన్ని చూపిస్తున్నట్లే..! మీరు అధికారాన్ని చెలాయిస్తే, మీరు సంతోషంగా ఉండలేరు. మానవ సంబంధాల్లో బాధ ఉన్నప్పుడు, అవి ఎంతో అసహ్యంగా తయారవుతాయి. మీరు ఎక్కడైతే అధికారం చూపించాలనుకుంటారో - అది సమాజంలో అయినా, సంస్కృతిలో అయినా ఒక జడత్వాన్ని తీసుకువచ్చి, కాలంతో పాటు వినాశనం అయిపోయేలా చేస్తుంది.

తల్లిదండ్రులు ఏదైతే సాధ్యం అవుతుంది అని ఊహించికూడా ఉండరో, దానిని పిల్లలు చేయగలిగినప్పుడే కొత్త సమాజం అనేది ఏర్పడుతుంది. సరే, అయితే మనం పాత తరంలానే ఉండాలా..? లేదా ఏదైనా కొత్తగా చేయాలా..? గతంలో చేసిన విధంగా చేయకూడదు అన్న నిర్బంధనం ఉండకూడదు. అలానే, పనులన్నీ కూడా, గతంలో ఎలా చేయబడ్డయో, అదే విధంగా చేయాలి అన్న నిర్బంధనం కూడా ఉండకూడదు. ప్రతీ తరం కూడా ఇప్పుడు ఏది అవసరం, ఏది అవసరం లేదు – అన్న దానిని తెలుసుకోవాలి. మీ ఇంట్లో పోగైన చెత్త అంతా మీరు కొంత కాలం తరువాత బయట పారెయ్యకపోతే, మీ ఇల్లంతా ఒక చెత్తకుప్పలా తయారవుతుంది.

మీరు కనుక, సరిగ్గా ఎలా కూర్చోవాలి, సరిగ్గా ఎలా శ్వాస తీసుకోవాలి, మీ శరీరాన్ని ఎలా సరిగ్గా నియంత్రించుకోవాలి అనే విషయాన్ని  తెలుసుకోవాలనుకుంటే - మీరు యోగా చేయడం మొదలు పెడతారు.

మీరు ప్రతిరోజూ కూడా, మీ ఇంట్లో చెత్తని బయటపడేయాలి. అప్పుడే, మీ ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఇదే విధంగా మన జీవితాల్లో కూడా, రోజువారీ ఏ విషయాలైతే మనకు పని చెయ్యడంలేదో వాటిని మనం వదిలేసెయ్యాలి. మనం వ్యక్తిగతంగా, సామాజికంగా ఈ పని చెయ్యలేదంటే మనం ఒక చోటే ఇరుక్కుపోతాం. అప్పుడు ఏదీ కూడా, మనం అనుకున్నట్టు పని చేయదు. ఈ మూసలోనుంచి బయటికి రావడానికి సమాజంలో ఒక పెద్ద తిరుగుబాటు రావలసిన అవసరం లేదు. మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి. జీవితంలో మనం ఎప్పుడూ కూడా, ఒక పనిని, ఒక అంశాన్ని ఇంకా మెరుగ్గా ఎలా చేయగలం - అని చూడాలి. చిన్న విషయాల నుంచి, ఎంతో ముఖ్యమైన విషయాల వరకూ, మనం ఈ విధంగా చేయాలి.

