ఈ వారం సద్గురు తమ "ఇంటి" జ్ఞాపకాలు మనతో పంచుకుంటూ, ఒక నివాసయోగ్యమైన స్థలాన్ని "ఇంటి" గా తీర్చిదిద్దగల లక్షణాలేవో నిర్వచిస్తారు.  మన జీవితాలపై, మనం నివసించే ఇంటి ప్రభావం ఎంతగా ఉంటుందో నొక్కిచెబుతూ, "మనం ఇల్లు అని పిలిచే స్థలం  మనల్ని మానవులుగా తీర్చిదిద్దే ఒక గర్భం వంటిది " అంటారు.  మరిన్ని విషయాలు  పూర్తిగా తెలుసుకుంనేందుకు ఈ ఆర్టికల్  చదవండి. 

Sadhguruమనం "ఇల్లు" అన్న మాట పలికినప్పుడల్లా, అది "సుఖం, సహచర్యం,  ప్రేమ"  అన్న భావనలకు ప్రతీకగా నిలుస్తుంది. తమ జీవితాల్లో అందరూ ఎన్నో ఇళ్ళలో నివసించినప్పటికీ, అన్నిటిలోకీ ముఖ్యమైనది వారు తమ బాల్యం నుండి యవ్వనం దాకా ఎదుగుతున్నపుడు గడిపిన ఇల్లే అయి ఉంటుంది. దానికి కారణం మనం బాల్యం నుండి ప్రౌఢ వయసులోకీ, ప్రౌఢవయసునుండి యవ్వనంలోకీ అడుగుపెట్టే సమయాల్లో, జీవితం గురించి మనకున్న అభిప్రాయాలు మారినంత నాటకీయంగా, మరేదశలోనూ మారకపోవడమే కారణమని నా అభిప్రాయం. ఆ సమయంలో మన పరిసరాలని ఎన్నిరకాలుగా అనుభూతి చెందవచ్చో అన్ని రకాలుగా పరిశోధిస్తాం. అందుకనే, ఈ వయసులో మనకి అండగా నిలిచి, మనల్ని తీర్చిదిద్దే మన ఇంటి వాతావరణం, తర్వాత మనం ఎన్ని వస్తువులు చూసినా, అనుభూతి చెందినా వాటికంటే గాఢంగా, మన మనసుల్లో ఎంతో సహజంగా నాటుకుపోతుంది.

చిన్నప్పుడు నేను నివసించిన ఇళ్ళన్నీ ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం.  మా తాతగారి ఇల్లు జమీందారీ తరహాలో ఉండేది. ఇది కొన్ని తరాలుగా వస్తున్న ఇల్లు.  అది చాలా విశాలంగా ఉంటూ, అధికారం దర్పాన్ని తొణికించేది.  ఆ సమయంలో ఆ ప్రాంతాల్లో ఏ విశేషం జరిగినా అది దాదాపు అక్కడనుండే జరిగేది. మా నాన్నగారి ఇల్లు, దానికి భిన్నంగా, చాలా ప్రశాంతంగా, సుఖంగా, సహజీవనాన్నీ, ప్రేమనీ ప్రతిబింబిస్తూ, పెద్దగా విశేషాలేవీ లేకుండా ఉండేది. తర్వాత నేను దేశం మొత్తం ఆ చివరనుండి ఈ చివరకి నా మోటారుసైకిలు మీద తిరిగాను. ఎక్కడో నేను తాత్కాలికంగా బస చేసిన రోజులు మినహాయిస్తే, మిగతా అన్ని సమయాల్లో నేను ఎవరో ఒకరి ఇంటి తలుపు  తట్టి, "నాకు ఆకలిగా ఉంది" అనే వాణ్ణి.  వాళ్ళు నా ఆకలి తీర్చేవారు.  అయితే నేను అక్కడ నుండి వెళ్ళిపోయేవాడిని, లేదా వాళ్ళు నన్ను స్నానం చేసి సేదదీరమనే వారు.  సర్వసాధారణంగా, వాళ్ళెప్పుడూ నన్ను నా పేరేమిటని కూడా అడిగేవారు కాదు,  నేను కూడా వాళ్ళగురించి తెలుసుకుంనేందుకు ప్రయత్నించలేదు. కానీ అక్కడ ఉన్నంత సేపు వారితో సహచర్యం అద్భుతంగా ఉండేది. వారితో కొన్ని గంటలు గడిపే వాణ్ణి , మళ్ళి పొద్దున్నే లేచి నా దారిన నేను వెళ్లిపోయే వాణ్ణి. ఈ అనుభవాలు, నన్ను అనేక విధాలుగా ఇంటి గురించి నాకున్న అభిప్రాయాలని ప్రభావితం చేశాయి.

మనల్ని మనుషులుగా తీర్చిదిద్దే గర్భమే (Incubator) మన ఇల్లు.

ఇల్లుకట్టుకోవడం మానవులకి ఒక ప్రాథమిక అవసరం. పుట్టినప్పటి నుండి వాటంతట అవి జివించవలసి వచ్చే మిగతా జీవులకి భిన్నంగా, మనం మానవులు, పూర్తిగా మనంతట మనం జీవించగల వ్యక్తులుగా ఎదగడానికి మనకి కొంత శిక్షణ అవసరం. మనల్ని మనుషులుగా తీర్చిదిద్దే గర్భమే (Incubator) మన ఇల్లు.  ఇంటికి ఉండవలసిన  ముఖ్య లక్షణం  కలుపుగోలుతనం. ఇల్లంటే … అందులో నివసించే కొద్దిమందినీ పెంచిపోషించే స్థలం.  దాన్ని ఇల్లు అని ఎందుకు పిలుస్తారంటే, అదే సమయంలో, ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి ఏదోరకంగా సంబంధం ఉన్న అనేకమంది ఇతరులకి... మిత్రులూ, కుటుంబసభ్యులూ, వ్యాపార భాగస్వాములూ, మొదలైన వారందరికీ ఆ ఇంటి తలుపులు తెరుచుకునే ఉంటాయి. అందులో కొందరు అక్కడే స్థిరంగా ఉండడానికి వస్తారు... కోడళ్ళూ, అల్లుళ్ళవంటి వారు. ఒక్కోసారి, నాలాంటి దేశదిమ్మరులుకూడా వచ్చిపోతుంటారు. చాలా రకాలుగా నేను ఇల్లంటూ లేని మనిషిని. నేను భారతదేశంలోనూ, అమెరికాలోనూ కట్టుకున్న ఇళ్ళ (ఆశ్రమం) లో గాక, చాలా సమయం ఇతరుల ఇళ్ళలో బసచేస్తుంటాను. జీవితం నన్ను మరింత బలహీనుణ్ణిచేసాక, బహుశా నేను నా ఇంట్లో నివసిస్తానేమో!

400 మందికిపైగా కుటుంబ సభ్యులు నివసించిన ఇళ్ళలో ఉన్నాను. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిపేరూ తెలిసి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళకి ఎవరు ఎవరికి ఏమవుతారో తెలుసు.  ఒకే కప్పు కింద కొన్ని తరాలకు చెందిన మనుషులు నివసించేవారు. అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, పెళ్ళిచేసికుని, పిల్లల్నికని, అక్కడే మరణించేవారు.  ఇప్పుడు అలా జరగే అవకాశం లేదు. ప్రతీ తరం మరొక కొత్త ఇంటిలోకి మారిపోతుంది. ఈ రోజుల్లో, అనేక కారణాల వల్ల మనుషులు ఒక చోటునుండి మరొకచోటికి తరుచు వెళ్ళవలసి వస్తోంది. కొన్ని తరాల ముందు అలా ఉండేది కాదు. అప్పుడు అవన్నీ వ్యవసాయాధారిత సమాజాలు. అందుకని వలసపోవడం చాలా పరిమితంగా ఉండేది. ఇప్పుడు మనం పనిచేసే సందర్భాలూ, జీవన సరళీ, ఇవే కాదు, ప్రపంచం మొత్తమే రూపుమారిపోయింది. గృహనిర్మాణాలూ, వాటి వాస్తు స్వరూపాలూ మారిపోయాయి. కానీ, ఆ నివాసయోగ్యమైన స్థలాన్ని "ఇల్లు"గా మార్చే మౌలిక విలువలు మారలేదు. ఇల్లు లోతైన, ఉదాత్తమైన అంతర్గ్రాహకతను, కలివిడిదనాన్ని పెంపొందింపజెయ్యాలి. ప్రపంచం అంతటినీ కాకపోయినా, మీరు మీ ప్రపంచంగా భావిస్తున్న మనుషులందరినీ గౌరవించి, మీలో కలుపుకుని, జీవించడం నేర్చుకోవాలి.

మనతో నివసించేవారెవ్వరూ మనం కోరుకున్నట్టుగా లోపాలు లేకుండా ఉండరు, ఉండలేరు. ఈ సత్యానికి మీరు రాజీపడగలిగితే, మీకు జీవితం గురించి ఇప్పటివరకు ఉన్న అవగాహనకు మించి జీవితాన్ని అర్థం చేసుకోగలరు.

మనతో నివసించేవారెవ్వరూ మనం కోరుకున్నట్టుగా లోపాలు లేకుండా ఉండరు, ఉండలేరు. ఈ సత్యానికి మీరు రాజీపడగలిగితే, మీకు జీవితం గురించి ఇప్పటివరకు ఉన్న అవగాహనకు మించి జీవితాన్ని అర్థం చేసుకోగలరు. ఇల్లు మిమ్మల్ని జీవితానికి సన్నద్ధం చెయ్యాలి... అప్పుడు, మీరు బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత, మీరు అందరినీ కలుపుకుంటూ పోగలగుతారు. సహజీవనం మీకు చాలా విషయాలని తెలుసుకోవడానికి, అంగీకరించడానికీ అవకాశం ఇస్తుంది. కానీ, మీరు చదువుకుంటున్న స్థాయి పెరుగుతున్నకొద్దీ, మీ సరిహద్దుల్లోకి ఇతరులు పోరపాటున వచ్చినా దాన్ని సహించగల సహనాన్ని కోల్పోతారు. ఎంతగా అంటే, ఎదుటివారు మిమ్మల్ని తాకితే చాలు, అయితే వాళ్ళ పనైనా అయిపోతుంది, లేకపోతే మీపనైనా అయిపోతుంది. మనం అటువంటి సంస్కృతివైపు పయనిస్తున్నాం. మన అదృష్టం కొద్దీ ఇప్పటితరంలో, ఒక మోస్తరువరకు ఇతరుల్ని తమతో కలుపుకుని సర్దుకుపోగల లక్షణం ఉంది. ఆ లక్షణం మనకు ఇళ్లలో నేర్పబడింది. మన ఇళ్ళలో  మన అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళతో, మిత్రులతో, ఇతర కుటుంబసభ్యులతో మనజీవితాలు ఎన్నోరకాలుగా ముడిపడి ఉండేవి. దానికి మనకు ఏ అభ్యంతరమూ ఉండేది కాదు.

ప్రపంచంలో ఏ ఇల్లైనా  సుఖానికీ, సహజీవనానికీ, ప్రేమకీ, కలిసి నివసించడానికీ నిర్మించబడినా, భారతదేశంలో దానికి మరొక అంశం తోడుగా ఉండేది.  ప్రతి ఇంటినీ పవిత్రపరిచే రోజులుండేవి. ఒక ప్రదేశంలో నివసించే ప్రజలందరి సంక్షేమమూ, ఎదుగుదలా, మానసిక వికాసమూ జరగడానికి అవకాశం కలిగించని చోట్ల నివసించడం చెడుగా పరిగణించే వారు. అందుకనే ప్రతి ఇంటిలోనూ ఒక పవిత్రస్థలం ఉండేది. ఇప్పటికీ దాని అవశేషాలు అక్కడక్కడ మిగిలున్నా, గతకొన్ని తరాలుగా  చాలా మార్పులు వచ్చేసాయి. ఉదాహరణకి, మా అవ్వ పూజ గది ఆ ఇంటిలోని గదులన్నిటిలోకీ పెద్దది. అక్కడ, ఆమె పాడేది, నృత్యంచేసేది, ఏడిచేది, నవ్వేది, ఇంకా చాలా చేసేది. మా అమ్మమ్మ దాన్ని సగానికి కుదించింది.  మా అమ్మ తన ఇల్లు మరొకచోట కట్టుకున్నపుడు,  పూజ గది, టాయిలెట్ కన్నా చిన్నదిగా ఉండేది.  నా కుమార్తె తన ఇల్లు కట్టుకున్నపుడు, పూజ గది, గోడమీద ఒక అల్మారా స్థాయికి పడిపోయింది.

కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం, మీ మతాధికారో, మీ పురోహితుడో, మీ గురువో, మీ పవిత్రగ్రంధమో మీగురించి ఆలోచించేవారు.  ఇపూడు అందరూ తమగురించి తామే ఆలోచించుకుంటున్నారు.

నా కళ్ళముందే, దివ్యత్వనికి ఉన్న ప్రాముఖ్యత ఈ నాలుగైదు తరాల్లో కుదించుకుపోయింది... ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకీ పెద్దగది స్థాయినుండి గోడమీద ఒక అలమరా స్థాయికి.  తర్వాతి తరంలో, ఆ అలమరా కూడ మాయమైపోతుందని నా అనుమానం. ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఒక స్థలంలో ఉన్న శక్తిని శుద్ధిచెయ్యడం అనే శాస్త్రీయ ప్రక్రియ ద్వారా జీవితాలని ప్రభావితం చెయ్యగల శక్తినుండి, కాలక్రమేణా, మనం వాటి అర్థాన్ని తర్వాతి తరాలకి అర్థం అయేలా చెప్పలేని చాలా మౌలికమైన విధానాలకి వచ్చేసాము. వాళ్ళకి ఏది అర్థవంతంగా కనిపించదో వాళ్ళు దాన్ని సహజంగానే నిరాకరిస్తారు. కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం, మీ మతాధికారో, మీ పురోహితుడో, మీ గురువో, మీ పవిత్రగ్రంధమో మీగురించి ఆలోచించేవారు.  ఇపూడు అందరూ తమగురించి తామే ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు సవ్యంగా ఆలోచిస్తున్నారా లేదా అన్నది వేరే ప్రశ్న, కనీసం వాళ్లగురించి వాళ్ళు ఆలోచించుకోగలుగుతున్నారు.

ఒకసారి మీఅంతట మీరు ఆలోచించడం మొదలుపెట్టాక, హేతుబద్ధంగా లేనిది ఏదైనా, అది ఎంతటివారు చెప్పినా దిగమింగుకోవడం కష్టం. మనం ప్రపంచాన్ని శాసనాధికారంలో ఉన్నవ్యక్తులు చెప్పినది సత్యం అన్న పరిస్థితినుండి ఏది సత్యమైతే అదే శాసనం అన్న స్థితిలోకి తీసుకుపోతున్నాం.  ఇది మంచి పరిణామమే గాని, ఈ రెండింటికీ మధ్యలో కొంత ఖాళి  ఉంది. అది మన ఇళ్ళల్లో ప్రతిబింబిస్తోంది. అక్కడ మన వారసత్వాన్నీ, కుటుంబ చరిత్రనీ, సంస్కృతినీ ప్రతిబింబిస్తూ, అందరూ అంత సులభంగా విశ్లేషించలేనివీ, కథనాలుగా చెప్పుకునే కొన్ని చిరు జ్ఞాపికలుంటాయి. తర్వాతి తరాలకి వాటి విలువ తెలియక, ఒక మూలపడేస్తున్నారు. తర్కించే బుద్ధి లక్షణం అదే.  అది ప్రతిదాన్నీ విశ్లేషిస్తుంది. నాకు మీ గురించి తెలుసుకోవాలనుకుంటే, మిమ్మల్ని ముక్కలుగా కోసిచూడడం ఉత్తమమైన మార్గం కాదు. కానీ తర్కించే బుధి చేసే పని అదే. చాలా విషయాలు తర్కానికి అర్థరహితంగా కనిపిస్తాయి. కానీ జీవితానికి అవి ఎంతో అర్థవంతమైనవి. మీ ఇంటిలో భాగమైన వ్యక్తులూ, వస్తువులూ, కట్టడాలూ తార్కికంగా చూసినపుడు అర్థంలేనివిగా కనిపించవచ్చు... కానీ అవే మీకు సర్వస్వం కావచ్చు.

మీ లోపలే మీరువెతికే ఆ ఇల్లు ఉందన్న సత్యం మీ జీవితకాలంలో  మీరు గ్రహించలేకపోతే, మీరు తెలుసుకోగలిగిన ఇల్లు మీ సమాధి ఒక్కటే.

చివరకి మనిషి నిజంగా  తెలుసుకోగలిగిన ఇల్లు తనలోపలే ఉందన్న సత్యాన్ని  గుర్తించగలిగే సంస్కారాన్ని అందజేయగల గర్భం(incubator) వంటి స్థలాలు కావాలి... అవే ఇళ్ళు. మీ లోపలే మీరువెతికే ఆ ఇల్లు ఉందన్న సత్యం మీ జీవితకాలంలో  మీరు గ్రహించలేకపోతే, మీరు తెలుసుకోగలిగిన ఇల్లు మీ సమాధి ఒక్కటే. మీ తర్కానికి లొంగలేదన్నమాత్రం చేత అది ఉండకూడదని అర్థం కాదు కదా. ఇల్లు ఈ భావననే నిరంతరం మనకి అవగాహన అయ్యేలా చేస్తోంది. ఒకరికి నచ్చినది మరొకరికి నచ్చదు, మరొకరికి నచ్చినది మొదటి వాళ్ళకి నచ్చదు.  అయినప్పటికీ ఇద్దరూ ఒకే ఇంటిలో ఉంటారు కనుక ఆ వైరుధ్యానికి రాజీపడిపోతారు. దాన్ని ఇష్టపడడానికి వేరే ప్రయత్నం చెయ్యనక్కర లేదు. మనకి ఇష్టంలేని వాటితో రాజీపడి సహజీవనం చెయ్యగలగడమే జీవితంలో నేర్చుకోవలసిన పెద్ద పాఠం. ఇల్లు మనల్ని ఒక స్థలానికి తీసుకువస్తుంది. మీరు మీకు కావలసినట్టుగా ప్రతి వ్యక్తీ, ప్రతి వస్తువూ ఉండాలనుకుంటే,  మీచుట్టూ ఒక్క మనిషికూడా ఉండరు.

ఎన్ని ఇళ్ళు వీలైతే అన్ని ఇళ్ళను పవిత్రంచేసే మన ప్రయత్నంలో, ఇళ్ళంటే గోడలూ, అందులోని అలంకరణలూ, దాని వాసనా, శబ్దాలూ, ఒక ఇంటి వాస్తూ కాదని మనకు తెలియజేసే శక్తిని మనం సృష్టిస్తున్నాం. చివరకి, ఇల్లంటే ఒక ఆవరణ; అది మిమ్మల్ని అంతర్ముఖులుగా చేసి, ఉన్నది ఒకే ఇల్లనీ, అది మీలోనే ఉందనీ తెలియజేసేదిగా ఉండాలి. ఆ ఇల్లు మీదీ కాదు, నాదీ కాదు. మీరు అంతర్ముఖులు కాగలిగినపుడు, మీరు అన్నిటినీ కలుపుకోగలిగిన వారవుతారు.  మనం మన శరీరాలతో గుర్తింపబూనుకోవడం వల్లనే, నేనూ, మీరూ అన్న స్పష్టమైన  సరిహద్దులు ఉంటున్నాయి. మీరు అంతర్ముఖులైనపుడు, మీలో చాలా ఉదాత్తమూ గంభీరమైన కలుపుగోలుతనం ఉంటుంది.  ఇల్లు అటువంటి సంస్కారాన్ని అందించాలి.  ఆ ఇల్లుకట్టడానికి వెచ్చించిన ధనం కంటే, ఆ ఇంట్లో ఉంటున్నవారి కలివిడిదనమే ఆ కట్టడాన్ని ఇల్లుగా తీర్చిదిద్దుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు