2016 లో యక్ష, మహాశివరాత్రి  సందర్భంగా  సుప్రసిద్ధ ఫాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ ఈశా యోగా కేంద్రంలో ఉన్నారు.  ఆ సందర్భంలో అందం, డిజైన్, ఫాషన్, యోగాల గురించి సద్గురుతో ఆయన సంభాషించారు. ఆ సంభాషణ నుండి ఒక భాగం మీ కొసం ఈ అర్టికల్  లో అందిస్తున్నాము.

మోడరేటర్: అందం అంటే మీ అభిప్రాయం ఏమిటి?

సవ్యసాచి ముఖర్జీ: అందం గురించి ఇప్పటి వరకూ ఎందరో, ఎన్నో విధాలుగా రాశారు. కాని నేనెప్పుడూ అందం అనేది మీ అంగీకారం నుండే, మీ సౌకర్యస్థాయి నుండే అనుభూతమవుతుందని అనుకుంటాను. మీరు ఎవరు అన్న  విషయం పట్ల మీరు సౌకర్యంగా, సుఖప్రదంగా ఉంటే మీకు చాలా అందంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఐదడుగుల ఒక అంగుళం ఉన్న మహిళ ఎత్తుమడమల చెప్పులు ధరించకుండా మామూలు చెప్పులతో ఒక పార్టీకి వెళితే దాన్ని నేను ఒక విశిష్టశైలిగా భావిస్తాను. మిమ్మల్ని మీరు అంగీకరించినప్పుడు, మీ ఆత్మవిశ్వాసస్థాయి ఇతరులను మీవైపు ఆకర్షిస్తుంది, బహుశా నిజమైన అందం అదే అయి ఉంటుంది.

మోడరేటర్: మరి పురుషుడిలో అందం ఏమిటి?

సవ్యసాచి ముఖర్జీ: అది కూడా అతని సౌకర్యమే అని నేననుకుంటాను. ఇవ్వాళ ప్రపంచంలో మనందరి విషయంలో ఏం జరుగుతున్నదో చూడండి. మీకో చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను యోగాభ్యాసం చేయను, నా శరీరం పట్ల మరీ జాగ్రత్త కూడా వహించను, నా పని ఒత్తిడి అంతగా ఉంటుంది. నేనిప్పుడు ధ్యానలింగం వద్ద గంట మోగే వరకూ కూర్చున్నాను – చాల కలం తరువాత  నాకోసం నేను గడిపిన పదిహేను నిమిషాలివి. మనలో చాలామందికి మనం అందంగా ఉన్నం అన్న  అనుభూతి లేదు – అందుకే మంచి దుస్తులు, విలువైన బ్రాండ్ల వస్తువులు, ఫాషన్లను ఉపయోగిస్తూ ఉంటాం, బాగున్నామని అనుకోవడానికిది ఒక రక్షణ కవచం, అది అసలు మనకేమైనా ఉపయోగపడుతున్నదా లెదా అన్న స్పృహ కూడా మనకుండదు. పైగా అది కాలక్రమంలో మన ఆత్మవిశ్వాసాన్ని కూడా పోగొడుతుంది. అందువల్ల స్త్రీఅయినా, పురుషుడయినా అందం అన్నది మనం ఎంత సౌకర్యంగా, సుఖప్రదంగా ఉన్నామన్న దానితో ప్రారంభమవుతుంది.

మోడరేటర్: సద్గురు, అందమంటే ఏమిటి?

సద్గురు: చూసే కన్ను ఉండాలే కాని ప్రతిదీ అందమైందే – అది ఒక యంత్రం కావచ్చు, చీమ కావచ్చు, గొల్లభామ కావచ్చు, మనిషి కావచ్చు, దుస్తులు కావచ్చు, భవనం కావచ్చు – అతి స్వల్పమైన ఘర్షణతో, ఏది ఇమడగలుగుతుందో  అదెప్పుడూ అందంగా కనిపిస్తుంది. నా బాల్యం నుండీ నేను అన్నిరకాల ప్రాణులనూ గమనిస్తూ ఎంతో సమయం గడిపాను. అతి చిన్నప్రాణి కూడా - దాని రంగు, ఆకారం, కార్యకలాప వైవిధ్యం ఎంత అద్భుతంగా డిజైను చేసి ఉన్నాయో తెలుసుకున్నాను. మీరు ఎటువంటి ప్రాణినైనా చూడండి. ప్రకృతి, జీవ పరిణామం దాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాయో తెలుస్తుంది. సూర్యోదయమో, సూర్యాస్తమానమో లంటి  పెద్ద విషయాలే అవ్వకర్లెదు, అత్యంత సూక్ష్మ జీవుల నిర్మాణం కూడా అద్భుతంగా ఉండడం మీరు గమనించగలరు.

మీరు ఒక ప్రాణి కార్యకలాపాన్ని కొలిచి చూడండి. అది చిన్న కీటకమైనా చాలు. దాని పరిమాణం, అది ఉపయోగించే ఆహారం, జ్యామితీ పరంగా అత్యంత సమగ్రం, అతి తక్కువ ఘర్షణతో అవి పనిచేస్తాయి. చక్కగా నిర్మితమై ఉన్నది ఎదైనా సరే, నాలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది – అది ఒక యంత్రం కావచ్చు, భవనం కావచ్చు, కీటకం కావచ్చు, జంతువు కావచ్చు, మనిషి కావచ్చు. ఇక మనుషుల విషయానికి వస్తే – వాళ్లు సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు వాళ్ల ముఖాలు అందంగా కనిపిస్తాయి. శరీరాన్ని అందంగా ఉంచుకోవాలంటే కొంచెం పనిచేయడం అవసరం. ఇప్పుడు చాలామంది ఈ భూగోళపు ఆకారం తీసికోవడానికి ప్రయత్నిస్తున్నారు. మా చిన్నతనంలో మేం పెరిగే వయస్సులో ఉన్నప్పుడు మా చర్మం ఎముకలకు అతుక్కుపోయి, సన్నగా ఉండే వాళ్లం. ఎందుకంటే, బోలెడంత శారీరక కార్యకలాపం ఉండేది. ఇవ్వాళ బడి పిల్లలలో ఎక్కువ మంది వయసుకు మించిన బరువుతో కనిపిస్తున్నారు.

ఒక వ్యవస్థ అత్యల్పమైన ఘర్షణతో పనిచేస్తూ ఉన్నదంటే, ఆ పని చేసే విధానమే అందమైనది.

అంటే గుండ్రంగా ఉన్న వ్యక్తి అందంగా లేనట్లు కాదు. మీరు దేన్నయినా అందంగా ఉన్నట్లు భావించవచ్చు. కాని సాంకేతిక పరిభాషలో మీరు అందం గురించి మాట్లాడుతున్నట్లయితే, అది ప్రధానంగా జ్యామితీయ సమగ్రత గురించి అని నేననుకుంటున్నాను.  ఒక వ్యవస్థ అత్యల్పమైన ఘర్షణతో పనిచేస్తూ ఉన్నదంటే, ఆ పని చేసే విధానమే అందమైనది. అన్నిటి విషయంలోనూ అంతే. ఉదాహరణకు ధ్యానలింగం పైకప్పు దాని నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రి దృఢత్వం వల్ల నిలవడం లేదు. అది దాని జ్యామితీయ సమగ్రత వల్ల నిలిచి ఉంది. ఆశ్రమంలోని ఇతర భవనాలన్నిటికీ కూడ ఈ సూత్రం వర్తిస్తుంది. ఉదాహరణకు వంపు దూలాలతో నిర్మించిన ఆదియోగి ఆలయాన్ని తీసికోవచ్చు. మేము ప్రతి నిర్మాణం విషయంలోనూ అది జ్యామితీయ సమగ్రతతో ఉండేటట్లు జాగ్రత్త తీసికొంటాం. అప్పుడూ తక్కువ సామగ్రితో దాన్ని నిర్మించగలం.

పరిణామ ప్రక్రియ ఎల్లప్పుడూ జ్యామితి వైపే చూస్తుంది. భూగ్రహం ఒక విధమైన జ్యామితీయ సమగ్రతను సాధించింది కాబట్టి తన భ్రమణ మార్గంలోనే నిలిచి పరిభ్రమించ గలుగుతుంది. అది తన కక్ష్య నుండి ఏమాత్రం జరిగినా మళ్లీ తన మార్గంలోకి చేరుకోలేదు. మొత్తం విశ్వంమే ఒక జ్యామితీయ సమగ్రతతో కూడుకొని ఉంది. నేను దేనివైపు చూసినా – అది చెట్టు కావచ్చు, మబ్బు కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు మరేదైనా కావచ్చు – నేను అందులో మొదట చూసేది దాని జ్యామితి, తక్కినదంతా ఆ తర్వాతే. సృష్టిలో ఉన్న ఏ వస్తువయినా సరే, ఏదోవిధమైన జ్యామితీయ సామరస్యం లేకపోయినట్లయితే అది ఏదయినప్పటికీ మనలేదు. మొత్తం యోగవ్యవస్థ అంతా కూడా మీ శరీరాన్ని విశ్వజ్యామితితో క్రమబద్ధమైన కూర్పులో ఉంచుకోవడమే. అప్పుడు మీరిక్కడ రెండురోజులు కూర్చున్నా మీకే సమస్యా ఉండదు, ఎందుకంటే మీ శరీర జ్యామితి విశ్వజ్యామితితో క్రమబద్ధమై ఉంటుంది కాబట్టి.

మోడరేటర్: మీరిద్దరూ మీ సమాధానాల్లో కళాత్మక సౌందర్యాన్ని ఒక ప్రత్యేక వర్గంగా పేర్కొనకపోవడం ఆసక్తిదాయకం. చాలా మంది దృష్టిలో ఉపయోగికత, కళాత్మకత ఏదో పద్ధతిలో భిన్నమైనవి. సవ్యసాచీ, మీరు సౌకర్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఉపయోగికతనే కళాత్మకతగా చెప్తున్నారు. సద్గురు, మీరు కూడా దాన్ని మరింత ప్రాథమికంగా, మౌలికంగా చెప్తున్నారు. అసమర్థత అందంగా ఉండగలదా? తన మొక్కకు తప్ప ఏవిధంగానూ, ఎవరికీ ఉపయోగకరం కాని పుష్పం గురించి నేను ఆలోచిస్తున్నాను. దాన్నే ఉదాహరణగా తీసికొంటే అది క్రమబద్ధమైన నిర్మాణంతోనూ, జ్యామితీయ సమగ్రతతోనూ ఉందికాబట్టి చూసేవాడికి అసాధారణ సుందరవస్తువుగా కనిపిస్తుంది – అదే కదా మీరు చెప్తున్నది?

సద్గురు: పుష్పం చాల సున్నితమైంది. తన ప్రయోజనాన్ని నిర్వహించేంత వరకు అవసరమైనంత కాలం అది స్వస్వరూపంతో మనగలుగుతుంది. అది నిర్మితమైన సామగ్రి దృష్ట్యా అది చాలా బలహీనమైనది, జ్యామితీయ సామరస్యం లేనట్లయితే ఇది సాధ్యం కాదు. వాస్తవానికి ప్రకృతిలోని సర్వవస్తువులూ జ్యామితీయ సామరస్యంతోనే ఉంటాయి, వాటి నిర్మాణంలో ఉన్న శక్తి  అటువంటిది.