ఇటీవల ఒక పత్రికకు ముఖాముకిలో మతానికి సంబంధించిన ప్రశ్నలకి సద్గురు ఏమి చెప్తున్నారో ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకోండి.

ప్రశ్న: ఇటీవలి కాలంలో మనదేశమూ, సమాజమూ కొన్ని వివాదాల్లో చిక్కుకు పోతూ ఉంది, దీన్ని గురించి ఆలోచించినప్పుడు మతం ప్రజలకు మార్గాన్ని చూపేది కాకుండా ఘర్షణను సృష్టిస్తున్నట్లు కనిపిస్తున్నది.

సద్గురు: అన్ని మతాలూ ఆధ్యాత్మిక ప్రక్రియలుగానే ప్రారంభమయ్యాయి. కాని, కాలక్రమంలో అవి విశ్వాస వ్యవస్థలుగా మారిపోయాయి. తమ మౌలిక ఉద్దేశాల నుండి అవి పక్కకు జరిగి మనుషుల్ని విడదీసే పద్ధతులుగా తయారయ్యాయి. నేను కొబ్బరి చెట్టును దేవుడనుకుంటే మీరు ఒక శిలను దేవుడనుకుంటున్నారనుకోండి. ఇవ్వాళ మనమిద్దరమూ పరస్పరం బాగానే ఉన్నాం. కాని రేపు మీరు కొబ్బరి చెట్టును ఏదో కారణం చేత కొట్టి వేయాలనుకున్నారనుకోండి, అప్పుడు మనిద్దరం పోట్లాడుకోవలసి వస్తుంది. మీ అనుభవంలో లేని దాన్ని మీరు నమ్మడం మొదలు పెట్టిన్నప్పుడు, ఘర్షణ తలెత్తక తప్పదు. అందువల్ల జనం నిజాయితీగా ‘‘నాకు తెలిసిందేదో నాకు తెలుసు, తెలియందేదో నాకు తెలియదు’’ అని అంగీకరించగలిగిన స్థాయికి ప్రజలని తీసుకురావడానికే నా ప్రయత్నం. మీకు తెలియనప్పుడు మీరెందుకు పోట్లాడతారు? సాధనకు, జ్ఞానానికి పునాది ఇది. మనదేశం సత్యాన్వేషకుల, ముక్తి మార్గాన్వేషకుల దేశం. దీన్నో, దాన్నో విశ్వసించడమన్నది కొత్త విషయం.

ప్రశ్న:  బ్రతుకు తెరువు సంపాదన కోసం, కుటుంబ బాధ్యతల నిర్వహణలో మునిగి ఉన్న గృహస్థులు మతం విషయంలోనూ, రోజు వారీ ప్రవర్తన విషయంలోనూ ఎలా ఉండాలి?

సద్గురు: నిజంగా మతాన్ని అనుసరించడానికీ, మనం ఇప్పుడు మతంగా అనుసరిస్తున్నదానికీ భేదం ఉంది. ఒక సమూహానికి చెంది ఉండడం గాని, నినాదాలు చేయడం గాని ఒక వ్యక్తిని మత నిష్ఠాపరుణ్ణి చేయవు. మత నిష్ఠ కలిగి ఉండడమన్నది ఒక విశిష్ట లక్షణం, అది మన అంతరంగంలోకి మనం ఒక అడుగువేయడం. మీ జీవితపు బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీరు ఈ అడుగు వేయవచ్చు. మీరు ఈ అడుగు వేయకపోయినట్లయితే మీరు గుడికో, చర్చికో, మసీదుకో దేనికి వెళ్లినప్పటికీ ఏ ప్రయోజనమూ ఉండదు. మీరక్కడికి మనశ్శాంతి కోసమో, భయంతోనో, నేర భావనతోనో, దురాశతోనో వెళతారు. ఇది మతం కాదు. నిజమైన మతం అంటే మీరు అంతర్ముఖులవ్వడం. యోగా కేవలం శాస్త్రం, అది పూర్తిగా వైజ్ఞానికం, అందులో ఎటువంటి విశ్వాస వ్యవస్థా ఉండదు. దానికి కావలసింది మీరు మీ వివేకాన్ని ఉపయోగించడం, మీ అంతరంగంలో మీరు ప్రయోగాలు చేయడం.

ప్రశ్న:  భారతదేశం వంటి ప్రజాస్వామిక దేశంలో, సమాజంలో మతపరమైన ఉన్మాదాన్ని తగ్గించడానికీ, భిన్న మతస్థుల మధ్య సోదర భావాన్ని పెంపొందించడానికీ ప్రభుత్వమూ, సమాజమూ ఏం చేయాలి?

సద్గురు: మీరు ఈ దేశంలో భాగం కావాలంటే మీ కులం, మతం, వర్గం, లింగం ఏదైనప్పటికీ మీ మొదటి నిబద్ధత దేశానికే అయి ఉండాలన్నది మొదటి నియమం. మనం ఈ విషయం మీద దృష్టిపెట్టకపోవడం వల్లనే భారతదేశం రక్తమోడుతూ ఉంది. దేశ ప్రయోజనం కంటే మరొకదానికి ప్రాధాన్యమిచ్చిన ప్రతివ్యక్తి పట్లా వ్యవహరించవలసిన తీరులోనే వ్యవహరించాలి. ఒకసారి మనం ఈ దేశంలో భాగంగా ఉండడానికి నిశ్చయించుకున్న తర్వాత ఈ దేశ రాజ్యాంగంలో లిఖించబడిన పౌరహక్కులనూ, స్వేచ్ఛలనూ గౌరవించడానికి అంగీకరిస్తున్నామన్నమాట. మీరు ఈ దేశాన్ని అధిగమించి ఒక గుర్తింపు పొందాలనుకుంటే ఒక మనిషిగా ఆ గుర్తింపు ‘నేను విశ్వమానవుణ్ణి’ అన్నది. ఇక్కడ నివసించే ప్రతి మనిషికీ ఈ విషయం స్పష్టం చేయాలి, లేకపోతే ఈ దేశాన్ని ముందుకు తీసికొని వెళ్లలేరు. ప్రతి మానవ బృందమూ భిన్న మార్గాల్లో దేశాన్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది.

ప్రశ్న:  భారతీయ టెలివిజన్‌లో మతపరమైన ఛానళ్లు, ప్రసంగాలు ప్రారంభమైనప్పటి నుండి స్వయం ప్రకటిత మత గురువులూ, దేవుడి అవతారాలూ ఎక్కువై పోయారు. దీని గురించి మీరేమంటారు?

సద్గురు: అమెరికాలో ఇంతమంది స్కూల్ టీచర్లున్నారెందుకు? అని అడిగినట్లుంటుందిది. వాళ్లు ఒక పద్ధతిలో తమ పిల్లలకు చదువు నేర్పాలనుకుంటున్నారు కాబట్టి. అదే విధంగా మన గురువులు. నేను మన బాబాల గురించి మాట్లాడడం లేదు. దురదృష్టవశాత్తు 120 కోట్ల మందికి ఉండవలసినంతమంది గురువులు మనకు లేరు. ప్రతిమనిషికి ఒక ఆధ్యాత్మిక సంభావ్యత లభించేటట్లు చేయడానికే గురువులు. అందువల్ల ఖచ్చితంగా మనకు మరింత మంది గురువులు కావలసిందే. ఇంత పెద్ద జనాభా అవసరాలకోసం వేలాదిమంది నిజమైన గురువులు రావాలని నేను కోరుకుంటాను. ఈ సంభావ్యతను మనం అనేక మార్గాల్లో అందించాలి. ఎందరో ఆధ్యాత్మిక వ్యాపార వేత్తలు పుట్టుకు రావడం మన దురదృష్టం.

ప్రశ్న:  భారతదేశం వంటి సెక్యులర్ దేశంలో, ప్రజలకు సరైన మార్గం చూపడంలో మత నేతల పాత్ర ఏమిటి? ఈ నేపథ్యంలో ప్రస్తుత మతనేతల పాత్ర ఎలా ఉండాలని మీరనుకొంటున్నారు?

సద్గురు: మతం అనేది మీ అంతర్ముఖంలోకి తీసుకునే అడుగు. అంతర్గత స్వభావాన్ని మీరు అన్వేషిస్తున్నారంటే మీరు మత నిష్ఠ కలిగినవారే. కాని ఇవ్వాళ మనం కొన్ని విశ్వాసాల మీద ఆధారపడిన ఒక ప్రత్యేక మతాన్ని నిర్వచిస్తున్నాం. భిన్న విశ్వాసాలను బట్టి ప్రజలను గుర్తించేటట్లయితే అది చివరికి ఘర్షణ గానే ముగుస్తుంది. అందువల్ల మతం సామరస్య రాహిత్యానికి కారణమవుతుంది. ఈ ప్రాథమిక సమస్యను మనం పరిష్కరించుకోవాలి. మనం ఏదో అతుకుల బొంతలాగా వారిని కలిపితే  అది ఎక్కువ రోజులు నిలవదు, వాళ్లు మళ్లీ ఘర్షణకు దిగుతారు. మనిషి తనలోపల తాను నిజంగా సామరస్యంగా ఉన్నప్పుడు మాత్రమే బయట సామరస్యం ఏర్పడుతుంది. నిజమైన మతం ఖచ్చితంగా సామరస్య పూరితమే. ఎందుకంటే వ్యక్తి తన అంతరంగంలోకి అడుగువేసి తన వెలుపల కాక లోపలే ఆనందమూలాన్ని అన్వేషిస్తాడు కాబట్టి అతను స్వాభావికంగానే సామరస్యంతో ఉంటాడు. మీ లోపలి మార్గంలో మీరెవరికీ అడ్డుండరు. మతనేతలు ఈ అంతరంగాన్వేషణను ప్రోత్సహించాలి.