సద్గురు లెబనన్ లోని బాల్బెక్ నగరపు (బృహస్పతి దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన) కట్టడం గురించి మాట్లాడుతున్నారు. నిజానికి ఆ కట్టడం కొన్నివేల సంవత్సరాల క్రితం యోగులచే నిర్మితమైన దేవాలయం.

బాల్బెక్ ఒక అపూర్వమైన కట్టడం. అందరూ తప్పకుండా చూడవలసినది. అందులో కొన్ని శిలలు 800 టన్నుల బరువుంటాయి. ఒక్కసారి ఊహించుకొండి: ఏ రకమైన సాధనాలూ లేకుండా, అంటే క్రేన్లు గాని, ట్రక్కులు గాని, తరలించడానికి పెద్ద పెద్ద ఓడలు గాని లేని రోజుల్లో, ఇటువంటి కట్టడాన్ని నిర్మించ తలపెట్ట సాహసించిన ఆ మనుషులు ఎటువంటివారై ఉంటారు? ఖచ్చితంగా కేవలం డబ్బు గురించీ తిండి గురించీ ఆలోచించే వాళ్ళు మాత్రం కారు.

గురుపూజ కేవలం భావావేశాన్ని సంతృప్తి పరుచుకోవడానికి కాదు. అది ఒకానొక అవకాశాన్ని సృష్టించగల విధానంలో ఒక భాగం.

ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, మీరు పైకప్పు వంక చూస్తే, దేవాలయం లోపల పైనుండి రాతి కలువలు వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. "మిడిల్ ఈస్ట్"  గా పిలవబడే మధ్య ఆసియా (ఎడారి) ప్రాంతంలో కలువపూలు దొరకవనుకొండి. భారతీయ ఆత్మదర్శనానికి అది ఒక ప్రతీక. అన్నిటికంటే ముఖ్యంగా బాల్బెక్ మ్యూజియంలో 16 ముఖాలు కలిగిన ఒక మహాశిల ఉంది. దాన్ని గురుపూజా శిల అంటారు.

గురుపూజ కేవలం భావావేశాన్ని సంతృప్తి పరుచుకోవడానికి కాదు. అది ఒకానొక అవకాశాన్ని సృష్టించగల విధానంలో ఒక భాగం. దీనినే షోడశోపచారములు అంటారు. అంటే 16 విధాలుగా గురువుని సేవించే విధానము. దీనికై, గురుపూజా పీఠాలుగా పిలవబడే  16 ముఖాలు గలిగిన శిలలు తయారు చేస్తారు. అది యోగ సంస్కృతిలోని ప్రత్యేకత. భూమిమీద మరెక్కడా లేదు గాని, బాల్బెక్ లో మాత్రం 3700 ఏళ్ళనాటి 16-ముఖాలు గలిగిన గురుపూజాశిల ఉంది.  కాబట్టి, ఈ రెండు నేలల మధ్యా, సక్రియాత్మకమైన వాణిజ్య, ఆధ్యాత్మిక సంబంధం ఉండేదని చెప్పవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు