మనం జీవితంలో ఇచ్చి-పుచ్చుకోవడాలను ఎలా సమతుల్యం చేసుకోవాలి..?తమిళ భాషలో ఒక నానుడి ఏమిటంటే - ఎవరైతే ఎల్లప్పుడూ ఇస్తారో లేదా ఎవరైతే ఎల్లప్పుడూ తీసుకుంటారో, వాళ్ళు నాశనం అయిపోతారని. సద్గురు ఈ సూక్తిని వివరిస్తూ ఎవరైతే జీవన ప్రక్రియతో అనుసంధానమై ఉంటారో, ఎవరైతే వారిలో వారు, ఎల్లప్పుడూ వసంత కాలంలో ఉంటారో, వాళ్ళు సహజంగానే పరిస్థితికి ఏది అవసరమో అదే ఇస్తారని చెపుతున్నారు.

ప్రశ్న : తమిళంలో ఒక సామెత ఉంది – “ఏ కుటుంబమైతే ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటారో లేదా ఏ కుటుంబమైతే ఎల్లప్పుడూ పుచ్చుకుంటూనే ఉంటారో – ఈ రెండు రకాల వారు కూడా నాశనం అయిపోతారు” అని. 

సద్గురు: ఇక్కడ మీరు దేనిగురించి మాట్లాడుతున్నారంటే ఎప్పుడూ తీసుకోవడం లేదా దేన్నైనా ఆధారం చేసుకుని బ్రతకడం లేదా కేవలం మీరు మంచివారు అనిపించుకోవడం కోసం యోచన చేయకుండా ఎప్పుడూ ఇవ్వడం...అక్కడ పరిస్థితిని, అవసరాన్ని బట్టి కాదు...! మీరు కేవలం మంచివారు అనిపించుకోవాలని ఇస్తున్నారనుకోండి, అది మీరు, స్వర్గానికి టికెట్ కొనుక్కోవడానికి చేస్తున్న ప్రయత్నమే. ఇది ఖచ్చితంగా సరైన పని కాదు. కానీ, ఒక నిజమైన అవసరం ఉందని చూసికూడా, మీరు ఇవ్వడానికి సిద్ధంగా లేరనుకోండి – అప్పుడు, మీరసలు మానవులే కాదు. అందుకని ఇవ్వడం అనేది సమస్య కాదు. సమస్య ఎప్పుడు తలెత్తుతుందంటే -  అలాంటి పరిస్థితి, అవసరం ఉంది కాబట్టి మీరు ఇవ్వడం కాకుండా, మీకు గొప్పగా అనిపించడం కోసం మీరు ఇవ్వాలనుకున్నప్పుడు. ..!

మీలో మానవత్వం గనక ఎప్పుడూ సజీవంగా ఉంటే, మీరు ఆ పరిస్థితికి ఏది అవసరమో అది ఇస్తారు.

మానవుల్లో ఇలా ఎందుకు జరుగుతుంది అని  అంటే; వారు వారి సంతోషాన్ని, ప్రశాంతతను ఎన్నో విధానాల్లో పొందాలని చూస్తున్నారు కాబట్టి. ఈరోజున ఎవరికో ఎదో ఇస్తే, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని నమ్ముతున్నారు. ప్రశాంతత, ఆనందం అనేది మీలో జరిగేది. మీలో మానవత్వం గనక ఎప్పుడూ సజీవంగా ఉంటే, మీరు ఆ పరిస్థితికి ఏది అవసరమో అది ఇస్తారు. అది ఇవ్వడం అని కూడా నేను అనను, దానిని పంచుకోవడం అంటాను. ఇది ప్రతి మానవుడికీ కూడా ఎంతో సహజమైనది. ఒకరి సంతోషం కేవలం పంచుకోవడం ద్వారానే పెంపొందుతుంది. మీకేదైనా మంచి జరిగిందనుకోండి సహజంగానే, మీరది మరొకరితో పంచుకోవాలనుకుంటారు. ఎందుకంటే, మానవుడు సంఘజీవి కాబట్టి.

 కేవలం సూక్తులు  లేదా నీతులు బోధించకండిమానవత్వాన్ని మేల్కొల్పండి.

దురదృష్టవశాత్తూ మనం ప్రజలకి మంచితనాన్ని బోధించాలి అని చూశాం. అంతేకానీ, మానవత్వాన్ని కాదు. నిజానికి  మానవ హృదయాల్లో మానవత్వాన్ని పెంపొందించాలి. ఇలా కాకుండా మనము ఎప్పుడూ నీతులూ, మంచితనమూ బోధించాలని ప్రయత్నం చేస్తున్నాము. అలా చేసినప్పుడు, మీరు ఎదో ఇవ్వడమనేది, స్వర్గం ప్రాప్తిస్తుందన్న ఆశతోనో, మీకు గొప్పగా అనిపించడం కోసమో చేస్తున్నారు.

ఇచ్చి- పుచ్చుకోవడం అనేది మానవ జీవితంలో మానవత్వానికి ఒక ప్రత్యామ్నాయంగా తీసుకురాబడింది.

ఇలా చేయడమనేది ఒక లావాదేవీ లాంటిది. ఇలా చేయడం కేవలం ఒక వ్యాపారమే. మీరు ఒక బిచ్చగాడికి ఒక గిన్నెలో ఆహారం ఇస్తే, మీకు కొంత ప్రశాంతత వస్తుందని మీరు అనుకుంటున్నారు. ఇది సరైన పని కాదు. ప్రశాంతత   మిగిలిపోయిన అన్నం కంటే, ఎంతో విలువ కలిగినది. ఎవరైతే తన ప్రశాంతతను కోల్పోయారో, వారికి దాని విలువ ఏమిటో తెలుసు. ఎందుకంటే, ప్రశాంతంగా లేనప్పుడు వాళ్ళు కూర్చోలేరు, నించొలేరు, పడుకోలేరు. మీరు గనక దాన్ని, ఒక గిన్నెడు అన్నంతో కొనేయగలిగితే లేదా మరెవ్వరికో ఇంకేదైనా చేయడం ద్వారా దాన్ని సాధించగలిగితే - అది సరైన లావాదేవీ కాదు. ఇచ్చి- పుచ్చుకోవడం అనేది మానవ జీవితంలో మానవత్వానికి ఒక ప్రత్యామ్నాయంగా తీసుకురాబడింది. కానీ, మానవత్వం అంటే అది ఒక తత్వం. మీరు, మీ మానవత్వాన్ని నిద్రపుచ్చినపుడు మీకు ఈ విధంగా ప్రతీక్షణం గుర్తు చేయాల్సి వస్తుంది - రోజుకి రెండుసార్లు ఏమైనా ఇవ్వండి, రోజుకు నాలుగుసార్లు తీసుకోండి - అని. ఇలా చెపితేనే ప్రజలు అంగీకరిస్తారు. మీరు రోజుకి నాలుగుసార్లు ఇవ్వండి, రెండుసార్లు తీసుకోండి – అంటే,  ఎవరూ అందుకు అంగీకరించరు.

జీవన ప్రక్రియతో అనుసంధానం

మీరు జీవన ప్రక్రియను అర్థం చేసుకున్నట్లైతే, నిజానికి ఇచ్చి పుచ్చుకోవడం అంటూ ఏమీ లేదు. జీవితం అంతా కూడా ఒకదానితో ఒకటి సంబంధంతో ఉంది. మీరు శ్వాస తీసుకున్నా శ్వాస వదిలిపెట్టినా మీకు మీ చుట్టూరా ఉన్న చెట్లకు మధ్య ఒక లావాదేవీ జరుగుతోంది. ఇది మీ ఎంపికతో జరగట్లేదు. జీవన ప్రక్రియే ఈ విధంగా ఉంది. మీరు గనక ఎల్లప్పుడూ జరిగే ఈ లావాదేవీతో అనుసంధానమై ఉన్నారంటే లేదా మీరు కేవలం అందరితో మీ జీవితంలో అన్నీ పంచుకుంటున్నారంటే – మీరు జీవన ప్రక్రియతో అనుసంధానం అయి ఉన్నట్లే. లేకపోతే మీరు ప్రతీదానితోనూ, జీవన ప్రక్రియతోనూ ఘర్షణ ఏర్పరచుకుంటారు. జీవితం ఎలా జరుగుతోందో అలా కాకుండా, మీరు మరోవిధమైన ఆలోచనలను ఏర్పరచుకుంటే, మెల్లిగా మీరు బాధ పడడం మొదలు పెడతారు. ప్రపంచంలో ఎంతో మందిలో చూడండి -  వాళ్ళల్లో అసలు వసంతమే కనిపించదు. వాళ్ళు, ఎప్పుడూ చలికాలంలో ఉన్నట్టుగానే ఉంటారు - వాళ్ళ మనస్సులు గడ్డ కట్టుకుపోయి ఉంటాయి.

మనకి జీవితం పట్ల కొంత అవగాహన ఉంటే, మనం జీవితాన్ని కొంత అర్థం చేసుకుంటే, జీవితం నిరంతరం జరిగే లావాదేవీ లాంటిదే.

వారు  చుట్టూరా ఉన్న జీవితంతో,  జీవంతో అనుసంధానమై ఉండరు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికీ కూడా, ప్రకృతి కొన్ని కాలాలను ఏర్పాటు చేసింది. ఒక చెట్టు ఒక కాలంలో మాత్రమే పుష్పిస్తుంది. ఒక జంతువు ఒక కాలంలో మాత్రమే సంయోగం చేస్తుంది. కానీ  మానవులకి ప్రకృతి ఋతువులను నిర్దేశించలేదు. ప్రకృతి మీ మేధస్సునూ, మీ ఎరుకనూ నమ్మి మీకు ఈ ఎంపికను ఇచ్చింది. మీకు  గనక ఎంపికనిస్తే, మీరు సహజంగానే మీకు ఏది అయితే ఉత్తమమైనదో ... సంవత్సరం పొడుగూతా దాన్నే మీరు ఎంపిక చేసుకుంటారు కదా..?365 రోజులూ కూడా ప్రజలు వారి మనసుల్లో వసంతాన్ని నిలుపుకుంటారని ప్రకృతి అనుకుంది. కానీ, ప్రజలు 365 రోజులూ వారి మనసుల్లో శీతాకాలాన్నే అట్టిపెట్టుకున్నారు. ఏదో అప్పుడప్పుడూ వసంతం అలా వచ్చి వెళ్లిపోతుంది. వారికి చక్కిలిగింతలు పెడితే తప్ప, వారు ఒక చిరునవ్వు  కూడా చిందించరు.

మనం జీవితానికి సంబంధించిన అవగాహన కోల్పోయాం

మనం జీవితానికి సంబంధించిన అవగాహన కోల్పోయాం కాబట్టి ఇచ్చి-పుచ్చుకోవడం అని ఆలోచిస్తున్నాము. మనకి జీవితం పట్ల కొంత అవగాహన ఉంటే, మనం జీవితాన్ని కొంత అర్థం చేసుకుంటే, జీవితం నిరంతరం జరిగే లావాదేవీ లాంటిదే.

ఎవరూ కూడా వారికిగా వారు ప్రత్యేకంగా జీవించలేరు. అందరికీ, అన్నింటికీ మించింది, సంపూర్ణమైనది - ఉన్నది అద్వైతమే. మీకు ఈ రోజున జీవితం అంటే ఈ శరీరం, ఈ మనసు, మీ భావాలు, మీ చుట్టూరా ఉన్న ప్రపంచం. ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ లావాదేవీలతోనే ఉన్నాయి. ఎవరూ దానిని నిరోధించలేరు. మీరు నిరోధించాలని చూస్తే, జీవితం మీ దగ్గర ఎంత ఘోరమైన మూల్యం కోరుకుంటుందంటే - మీ ముఖంలో, మీ మనసుల్లో వసంతం అన్నది ఉండదు. మీరు మీ సమాధిలో జీవిస్తున్నట్లే. తొంభై శాతం మానవులు వారి ఆలోచనల్లో, వారి వైఖర్లలో ఇలా కేవలం వారి సమాధిలోనే జీవిస్తున్నారు.

మీరు గనక మీలో ఎల్లప్పుడూ వసంతాన్నే నిలుపుకోగలిగితే, మీరు ఎంతో సంతోషంగా, ఉత్సాహభరితంగా ఉంటారు.  అప్పుడు మీకు, ఎవరూ వచ్చి - ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు తీసుకోవాలి – అని చెప్పక్కరలేదు. జీవితంతో ఎప్పుడు ఏమి చేయాలో మీకే తెలిసిపోతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు