ఈ 12 సంవత్సరాల గ్రామోత్సవ కార్యక్రమాల్లో, వీరేందర సెహ్వాగ్, సచిన్ తెందూల్కర్, సింధు, మొదలైన గొప్ప గొప్ప క్రీడాకారులు తమజీవితాల్లో క్రీడల ప్రాముఖ్యత, అవి ఇతర పార్శ్వాల్నీ ఎంతగా ప్రభావితం చేశాయో చెప్పారు. ఈ సారి మంత్రివర్యులు శ్రీ  రాజ్యవర్థన్ రాథోర్ మరియు శ్రీమతి కిరన్ బేడీ మన మధ్య తమ అనుభవాల్ని పంచుకున్నారు. క్రీడల తత్త్వమే అది. తాము ఆడే క్రీడ గురించి ప్రతి క్రీడాకారుడూ అనుభూతిచెందేది అదే. ఒక ఆట ఆడడం ద్వారా కలిగే ఆనందాన్ని ప్రతి వ్యక్తీ జీవితంలో అనుభవించాలి. చాలా ఏళ్ళక్రితం, మొదటిసారి మేము 14 రోజుల ఈ ఈషా యోగా కార్యక్రమం రూపకల్పన చేసినపుడు దాన్ని ఒక క్రీడగానే రూపుదిద్దాము. మొదటి రోజు దానికి కావలసిన మార్గదర్శక సూత్రాలు తయారుచేశాము. ఒక ఆటని అది ఆడవలసిన మార్గదర్శకాలే నిర్ధారిస్తాయి. ఒక టెన్నిస్ అయినా, క్రికెట్ అయినా, ఫుట్ బాల్ గాని మరే ఇతర క్రీడ అయినా దానికి కొన్ని స్పష్టమైన నియమాలు ఆ క్రీడని నిర్వచిస్తూ ఉంటాయి. ఆ నియమాలు మనం ఏర్పాటు చేసినవే అని తెలుసు, అయినప్పటికీ, ఆ ఆట బాగా ఆడాలంటే, వాటిని దైవశాసనంలా శిరసావహించి ఆడవలసిందే.

ఒక ఆటని అది ఆడవలసిన మార్గదర్శకాలే నిర్ధారిస్తాయి.

స్వామి వివేకానంద "మీరు భగవద్గీతను అభ్యసిస్తున్నప్పటికంటే, ఫుట్ బాల్ ఆటద్వారా స్వర్గానికి చేరువగా ఉంటారు," అని అన్నారని మీకు తెలిసే ఉంటుంది. మీరు ప్రార్థిస్తున్నపుడు, ప్రార్థనతోపాటు చాలా విషయాలు చేసే అవకాశం ఉంది. కానీ, మీరు బంతిని కాలితో తన్నినపుడు "తన్నడమనేది" అదొక్కటే చెయ్యగలరు. అలా చెయ్యకపోతే, అది మీరనుకున్నచోటుకి వెళ్ళదు. ఒక ఆట ఆడడం దానిలో మనసును పూర్తిగా లగ్నం చెయ్యకపోతే గెలవలేమన్న సత్యాన్ని బోధిస్తుంది. మీరు మీ జీవితం దానిమీదే ఆధారపడి ఉన్నదన్నట్టు ఆడతారు. గణాంకాలు మొన్న ప్రపంచ కప్పు ఫుట్ బాల్ ఫైనల్ ని 3.2 బిల్లియన్ల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చూసారని చెబుతున్నాయి. అది సుమారుగా ప్రపంచ వయోజన జనాభాలో సగం. ఈ 3.2 బిల్లియను జనాభా, 11 మంది ఆటగాళ్ళు బంతిని ఒక వైపునుంచి రెండోవైపుకీ, మరో 11 మంది ఆటగాళ్ళు, రెండోవైపునుండి మొదటివైపుకీ తన్నడాన్ని వీక్షించారు. అయితే, మీరొక తాత్త్వికమైన ప్రశ్న వెయ్యవచ్చు, "అయితే ఏమిటిట?" అని. ముఖ్యంగా మనం బంతి బాగుందనో, ఆటగాడి నైపుణ్యం బాగుందనో చూడం; అతను తన జీవితం దాని మీద ఆధారపడి ఉన్నట్టు ఆడడాన్ని చూస్తాం. అందులో వాళ్ళు నిమగ్నమై ఆడడంవల్ల, ప్రపంచ యావత్తూ లేచికూచుని శ్రద్ధగా గమనిస్తుంది.

మీరు నియమాలని ఉల్లంఘిస్తే, మీరు ఆ ఆటకి నష్టం కలిగిస్తారు. ఇది ప్రతి భారతీయుడూ గమనించవలసిన విషయం... అది వీధిలో కారునడుపుతున్నా, మన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా, మరే ఇతర వ్యాపకం చేస్తున్నప్పటికీ. మీరు నియమాలని ఉల్లంఘించడం ద్వారా దేశాన్ని దెబ్బతీస్తారు.  ప్రతిభావంతంగా నడుస్తున్న దేశాలు, కేవలం అక్కడి ప్రజల సంక్షేమమనే సంకుచిత దృష్టితో చూసినప్పటికీ, అన్నీ చట్టాన్ని అమలుపరచగలుగుతున్న దేశాలే. దానర్థం అందరూ చట్టాన్ని అనుసరించాలి. ఇక్కడ భారతదేశంలో, మనకి నియమాల విషయంలో ఎప్పుడూ సందిగ్ధమే. దురదృష్టవశాత్తూ, చాలామంది మనసుల్లో ఇప్పటికీ నియమాలని పాటించాలా వద్దా అన్నది తేల్చుకోలేని ప్రశ్నే. ఏ నియమాలూ లేకుండా ఏ ఆటా ఉండదు. మీరు మీ కార్యాలయానికి అన్యమనస్కులుగా వెళ్లవచ్చు. మీరు జీవితాన్ని అన్యమనస్కంగా గడపొచ్చు. మీరు అన్యమనస్కంగానే వివాహమూ చేసుకోవచ్చు. కానీ ఆటని మాత్రం అన్యమనస్కంగా ఆడలేరు. మీరు అందులోకి పరిపూర్ణమైన మనసుతో దూకాలి. లేకపోతే, ఆటే ఉండదు.

ఈషా గ్రామోత్సవాలు జరిగిన ఈ 12 సంవత్సరాలూ ఒక గొప్ప ప్రయాణం. కొంత కాలంగా ఆడుతున్న క్రీడాకారులను గమనిస్తే, జీవితం పట్ల, ఇతర వ్యక్తులపట్ల వాళ్ళ దృక్పథం... సంకుచితమైన కుల, వర్గ, లింగ భేదాలకి అతీతంగా ... ఒక పరిణామం. జీవితంలోకి క్రీడాస్ఫూర్తిని ఆహ్వానించండి. మీకు పెద్ద ఆటవస్తువులూ, పరికరాలూ అక్కరలేదు. ఒక్క బంతి చాలు. మీ పిల్లడితోనో, భార్యతోనో, భర్తతోనో, బంతి విసురుతూ ఆడండి. బంతి లేకపోతే బంగాళాదుంపయినా ఫర్వాలేదు, మరొకటైనా పర్వాలేదు.  ఇది హాస్యాస్పదం అనుకోకండి. చలాకీగా ఉండండి. అది లేకపోతే, జీవితమే లేదు. మీరు జగజ్జెట్టీ కానక్కరలేదు. మీరు ఒక ఆటగాడు/ఆటగత్తె. అదొక్కటి చాలు. మనందరం క్రీడాస్ఫూర్తిగలిగిన దేశంగా అభివృద్ధి చెందడం అవసరం. భారతదేశంలో ఈ క్రీడాస్ఫూర్తి నశించడానికి కారణం, ఒకప్పటి బానిస దేశంగా, 8 నుండి 10 తరాలపాటు అతి దీనంగా, దుర్భర దారిద్ర్యంలో బ్రతకడం వల్ల, మనకి క్రీడాస్ఫూర్తికంటే, బ్రతకడమే పరమావధి అయిపోయింది.

ఏ కారణమూ అక్కరలేకుండానే ఆడుతూ పాడుతూ ఉన్న మనుషులు నడిచిన నేల ఇది. ఈ నేలమీద ప్రతి వ్యవసాయ కార్యక్రమానికీ ఒక ప్రత్యేకమైన ఆట, పాట ఉండేది. అందులోని తాదాత్మ్యమే మనిషి తన అవధులుదాటి ప్రయత్నించడానికి తోడ్పడేది. అసలు ఆధ్యాత్మిక ప్రక్రియ లక్ష్యమే, మనిషి తనకున్న భౌతిక పరిమితులు అధిగమించి, అంతవరకు తనకి తెలియని కొత్త పరిమాణాన్ని అనుభూతి చెందగలగడానికి ప్రోత్సహించడం. దీనినే క్రీడలు కూడా మీకు అందిస్తాయి. గెలవాలన్న తపనలేకపోతే, ఏ క్రీడా లేదు. ఎప్పుడూ మీరే గెలవాలనుకున్నా ఏ ఆటా లేదు. జీవితంలో ఏ పార్శ్వానికైనా ఇది వర్తిస్తుందన్న ప్రాథమిక సత్యాన్ని ప్రతివారూ గుర్తించాలి. మీరు గెలవాలనుకుని ఆడినపుడే మీరు సఫలురవుతారు. కానీ, మీరు ఒకవేళ ఓడిపోయినా, దానికి బాధపడకూడదు.

మనం మన పూర్వీకుల సంగీతాన్నీ, నృత్యాన్నీ, ఇతర కళలనీ కోల్పోతే, మన నాగరికత, సంస్కృతికి ఆయువుపట్టు కోల్పోయినట్టే.

మనం మన పూర్వీకుల సంగీతాన్నీ, నృత్యాన్నీ, ఇతర కళలనీ కోల్పోతే, మన నాగరికత, సంస్కృతికి ఆయువుపట్టు కోల్పోయినట్టే. దాన్ని పునరుద్ధరించవలసిన అవసరం, ముఖ్యంగా, గ్రామసీమల్లో ఉంది. లేకుంటే, మనదేశంలో వ్యవసాయం మనిషి జీవాన్ని హరించేంత కష్టమైన పని. అందుకనే, వేలమంది రైతులు ప్రతి ఏడూ ఆత్మహత్యలు చేసుకోవడంలో వింతలేదు. కేవలం సంగీతం, నృత్యం, కోలాహలంగా పండగచేసుకోవడం, అందులో పరిపూర్ణమైన నిమగ్నతతోనే ఏ వ్యక్తి అయినా వ్యవసాయం చెయ్యడం సాధ్యపడుతుంది. లేకపోతే, అందరూ నగరాలకి పరిగెత్తుతారు. అందరూ నగరాలకు వస్తే, సూపర్ మార్కెట్లలో కొనడానికి ఏదీ దొరకదు. ఈ రోజు సూపర్ మార్కెట్లలోని అల్మారాలన్నీ నిండుగా ఉంటున్నాయంటే, దానికి సగం తినీ తినక, ఆత్మహత్యచేసుకోవడం తప్ప గత్యంతరంలేని దుస్థితిలో బ్రతికే రైతులే కారణం.

వాళ్ళ జీవితాలను మనం మార్చవలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళ ఆర్థిక దుస్థితి మనం ఒక్క రోజులో మార్చలేకపోవచ్చు. కానీ వాళ్లు ఆడుతూ పాడుతూ ఉండేలా చెయ్యగలం; ఆటలు ఆడేలా చెయ్యగలం; బంతి విసరి, వాళ్ళలో క్రీడాసక్తి కలిగేలా చెయ్యగలం. మనకి సంబరం చేసుకునేందుకు కారణం అక్కరలేదు. మన సంస్కృతిలో ప్రతి రోజూ ఒక సంబరమే. మనం మన పనినీ, దానితోపాటు, మనజీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నిటినీ సంబరాలుగా చేసుకున్నాం. మనది క్రీడాస్ఫూర్తి కలిగిన దేశం. ఇప్పుడిప్పుడే, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నందున, ఇప్పుడు ఆటలను కూడా జీవితంలో ఒక భాగంగా చెయ్యడం ఎంతైనా అవసరం. నా ఉద్దేశ్యంలో రాబోయే 5-10 సంవత్సరాల్లో, మనం ఆర్థికంగా బాగా పుంజుకుంటాం. కానీ మనం ఎటువంటి పరిస్థితికి వస్తున్నామంటే, మనం ఒక మనిషి నృత్యం చెయ్యాలంటే, అతనికి మద్యం తాగించవలసి వస్తోంది. దీనినే ఈషా మార్చడానికి ప్రయత్నిస్తోంది. మీరు ఏ కారణం అక్కరలేకుండా నృత్యం చెయ్యగలిగిన చోటికి మిమ్మల్ని తీసుకు వస్తున్నాం. ఇతరులు ఏమనుకున్నా అనుకోనీండి. నాకు ఈ దేశంలో ప్రతి వ్యక్తీ ఏ కారణమూ అవసరం లేకుండానే, ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, ఉత్సాహంగా ఉండాలనిపిస్తోంది.