మీరు కనుక, సరిగ్గా ఎలా కూర్చోవాలి, సరిగ్గా ఎలా శ్వాస తీసుకోవాలి, మీ శరీరాన్ని ఎలా సరిగ్గా నియంత్రించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే - మీరు యోగా చేయడం మొదలు పెడతారు. అంటే, మీరు మీ శారీరిక - మానసిక శ్రేయస్సుని, ఒక శాస్త్రీయ పద్ధతిలో చూడడం మొదలు పెడతారు. సత్యం అనేది మీరు తెలుసుకొనేది. మీరు దీనిని కనిపెట్టాలి అని చూస్తే,  అది కేవలం అసత్యమే. మీరు నిజాయితీగా ‘ఒక పనిని సక్రమంగా ఎలా చేయాలి’ అన్న పద్ధతికోసం చూస్తే, క్రమంగా మీ దృష్టి  ఒక శాస్త్రం వైపుగా మళ్ళుతుంది.  లేదంటే, మీరు దాని చుట్టూ ఏవో తత్వాలు అల్లుకుంటూ పోతారు. గతంలో ఉన్న తత్వాలు, కొంత కాలానికి కొద్దిగా ఏదో అర్థం సంతరించుకొని ఉండవచ్చు. కానీ కొంత కాలంగా ఏదైతే ఒక తత్వంగా ఉండేదో, అది ఒక నియమంగా, ఒక నమ్మక వ్యవస్థగా, చివరికి ఒక మతంగా మారిపోతోంది. దాని బదులు, మనం మన విచక్షణను అన్నింటికీ ఉపయోగించుకోవాలి.

కానీ ఇలా ప్రతిదానికీ మనం ఒక సమాధానానికి చేరుకోగలమా అంటే చేరుకోలేకపోవచ్చు. ఎందుకంటే, వాస్తవాలు మారిపోతున్నాయి కాబట్టి. జీవితాన్ని మనం ఒక మౌలికమైన విధానంలో ఎలా చూడొచ్చు అంటే..  ఈరోజున దీనికి ఆధునిక శాస్త్రం, వైద్య శాస్త్రం మనకి ఆధారాలు కూడా అందిస్తున్నాయి, మన శరీరం, మన మెదడు, మనం ఆనందంగా ఉన్నప్పుడే, అవి ఉత్తమంగా పని చేస్తాయి. ఈ మాట ఆధునిక వైద్య శాస్త్రాలు చెప్తున్నాయి. మీ శరీరం, మీ మనస్సు సరిగ్గా పని చెయ్యాలంటే కావలసిన మొదటి విషయం మీరు స్వాభావికంగా ఆనందంగా ఉండగలగాలి. చాలా మంది, ఈ మౌలికమైన విషయాలను పట్టించుకోవడం లేదు.  వారు, ఆనందాన్ని వెతుక్కొంటూ పోతున్నారు. ఆనందం అనేది వారు ఎక్కడో ఒకచోట సాధించాల్సిన విషయమని, బహుశా జీవితాంతంలో దొరికే విషయం అని అనుకుంటున్నారు. ఇది సరైన అభిప్రాయం కాదు.

మీ స్వభావమే ఆనందం, సంతోషం అనుకోండి, ఇది అన్నింటికీ మూలమవుతుంది. కానీ, మీరు ఆనందాన్ని వెతుకుతూ ఎన్నో నిర్బంధనాలల్లో చిక్కుకుపోతున్నారు. మీరు కనుక ఆనందంగా ఉంటే, మీకు ఎటువంటి నిర్బంధం ఉండదు. మీరు గనక ఆనందంగా ఉండగలిగితే, అన్ని విషయాలనూ, అవి ఎలా ఉన్నాయో, అదే విధంగా చూడగలుగుతారు. అప్పుడు, వాటికి మంచి పరిష్కారాలను చూపించగలుగుతారు. అదే మీ అవగాహన… మీ ఆలోచనలు, అభిప్రాయాలతో నిండిపోయి ఉన్నప్పుడు.. మీకు ఒక పరిష్కారం ఎలా దొరుకుతుంది..? మీరు ఆనందంగా ఉన్నప్పుడు పరిష్కారాలు దొరుకుతాయి. మీ ఆనందంలో ఒక రకమైన మృదుత్వం ఉంటుంది. ఈ మృదుత్వం నుంచే పరిష్కారాలు అన్నవి వెలువడతాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు