భారతదేశ పురాతన సంస్కృతిలో పంచ భూతాలను కూడా దేవుళ్ళుగా ఆరాధించేవారు. ఈ పంచ భూతాలు నిజంగా రూపాన్ని, అంటే మానవ రూపాన్ని ధరిస్తాయా? ఈ పంచభూతాలకు సంబంధించిన శక్తి రూపాల గురించి సద్గురు వివరిస్తున్నారు.

ప్రశ్న: సద్గురూ, సనాతన భారతీయలు ఇంద్ర, వాయు, సూర్య, వరుణ ఇత్యాది దేవతలను ఆరాధించారా?

సద్గురు: ఇంద్రుడు పంచభూతాలలో ఒకడు కాదు.

ప్రశ్న: ఇంద్రుడు పంచ భూతాలలో ఒకరు కాకపోయినా, ఆయన పిడుగులకు, వానలకు అధినాయకుడు అంటారు కదా. ఈ పంచ భూతాలు నిజంగా రూపాన్ని ధరిస్తాయా? ఈ దేవతల గురించి కధలు ఉన్నాయి కాబట్టి...

సద్గురు: ఇక్కడ పంచ భూతాలు మానవ అవతారమెత్తడం అని అర్ధం కాదు. ఈ పంచభూతాలను కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చు. ఒకప్పుడు అమెరికాలోని ఈషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ లో పంచ భూత దేవాలయాలను నెలకొల్పుదామనుకున్నాము. అంటే మనం వాయు దేవుడి కోసం ఇక్కడేమీ ఒక గాలి బెలూన్ పెట్టబోవడంలేదు. గాలి బెలూన్ లో కూడా గాలే ఉంది కాబట్టి దానిని ఆరాధిస్తామనా?...అలా కాదు..! మానవుడు అనుసంధానించుకోగల ఒక శక్తి రూపాన్ని సృష్ఠించవచ్చు. మనం యోగా సంప్రదాయంలో ఉన్నాము కాబట్టి, సామాన్యంగా మనం మానవాకృతిని నెలకొల్పం. మనం అతి తక్కువ నిర్వహణతో ఎక్కువ కాలం ఉండే లింగాకారాన్నే (ellipsoid) ఎంచుకుంటాము. మనం స్త్రీ స్వరూపిణి అయిన దేవిని కూడా లింగాకారంలోనే చేశాము. అలాంటి రూపం ఉంటే నిర్వహణ సులువని మనం ఆమెకు ఆ ఆకారం ఇచ్చాము, దాదాపు దీర్ఘవృత్తాకారంలో ఉంది కాబట్టి  తేజస్సు కూడా అత్యధికంగా ఉంటుంది.

ఒక్కో మూలకానికీ ఒక్కో లింగం

శాస్త్రాన్ని అర్ధం చేసుకున్నాము కాబట్టి, యోగ శాస్త్ర పరంగా మనం పంచ భూతాలకూ, అయిదు రకాలైన లింగాలను తయారు చేస్తాము. వాస్తవానికి దక్షిణ భారత దేశంలో అయిదు దేవాలయాలు ఇప్పటికే ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ కాళహస్తిలో వాయులింగం, మిగతా నాలుగు లింగాలు తమిళనాడులోనూ ఉన్నాయి. ఈ అయిదు లింగాలూ అయిదు రకాలుగా ప్రతిష్ఠంపబడ్డాయి.

అంటే లింగాకారంలో గాలి ప్రకటితమయ్యిందా? మౌలికంగా చూస్తే..కాదు. మరికాస్త నిశితంగా చూస్తే.. అవును. అంటే మనం కదలికలను సూచించే ఒక లింగాన్ని తయారు చేయవచ్చు. వా-యు అంటే కదలికను సూచించేది. వా-యు అంటే కదిలేది. మనం కదలికను, క్రియాశీలతనూ సూచించే లింగాన్ని సృష్ఠించవచ్చు, దానిని వాయులింగంగా చూడవచ్చు. అలాగే మనం మిగతా పంచ భూతాలకు కూడా లింగాలను తయారు చేయవచ్చు. మనం దీనిని మానవాకృతిలోకూడా చేయవచ్చా? చేయవచ్చు. వాస్తవంగా దేవతా విగ్రహాలను తయారు చేసినప్పుడు కూడా, విగ్రహం మొత్తం ఒక శక్తిరూపంగా పనిచేయకపోవచ్చు. సామాన్యంగా అయితే విగ్రహంలోనే ఒక చిన్న యంత్రాన్ని చేస్తారు.

అందుకే తంజావూరు కంచు విగ్రహాలు అంత అపురూపమైనవి, విలువైనవి ఎందుకంటే అవి ఖచ్చితమైన జ్యామెట్రీతో ఉన్నాయి.

మీరు తమిళనాడుకు చెందిన వారైతే, కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్రమంతా పెద్ద అలజడి చోటు చేసుకుంది, ఆ విషయం తెలిసే ఉంటుంది. తిరుచినాపల్లి లోని ప్రముఖ వైష్ణవాలయం అయిన శ్రీరంగం దేవాలయంలో ఆయన హృదయంలో ఒక రాగి యంత్రం ఉండేది. ఏదో కారణాన ఆ యంత్రాన్ని తీసివేయాలనుకున్నారు.

ఆ యంత్రం తీసివేయగానే ‘రంగడు వెళ్ళపోయాడు’ అన్నారు. వారికి ఆయన ఎంతో ప్రీతి పాతృడు కాబట్టి ఆయనను వారు ఏక వచనంలోనే సంబోధించేవారు. ఆయన వారికి ‘రంగడే’. అందుకే వారు రంగడు వెళ్ళిపోయాడని అనేవారు, ఒకరకంగా అది యదార్ధం. మొత్తం విగ్రహం అంతా జనులు అన్వయించుకునే విధంగానే ఉంది. చేతులు, కాళ్ళు, కళ్ళు అన్నీ అలాగే అన్వయించుకునే విధంగానే ఉన్నాయి. ఈ దేవతా మూర్తులే మొత్తం ఒక యంత్రంలా పనిచేసేవి. కాని అది ఎంతో జ్యామెట్రీతో కూడుకున్నది. అందుకే తంజావూరు కంచు విగ్రహాలు అంత అపురూపమైనవి, విలువైనవి ఎందుకంటే అవి ఖచ్చితమైన జ్యామెట్రీతో ఉన్నాయి.

సరైన రూపాన్ని తయారు చేయడం

ఒక మానవాకారంలో, చిటికిన వేలుతో సహా మొత్తం విగ్రహాన్ని ఒక యంత్రంలా తయారు చేయాలంటే, దాని జ్యామెట్రీ సరిగా ఉండాలి. సామాన్యంగా ఒక రాతితో దానిని చేయాలంటే చాలా కష్టం. అందుకే అలా చేయడానికి లోహంతో మూస పోస్తారు. సామాన్యంగా, ఆ ప్రాతంలోని సంస్కృతి వారు అన్వయించుకో గలిగే విధంగా ఒక విగ్రహాన్ని తయారు చేసి శరీరంలో ఏదో ఒక చోట ఒక యంత్రాన్ని బిగిస్తారు. ఆ యంత్రంమే నిజమైన శక్తిగా పనిచేస్తుంది.

అలాగే మీరు వివిధ మూలకాలకు యంత్రాన్ని తయారు చేసి మానవాకృతిలో అమర్చి పంచభూత దేవతగా పనిచేసేటట్లు చేయవచ్చు. కాకపోతే ఆయన అగ్ని అయితే భీకరమైన ఆకారం ఉంటుంది. ఆయన వాయువు అయితే వాయు ఆకృతిలో, జనులు అన్వయించుకునే విధంగా అలా చేస్తారు. ఎందుకంటే మానసికంగా సుమఖంగా ఉండడం, దానికి అన్వయించుకోగలగడం కూడా ‘శక్తి’ ఎంత ముఖ్యమో, అదీ అంత ముఖ్యమైనది. ప్రజలు ఆ ఆకృతితో అన్వయించుకోలేక పోతే అక్కడ ఎక్కువ సేపు కూర్చోలేరు. ప్రజలు అనుభూతి చెందరు, చేయమన్నది వారు చేయరు. అక్కడ ఉన్న లింగాన్ని అది వాయు లింగమనీ, ఇంకో లింగాన్ని అగ్ని లింగమని అంటే, మీరు చూసినప్పుడు మాత్రం రెండూ ఒకే రకంగా ఉంటే, అప్పుడు మీరు అక్కడ చేయవలసింది చేయరు.

అదే జుట్టు ఎగురుతున్నట్లు ఉంటే ఆ విగ్రహాన్ని చూపించి ఆయన్ని వాయు దేవుడు అంటే. అప్పుడు మీరు చేయవలసింది చేస్తారు. అందుకే ప్రజలు అన్వయించకునే విధంగా విగ్రహం తయారుచేయడం ముఖ్యం. ఆ విగ్రహానికి కావలసిన శక్తి ఉన్నా, ప్రజలు దానికి అన్వయించుకోలేక పోతే వారు దానిని ఉపయోగించుకోలేరు. ఈ పరిస్థితులలో, మరి పంచభుతాలకు విగ్రహాలని తయారు చేయగలమా? చేయగలం, ఈ శక్తి ఆకృతలను సరిగా తయారుచేస్తే వారు సజీవంగా మీతో నడవగలరు, జీవించగలరు. కాని ఎక్కడో ఆకాశంలో వాయుదేవుడు ఉండి, ఆయన ఒక రోజు మీ దగ్గరకు దిగి వస్తాడా అంటే, లేదు అలా జరగదు.