పండగచేసుకునేందుకు జీవించి ఉండడాన్ని మించిన కారణం అవసరం లేదనిపిస్తుంది. ఈషా గ్రామోత్సవం వెనుకనున్న అంతరార్థం ఇదే. అందుకనే గ్రామీణ జీవితానికున్న అన్ని పార్శ్వాలనూ ఇందులో జోడించాము. తమిళనాడులో ఎన్నో కళారూపాలూ, ఎన్నో ఉత్సవాలూ ఉండేవి. అందులో కొన్నైనా గ్రామాల్లో సజీవంగా ఉండడానికి కృషిచేస్తున్నాము. సామాన్య మానవులకి వాళ్ల సంస్కృతి అంతరిస్తే, వాళ్ళ మనసు విరిగిపోతుంది. మనసులేక జీవించే సమాజం ఎంతో ప్రగతి సాధించలేదు. అటువంటి సమాజాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించాలంటే, దానికి చాలా దృఢచిత్తం కావాలి.

పిల్లల భవిషత్తుకీ, మనదేశప్రగతికీ, మనం ఉల్లాసంగా ఆటలాడగలగడం అవసరం. జీవితంలోని చాలా కష్టాలనీ, దేశంలోని కొన్ని భయానకమైన పరిస్థితులనీ, మన సమాజం క్రీడాస్ఫూర్తిగల దానిగా తీర్చిదిద్దగలిగితే, నివారించవచ్చు. మనకి ఆ ఉల్లాసమే లేకపోతే, ఎంతో సాధారణమైన జీవితము, బరువుగా, నిర్జీవంగా కనిపిస్తుంది. మీరందరూ, మీ ఇళ్ళలోనూ, జీవితాలలోనూ కొంత క్రీడాస్ఫూర్తిని తీసుకు వస్తానని కంకణం కట్టుకోవాలి. గ్రామోత్సవం లక్ష్యం గ్రామీణ జీవితాల్లో ఇటువంటి పునరోత్సాహాన్ని తీసుకురావడం. అనేక కారణాలవల్ల ఒక దేశంగా మనం గ్రామీణులకి వాళ్ళు గౌరవప్రదమైన జీవితం గడపడానికి కావలసిన ప్రాథమిక సౌకర్యాలను కల్పించడంలో విఫలమౌతున్నాం. మనం కనీసం, వాళ్ళ జీవితాల్లోకి  ఆట, పాట, నృత్యం, సంస్కృతి తీసుకురావాలి.  4,500 గ్రామాలను స్పృశించగలగడం గొప్పవిషయంగా ఇప్పుడందరూ భావిస్తున్నారు. కానీ, ఒక్క తమిళనాడు లోనే 53000 గ్రామాలున్నాయి. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు ప్రభుత్వ సహకారంతో వెళుతున్నాం. మనం పుదుచ్చేరిలో కూడా ఇటువంటి కాంక్ష రగిలించగలమని భావిస్తున్నాను.

ఈ గ్రామోత్సవం పదిమందికీ చేరేలా మీరు ఏ రకమైన సహాయం చెయ్యగలిగితే  ఆ రకమైన సహాయం చెయ్యవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.  మనం తిరిగి క్రీడాస్ఫూర్తిగలిగిన దేశంగా ఎదగాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు 

ముఖ్య అతిధులు 

రాజ్యవర్థన్ రాథోర్: ఒలింపిక్  పతకం విజేత, ప్రస్తుతం కేంద్ర ఐ టి మరియు బ్రాడ్ కాస్టింగ్  మంత్రి.

కిరన్ బేడీ: ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మరియు రిటైర్డ్ ఐ పి ఎస్ ఆఫీసర్, సంఘ సంస్కర్త , ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి.